
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపించాయి. రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాలలో టీచర్, ఒక నియోజకవర్గంలో పట్టభద్రుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం కొందరు అభ్యర్థులు తాము అందించిన సేవలను ఓటర్లకు గుర్తుచేస్తున్నారు. మరికొందరు పలు హామీలను ఇస్తున్నారు. ఇంకొంతమంది ప్రలోభాల ఎరలను విసురుతున్నారు.
ఉద్యోగుల ప్రయోజనానికి సంబంధించిన ఒక జీవో పై తాను ఉద్యమం చేశానని అందుకుగాను తనని ఎన్నుకోవాలని ఒకాయన ఓటర్లను కోరుతున్నారు. తన ఉద్యోగ పరీక్షల కోచింగ్ వలన (ఉచితంగా కాదు) చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలను పొందగలిగారని, అందుకు తనని ఎన్నుకోవాలని మరోకాయన అడుగుతున్నారు. తాను ప్రభుత్వాధినేతకు దగ్గర కాబట్టి తనను ఎన్నుకోవాలని ఇంకోకాయన అంటున్నారు. ఇందులో భాగంగా కొందరు తమ ఆర్ధిక బలాన్ని చూపిస్తూ మందు, విందులతో సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఎవరికి తోచిన తీరు వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో అభ్యర్థుల ప్రచార హడావిడి తీవ్ర స్థాయికి చేరింది.
నమస్యలపై అవగాహన లేమి..
విద్యారంగ సంబంధ మౌలిక సమస్యలపై అవగాహన లేనివారు కూడా అర్థ బలం, రాజకీయ అండతో ఓటర్ల బలహీనతలను సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. విద్యా హక్కు, విద్య ప్రైవేటీకరణ, కామన్ స్కూల్, డిటెన్షన్ విధానం, కార్పొరల్ పనిష్ మెంట్స్ విద్యలో పోటీ తత్వం, పరీక్షల విధానం, బోధనా వృత్తిపై నవ ఉదారవాద ప్రభావంలాంటి విద్యారంగానికి సంబంధించిన మౌలిక అంశాలపై కొద్దిమంది అభ్యర్థులకు మాత్రమే అవగాహన ఉన్నట్టు తెలుస్తోంది. మిగితా వారికి సరైన అవగాహన ఉన్నట్టు కనిపించదు.
సాదారణ ఎన్నికల్లో ఓటర్లు నోటుకూ, మధ్యానికి అమ్ముడుపోతే అది వారి నిరక్షరాస్యత, అజ్ఞానం అని అనుకోవచ్చు. కానీ, పెద్దల సభలో మేధావుల ప్రాతినిధ్యం ఉండాలని రూపొందించిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అదే బాటలో నడవడం బాధాకరం.
ఇప్పటికీ వినిపించే ప్రశ్నలు..
ఏ సివిల్ సర్వెంట్లకు లేని సౌకర్యం టీచర్లకే ఎందుకు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాక మళ్ళీ టీచర్ ఎమ్మెల్సీ అవసరం ఏమిటి? లాంటి ప్రశ్నలు వినిపిస్తుంటాయి. రాజ్యాంగం రూపొందించే సమయంలో రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు కూడా ఈ ప్రశ్నలను లేవనెత్తారు.
అయితే, డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తనదైన శైలిలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పారు. విద్య ఓ వ్యక్తి ప్రయోజనం కోసం మాత్రమే కాదు, సమాజ శ్రేయస్సుకు అది చాలా ప్రధాన విషయమని అంబేద్కర్ అన్నారు. అంతేకాకుండా, జాతి నిర్మాణంలో టీచర్ల బాధ్యత ప్రధానమైనది కాబట్టి వారి ప్రాతినిథ్యం పెద్దల సభలో తప్పక ఉండాలని పేర్కొన్నారు. అందుకే టీచర్లకు ఈ సౌకర్యం నేటికీ కొనసాగుతోంది.
లోపించిన స్ఫూర్తి..
కానీ, ఆ సౌకర్యం కలిగించడం వెనుక ఉన్న స్ఫూర్తి మాత్రం లోపించింది. ‘కొంతమంది’ టీచర్ల సంఘాల నాయకులు ముఠా రాజకీయాలు చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. గతంలో ఎన్నికల వేళ డబ్బులు పంచినట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. వీరి ప్రచార కరపత్రాల్లో విద్యా వ్యవస్థ బలోపేతం కావాలంటే అది ఎదుర్కొంటున్న మౌలిక సవాళ్ళు, వాటి సమస్యలు, వాటి పరిష్కారాలలాంటి విషయాలు ఏమీ ఉండవు. వృత్తి సంబంధ విషయాల్లో కూడా కేవలం ఓటర్లను ప్రలోభపెట్టే వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప, వృత్తి ప్రాధాన్యతను తెలియజేసే విషయాలు కాని, దాని బలోపేతానికి సంబంధించిన విషయాల పైన కాని చర్చ ఉండదు.
కేవలం ఏడు రాష్ట్రాల్లోనే..
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకొని దేశం మొత్తంలో ఏడు రాష్ట్రాల్లోనే విధాన పరిషత్ ఉనికిలో ఉంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 171(3C) పెద్దల సభలో 1/12 వంతు సీట్లను టీచర్ ఎమ్మెల్సీలకు కేటాయించాలని నిర్దేశిస్తుంది. సెకండరీ, ఆ పై స్థాయి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సదుపాయం టీచర్లకు తప్ప ఏ ఇతర సివిల్ సర్వెంట్లకు లేదు. సెకండరీ, ఆ పై స్థాయిలో పని చేసే టీచర్లను మేధావులుగా పరిగణించి విధాన నిర్ణయాల్లో వారి పాత్ర అవసరమని భావించడం వల్ల ఈ విధమైన సౌకర్యాన్ని రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు.
ప్రాథమిక స్థాయి టీచర్లకు ఓటింగ్ అర్హత లేకపోవడం, ప్రాథమిక దశలోని టీచర్ల స్థాయిని ఆది నుండి మనం తక్కువగా చూశామనడానికి ఇది ఓ విదర్శన. ఇంకా వలస పాలన లెగసీ కొనసాగుతుందనడానికి ఇది ఉదాహరణ. తెలంగాణలో ప్రైమరీ టీచర్లకు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటు హక్కు కలిపించాలని గతంలో హైకోర్ట్ లో PIL దాఖలు అయింది. ఈ క్రమంలో కోర్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా ఇచ్చింది. కానీ, దీనిపై ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదు.
విద్యా విధాన నిర్ణయాల్లో టీచర్ ఎమ్మెల్సీల పాత్ర కీలకమైనది. విద్యావ్యవస్ధకు సంబంధించిన నాయకుల అభిప్రాయాలను పరిగణిస్తూ వారి సహకారంతో జరిగే విధాన నిర్ణయాల సార్థకత చాలా బాగుంటుంది. అయితే, ప్రస్తుతం విధాన నిర్ణయాలన్నీ ఏకపక్షంగా, విద్యా వ్యవస్థ సంక్షేమానికి విఘాతం కలిగేలా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల ద్వారా ఒరిగేది ఏమీ లేదనే అభిప్రాయం ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు అణిగిమణిగి ఉండే ఎమ్మెల్సీలు కాకుండా నిష్పక్షపాతంగా విద్యావ్యవస్ధ బాగుకు గొంతెత్తే ఎమ్మెల్సీలు కావాలని పలువురు కోరుకుంటున్నారు.
ఫిన్లాండ్, సింగపూర్ విద్యా వ్యవస్థ..
విద్యా నాయకత్వం సమర్ధవంతంగా ఉన్నట్లైతే, విద్యా రంగంలో చాలా అద్భుతాలు జరుగుతాయని ఫిన్లాండ్, సింగపూర్ లు నిరూపిస్తున్నాయి. విద్యా వ్యవస్థను మెరుగు పరిచే రాజకీయ సంసిద్ధత ప్రభుత్వాలకు, వాటికి సహకరించే ఉపాధ్యాయ సంఘాలు ఉండడం వల్లనే ఈ దేశాలు విద్యారంగంలో ముందు ఉన్నాయి. సంస్కరణలకు అడ్డుపడతారని, చెడ్డ టీచర్లను రక్షించుకుంటారని ఉపాధ్యాయ సంఘాలపై సాధారణంగా విమర్శ ఉంది. కానీ, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయ సంఘాలు నిర్మాణాత్మక వైఖరితో పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయని ఈ దేశాలు తేటతెల్లం చేశాయి. వారి నుండి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. మన దగ్గర కూడా ఇలాంటి టీచర్ల సంఘాలు లేవని కాదు కానీ వీటి సంఖ్య తక్కువ. విద్యా రంగం బలోపేతానికి కాకా, ప్రభుత్వాల రాజకీయ ప్రయోజనాలకు వంత పాడేవి, స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేవే ఎక్కువగా ఉన్నాయి.
ట్రేడ్ ఫెయిర్ ‘ఎడ్యుకా’ ..
ఫిన్లాండ్లో ప్రతి సంవత్సరం జనవరి నెలలో ‘ఎడ్యుకా’ అనే పేరుతో అక్కడి టీచర్స్ యూనియన్ OAJ రెండు రోజుల ట్రేడ్ ఫెయిర్ ను నిర్వహిస్తుంది. దేశంలోని టీచర్లు అంతా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు టీచర్లు అందరూ 0AJలో సభ్యులుగా ఉంటారు. టీచర్లంతా తమ ఆదాయంలో 1.2 శాతాన్ని OAJకు విరాళంగా ఇస్తారు. దీనికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.
టీచర్లకు బోధనా విషయాల్లో సలహాలను ఇవ్వడానికి నిపుణులు OAJలో ఉంటారు. టీచర్లకు తక్కువ వడ్డీకి బ్యాంక్ లోన్లు, వస్తు కొనుగోళ్లలో డిస్కౌంట్లను ఇప్పించడానికి OAJ ఒప్పందాలు చేసుకుంటుంది. ‘ఎడ్యుకా’లో పెడగాజీని మెరుగు పరిచే అన్ని రకాల వనరుల అమ్మకాలు, వినిమయంతో పాటు విద్యా వ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలపై చర్చలు జరుగుతాయి.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే? ఈ సమావేశాల్లో తప్పకుండా ఒక ప్యానెల్ చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇందులో టీచర్ సంఘాల నాయకులు, విద్యా మంత్రి, ఇతర మంత్రులు, ప్రభుత్వాధికారులు పాల్గొంటారు. విద్యా విషయాల్లో ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణపై టీచర్స్ సంఘాల నాయకుల సవాళ్ళకు విద్యా మంత్రి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.
విద్యా వ్యవస్థకు కృషి.
సింగపూర్ టీచర్స్ యూనియన్ అతి పెద్ద యూనియన్, 1997 సంవత్సరంలో TSLN (Thinking Schools Learning Nations), 2004లో TLLM (Teach Less Learn More) సంస్కరణలను సింగపూర్‌లో ప్రవేశపెట్టాడు. 2008లో వారి వారి సామర్థ్యాల ప్రాతిపదికన పిల్లలను గ్రూపులుగా చేయడాన్ని నిషేధించారు. అభిరుచుల ప్రాతిపదికన సహకార పద్ధతిలో నేర్చుకోవడాన్ని ప్రోత్సహించారు. 2009లో సంగీతం, కళలు, ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు విశేష ప్రాధాన్యతనిస్తూ సిలబస్‌ను రూపొందించారు. 2015లో టీచర్ల వృత్తి సంబంధ అభివృద్ధి నిమిత్తం TEACH కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమాల అమలు విజయవంతం కావడంలో అక్కడి ఉపాధ్యాయ సంఘాల పాత్ర చాలా కీలకమైంది. నాణ్యమైన నైబర్ హుడ్ స్కూళ్ళు, టెక్నికల్ స్కూళ్ళు, పాలీ టెక్నిక్‌లు సింగపూర్ ప్రత్యేకత.
సింగపూర్ దేశానికి ప్రధానిగా సేవలు అందించిన ‘లీ’ ఆ దేశ విద్యా రంగానికి ఎక్కువ కృషి చేశారు. ఆయన చనిపోయిన తర్వాత గౌరవ విహ్నంగా ప్రభుత్వ లాంచనాలతో ప్రపంచ ప్రసిద్ధి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో ఆయనకు ఘననివాళి అర్పించారు.
కేటాయింపుల కన్నా మార్పు ముఖ్యం..
విద్యారంగం పట్ల మన ప్రభుత్వాల చిత్తశుద్ధి బడ్జెట్ కేటాయింపుతోనే అర్ధమవుతుంది. కోరారి కమిషన్ నుండి జాతీయ విద్యా విధానం 2020 వరకు, విద్యకు ఆరు శాతం నిధులివ్వాలని చేసిన ప్రతిపాదన ఇప్పటికి నెరవేరలేదు. కేంద్ర బడ్జెట్లో విద్యకు 128,650 కోట్ల కేటాయింపు గత బడ్జెట్ కంటే 6.2 శాతం అధికమని చెప్పుకోవడానికి సరిపోతుంది. కానీ, అది జీడిపీలో 0.41 శాతమే. అలాగే 19,000 కోట్ల నుండి 21,000 కోట్లకు తెలంగాణ రాష్ట్ర విద్యా బడ్జెట్ పెరిగినట్లు కనబడినా అది మొత్తం బడ్జెట్ లో 7.3 శాతం, జీడిపీ పరంగా 1.29 శాతం మాత్రమే.
జాతీయ విద్యా విధానం 2020 విప్లవాత్మక మార్పులను తెస్తుందని చెప్పారు. కానీ, విద్యా ప్రైవేటీకరణపై టీచింగ్ ప్రొఫెషన్ బలోపేతంపై సరైన చర్యలు లేవు. నిష్పక్షపాతంగా లేని కరికులంతో మార్పులు కొనసాగుతున్నాయి. శాస్త్రీయ చూపు, ప్రజాస్వామిక దృక్పథాన్ని పెంపొందించడంలో విద్యా వ్యవస్థ విఫలమయింది. అన్ని స్థాయిల్లో విద్యార్థుల నమోదు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. కాని సామర్థ్యాలు క్షీణించాయి, పరిశోధనల్లో వెనుకబడి పోయాం.
దేశవ్యాప్తంగా అన్ని స్థాయిలలో భారీగా టీచర్ల ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా విద్యా వ్యవస్థ బలహీనపడింది. మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ తరుణంలో విద్యారంగ సమస్యలపై, వాటి పరిష్కారాలపై సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తుల ఎంపిక సాధ్యమేనా? శిశిరంలో ప్రకృతి అంతా ఆకుని రాల్చుకున్నట్టు ఆశలు రాలిపోతాయా?
-ఎడమ శ్రీనివాస రెడ్డి
అధ్యాపకులు, కాకతీయ ప్రభుత్వ కళాశాల, హమమకొండ
సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపక సభ్యులు
9949905069, sreevare13@gmail.com
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.