
నేను చైనా గోడను లేపాను కానీ దానిమీద నా పేరు లేదు
తాజ్ మహల్‌ను కట్టాను కానీ దానిమీద నా పేరు లేదు
లాల్ ఖిల్లాకు రంగులు వేశాను కానీ దాని మీద నా పేరు లేదు
మక్కా మస్జీదుకు రాళ్లు ఎత్తాను కానీ వాటి మీద నా పేరు లేదు
చార్మినార్లను నిలబెట్టాను కానీ వాటి మీద నా పేరు లేదు
పాతబస్తీ చారిత్రాత్మక కట్టడాలకైనా
హైటెక్ హంగులకైనా నేనే ఆయువు పట్టును
కానీ నా పేరు వాటి మీద లేదు
గోల్కొండనే కాదు అనేక కోటగోడలు కట్టింది నేనే
కానీ వాటి మీద నా పేరు లేదు
ఎన్నో కాలువలను
ఎన్నో చెరువులను తవ్వాను
కానీ ఎక్కడ నా పేరు మీద శిలా ఫలకం లేదు
ఆకాశ హార్మ్యాలను నిలబెట్టాను
కాని వాటి మీద నా పేరు లేదు
నా వల్లే పల్లెలు గ్రామాలు నగరాలు విలసిల్లుతాయి
కానీ నా పేరు ఎక్కడా కానరాదు
అందమైన ఉద్యాన వనాలు
అంతర్జాతీయ విమానాశ్రయాలు
రైలు మార్గాలు మెట్రోలు
రోడ్లు అన్నింటికి నేనే చెమటోడ్చాను
కానీ నా పేరు ఎక్కడా కానరాదు
నేనే నిర్మాతను నేనే శ్రమజీవిని
అయినా నేను అగోచరుణ్ణి అనామకుణ్ణి నిస్వార్థపరుణ్ణి
నేను ఒక కార్మికుడను ప్రపంచ కార్మికుడను
(కూలీ చేసిన వ్యక్తి చెమట ఆరకముందే అతని కూలి చెల్లించండని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు)
మొహమ్మద్ అబ్దుల్ రషీద్ తెలుగు కవి, రచయిత, అనువాదకులు. సాహిత్య భూషణ్, తెలుగు కీర్తి ప్రతిభా పురస్కారం, ఎన్టీఆర్ లెజెండరీ, పద్మ ప్రతిభ అవార్డును ఆయన పొందారు.