
గ్రీన్లాండ్ ఆక్రమణ, గాజా ఆక్రమణ వంటి విషయాలపై భారత్ నోరు మెదపకపోవటం ప్రపంచ రాజకీయాల్లో భారత్ స్థానాన్ని మసకబారుస్తున్నాయి.
ఈ వారం ప్రధాని మోడీ వాషింగ్టన్ పరిగెత్తడాన్ని రెండు కోణాల్లో చూడాలి. అధ్యక్షుడు ట్రంప్ నుండి ఆహ్వానం అందుకున్న తొలి ముగ్గురు దేశాధినేతల్లో మోడీ కూడా ఒకరని మనం తృప్తిపడటం ఒకటి. ఈ వాదన ఢిల్లీ పత్రికల్లో ప్రముఖంగా వస్తుంది. ఈ ఆహ్వానం కేవలం భారత్ అమెరికాల మధ్య ఉన్న దౌత్యసంబంధాలకు నిదర్శనం మాత్రమే కాదని మోడీ, ట్రంప్‌ల మధ్య ఉన్న పర్సనల్ కెమిస్ట్రీకి చిహ్నమని వ్యాఖ్యానిస్తారు. ఒకేగూటిపక్షులనీ, భారత్ అమెరికాకు ముఖ్యమైనదీ, అమెరికా భారత్‌కు ముఖ్యమైనదన్న వాదనలు కూడా వినిపిస్తాయి.
సమ ఉజ్జీలు అన్న వాదనను ప్రశ్నించేది రెండో కోణం. ట్రంప్ మరెవ్వరినీ తనకు సమ ఉజ్జీ అని అంగీకరించరు. నిజానికి ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికా పర్యటించిన రెండు దేశాల నేతలూ అంతర్జాతీయ వ్యూహంలో అమెరికాకు జూనియర్ భాగస్వాములే. ఒకరు ఇజ్రాయెల్ అధ్యక్షులు, మరొకరు జపాన్ ప్రధాని. అమెరికా ప్రత్యక్ష సహకారం వల్లనే ఇజ్రాయెల్ ఇరుగుపొరుగు దేశాలతో చేస్తున్న యుద్ధాల్లో బతికి బట్టకట్టగలిగింది. గెలిచిన దేశాలను ప్రపంచంలోని అతి పెద్ద రియల్ ఎస్టేట్ డీలర్‌కు అమ్మటానికి ఈ పర్యటనను ఉపయోగించుకున్నారు.
ఇక జపాన్ ప్రధాని. ట్రంప్‌తో ఫోటో దిగితే దేశీయ రాజకీయాల్లో తనకు నాలుగుమార్కులు పడతాయని ఆశగా ఎదురు చూస్తున్న నాయకుడు షిగెరు ఇషిబా. ట్రంప్ మొదటి దఫా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తలుపుతట్టిన జపాన్ ప్రధాని షింజో ఆబెకు ఇషియా పాలిపోయిన ప్రతిబింబమే. ట్రంప్‌తో జపాన్‌కు కలిగే ప్రయోజనం ఏమిటన్న విషయంలో కనీసం షింజో ఆబెకు కొన్ని ప్రశ్నలన్నా ఉన్నాయి. ఇప్పట్లో ఆయన పదవికి వచ్చిన ముప్పేమీ లేదు. చైనా ప్రీమియర్ షీ జిన్‌పింగ్‌కు తొలి ఆహ్వానం పంపుతాడేమో అన్న ఆందోళనతో బిక్కచచ్చి ఉన్నాడు ఇషిబా. చైనా కోసం జపాన్ను అమెరికా పసిఫిక్ సముద్రంలో ముంచుతాడా, అమెరికా, చైనాల జోడి తూర్పు తీరంలో జపాన్ పలుకుబడిని కట్టడి చేస్తుందా వంటి భయాలున్నాయి ఇషిబాకు.
స్వతంత్ర శక్తిగా భారత్
అమెరికాతో గోక్కుంటే తమకు జరిగే నష్టమేమిటో తెలిసిన దేశాలు జపాన్, ఇజ్రాయెల్. భారతదేశం విశ్వబంధు అని చెప్తారు. ఈ రెండు దేశాల రక్షణ వ్యవస్థలు అమెరికాపైనే పూర్తిగా ఆధారపడి ఉంటాయి. అందువల్లనే ఈ రెండు దేశాలూ అమెరికాకు జూనియర్ భాగస్వాములుగానే వ్యవహరిస్తున్నాయి. చతుర్భుజిలో ఆస్ట్రేలియా, జపాన్‌లు అమెరికాకు జూనియర్ భాగస్వాములుగానే ఉన్నాయి. ఈ కూటమిలో భారతదేశం ఒక్కటే తనదైన ఆలోచన, వ్యవహారశైలి కలిగి ఉన్న దేశం.
భారతదేశం విశ్వబంధు అని చెప్తారు. ఏమి ఆలోచించినా, ఏమి చేసినా దేశవాళీ శైలిలోనే చేస్తుంది. ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే ప్రయత్నంలో ఒకటి రెండుసార్లు ఇతర దేశాల సహకారాన్ని తీసుకున్నా స్థూలంగా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పాటిస్తుంది. ఇజ్రాయెల్‌ను ఏర్పాటుచేసినట్లు పశ్చిమ దేశాలు భారతదేశాన్ని ఏర్పాటు చేయలేదు. తనదైన నాగరికత కలిగిన దేశం. దీర్ఘకాలం వలసపాలన కింద నలిగిన దేశం. వలసపాలనకు వ్యతిరేకంగా భారతదేశం సాగించిన మహోన్నత పోరాటం సామ్రాజ్యవాద, వలసవాద వ్యతిరేక పోరాటాలకు స్పూర్తినిచ్చింది. దక్షిణార్ధగోళంలో మనదేశమే నాయకురాలు. మన గొప్పతనం గురించి పక్కనపెడితే మనకున్న పరిమితులు, బలహీనతలు మనకున్నాయి. ట్రంప్ లాంటి నియంతృత్వ పోకడలున్న వ్యక్తితో వ్యవహరించేటప్పుడు ఎందుకు ఆందోళనకు గురవుతోంది?
అమెరికాతో నిలకడైన సంబంధాలు కోరుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. చైనా ఎదుగుదల నేపథ్యంలో ఆసియా ఖండంలో బలాబలాలు విషయంలో తనదంటూ పాత్ర పోషించాలన్న కాంక్ష భారతదేశానికి ఉంది. ఈ విషయంలో భారత్ అమెరికా దోస్తీ చైనాతో వ్యవహరించేటప్పుడు ఉపయోగపడుతుంది. అయితే ఇది ఉభయులకూ ప్రయోజనం కలిగించే అంశమే.
ట్రంప్ చైనా ప్రీమియర్ షీ జిన్‌పింగ్‌కు కాల్ చేసిమాట్లాడినందువలన మనం మరీ అంత కంగారు పడిపోయి హైరానా చెందాల్సిన అవసరంలేదు. అది కూడా అందరికీ కనిపించేలాగా. ఈ రెండు నెలల్లో భారతదేశం వ్యవహరించిన తీరు గురించి రానున్న పాకేతిళ్లపాటూ అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చిస్తూనే ఉంటారు. వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే పీటర్సన్ ఇనిస్టిస్ట్యూట్లోపని చేసే ఫ్రెడ్ బెర్గ్స్టన్ ప్రపంచం మొత్తం అమెరికా, చైనాల చెప్పుచేతల్లో ఉండాల్సి వస్తుందని అంచనావేశారు. ఈ కూటమికి కిమెరా అని పేరుకూడా పెట్టారు.
ఇంకా చెప్పాలంటే ఆ పరిస్థితులే వచ్చి అమెరికా చైనాలు మొత్తం ప్రపంచాన్ని చెరిసగం పంచుకుని ఏలాలనుకుంటే ఆపే శక్తి భారత్‌కు లేదన్న వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి. ఇప్పుడున్న ప్రపంచ శక్తుల పొందికతో జాగ్రత్తగా వ్యవహరించటంలోనే భారత్ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనమేదో కొత్త అంతర్జాతీయ బలాబలాలను నిర్మించాలనుకోవటం సాహసమే అవుతుంది. అమెరికా చైనాల మధ్య ఉన్న వివాదాలు, సయోధ్యలను భారతదేశం తనదైన సామర్ధ్యంతో ఎదుర్కోవాలి. ఈ పరిస్థితుల్లో అమెరికా మనకు మిత్రదేశమే అని చెప్పుకునే ప్రయత్నంలో హడావుడిగా అమెరికా పరిగెత్తడటం, దానికోసం ఆందోళన చెందటం అవసరంలేని వ్యవహారం.
అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలకు తెరతీస్తున్న ట్రంప్
అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలకు తెరతీయటానికి ట్రంప్ సిద్ధం కావటం భారతదేశం ఆందోళనకు మరోకారణం. అమెరికాతో భారతదేశానికి ఉన్న వాణిజ్యం వలన మన వాణిజ్యలోటు భారీఎత్తున పెరిగే ప్రమాదం ఏమీ లేదు. వాణిజ్యోత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించినా మన దేశం నుండి అమెరికాకు ఎగుమతవుతున్న సేవారంగంపై అమెరికా ఆధారపడకతప్పదు. సేవారంగ వాణిజ్యం విషయంలో రెండు దేశాలకూ సమానపాత్ర ఉంటుంది. ఒకరికొకరు కావాల్సిందే. అమెరికాలో కూడా భారతదేశానికి చెప్పుకోదగ్గ స్థాయిలో లాబీంగ్ శక్తి ఉంది. ట్రంప్ చుట్టూ ఉన్న సహస్రకోటీశ్వరులే భారతదేశపు సాంకేతిక సామర్ధ్యంతో ప్రయోజనం పొందుతున్నారు.
అమెరికా గురించి మాట్లాడుకునేటప్పుడు భారతీయులకు వీసాలు, సాంకేతికపరిజ్ఞానం బదిలీ కీలకమైన అంశాలుగా ఉంటాయి. ఇది కూడా ఇద్దరికీ ప్రయోజనం కలిగించేదే. ఒక్క భారతదేశానికే కాదు. అందువల్ల వీసాల సంఖ్య పెంచటానికో, సాంకేతిక పరిజ్ఞానం సంపాదించటానికో శ్వేతసౌధం ముందు పడిగాపులుగాయాల్సిన అవసరం లేదు. ప్రఛ్చన్నయుద్ధం తారాస్థాయిలో ఉండి ముఖాముఖీ చూసుకునే పరిస్థితి కూడా లేనప్పుడు సైతం భారతీయులకు వీసాలు వచ్చాయి. అమెరికా పారిశ్రామిక రంగానికి కావల్సిన మేధోసంపదను తరలించుకుపోవడానికి వెనకాడలేదు.
గత నాలుగు దశాబ్దాల్లో లక్షలాదిమంది భారతీయులు కావాలనే అమెరికా వెళ్లారు. వాళ్లకోసం ఏ ప్రభుత్వమూ ప్రత్యేకంగా బేరసారాలాడలేదు. మరోవైపున అమెరికాకు అనుంగు మిత్రుడుగా ఉన్న మోడీ ప్రభుత్వం అక్రమంగా ప్రవేశించారన్న పేరుతో బారతీయులకు బేడీలు వేసి తరలించటాన్ని అడ్డుకోలేదు. కనీసం నిరసన కూడా వ్యక్తం చేయలేదు. భారతీయులకు జరిగిన అవమానానికి నిరసన వ్యక్తం చేస్తే మిన్ను విరిగి మీదపడేదేమీ లేదు. దౌత్య పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత అమెరికా పర్యటనకు వస్తామని వాయిదా వేసుకుంటే దేశప్రతిష్ట మరింత పెరిగేది. అమెరికాలో పరిస్థితులు నిలకడ స్థితికి వచ్చేవరకూ ప్రధాని తన పర్యటనను వాయిదా వేసుకున్నా వచ్చే నష్టం ఏమీలేదు. ప్రతిచిన్నదానికీ అమెరికాపైనే ఆధారపడ్డ లాటిన్ అమెరికా దేశాలు, మెక్సికో, కెనడాలు ప్రదర్శించినంత బింకాన్ని సైతం భారతదేశం ప్రదర్శించేలకపోవటం విచారించదగ్గ విషయం.
ఇంతటి వివాదాస్పద సందర్భంలో ట్రంప్‌కు ప్రేమపావురాలను పంపటం వర్ధమాన దేశాల నేతగా భారతదేశానికున్న పేరు ప్రతిష్టలను మసకబారుస్తోంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జి20 సమావేశాలకు హాజరుకానని, దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని గుర్తించేందుకు తాను నిరాకరిస్తున్నానని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. జి 20 సమావేశాలు ఏర్పాటు చేయటానికి ఊరూవాడా ఏకం చేసి మరీ ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన పట్ల కనీసం పల్లెత్తిమాట అనలేకపోయింది. గ్రీన్లాండ్, గాజా లాంటి దేశాలను అమెరికా దురాక్రమణను ప్రశ్నించలేకపోవటం కూడా స్వతంత్ర దేశంగా మన దేశ ప్రతిష్టను మసకబారుస్తోంది. మన దేశం సర్వస్వతంత్రంగా వ్యవహరించగలుగుతుందన్న నమ్మకంతోనే అనేక దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో మనదేశానికి స్థానం దక్కాలని మద్దతు పలికారు. వలసవాదవ్యతిరేక వారసత్వాన్ని కొనసాగిస్తుందనీ, సాయుధ సైనిక కూటముల్లో చేరకుండా తటస్థంగా ఉంటుందనీ నమ్మాయి. నెతన్యాహూ లాంటి రక్తపిపాసి తర్వాత ట్రంప్‌ను కలిసేందుకు ఉవ్విళ్లూరటం మోడీకి గానీ, దేశానికి గానీ ప్రతిష్ట పెంచే చర్య కాదు.
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.