
నిన్నా మొన్నటి వరకు ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్‌కు కొమ్ముకాసిన బిజెపి జాతీయ నాయకత్వం హఠాత్తుగా ఆయనతో రాజీనామా ఎందుకు చేయించినట్లు?
న్యూఢిల్లీ: చదరంగపు ఆటగాడు రాజుని రక్షించుకునే దిక్కుతోచని పరిస్థితులలో పావుని బలిపెడుతుంటాడు. మణిపూర్‌లోనూ సరిగా అదే జరిగింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీ నుండి జరుగుతున్న పరిణామాలు చివరాఖరికి ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి బిరెన్ సింగ్ రాజీనామా సమర్పించడంతో బిజెపి పార్టీ జాతీయ నాయకత్వం వేసిన ఎత్తుగడలో భాగమే.
ఫిబ్రవరి 10వ తేదీన మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బిరేన్ సింగ్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ ప్రయత్నాన్ని పక్కదోవ పట్టించడానికి విధిలేని పరిస్థితులలో ఢిల్లీలోని బిజెపి నాయకత్వం ఈ రాజీనామా తంతును నడిపించింది. 2023 మే 3వ తేదీ నుండి రాష్ట్రంలో చెలరేగిన హింసను అరికట్టడంలో ముఖ్యమంత్రి విఫలంకావడం మూలంగా బిరేన్ సింగ్‌ను ఆ పదవి నుండి తప్పించాలని అధికారపార్టీ శాసన సభ్యులు కోరుతూ వచ్చారు. అయితే పార్టీ జాతీయ నాయకత్వం వీరి డిమాండ్‌ను ఇంతకాలంగా తోసిపుచ్చుతూ వచ్చింది. ఎప్పుడైతే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బిరేన్‌సింగ్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానని ప్రకటించిందో ఈ తీర్మానానికి అధికారపార్టీలోని శాసనసభ్యులు కూడా మద్దతు పలికే అవకాశం ఉందని గ్రహించిన పార్టీ జాతీయ నాయకత్వం ముఖ్యమంత్రితో రాజీనామా చేయించింది.
బిరేన్ సింగ్ ఆడియో టేప్ నిజనిర్ధారణకు సంబంధించి ల్యాబ్ రిపోర్ట్ వెలువడడం అధికారపార్టీలో దీర్ఘకాలంగా తిరుగుబాటు ధోరణితో ఉన్న శక్తులకు ఆయుధంగా అంది వచ్చింది. రాష్ట్రంలో ఇంతపెద్ద ఎత్తున హింస చెలరేగడానికి ముఖ్యమంత్రి వైఖరే కారణమని, అందుకు సాక్ష్యంగా బిరేన్‌సింగ్ ఆడియో టేప్ ఒకటి బయటికి వచ్చింది. దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేటు ల్యాబరేటరీ అయిన ‘ట్రూత్ ల్యాబ్’ ఆ ఆడియో టేప్‌లోని గొంతు 93శాతం ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్ స్వరాన్ని పోలి ఉందని ఫ్రిబ్రవరి 3వ తేదీన సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.
మణిపూర్‌లో చెలరేగిన జాతివైషమ్యాల హింసలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. 70,000 మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తీవ్ర గందరగోళంలో చిక్కుకుపోయింది. రాష్ట్రం దాదాపు రెడు జాతులుగా విడిపోయింది.
గత ఏడాది కేంద్రహోంమంత్రిత్వశాఖ మణిపూర్ అల్లర్లపై విచారణకు ఒక జ్యుడిషియల్ కమిషన్‌ను వేసింది. కమిషన్‌కు గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజయ్ వాంబాను అధ్యక్షుడిగా నియమించింది. సాక్ష్యం సమర్పించే వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని కమిషన్ ఛైర్మన్ ఇచ్చిన హామీతో రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా హింసకొనసాగుతున్న నేపథ్యంలో స్వయానా ముఖ్యమంత్రి ఇంట్లో రికార్డు చేసిన అడియో టేప్‌ని కమిషన్‌కు సమర్పించారు. అదే కాపీని ‘ద వైర్’ పత్రికకు కూడా అందింది. ఈ టేప్‌లోని విషయ తీవ్రత దృష్ట్యా సదరు టేప్‌ను ప్రజాక్షేత్రంలో అందుబాటులోకి తీసుకురావాలని ‘వైర్’ భావించింది.
తదనంతరం కుకీ తెగ మానవహక్కుల సంస్థ ఈ ఆడియో రికార్డింగ్ మీద స్వతంత్య్ర విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ ఆడియోటేప్‌ను శాస్త్రీయంగా నిర్ధారణ చేయించి సదరు నివేదికను కోర్టుకు సమర్పించమని పిటిషనర్‌ను ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి ఎంఎన్ వెంకటచలయ్య ఆధ్వర్యాన నెలకొల్పిన ‘ట్రూత్ ల్యాబ్’ నివేదికను గతంలో సుప్రీంకోర్టు ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకుంది. కాబట్టి ఆడియో టేప్ శాస్త్రీయ నిర్ధారణను ట్రూత్ల్యాబ్కు అప్పగించారు. జనవరి నెలాఖరున ఆ ల్యాబ్ ఆడియో టేప్‌లోని గొంతు బిరేన్ సింగ్ స్వరంతో 93శాతం సరిపోలిందని నిర్ధారించింది.
ఫిబ్రవరి 3వ తేదిన ఈ టేప్‌ను ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (సిఎఫ్ఎస్ఎల్)లో మరోసారి పరీక్షింపచేసి నివేదిక సమర్పించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలోని ధర్మాసనాన్ని మూడు వారాల గడువు కోరాడు.
అయితే, ఇది బిరేన్ సింగ్‌ను రక్షించడానికి కాస్త సమయాన్ని చేజిక్కించుకోవడమే తప్పవేరేమీ కాదు. ఎందుకంటే గతంలో అనేక సందర్భాలలో సిఎఫ్ఎస్ఎల్ ఆడియో, వీడియోల నిజనిర్ధారణకు ‘ట్రూత్ ల్యాబ్’నే ఆశ్రయించింది.
ఢిల్లీకి తెలిసి వచ్చేలా పార్టీ శాసనసభ్యులు, కొంతమంది సీనియర్ నాయకులు సహా తిరుగుబాటు చెయ్యడానికి సిద్ధపడ్డారు. గతంలోనే బిరేన్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని భావించారు. మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సాయంతో ఇప్పుడు ఆ అవిశ్వాస తీర్మానానికి తిరిగి ఊపిరిపోశారు. బిరేన్‌సింగ్ అహంకార ధోరణులకు విసిగిన మరికొంతమంది బిజెపి నాయకులు కూడా తమ విధేయతలను మార్చుకున్నారు.
ఇదేమంత తేలికగా సాగిన పరిణామం కాదు. గత 21 నెలలుగా బిజెపి అగ్రనాయకత్వం అందించిన అండదండలతో ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్ తనని తాను మైనార్టీ కుకీలకు వ్యతిరేకంగా ఉన్న ఏకైక మైతేయి స్వరంగా మలుచుకున్నాడు. మెయితి జాతికి చెందిన నిషేధిత సంస్థలు, ఉగ్రవాద సంస్థలను ప్రేరేపించి సాయుధ మూకగా తయారు చేశాడు. ఈ సాయుధ ముఠా ఎలాంటి హింసకు పాల్పడినా ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి చర్యలూ తీసుకోకుండా రక్షణ కల్పించాడు. కేంద్రహోంశాఖామంత్రిత్వశాఖ మణిపూర్ లోయలో అమలులో ఉన్న సైనిక బలగాల(ప్రత్యేకాధికారాల) చట్టాన్ని ఎత్తివేసేలా చూశాడు. ఈ సాయుధ ముఠాలు పోలీసు వాహనాలను కూడా వాడుకున్నాయని మీడియా వెల్లడించింది. రాష్ట్ర ఆయుధాగారం నుండి వందలాది తుపాకులు, లెక్కలేనన్ని తూటాలు ఇతర ఆయుధాలను ఈ సాయుధ ముఠాలు దోచుకోవడానికి వీలు కల్పించాడు.
బిరేన్‌సింగ్ సమక్షంలోనే ఈ సాయుధ ముఠాలు స్వైరవిహారం చేశాయి. అయినప్పటికీ ఢిల్లీలో పార్లమెంటు బయటా, లోపలా కేంద్రప్రభుత్వం అతనికి అండగా నిలబడింది. స్వయానా కేంద్రహోంమంత్రి అమిత్‌షా బిరేన్సింగ్ను వెనకేసుకురావడంతో ఇక పట్టపగ్గాలు లేకుండాపోయాయి. పార్టీ లోపలా, వెలుపలా ఉన్న వారు ఎవరైనా సరే, అది పోలీసు ఉన్నతాధికారులు అయినా కూడా, బిరేన్‌సింగ్‌కు వ్యతిరేకంగా పల్లెత్తు విమర్శ చేసినా ఈ సాయుధముఠాలు వారి మీద బెదిరింపు దాడులకు పాల్పడేవి. బిరేన్‌సింగ్ వ్యవహారశైలిని ఎదిరించిన బిజెపి శాసన సభ్యుల ఇళ్లను లూటీ చేసి అగ్నికి ఆహుతి చేసిన సంఘటనలు నెలకొన్నాయి. స్వంత పార్టీ శాసనసభ్యులు, మిత్రపక్ష పార్టీలు శాసనసభ్యులలో ఆస్తి, ప్రాణనష్ట భయాలు నెలకొల్పి, ఢిల్లీ అండదండలతో బిరేన్ సింగ్ తన ఆధిపత్యాన్ని చలాయించుకుంటూ వచ్చాడు.
అయితే, ఈ సారి తిరుగుబాటు శాసనసభ్యులు మరికొంతమంది పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోగలడంతో బిరేన్ సింగ్ ముఖ్యమంత్రి పీఠాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన 31మంది శాసనసభ్యుల బలం పొందడం క్లిష్టతరం అని స్పష్టం అయ్యింది. అందుకే ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే దానిని బలపరుస్తామని లోపాయకారిగా మద్దతు ప్రకటించింది. దాంతో బిజెపి అగ్రనాయకత్వంలో కదలిక వచ్చింది.
దీంతో పరిస్థితులు చేజారిపోకుండా చాలా వేగంగా వెంటనే స్పందించింది. బిజెపి సీనియర్ నేత వై ఖేమ్‌చంద్‌ను హుటాహుటిన ఢిల్లీకి రప్పించారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ఆయన రహస్యంగా సమావేశం కాబోతున్నారని ఇంఫాల్‌లో వార్తలు బయటికి పొక్కాయి. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడిగా ఉన్న సంబిత్ పాత్రా ద్వారా అమిత్‌షా మాటగా రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందని ఖేమ్‌చంద్‌కు ఉప్పందించారు.
ఖేమ్‌చంద్ ఫిబ్రవరి 7న ఇంఫాల్‌కు తిరిగి వచ్చాడు. పార్టీ జాతీయ నాయకత్వం బిరేన్సింగ్ను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించనున్నదాన్న మీడియా ప్రశ్నలకు ఆయన అవునని లేదా కాదని సమాధానం చెప్పకుండా ‘నో కామెంట్’ అని చెప్పి జవాబు దాటవేశాడు. అయితే ఖేమ్‌చంద్ ఉల్లాసంగా కనిపించిన తీరును బట్టి ఏదో జరగబోతోందని స్థానిక మీడియా అంచనాకు వచ్చింది. విలేకరులు ఆయన వెంటబడ్డారు. ఆయన మాత్రం ఇంటికి వెళ్లకుండా తిన్నగా అసెంబ్లీ స్పీకర్ థోక్ఛామ్ సత్యబ్రతసింగ్ నివాసానికి చేరుకున్నాడు. స్పీకర్ నివాసంలో బిరేన్సింగ్ను వ్యతిరేకిస్తున్న మరికొంతమంది శాసనసభ్యులతో కలిసి రహస్య సమావేశం నిర్వహించారు.
ఈ పరిణామాలతో మేలుకొన్న బిరేన్‌సింగ్ కొంతమంది నమ్మకస్తులైన శాసనసభ్యులను వెంట తీసుకుని హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నాడు. ఈ క్రమంలో అమిత్‌షాను కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని రాష్ట్ర బిజెపి వర్గాలు ఈ విలేకరికి వివరించారు. ఇందులో ఆందోళనపడాల్సిన అవసరం ఏమి లేదన్నట్టుగా వ్యవహరిస్తూ బిరేన్‌సింగ్ తన వెంట వచ్చిన మందీమార్బలంతో కుంభమేళాకు హాజరై వచ్చాడు.
తెలివైన రాజకీయవేత్త కాబట్టి బిరేన్‌సింగ్ తాను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే జాతీయ నాయకత్వం ఎదుట తనకు కావాల్సినంత బలం ఉందని తెలియజెప్పాల్సిన అవసరాన్ని గుర్తించాడు. స్వంతపార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను, మిత్రపక్షంగా ఉన్న నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన మరో 5గురు ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని, మరో మిత్రపక్షమైన నేషనలిస్టు పీపుల్స్ పార్టీకి చెందిన 5గురు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండాలన్న హామిని తోడుగా తీసుకు వెళ్లాడు.
ఫిబ్రవరి 9న అమిత్‌షాను కలిసేందుకు అనుమతి లభించింది. బిరేన్‌సింగ్ తనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని అమిత్‌షాను కలిసినట్లు ఢిల్లీలోని పార్టీ వర్గాల నుండి ‘వైర్’కు సమాచారం అందింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా ఉన్నారు. అయితే మెజార్టీకి అవసరమైన సంఖ్యాబలం తనకు ఉందని నిర్దిష్టంగా చూపించలేకపోవడంతో, బీరెన్‌సింగ్ ప్రభుత్వాన్ని స్థిరంగా నడపలేడని జాతీయనాయకత్వం ఓ అంచనాకు వచ్చింది. కేవలం 15 నిమిషాల్లో సమావేశం ముగిసిందని, బిరేన్‌సింగ్ రాజీనామా చెయ్యక తప్పదని నాయకత్వం స్పష్టం చేసినట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా.
ఈ క్రమంలో బిరేన్‌సింగ్ ఇంఫాల్‌కు తిరిగివచ్చి అదే రోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ అజయ్ భల్లాను కలిసి తన రాజీనామాను సమర్పించాడు. బిరేన్‌సింగ్ వెంట రాష్ట్రవ్యవహారాల ఇన్ఛార్జ్ సంబిత్ పాత్రా, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శారదాదేవి తదితరులు ఉన్నారు.
జాతివైషమ్యాలు చెలరేగిన సందర్భంగా ముఖ్యమంత్రిగా తాను తన మైతేయి జాతికి చెందిన మనిషిగా అన్నివిధాలా జాతి ప్రయోజనాల కోసం నిలబడి వారి హృదయాలను గెలుచుకున్నానన్నా ‘ఇమేజి’ని నిలబెట్టుకోవడానికి బిరేన్‌సింగ్ చివరాఖరి ప్రయత్నం చేశాడు. మణిపూర్ రాజకీయాలలో మైతేయి తెగకు చెందిన ప్రజానికంలో ‘భూమి పుత్రులం’ అన్న భావోద్వేగాలను తట్టిలేపే కథానాయకుడిగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానన్న భావన కలిగించాడు. ఇది ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. పొరుగున ఉన్న అస్సొంలో 1970వ దశకంలో ముఖ్యమంత్రి గోలప్ బోర్బోరా తన పదవిని కాపాడుకోవడానికి సరిగా ఇలానే వ్యవహరించాడు.
ఆరు నూరైనా అధికారం దక్కాలి. ఈ మొత్తం రాజకీయ పరిణామాలలో పార్టీని అధికారంలో నిలబెట్టుకోవడం మినహా మరేదీ మోడీ-షా ద్వయాల శకాన్ని వేరేదీ కదిలించలేదని స్పష్టమవుతుంది. మహిళలపై లైంగికదాడులు, అమాయక పౌరుల అకారణ హత్యలు, ఆస్తులు- జీవనోపాధిల విధ్వంసం, పోలీసు స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు లూటీ చేసుకుపోవడం, నిషేధిత ఉగ్రవాద సంస్థల సభ్యులు పోలీసు అధికార వాహనాల్లో తిరగడం ఇవేవీ బిజెపి అగ్రనాయకత్వానికి చీమకుట్టినట్టు కూడా అనిపించలేదు.
గత 21 నెలలుగా రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దయనీయంగా దిగజారిపోయినా బిజెపి అధికారాన్ని నిలబెట్టినంత వరకూ ముఖ్యమంత్రిగా శాంతిభద్రతలు కాపాడడంలో ఘోరంగా విఫలమైనా బిరేన్సింగ్ను ఆ పదివిలో కొనసాగించారు. తమ పార్టీ ప్రభుత్వ అధికారానికి ఢోకా ఏం లేదు కాబట్టే ఎవరెన్ని విమర్శలు చేసినా, మణిపూర్ ప్రజానీకం ఎంతగా ఆరాట పడినా మోడీ ఆ రాష్ట్రానికేసి కన్నెత్తి చూడలేదు. కనీసం మాట మాత్రంగా అయినా రాష్ట్రంలో చెలరేగిన హింసను ఖండిస్తూ ఒక ప్రకటన కూడా చెయ్యలేదు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ‘వైరల్’ అయ్యాక కంటి తుడుపుగా ఆ ఘటనను ఖండించాడు.
మణిపూర్‌లో అధికారం నిలబెట్టుకోవడానికి బిరేన్సింగ్తో రాజీనామా చేయించడంతో పాటు మోడీ నమ్మకస్తుడైన రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లా ఫిబ్రవరి 10 నుండి జరగాల్సిన శాసనసభాసమావేశాలకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరింప చేయించారు. 2024 ఆగస్టు నెల వరకు మోడీ ప్రభుత్వంలో హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం మణిపూర్ గవర్నర్‌గా ఉన్నటువంటి అజయ్ భల్లా ప్రతిపక్ష పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిహరించి అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలు కాపాడేందుకు తనవంతు పాత్ర పోషించాడు.
ప్రస్తుతానికి రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం మనుగడ అజయ్ భల్లా చేతుల్లో సురక్షితంగా ఉంది. కానీ రానున్నకాలంలో మరో కీలక పరిణామం ఎదురుకోనున్నది.
మార్చి 24వ తేదిన ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బీరెన్‌సింగ్ ఆడియో టేప్‌కు సంబంధించిన సిఎఫ్ఎస్ఎల్ నివేదిక సుప్రీం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. అప్పుడు కూడా ప్రభుత్వం ఫిబ్రవరి 3న బిరేన్ సింగ్‌కు రక్షణగా నిలిచినట్లు నిలబడుతుందా లేక రాజుగారిని ఆరు నూరైనా కాపాడుకోవాల్సిన అవసరం కొద్ది పావుగా బలిపెడుతుందో అనేది వేచి చూడాలి.
– సంగీత బరూహ్ పిషరోతి
అనువాదం: కె సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.