
అధికార పార్టీ కి సంస్థాగత మార్పులతో వచ్చే ప్రయోజనాలతో పాటు, రాజకీయ కథన స్వరూపాన్ని నిరంతరం నిర్ణయించే సామర్థ్యంలోనే దాని బలం ఉంది.
అధికార భారతీయ జనతా పార్టీ సుధీర్ఘకాలంపాటు అధికారంలో ఉండాలనే కృత నిశ్చయంతో ఉంది.
రాబోయే 15 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంటుందని హోంమంత్రి అమిత్ షా ఇటీవల పేర్కొన్నారు. అంతకుముందు, 2015లో రాబోయే 30 సంవత్సరాల కాలం బిజెపి యుగం అవుతుందని ఆయన అన్నారు.
గుజరాత్ లో రెండు దశాబ్దాలకు మించి పార్టీ అధికారంలో ఉంది. బిజెపి 10 సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పాలించింది. మరో ఐదు సంవత్సరాలపాటు అధికారంలో ఉండేందుకు జూన్ 2024లో వరుసగా మూడవసారి గెలిచింది.
అధికారంలో కొనసాగుతామని బిజెపి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతుంది?
ఎక్కువ కాలం అధికారాన్ని నిలుపుకునే లక్ష్యంతో బిజెపి సంస్థాగత మార్పులు చేసింది. అక్రమాలను వ్యవస్థీకృతం చేశారని, అందుకే ఈ పోరాటం ఒక పార్టీకి వ్యతిరేకంగా కాకుండా భారత రాజ్య “యావత్ యంత్రాంగానికి” వ్యతిరేకంగా సాగుతుందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, నిష్పాక్షికమైన, తటస్థమైన పారదర్శక ఎన్నికల కమిషన్ లేకుండా ఎన్నికలు న్యాయంగా జరగవని ఆయన అన్నారు.
అయితే, బిజెపి నిరంతరం సాధించే ఎన్నికల విజయాలను అక్రమాలు మాత్రమే వివరించలేవు. ఓటర్లను ఆకర్షించడానికి సంక్లిష్టమైన వ్యూహాలను, రాజకీయ కథనాలను బిజెపి ఉపయోగిస్తుంది.
ప్రతిపక్షాలు బిజెపి రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి.
బిజెపి తన సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మద్దతుతో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.
జమ్మూ కాశ్మీర్లో జరిగినట్టుగా అధికారంలోవున్న పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల హద్దులు నిర్ణయించే ప్రక్రియను(డీలిమిటేషన్) తనకు అనుకూలంగా మలుచుకోవడం(గెర్రీమాండరింగ్) దీనికి సూచిక. అనేక రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అది రాజకీయ పార్టీలను చీల్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం. తనకు అనుకూలంగా పనిచేసే ఎన్నికల కమిషనర్లను నియమించుకోవడానికి వారి నిమామక ప్రక్రియనే మార్చటం వంటి చర్యలు దాని వ్యూహంలో భాగంగా ఉన్నాయి.
ప్రతిపక్షానికి దీర్ఘకాలిక వ్యూహం అంటూ ఏమీ లేదు. అది పూర్తిగా ప్రతిచర్యాత్మకమైనదిగా(రియాక్టివ్) ఉంది. ఇది రాజకీయంగా కూడా అంత చురుగ్గా లేదు.
ప్రతిపక్షం తరచుగా బిజెపి కథనానికి ప్రతి-కథనాన్ని అందించడానికి ఇబ్బంది పడుతుంది. బిజెపి ప్రతిపక్ష సంభావ్య ప్రతిచర్యను పరిగణనలోకి తీసుకోవటమే కాకుండా, ఆ ప్రతి-కథనాన్ని కూడా తన ప్రయోజనం కోసం ఆయుధంగా మలుచుకుంటుంది. బిజెపి చర్యలను ప్రతిపక్షం ఏమాత్రం ఊహించలేకపోతోంది.
బిజెపిని ఎదుర్కోవడంలో ప్రతిపక్షానికి అత్యంత ముఖ్యమైన సవాలుగా ఇది ఇప్పటివరకు నిలిచింది.
గత 10 సంవత్సరాలకుపైగా కేంద్రంలో కొనసాగుతున్న బిజెపి పాలనకు చెందిన మెజారిటీవాద(మెజారిటేరియన్) ఎజెండాకు ప్రత్యామ్నాయ దృక్పథాన్ని ప్రతిపక్షం అందించలేకపోయింది.
ప్రతిపక్ష పార్టీలు ప్రతి బిజెపి నినాదాన్ని, ప్రచారాన్ని స్వతంత్రంగా విమర్శిస్తుంటాయి. అయితే ఈ విమర్శలన్ని కలిసి ఒక ప్రత్యామ్నాయ సామాజిక దృక్పథానికి సమానం కాజాలవు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, కుల గణన కోసం చేస్తున్న ప్రచారం ద్వారా ఒక ప్రత్యామ్నాయ దృక్పథాన్ని అందించేందుకు కాంగ్రేస్ చేరువ అయింది. అయితే ప్రతి రాష్ట్రంలో వైవిధ్యాలకు కారణమయ్యే సూక్ష్మ-గతిశీలతలలో పొరలు పొరలుగా పాతుకుపోయిన బిజెపి సామాజిక దృక్పథాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రేస్ పార్టీ ప్రభావవంతంగా లేదు .
ఉదాహరణకు, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించటం, ఉద్యోగాలలో రిజర్వేషన్లను కాపాడటం వంటి విషయాలచుట్టూ ఒక ప్రచారాన్ని ప్రారంభించగలిగింది. అది కొంత లాభాన్ని తెచ్చిపెట్టింది.
అయితే, బిజెపి ఇటువంటి ప్రతి-కథనాలకు అప్రమత్తమౌతూ తన వ్యూహాలను సవరించుకుంటుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించడం అనే కథనాన్ని స్వంతం చేసుకోవటానికి అది వేగంగా కదిలింది. అదేవిధంగా, పెరుగుతున్న యువత నిరుద్యోగ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా ఇంటర్న్ షిప్ లను అందించే ఆలోచనను ముందుకు తీసుకువచ్చింది.
చివరికి రాజకీయ చర్చ(పొలిటికల్ డిస్ కోర్స్ )కు సంబంధించిన షరతులను బిజెపి నిర్ణయిస్తుంటే ప్రతిపక్షం కేవలం తాత్కాలికంగా ప్రతిస్పందిస్తుంది.
ఉదాహరణకు మతపరమైన ధ్రువణత(పోలరైజేషన్)ను ఉత్పన్నం చేయడానికి బిజెపి మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటుందనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అది అంతటితో ఆగదు. అటువంటి పరిస్థితి నుంచి జనించే రాజకీయ ఎంపికలను, దృశ్యాలను కూడా అది క్రమంలో ఉండేలా చూస్తుంది.
తత్ఫలితంగా ఉద్భవించే మతపరమైన మైనారిటీల ప్రతిస్పందనలను బిజెపి అంచనా వేసి, వాటిని తన ఎన్నికల లెక్కల్లో కారకం చేస్తుంది.
మైనారిటీ అనుకూల, దళిత అనుకూల పార్టీలు ప్రాతినిధ్యం వహించడానికి, ప్రతిపక్ష లౌకిక పార్టీల నుండి వారిని దూరం చేయడానికి కావలసిన వ్యూహాన్ని బిజెపి అమలుచేస్తుంది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎమ్ఐఎమ్), ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి వంటి పార్టీలు ఎప్పుడూ ప్రతిపక్ష కూటమిలో చేరకుండా పరోక్షంగా బిజెపిని ఎన్నికలలో బలోపేతం చేస్తాయి. అయితే, ఈ పార్టీలు బిజెపి, ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూనే ఉంటాయి.
మరో దళిత పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇదే వైఖరిని తీసుకుంటుంది. తాము బిజెపి, ప్రతిపక్ష కూటమిలతో సమాన దూరం పాటిస్తున్నట్లు పేర్కొంటుంది.
బిజెపి ఈ పరిణామాలను ముందుగానే ఊహించినట్లు కనిపిస్తుంది. అయితే, ప్రతిపక్షం మాత్రం తన రాజకీయ చర్చల పర్యవసానాలను గ్రహించటంలో అంత తెలివిగా వ్యవహరించటం లేదు. నిజానికి ప్రతిపక్ష పార్టీల రాజకీయ చర్చను బిజెపి తరచుగా ఈ పార్టీలు ఊహించని విధంగా ఉపయోగించుకుంటుంది.
ఉదాహరణకు హర్యానా రాష్ట్ర ఎన్నికల్లో, రైతుల నిరసనల మీద, నాలుగు సంవత్సరాల కాంట్రాక్టుల కారణంతో కోపంగా ఉన్న సాయుధ దళాలలో అగ్నివీర్లుగా చేరాలని కోరుకునే యువతపైన, మాజీ రెజ్లింగ్ సమాఖ్య అధిపతి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆందోళన చెందుతున్న మహిళా రెజ్లర్ల నిరసనలపైన ఆధారపడి కాంగ్రెస్ విజయం సాధించడానికి ప్రయత్నించింది.
జాట్లను, జాట్లు కానివారిని కులాల వారీగా విభజించి బిజెపి ఈ నిరసనలను తెలివిగా ఉపయోగించుకుంది. ఈ విభజన స్వభావాన్ని, దాని పర్యవసానాలను రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అర్థం చేసుకోగలిగేటప్పటికి సమయం మించిపోయింది. అలా కాంగ్రేస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది.
అలాగే, మహారాష్ట్రలో బిజెపి మరాఠా వ్యతిరేక భావాన్ని ప్రోత్సహించింది. గుజరాత్ ఎన్నికల్లో గెలవడానికి పటేల్ వ్యతిరేక భావాలను, తరువాత రాజ్‌పుత్ వ్యతిరేక భావాలను ఉపయోగించింది.
బిజెపి తన సొంత ప్రత్యర్థులను కూడా ప్రోత్సహించి, ఎన్నికల ప్రయోజనం కోసం తన రాజకీయ ప్రక్రియలో వారిని ఉంచుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విషయంలో కూడా ఇదే చేసింది. “ఇండియా అగైన్స్ట్ కరప్షన్” ఉద్యమం ద్వారా ఆ పార్టీని సృష్టించడంలో సహాయపడింది. ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచేలా చేసి దాని క్షీణతకు కారణమయ్యేలా చేసింది. ఢిల్లీ, పంజాబ్ లలో స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా ఆప్ కాంగ్రెస్ బలహీనపడటానికి కారణభూతమైంది. చివరగా, బిజెపి నిరంతరం నినాదాలు, విధానాలు, ప్రచారాల శ్రేణితో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా ప్రతి-కథనం ఆవిర్భవించటానికి అవకాశం ఇవ్వదు. ఒక కథనం తడబడటం మొదలవగానే, అది మరొకదానికి వెళుతుంది.
దీనితో పాటు, పార్లమెంటులో ప్రజల ద్రుష్టిని మార్చే అంశాలను లేవనెత్తటంలో, అంతరాయాలను సృష్టించడంలో అది చూపుతున్న చురుకుదనం వల్ల ప్రతిపక్షం స్థిరమైన విమర్శను అందించలేకపోతుంది.
ఫలితంగా, బిజెపి ప్రతిపక్షాల ప్రతిస్పందనను ముందుగానే అడ్డుకుంటుండగా, ప్రతిపక్షం బిజెపి చేసే దానికి మాత్రమే ప్రతిస్పందిస్తుంది. ఆవిధంగా ఓటర్ల మనస్సులను ఆకట్టుకోవడానికి ప్రతిపక్షం కష్టపడుతూనే ఉంది.
బిజెపి నాయకులు తాము సుధీర్ఘకాలంపాటు అధికారంలో కొనసాగుతామని చెబుతున్నప్పుడు వారి మనసుల్లో రాజకీయ ప్రవచనం(పొలిటికల్ డిస్ కోర్స్) ఎలా ఉండాలనే విషయానికి సంబంధించిన షరతులను నిర్ణయించే సామర్థ్యం తమ స్వంతం అనే భావన ఉంటుంది.
– అజయ్ గుడవర్తి, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం
అజయ్ గుడవర్తి న్యూఢిల్లీలోగల జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
అనువాదం: నెల్లూరు నరసింహారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.