
ఢిల్లీ ప్రజల ఓటు ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వానికి వారిచ్చిన కితాబుకాదనీ, అది మోసపూరిత రాజకీయాలతో కేజ్రీవాల్ చేసిన ప్రయోగానికి ప్రజల తిరస్కారమని కాంగ్రెస్ అభిప్రాయపడితే వారికా హక్కుంది. దీనిలో రవ్వంత వాస్తవం కూడా లేకపోలేదు.
బిజెపికి కిరీటందక్కింది. దీనికి అనుగుణంగా వందిమాగధుల క్రతువులు ప్రారంభమైయ్యాయి. ప్రభుత్వం తరఫున విలేకరులు అదనపు సమయం వెచ్చించి మరీ పనిచేస్తున్నారు. మోడీ సమ్మోహనం ఇంకా అలాగే ఉందనీ అమిత్ షా కోరుతున్నా ‘‘అస్సలు నమ్మదగని చాణక్య’’ బిరుదు అతనికి దక్కిందనీ, బిజెపి రాజకీయ రంగంలో ఆధీక్యత కొనసాగిస్తున్నదనీ నమ్మకం కలిగించుకోవడానికి వారికి వారు చెప్పుకుంటూ మనకు చెబుతున్నారు.
ఢిల్లీ గద్దెను బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ అప్పగించింది. కానీ వారి ఓట్లు ఇంకా ఆవిరైపోలేదని ఆప్ నమ్ముతుంది. ఇలా అనుకునే హక్కు వారికి పూర్తిగా ఉంది. 42% ఓటు వాటా అంటే చిల్లర కాదు. సుదీర్ఘకాలం పరిగెత్తడానికి అవసరమైన శక్తి, నమ్మకం కేజ్రీవాల్‌కు ఉన్నయా అనేది వేచి చూడాల్సిన విషయం. కానీ నరేంద్రమోడీ పాలన తన పాటని, నేపథ్య సంగీతాన్ని మార్పుచుకునేలా చేసిన బలం వారిదేననే వాస్తవంతో కేజ్రీవాల్ అతని సహచరులు సంతృప్తి పొందవచ్చు. మూడు అంశాల్లో బిజెపి భిన్నమైన బాణీని ఆలపించించేలా చేశామనే ప్రతిష్ట మాత్రం ఆప్‌కు దక్కుతుంది.
ఆ మూడు బాణీలు ఏంటి?
మొదటిది వారికి ఇష్టమైన సైద్ధాంతిక నేపథ్యగీతం హిందూ- ముస్లిం పాటను అటకెక్కించాల్సి వచ్చింది. ఢిల్లీ ఎన్నికల ప్రచార ప్రారంభంలో ఢిల్లీ అభ్యర్ధి బిజెపి పోటీదారులు మహారాష్ట్ర ఎన్నికల్లో మొదటగా తయారు చేసి ఆరెస్సెస్ కరుడుకట్టిన మనువాదులు వాడిన నినాదం- ఏక్ హైతో సేఫ్ హై(ఒకటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం)ని ఎత్తుకున్నారు. అత్యంత వివాదాస్పదుడైన కపిల్ మిశ్రాకు అభ్యర్ధిత్వం ఇచ్చినా, బిజెపి వాక్చాతుర్యం వాదనలన్నీ ఆప్ తప్పుడు పనులు దుస్సాహసాలపైనే కేంద్రీకృతం అయ్యాయి. ‘‘గోలీమారో సాలోంకో’’ (వెధవల్ని తూటాతో కాల్చేయండి) అనే అనురాగ్ ఠాకూర్ లేడు. మోడీ- షా ద్యయం కూడా ధృవీకరణ రాజకీయాలపై వాళ్లు తగిలించుకున్న దురదను అణుచుకున్నారు.
ఇది వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గడమే అయినా బిజెపిని ఇలా వంచిన ఘనత కేజ్రీవాల్‌కు దక్కుతుంది. ఆప్ నుండి మధ్య తరగతిని దూరం చేయాలని బిజెపి భావించింది. దాని కోసం రాజధానిలో ముక్కోపులైన హిందుత్వవాదులను పూర్తిగా నియంత్రణ చేసింది. కేంద్రనాయకత్వం చుట్టు గిరికీలు తిరుగుతున్న, కరుడు కట్టిన హిందూత్వ గుంపుకు నాయకుడైన ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌లో చేసినట్టుగా కాకుండా మోడీ సమూహం కొంత నిగ్రహం పాటించింది. అర్ధబలం కండబలంగల మోడీకి రాజకీయాలకు, అత్యంత స్వీయకేంద్రిత రాజకీయం నడిపే కేజ్రీవాల్‌కు మధ్య ఎంపిక చేసుకోవడానికి ఢిల్లీ మధ్యతరగతి పెద్దగా ఏం ఆలోచించలేదు. కానీ ఢిల్లీ ప్రజలకు అదుపు తప్పిన మతోన్మాదం పట్ల మోహం లేదు. దీనివల్ల హింస, విధ్వంసం మాత్రమే పుడతాయి. మధ్యతరగతి మద్దుతుకు బీజేపీ మూల్యం చెల్లించాలి మరి.
ఇక రెండవది. ‘‘రేవడీ’’ (ఉచితాలు) సంస్కృతిగా మోడీ స్వయంగా తిరస్కరించిన ఆప్ పాలనలోని సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని బిజెపి వాగ్ధానం చేసేలా చేసిన ఘనతగా కేజ్రీవాల్, అతని ఉద్రేకపూరితమైన మద్దతుదారులకు దక్కుతుంది. ఆప్ ప్రభుత్వం అందించిన రాయితీలు. ప్రజానుకూల పథకాలు కొనసాగిస్తామనే వాగ్ధానం చేయడమే కాకుండా తానుగా కూడ తమ ఉచితాలను జోడించవలసి వచ్చింది.
బిజెపి చేసిన ప్రజాకర్షక వాగ్ధానాల జాబిత
– స్త్రీలకు ప్రతినెల రూ.2,500
– రూ.500లకే గ్యాస్ సిలిండర్- హోలీ, దీపావళికి ఉచిత సిలిండర్
– కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య
– ఆటో, టాక్సీ, ఈ- రిక్షా, గిగ్, ఇంటి పనివాళ్లకు 10 లక్షల బీమా
– రూ.5కే అటల్ కాంటిన్ల్లో పౌష్టికాహారం
ప్రజాకర్షణే ప్రబల ప్రాచుర్యం:
ఇకపోతే ప్రభుత్వ అర్ధశాస్త్రవేత్తలు, ఇతర సాధారణ అనుచరులు బిజెపి ఉచితాలు ‘‘రెవడీ’’లు కాదని అవి సంక్షేమ చర్యలనీ మనకు చెబుతారు. వాళ్లేం చెప్పినా ఈ పథకాల అమలుకు బిజెపి కట్టుబడింది. అది కూడా మోడీ గ్యారంటీతోనే. అయిష్టంగానైనా సరే ఈ రూపంలో ఎంతోకొంత సంపద పునఃపంపిణీకి అంగీకరించింది. చాలా అప్రమత్తంగా ఉండే ఆప్ నాయకత్వం, కార్యకర్తలు ఈ వాగ్ధానాలు అమలు జరిగేలా చూస్తారని ఆశించవచ్చు.
మూడవది తమ ఆర్ధిక/ ప్రాధాన్యతల గురించి తన్నుతాను గిల్లిచూసుకోవాల్సిన స్థితి ఢిల్లీ పోరువల్ల బిజెపికి ఏర్పడింది. ఎక్కువగా తన దృష్టిని పేదలపై కేంద్రకరించడం వలన ఆప్ పార్టీ పేద మధ్యతరగతి కూటమిలో పగుళ్లు ఏర్పడ్డాయనే ప్రచారమైన భారం నుండి లబ్ధి పొందడానికిగాను కేంద్రప్రభుత్వం తన తాజా బడ్జెట్లో తన అలవాటుకు భిన్నంగా మధ్య తరగతికి భారీ ఆదాయపనున్న రాయితీలు కలగచేసింది. ఢిల్లీ జనాభాలో దాదాపుగా 67% మధ్య తరగతి వాళ్లని అంచనా. నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ఆటను ఎలా మార్చిందో నిరూపించడానికి ప్రొఫేషనల్ గణాంక నిపుణుల విశ్లేషణలను గమనిస్తే అర్ధమవుతుంది. సగం రాష్ట్రంపై రాజకీయ నియంత్రణ సాధించడానికి మోడీ ప్రభుత్వం లక్ష కోట్ల పన్ను ఆదాయం వదిలేసుకుంది. భవిష్యత్తుకోసం కొత్తగా ధనికులైన ఈ మధ్యతరగతి వినిమయచక్రం ప్రారంభిస్తారో లేదో? ప్రస్తుతానికి మాత్రం మోడీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ అనే ఒక ప్రమాదకర రాజకీయ వ్యక్తిత్వానికి ఇప్పటి వరకకైతే అడ్డుకున్నామనే తృప్తి పొందవచ్చు.
మధ్య తరగతి కేజ్రీవాల్‌ను వదిలేసిందంటే దానికి కారణం కేజ్రీవాల్ ఇక ఎంతమాత్రం కొత్త తరహా రాజకీయాల ప్రతీకగా లేడని బీజేపీ సైద్ధాంతిక గురువులు, బీజేపీ అనుయాయులు భావించడం తప్పేమి కాదు. ఆప్ నుండి దూరం కావడం అంటే మధ్యతరగతి విలువల తపనను, మంచి పరిపాలన అందించే వాగ్ధానాలను వదిలేసుకుందని కాదు. ఈ తపనే మోడీకి అతిపెద్ద బలహీనతగా రుజువుకానుంది.
ఇప్పటి దాకా అయితే మధ్యతరగతి ఓటర్లు విస్తృతమైన మోడీ వ్యక్తి ఆరాధన, బిజెపి సాంస్కృతిక జాతీయవాదంలో పడి కొట్టుకుపోవడానికి సిద్ధం అయ్యారు. రెండూ అతిగా జరిగాయి. దాని వల్ల తగ్గుదలే వస్తుంది. మౌని అమావాస్యనాడు కుంభమేళా తొక్కిసలాటలో ఎంతమంది భక్తులు మరణించారో చెప్పడానికి ఇష్టపడక పోతే హిందూ జాతీయ వాద పాలన వలన ఉపయోగం ఏముంది? లెక్కగట్టుకుని చూసే సున్నితత్వం లేని తనాన్ని. పరిపాలనా అహంకారాన్ని మధ్యతరగతి దయతో మన్నించదు. మన నాయకత్వం తనకు తాను విశ్వగురువుగా రెక్కలు విప్పార్చి ప్రసరించుకోవచ్చు. కాని చేతులకు బేడీలు, కాళ్లకు సంకేళ్లతో భారతదేశస్తులనీ అమెరికా నుండి తిప్పిపంపించిన అవమానకర దృశ్యాల నుండి మధ్యతరగతి తనకు తానుగా అంచనాలకు వస్తుంది.
తన ఓటమితో జాతీయ రాజకీయాల్లో మధ్యతరగతికి చెందిన కేంద్రీకృత ఉమ్మడి భావనను అరవింద్ కేజ్రీవాల్ తిరిగి పాదుకొల్పడమే కాకుండా మోడీ ప్రభుత్వాన్ని సరిదిద్దబడిన సంక్షేమంలోకి ఇరికించాడు. దానికంటేకూడా బిజెపి నాయకత్వానికి మతోన్మాద ఘర్షణపూరిత రాజకీయాలకున్న పరిమితిని ఢిల్లీ పోరు తెలియజేసింది. ఢిల్లీ తీర్పు ప్రకంపనలు ఢిల్లీ పరిధి దాటి దేశరాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వారి ప్రాధాన్యతలు, రాజకీయాల గురించి పునరాలోచించుకోవలసి వస్తుంది.
– హరిశ్ ఖరే
అనువాదం: దేవి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.