
ప్రధానమంత్రిగా మూడో దఫా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. సమరశీల హిందుత్వ, కండలు తిరిగిన జాతీయోన్మాదం మేళవించిన రాజకీయాలు మోడీని రెండు దఫాలుగా గద్దెపై కూర్చోబెట్టాయి. దేశ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా బీజేపీని నిలబెట్టాయి. కానీ మూడో దఫా పరిపాలనలో కులాధారిత అస్తిత్వ రాజకీయాలను బీజేపీ అధికమించలేకపోతున్న వైనం కనిపిస్తోంది.
మూడో దఫా అధికారానికి వచ్చిన మోడీ ఏడాది ముగియక ముందే బీజేపీ సైద్ధాంతిక అవగాహనలో కీలకమైన మలుపుకు చేరుకున్నది. పహల్గాం ఉగ్రదాడి వెలుగులో ముందుకొచ్చిన నిఘా వైఫల్యాలు వంటి కీలకమైన సమస్యలను ఎదుర్కొంటున్న మోడీ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టనున్నట్లు ప్రకటించడం గమనార్హం.
గత రెండేళ్లుగా కులగణన చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి సోషలిస్ట్ పార్టీల నేతలతోపాటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ప్రతి వేదిక పైన ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన బలహీన తరగతులకు సంబంధించిన వాస్తవ స్థితిగతులు తెలుసుకోవడానికి కులగణన బాగా ఉపయోగపడుతుందని వాదిస్తున్నారు. అటువంటి సమగ్ర సమాచారం ఆధారంగా సంక్షేమ పథకాలను మరింత అర్థవంతంగా రూపొందించి మెరుగైన ఫలితాలు ఇచ్చే విధంగా అమలు చేయవచ్చు అన్నది ప్రతిపక్షాల వాదన.
ఇటువంటి వాదనలు అర్థరహితమని బీజేపీ ఆడిపోసుకున్నది. ప్రతిపక్షాలను గేలి చేసింది. కుల రాజకీయాలను రెచ్చగొట్టి భారతదేశాన్ని ఆటవిక కాలానికి తీసుకు వెళుతున్నారని ప్రతిపక్షంపై స్వయంగా ప్రధానమంత్రి మోడీ విరుచుకుపడ్డారు. దేశంలో తనకు నాలుగు కులాలు మాత్రమే కనబడుతున్నాయని అన్నారు. ఆ నాలుగు కులాలు పేదలు, మహిళలు, యువకులు, రైతులని మోడీ చెప్పుకొచ్చారు. కులగణన డిమాండ్ అర్బన్ నక్సలైట్ల ఆలోచనా ధోరణికి ప్రతిబింబమని కూడా మరో సందర్భంలో మోడీ ధ్వజమెత్తారు. కులగణన దేశాన్ని చీల్చే నినాదమని పలువురు బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు.
కుల సమీకరణల చుట్టూ జరుగుతున్న రాజకీయాలను 2024 పార్లమెంటు ఎన్నికలు శాశ్వతంగా మార్చివేశాయి. బీజేపీకి హిందుత్వ రాజకీయాలు ఎంత ప్రాధాన్యత కలిగినవో ఎన్డీఏ కూటమి భాగస్వాములైన నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడుకు కుల రాజకీయాలు, సమీకరణలు కూడా అంతే ప్రాధాన్యత కలిగినవి. ఈ నేపథ్యంలో భారత రాజకీయాలను శాసించే ఏకైక నేతగా మోడీ స్థానానికి సవాళ్లు ఎదురవుతున్నాయి.
మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు నెలల్లోనే కులగణన విషయంలో మోడీ తన అవగాహనను మార్చుకోవడం మొదలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టిన అడ్డదారి నియామకాలను ఎన్డీఏ కూటమి పక్షాలు, ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు అయిష్టంగానే మోడీ ఉపసంహరించుకున్నారు. అడ్డదారి నియామకాలు మొదలయితే రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. పైగా ఈ నియామకాలకు అర్హులైన వారిని ఎంపిక చేసే విషయంలో నిర్నిరోధమైన విచక్షణ అధికారాలు కొద్దిమంది చేతుల్లో పోగుబడతాయి. ఈ నియామకాలను వ్యతిరేకించడం వెనుక ఈ రెండు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామాజిక న్యాయ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్డదారి నియామకాల కోసం జారీ చేసిన ప్రకటన ఉపసంహరించుకున్నట్టు కేంద్రంలో సీనియర్ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు.
రామాలయం నిర్మాణం ఎజెండాగా ఉధృతంగా ముందుకు వచ్చిన బీజేపీ మతోన్మాద రాజకీయాల నేపథ్యంలో బీజేపీ ప్రాబల్యం నుంచి దళితులు బీసీలు పక్కకు పోతున్నారన్న మౌలిక వాస్తవాన్ని ఆ పార్టీ గుర్తించిన మొదటి సందర్భంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల ప్రకటన ఉసంహరణ నమోదవుతుంది.
కులం గురించిన చర్చ..
2014 తర్వాత ఆధిపత్య సామాజిక తరగతుల విశ్వాసాన్ని పోగు చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసింది. కానీ 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ ఆ దిశగా వేస్తున్న అడుగులు నిలిచిపోయాయన్న వాస్తవాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
కులాధారిత సామాజిక న్యాయం నినాదాన్ని కప్పి పుచ్చటానికి ఈ నినాదాలను ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముందుకుతెస్తున్నాయని బీజేపీ, మోడీ నాయకత్వం అంది. అయినప్పటికీ పాలక పార్టీ కూడా ఎన్నికల్లో గెలుపుకొసం ఇదే కులాధారిత రాజకీయ సమీకరణాలపై ఆధారపడింది. ఈ సమీకరణాల కోసం బీజేపీ చేసే ప్రయత్నాలను మరో కోణంలో దేశం ముందు ఉంచడం ద్వారా బీజేపీ కులాధారిత రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని అభిప్రాయం కలిగించటానికి ప్రయత్నం జరిగింది. కులాధారిత రాజకీయ సమీకరణాల విషయంలో రెండు ప్రధాన పార్టీల వైఖరిలో మౌలికమైన వ్యత్యాసాలు ఉన్నాయి.
సమాజ్ వాది పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలు తాజాగా కాంగ్రెస్ కులాధారిత సంక్షేమ చర్యలను దీర్ఘకాలంలో సహజ వనరుల సమాన పంపిణీ ఇంకా రాజకీయాల ప్రజాతంత్రీకరణ సాధన లక్ష్యాలుగా పరిగణిస్తున్నాయి. దీనికి భిన్నమైనది బీజేపీ అవగాహన. ఎస్సీ, బీసీ కులాలలో ఆధిపత్య తరగతులకు వ్యతిరేకంగా అవే సామాజిక తరగతులలోని నిరాధరణకు గురైన ఉపకులాలను సమీకరించటం, రాజకీయాలలోనూ రాజ్యాంగ వ్యవస్థల్లోనూ నియమించటం ద్వారా బీజేపీ ప్రత్యామ్నాయ కుల సమీకరణ రాజకీయాలను అమలు చేస్తోంది. మరోవైపు సామాజిక న్యాయానికి పునాదులైన ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్ముకునే ఆర్థిక విధానాలను శరవేగంగా అమలు చేస్తోంది.
మరింత స్పష్టంగా చెప్పాలంటే పార్లమెంటరీ రాజకీయాలలో సంఖ్యాపరమైన ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవటానికి బీజేపీ దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ కులాలను మిగిలిన కులాలకు, ఉపకులాలకు వ్యతిరేకంగా బరిలోకి దించుతోంది. ఫలితంగా అటు దళితుల్లోనూ ఇటు బీసీల్లోనూ శాశ్వతమైన చీలికలు, విభజనలు, విభేదాలు పాతుకు పోతున్నాయి. ఈ పర్యవసానాలపై చర్చ జరగకుండా ఉండటానికి తమ విధానాలన్నీ పేదల పక్షమే అన్న ముసుగును మోడీ వాడుకుంటున్నారు.
అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఉధృతంగా ప్రారంభించిన రామాలయ నిర్మాణ ఉద్యమం, దాంతోపాటు పలువురు అగ్రకుల సంఘపరివార నేతలు రాజ్యాంగంలో అణగారిన తరగతులకు ఉన్న ప్రత్యేక అవకాశాలు, సదుపాయాలు వెసులుబాటులను రద్దు చేయటానికి వెనకాడబోమంటూ చేసిన ప్రకటనలు గత 12 ఏళ్లలో బీజేపీ అనుసరించిన ప్రత్యామ్నాయ కుల సమీకరణ రాజకీయాల ద్వారా సాధించిన ప్రయోజనాలను దెబ్బతీయటం మొదలైంది. వీటి ఫలితమే లోక్‌సభలో మోడీ సొంతంగా ప్రభుత్వాన్ని శాసించే సామర్థ్యాన్ని కోల్పోవడం. అధికారంలో కొనసాగడానికి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావటం జరిగింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో 400పైగా సీట్లు సొంతంగా సాధించాలన్న బీజేపీ లక్ష్యం, ఆ లక్ష్య సాధనకు వెచ్చించిన ఆర్థిక, మానవ వనరులు వాటి ప్రభావాలను తిరస్కరించి దేశ ప్రజలు బీజేపీకి సొంతంగా దేశాన్ని పరిపాలించే సామర్థ్యం లేదని నిరూపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరో కోణాన్ని కూడా దేశం ముందుకు తెస్తున్నాయి. కరుడుగట్టిన హిందూత్వ రాజకీయాలు, కండలు తిరిగిన జాతీయ వాదం, జబ్బలు చరిచే యుద్ధోన్మాదం ముందు ముందు ఆశించిన రాజకీయ ప్రయోజనాలు సాధించే సాధనాలుగా ఉండబోవన్నది ఆ కొత్తకోణం చెప్తోంది.
రాజ్యాంగం పట్ల బీజేపీ గత పదేళ్ళు గా ప్రదర్శిస్తున్న వైఖరి, తప్పుడు భాష్యాల ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని గమనించినప్పుడు సామాజిక న్యాయం నినాదాన్ని అర్థం చేసుకోవడంలోనూ ఆచరణలో పెట్టడంలోనూ బీజేపీ ఎదుర్కొంటున్న సంక్షోభం తేట తెల్లమవుతోంది.
రిజర్వేషన్లు..
కులగణన చేపడతామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన రాజకీయ సమీకరణ సాధనంగా కులం పని చేస్తుందన్న మౌలిక సత్యాన్ని అంగీకరించే నిదర్శనంగా ఉంటుంది. గతంలో అనేకసార్లు కులగణన డిమాండ్‌ను మోడీ తులనాడారు, గేలి చేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న భారతదేశాన్ని నడిపించే సామర్థ్యం రానురాను బీజేపీకి తగ్గిపోతుందన్న వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. కులగణన డిమాండ్‌ను అంగీకరించాల్సి రావడం బహుశా తన పదవీకాలంలో మోడీ వెనుకడుగు వేసిన రెండో సందర్భం అవుతుంది. 202-21లో ఏడాది పాటు సాగిన రైతాంగ మహోద్యమం తరువాత పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయక చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం మోడీ తొలి వెనుకడుగు.
వ్యవసాయక చట్టాలు రద్దు చేసుకున్నప్పటి సందర్భంతో పోల్చినప్పుడు కులగణనను అంగీకరించడం ద్వారా మోడీ విస్తృతమైన పోరాట రంగానికి తెర తీసినట్టనిపిస్తుంది. కులగణన డిమాండ్లను అంగీకరించడం ద్వారా ప్రతిపక్షం లేవనెత్తిన మరింత విస్పష్టమైన డిమాండ్లను అంగీకరించక కాదనలేని పరిస్థితికి మోడీ చేరుకున్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండరాదనే చట్టాన్ని సవరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రిజర్వేషన్లపై ఈ రకమైన నిషేధం కృత్రిమమైందని అర్థరహితమైందని రాహుల్ గాంధీతో సహా ప్రధాన ప్రతిపక్షాలన్నీ హెచ్చరిస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అంతర్జాతీయ దౌత్య రంగంలో ఏకాకిగా మిగిలిన భారత్, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని ముస్లిం గ్రూపులన్నీ సంఘటితమవుతున్న తరుణంలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అవసరమంటున్న డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం అడ్డుకోగలదా? ఈ డిమాండ్‌ను అంగీకరించినా లేదా తిరస్కరించినా అది వ్యక్తిగతంగా మోడీకి, వ్యవస్థాగతంగా బీజేపీ- సంఘ పరివారానికి, వారి రాజకీయ మనుగడను దీర్ఘకాలంలో ప్రభావితం చేసే అంశంగా ఉంటుంది. కులగణన అనంతరం ముందుకు వచ్చే డిమాండ్లు భారత రాజకీయాల్లో భూకంపాన్ని సృష్టించనున్నాయి.
చారిత్రకంగా చూసినప్పుడు ప్రజల్ని ప్రలోభ పెట్టడంలో ప్రజాకర్షణ కలిగిన నాయకులు తమ శక్తి సామర్ధ్యాలను అతిగా అంచనా వేసుకున్న అనుభవాలు, దాని పర్యవసానాలు మనముందు ఉన్నాయి. అటువంటి మితిమీరిన ఆత్మ విశ్వాసంతోనే ఈ నాయకులు బహుముఖ రంగాలలో పోరాటానికి దిగుతారు. మూడో దఫా అధికారానికి వచ్చిన మోడీకి మిగిలిన నాలుగు సంవత్సరాలు ముందున్నది ముసళ్ళ పండగ అన్న సూచనలు వెల్లడిస్తోంది.
అనువాదం: కొండూరి వీరయ్య
(ఈ కథనం ది వైర్- గెలీలియో ఐడియాస్ కలిసి నిర్వహించే ఇండియా కేబుల్ న్యూస్ లెటర్లో ప్రచురితమైంది.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.