
భూమి మీద గాజాలోని పరిస్థితి నరకం కంటే హేయంగా ఉందని ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్ ప్రెసిడెంట్ మీర్జానా స్పోల్ జారిక్ జూన్ 4న లండన్‌లో వ్యాఖ్యానించారు. గాజాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
జూన్ మొదటి వారంలోని మూడు రోజులలో ఇజ్రాయిల్ సాగించిన కాల్పులలో ఒక్క జూన్ 3న 27 మంది పౌరులు దక్షిణ భాగంలోని రఫా నగరంలో చనిపోయారు. అమెరికా మద్దతుతో గాజా హ్యుమానిటీరియన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సహాయక శిబిరాలపై ఇజ్రాయిల్ సైనికులు సాగించిన ఈ కాల్పులు దక్షిణ గాజా స్ట్రిప్‌లో భీతావహ పరిస్థితులను సృష్టించింది. ఈ ప్రాంతమంతా ఇజ్రాయిల్ మిలిటరీ జోన్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలోకి రావటానికి విలేకరులకు అనుమతిని నిషేధించారు.
రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ ప్రకటించిన సమాచారం ప్రకారం, రఫా నగరంలోని హాస్పటల్లో 180 మంది గాయాలతో చేరితే వారిలో 19 మంది చనిపోయారు. తరువాత మరో ఎనిమిది మంది చనిపోయారు. జూన్ 7న తెల్లవారుజాము నుంచి సాయంత్రానికి ఇజ్రాయిల్ సాగించిన అమానుష దాడుల్లో 66 మంది పాలసీనియన్లు తమ ప్రాణాలను కోల్పోయారు. దక్షిణ గాజాలోని రఫా నగరానికి సమీపంలో ఆల్అఖావాలో ఆహార పంపిణీ కేంద్రం వద్ద ఈ కాల్పులు జరిగాయి. దీంతో మరణించిన వారి సంఖ్య 118కి చేరింది.
దీనిని పరిశీలిస్తే పాలస్తీనా పౌరులు తమ సొంత గడ్డపై నిత్యం నరకం అనుభవిస్తున్నారని అర్థమవుతుంది. పాలస్తీనా ప్రజలు తమ సొంత గడ్డపై ఊపిరి పీల్చుకోలేని దుర్భర పరిస్థితులు ఏర్పడటానికి కారకులు ఎవరు?
పాలస్తీనా- ఇజ్రాయిల్ వివాదం 2023 అక్టోబర్ 7వ తేదీతోనే ప్రారంభం కాలేదు. ఆ రోజున హమాస్ ఇజ్రాయిల్‌పై చేసిన దాడులను సాకుగా తీసుకొని ఇజ్రాయిల్‌లోని నెతన్యాహు ప్రభుత్వం పాలస్తీనా ప్రజలను ఊచకోత కోసి గెంటివేయాలని చూస్తుంది. ఒక అధికారిక లెక్కల ప్రకారం గాజా స్ట్రిప్‌లో ఉన్నటువంటి పాలస్తీనియులు 12 నెలల్లో సుమారు 46 వేల మంది చనిపోయారు. వెస్ట్‌బ్యాంకులో 800 మంది చనిపోయారు. గాయపడిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఇంచుమించు ప్రతి ఒక్కరూ క్షతగాత్రులుగానే మిగిలిపోయి ఉన్నారు. తమ సొంత గడ్డమీద ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించటం శారీరకంగా పొందిన గాయాల కంటే తీవ్ర మానసిక గాయాలను పాలస్తీనియులు నిత్యం అనుభవిస్తున్నారు.
పాలస్తీనా పటాన్ని గమనిస్తే ప్రస్తుత ఇజ్రాయిల్, గాజా- వెస్ట్‌బ్యాంక్‌కు చెందిన మొత్తం భూభాగం 1917లో పాలస్తీనా అధీనంలో ఉండేది. అక్కడక్కడా భూభాగాలలో యూదులు ఉండేవారు. 1947లో ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పాలస్తీనాకు కేవలం 45%, ఇజ్రాయిల్‌కు 55% భూభాగాన్ని అన్యాయంగా పంపకం చేశారు. అన్యాయమైన ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని పాలస్తీనా ఒప్పుకోలేదు. తమ దేశంలో తలదాచుకోవటానికి వచ్చి మమ్మల్ని బయటికి నెట్టివేస్తారేంటని ఎదురు తిరిగారు. అప్పటినుంచి రెండు దేశాల మధ్య యుద్ధం వివిధ రూపాలలో సాగుతూనే ఉంది.
తమ న్యాయమైన హక్కుల కోసం యాసర్ అరాఫత్ నేతృత్వంలోని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్ఓ)తో కలిసి పాలస్తీనీయులు పోరాటం సాగిస్తున్నారు. పీఎల్ఓకి అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. గాంధీ కాలం నుంచి పాలస్తీనియుల న్యాయమైన స్వతంత్ర పోరాటానికి భారతదేశం మద్దతు ఇస్తూనే ఉంది. అయితే, 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇజ్రాయిల్‌కు అనుకూలంగా మారింది. ఈ మార్పుకు ముఖ్య కారణం ఇజ్రాయిల్‌కు అమెరికా సామ్రాజ్యవాదులు బేషరతు మద్దతును ప్రకటించడం.
ఆయిల్ వనరులు పుష్కలంగా ఉన్న పశ్చిమాసియాకు గెట్‌వేగా ఉన్న పాలస్తీనాపై అన్యాయంగా యుద్ధం సాగిస్తోన్న ఇజ్రాయిల్‌కు అమెరికా అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తూ వస్తుంది. ఇజ్రాయిల్‌ను అమెరికా 51వ రాష్ట్రంగా వాడుకుంటుంది. 1948 నుంచి ఇజ్రాయిల్‌కు అభివృద్ధి పేరుతో వంద మిలియన్ డాలర్ల సహాయాన్ని అమెరికా పంపిస్తుంది. ఆయిల్, ఇతర సహజవనరులపై ఆధిపత్యం సంపాదించడం కోసం పశ్చిమాసియా దేశాలపై యుద్ధాన్ని కొనసాగిస్తూ వందల కోట్ల విలువచేసే ఆయుధ వ్యాపారాన్ని అమెరికా చేస్తోంది.
పాలస్తీనీయులను వారి దేశములోనే పరాయివారిగా చేసి, అమెరికా సామ్రాజ్యవాదుల అండతో నరహంతక దాడులు సాగిస్తూ, సహాయక శిబిరాలలో తలదాచుకుంటున్న, వైద్య సహాయం పొందుతున్న పాలస్తీనా పౌరులపై బాంబులు వేసి ప్రాణాలను హరిస్తున్న ఇజ్రాయిల్ దురాక్రమణ దాడులను ఖండిస్తూ ప్రపంచవ్యాపితంగా పాలస్తీనీయులు సాగిస్తున్న పోరాటానికి సంఘీభావ ఉద్యమాల చేయటం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. పాలస్తీనా భూభాగము నుంచి ఇజ్రాయిల్ తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేస్తూ, తమ మాతృభూమి కోసం దశాబ్దాలుగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు ప్రపంచ దేశాల ప్రజలతో పాటు మనదేశంలో కూడా సంఘీభావ ఉద్యమాలు సాగుతున్నాయి. వాటిని మరింత శక్తివంతంగా సాగించటానికి ప్రజలు, ప్రజాతంత్రవాదులు, వివిధ వామపక్ష ప్రజాసంఘాలు ముందుకు రావాలి. మాతృభూమి కోసం రక్తతర్పణ చేస్తూ సాగుతున్న చారిత్రాత్మక పాలస్తీనా ప్రజల పోరాటం వర్ధిల్లాలి.
ముప్పాళ్ళ భార్గవ శ్రీ,
సీపీఐ ఎంఎల్(క్లాస్ స్ట్రగుల్)నాయకులు,
98481 20105
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.