
ముంబై: భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో బలవంతంగా శాఖాహారం అలవాటు చేయడం ఈ మధ్యకాలంలో పెరిగింది. తాజాగా మహారాష్ట్రలో పండరీపూర్ యాత్ర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఈ కోవకు చెందినవే. 700 సంవత్సరాలకు పైగా భక్తి ఉద్యమంతో ముడిపడిన సాంప్రదాయ వారసత్వం కలిగిన కార్యక్రమం పండరీపూర్ యాత్ర. ప్రస్తుతం ఇది కూడా బీజేపీ ప్రభుత్వం చేతుల్లో బంధీ అయింది.
సోలాపూర్ జిల్లాలో ఓ ముఖ్య పట్టణం పండరీపూర్. యాత్రకు ముందు వారం రోజులు, యాత్ర తర్వాత మరో మూడు రోజులు మొత్తం కలిపి పదిరోజుల పాటు జిల్లాలో ఎటువంటి మాంసాహారాన్ని అమ్మకూడదని మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జయకుమార్ గోరే జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.
చంద్రభాగ నది ఒడ్డున ఉన్న పండరీపూర్ యాత్ర స్థలానికి వచ్చే భక్తుల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాతో గోరె మాట్లాడుతూ చెప్పారు.
“తీర్థయాత్ర సమయంలో పరిసర ప్రాంతాల్లో మాంసాహార అమ్మకాలు నిషేధించాలంటూ భక్తులు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అందువల్ల ఈ దిశగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చాము” అని గోరె చెప్పారు.
తీర్థయాత్ర సమయంలో జిల్లాలో మద్యం అమ్మకాలు కూడా నిషేధించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు ప్రయాణించే ఇతర ప్రాంతాలలో కూడా ఈ నిషేధాలు అమల్లో ఉంటాయి.
దాదాపు 13వ శతాబ్దంలో భక్తతుకారం సంత్ ధ్యానేశ్వర్ వంటి భక్తులు ప్రారంభించిన ఈ సాంప్రదాయం ప్రధానంగా కులాధిపత్యానికి వ్యతిరేకంగా మొదలైంది. ఈ ప్రాంతంలో సాగిన శక్తివంతమైన సామాజిక ధార్మిక ఉద్యమాలలో కులఆధిపత్యానికి, అణిచివేతకు వ్యతిరేకంగా తుకారం బోధనలు ఎన్నో ప్రజల నోళ్ళల్లో నేటికీ నానుతూ ఉన్నాయి. 11వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు మహారాష్ట్ర ప్రాంతంలో సాగిన భక్తకవుల ఉద్యమం సుధారణ పేరుతో సాగింది. దీన్నే చరిత్రకారులు మహారాష్ట్ర పునరుద్దాన ఉద్యమం అని పిలిచారు. జాతీయ ఉద్యమ కాలంలో కులాధిపత్య వ్యతిరేక ఉద్యమకారులు 19- 20 శతాబ్దాలలో తుకారం బోధనలను భక్తి ఉద్యమ సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేశారు.
గత కొంతకాలంగా భక్తుల సంప్రదాయంలో బీజేపీ సంఘ్ పరివార్ ఓ పద్ధతి ప్రకారం జోక్యం చేసుకోవడం ప్రారంభించింది. ఆధిపత్య వ్యతిరేక ధోరణి ప్రధానంగా సాగే భక్తి ఉద్యమంలో లొంగుబాటును అనివార్యం చేసే హిందుత్వ సిద్ధాంతం ప్రవేశించింది. ఈ యాత్రలో పాలుపంచుకునే వారంతా ప్రధానంగా బహుజనకులాలకు సంబంధించిన వారే. మద్యం మాంసం వారి ఆహారపు అలవాట్లలో అంతర్భాగం.
పండరీపూర్ యాత్రలో పాల్గొన్నంతకాలం భక్తులు మద్యానికి మాంసానికి దూరంగా ఉండేవారు. కానీ ఈ యాత్రకాలంలో గ్రామాల్లోని ఇతర ప్రజలు మద్యం- మాంసం స్వీకరించటం చారిత్రకంగా ఎప్పుడు సమస్యగా మారలేదు.
సంవత్సరానికి ఒకసారి యాత్ర జరిగే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మాంసం వినియోగంపై నిషేధం విధించాలని గత కొంతకాలంగా వివిధ మితవాద సామాజిక సంస్థల ద్వారా ముందుకు వచ్చిన డిమాండ్‌ను బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహించింది.
గతంలో కూడా నవరాత్రి, శ్రీరామనవమి సందర్భాలలో ఇటువంటి డిమాండ్లు ముందుకు వచ్చాయి.
జూన్ మూడో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలో ఎటువంటి ఆవుల సంతలు నిర్వహించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన మహారాష్ట్ర గోసేవ కమిషన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.