
ఇటీవల దేశవ్యాప్తంగా హోలీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాలలోనూ ప్రజలు ఉల్లాసంగా దీనిని జరిపారు. మన ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు కూడా ఈ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఇటువంటి పండగలను జరుపుకోవడంతోనే కేవలం సరిపెట్టకుండా, ఆ పండుగ వెనుక ఉన్న అసలు లక్ష్యాలను, దాని వారసత్వాన్ని కొనసాగించడం ద్వారా మాత్రమే ఆ పండగకు అసలైన వైభవాన్ని తీసుకురావడం సాధ్యం అవుతుంది.
హోలీ పండగ వెనుక అనేక కథనాలు, నమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. హోలీ, ఉత్సాహభరితమైన “రంగుల పండుగ”గా ప్రాచుర్యం పొందింది. ఈ పండుగ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు, అతన్ని చంపడానికి ప్రయత్నించిన హిరణ్యకశిపుని సోదరి రాక్షసి హోలిక అగ్నిలో మరణించడం చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుందని పురాణ గాథ. దీనికి చిహ్నంగా కొన్ని ప్రాంతాలలో హోలీకి ముందు రోజు రాత్రి, ఒక భోగి మంట (హోలీకా దహన్) వెలిగిస్తారు, ఇది ప్రతికూలత, చెడును తగలబెట్టడాన్ని సూచిస్తుంది.
హోలీ కృష్ణుడి వినోదభరితమైన చేష్టలను అనుకరిస్తూ రంగులు విసరడంతో కృష్ణుడు, రాధ మధ్య ఉల్లాసభరితమైన, దైవిక ప్రేమను సూచించే హిందూ పండుగనే విశ్వాసమూ ఉంది. గత బాధలను విడిచిపెట్టి, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరిదిద్దుకోవడానికి, కలిసి ఉండే స్ఫూర్తిని పెంపొందించడానికి ఇది ఒక సమయం. హోలీ సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది, సామాజిక అడ్డంకులను తొలగిస్తుంది. నూతన వసంత ఋతువు ప్రారంభానికి మార్గం సుగమం చేస్తూ, ప్రజలు రంగులు, నీటితో ఆడుకుంటారనే సాంప్రదాయమూ దీని వెనుక ఉంది. హోలీ ఐక్యత, సోదరభావాన్ని నొక్కి చెబుతుంది. కులం, మతం నేపథ్యంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలసి ఉండాలని బోధిస్తుంది.
హోలీ పండగను ఏదో సరదాగా జరుపుకోవడం గాక, దీని వెనుక ఉన్న అసలు లక్ష్యాలను అర్థం చేసుకుని, వాటి సాధనకై సాగడం మాత్రమే అసలైన హోలీ పండుగ అనిపించుకుంటుంది.
భారతీయ సమాజం లోతైన సాంస్కృతిక వారసత్వంతో పాటు బలమైన కుటుంబ విలువలు, భిన్నత్వాన్ని గౌరవించడం, ప్రేమ, సహనం, సామరస్యం, సుహృద్భావం, ఉత్సాహభరితమైన ప్రజాస్వామ్యం వంటి అనేక బలాలను కలిగి ఉంది. అయితే, నేడు ఆ మంచి క్రమేణా తగ్గుతూ చెడు లక్షణాలు బలంగా పెరుగుతూ, సమాజాన్ని ఆవహిస్తున్నాయి. ఆ చెడును పరిపూర్ణ మనస్సుతో తెలుసుకుని, నివారించడం నేడు అవసరం. మంచితో పాటు అనేక సవాళ్లను కూడా భారతీయ సమాజం ఎదుర్కొంది. నేటికీ ఎదుర్కొంటోంది. సతీ సహగమనం, బాల్య వివాహాలు, లింగ, సామాజిక వివక్ష వంటి అనేక దుర్లక్షణాలను అనేక సంఘ సంస్కరణోద్యమాలతో భారతీయ సమాజం ఎదుర్కొంది. ఎల్లప్పుడూ మంచిని కాపాడుకుంటూ, చెడును నిలువరించడం సమాజాభివృద్ధికి అత్యంత అవసరం. అంతే తప్ప మేమే గొప్ప అని చంకలు గుద్దుకుంటూ, చెడు ఉందని గుర్తించడానికి కూడా నిరాకరిస్తే, ఆ సమాజం నిస్సందేహంగా వెనక్కే వెళుతుంది. చెడును నిర్మూలిస్తూ ముందుకు సాగాలన్నదే హోలీ సందేశం.
సామాజిక అసమానత, కుల వివక్ష..
కుల వ్యవస్థ చట్టబద్ధంగా రద్దు చేయబడినప్పటికీ, ఇప్పటికీ సామాజిక చలనశీలత, అవకాశాలను ఇది బలంగా ప్రభావితం చేస్తోంది. దళితులు, అణగారిన వర్గాలు తరచుగా విద్య, ఉద్యోగాలు ఇంకా దైనందిన జీవితంలో వివక్షను ఎదుర్కొంటున్నాయి. భారతీయ సమాజంలో జరిగిన అనేక మార్పులు, సాధించిన అభివృద్ది సైతం దీన్ని నిర్మూలించలేకపోయాయి. ఫలితంగా ఇదో ప్రధాన సామాజిక రుగ్మతగా కొనసాగుతోంది. నాటి బ్రిటిష్ తమ పాలన సుస్థిరతలో భాగంగా దీని జోలికి వెళ్లలేదు. నేటి మన పాలకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని పెంచి పోషిస్తున్నారు. గబ్బుకొట్టే ఈ కుల వ్యవస్థను నిర్మూలించే చర్యలు చేపట్టవలసిందిపోయి, నేడు పాలకులు ఎన్నికలలో గెలుపుకు ఈ కులాన్నే నిస్సిగ్గుగా వాడుకోవడం సిగ్గుచేటు.
లింగ వివక్ష..
మహిళలు గృహ హింస, కార్యాలయంలో వేధింపులు, అసమాన వేతనం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వరకట్న దురాచారం, ఆడ బిడ్డ భారం అనుకోవడం వంటివి ఇప్పటికీ దేశంలోని ఆనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్నాయి. మహిళలను తమ కోర్కెలను తీర్చే వారుగానే చూసే ధోరణి సమాజంలో బలీయంగా ఉంది. మహిళలపై అత్యాచారాలు నిత్యం పెరుగుతున్నాయి.
గత దశాబ్ద కాలంలో మహిళలపై నేరాలు 28 శాతం పెరిగాయి. జాతీయ నేరాల నమోదు బ్యూరో నివేదికల ప్రకారం 2022లో ప్రతి గంటకు మహిళలపై 50 నేరాలు జరిగాయి. ప్రతి రోజూ 88 మంది మాన భంగానికి గురయ్యారు. వారిలో 11 మంది దళిత మహిళలు. నేరస్థులలో అత్యధికులు శిక్ష పడకుండా తప్పించు కుంటున్నారు. మహిళా మల్ల యుద్ధ క్రీడాకారుణుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం బాహాటంగానే నిందితులను సమర్ధించింది. ఇటువంటి దురాగతాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవలసిన పాలకులు ఆ పని చేయకపోగా, తిరిగి వారినే కాపాడేలా వ్యవహరించడం చెడును ప్రోత్సహించడమే అవుతుంది. ఫలితంగా మహిళలకు రక్షణ పూర్తిగా కరువైన దేశాల్లో మన దేశం ఒకటిగా నిలిచింది. గృహ హింస, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు వంటి నేరాలతో మహిళలకు రక్షణ లేని ప్రదేశంగా మన దేశం ఆసియా ఖండంలో అగ్ర భాగాన నిలిచింది. విచిత్రంగా ఇది తగ్గడం గాక, ఇటీవల కాలంలో మరింత పెరగడం వివక్షత తీవ్రతకు అద్దం పడుతోంది.
అవినీతి..
రాజకీయాలు, అధికార యంత్రాంగం, రోజువారీ లావాదేవీలలో కూడా అవినీతి విస్తృతంగా వ్యాపించింది. ఇది ప్రజా సేవల నుంచి వ్యాపార అవకాశాల వరకు ప్రతిదానినీ ప్రభావితం చేస్తోంది. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ- కార్పొరేట్ ల అవినీతిని చట్టబద్ధం చేయడం కూడా మనం చూశాం. ప్రైవేటీకరణ అంటేనే అవినీతీకరణ అని ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత జోసఫ్ స్టిగ్లిడ్జ్ అన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వ విధానమే ప్రైవేటీకరణ. ఇందులో నీతిని వెతకడం నేతి బీరకాయలో నెయ్యిని వెతకడం లాంటిదే అవుతుంది. ఎన్నికలలో రాజకీయ పార్టీలు పెట్టే కోట్లాది రూపాయల ఖర్చు వారికి ఎక్కడ నుంచి వస్తోందో సామాన్యులు కూడా ఆలోచించవలసిన అంశం.
మతతత్వం, మతపరమైన ఉద్రిక్తతలు..
మతపరమైన విభజనలు అనేక సందర్భాలలో హింస, వివక్షతకు దారితీస్తున్నాయి. ప్రజలను ఐక్యం చేసి, సుహృద్భావం కాపాడవలసిన పాలకులే నేడు ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తున్నారు. ఎన్నికల లబ్ధి కోసం దీన్ని ఒక ప్రధాన ఆయుధంగా వాడుకుంటున్నారు. అన్ని తరగతుల ప్రజలు కలసి మెలసి సోదర భావంతో ఉండవలసిన దేశంలో మతం పేరున ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు. వ్యక్తిగత విశ్వాసంగా ఉండవలసిన దేవుడి పేరునూ రాజకీయం చేస్తున్నారు.
ఆర్థిక అసమానతలు..
ప్రపంచంలోనే తీవ్ర ఆర్ధిక అసమానతలు ఉన్న దేశాల్లో మన దేశం ఒకటిగా ఉంది. 2022- 23 ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం దేశ జనాభాలో ఒక్క శాతంగా ఉన్న అత్యంత సంపన్నులు 40.1 శాతం సంపద సొంతం చేసుకున్నారు. ఇది బ్రిటిష్ కాలనా నాటి కన్నా చాలా ఎక్కువ. అదే సందర్భంలో అట్టడుగు ఏభై శాతంగా ఉన్న అత్యంత పేదల వద్ద కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉంది. జనాభాలో ఎక్కువ భాగం పేదరికం, నిరుద్యోగంతో పోరాడుతున్నారు. విద్య, వైద్యం ప్రియమై సామాన్య ప్రజలకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి.
వనరుల లూటీ – పర్యావరణ సమస్యలు..
పర్యావరణాన్ని కూడా ఫణంగా పెట్టి వివిధ ప్రాజక్టులు, మైనింగ్ పేరున చట్టాలను కూడా ఉల్లంఘించి, పెద్ద ఎత్తున అడవులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. మరోపక్క అటవీ సంరక్షణ చట్టాన్ని, దాని నిబంధనలను సవరించి, ఇప్పటి వరకు రక్షణ కవచంలా ఉన్న ‘గ్రామ సభ’ అనే పదాన్ని తొలగించారు.
వృక్ష సంపదను నాశనం చేయడంతో ప్రకృతి వైపరీ త్యాలు పెరిగి, ఒక పక్క అకాల వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడడం తరచూ సంభవిస్తున్నాయి. మరో పక్క రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. టూరిజం పేరున సముద్రాన్నీ వదలడం లేదు. దీనివల్ల మత్స్య సంపద నాశనమవడమే గాక, తీరం కోతకు గురవుతోంది. పర్యావరణ సమతుల్యత తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇది మానవాళి, జీవకోటి భవిష్యత్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది.
భిన్నాభిప్రాయాలను అణచివేయడం..
భిన్న రాజకీయ అభిప్రాయాలను వ్యక్తపరిచే లేదా వ్యవస్థను ప్రశ్నించే వ్యక్తులు పాలకులకు లక్ష్యంగా ఉంటున్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరచడంతో అటువంటి వారిపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఏళ్ళ తరబడి జైళ్ళలో రిమాండు ఖైదీలుగా ఉంచుతున్నారు. బెయిలు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు. మీడియా స్వేచ్ఛనూ హరించి వేస్తున్నారు.
అశాస్త్రీయ దృక్పథం, మూఢనమ్మకాలు..
చాలా మంది ఇప్పటికీ జ్యోతిష్య శాస్త్రం, చేతబడి ఇంకా నకిలీ శాస్త్రాలను నమ్ముతున్నారు. కొన్నిసార్లు వైద్య, సామాజిక నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. పాలకులే రాజ్యాంగ విరుద్ధంగా అశాస్త్రీయ భావాలను పెంచి పోషిస్తున్నారు. హేతుబద్ధమైన ఆలోచన, శాస్త్రీయ ఆలోచనలు తరచుగా ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయి.
విద్యా రంగంలో వినాశనం..
సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన కంటే వాక్చాతుర్య అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. అశాస్త్రీయ భావాలు, అవాస్తవాలతో చరిత్రను తిరగరాస్తున్నారు. డార్విన్ పరిణామ సిద్ధాంతం వంటి ప్రకృతి పరిశోధనలను కూడా పాఠ్య సిలబస్ ల నుంచి తొలగిస్తున్నారు.
వీటన్నింటి వల్ల సమాజానికి చెడు తీవ్రంగా జరుగుతోంది. చిన్న వయసులోనే చెడుని నిర్భీతిగా ఎదుర్కొన్న ప్రహ్లాదుని గుర్తుంచుకునే దేశంలో చెడును మార్చి మంచిని ప్రోత్సహించడమే హోలీ పండగ లక్ష్యం కాగా, నేడు ఈ లక్ష్యానికి విరుద్ధంగా విధానాలున్నాయి. కృష్ణుడు నేర్పిన ప్రేమ స్థానంలో విద్వేషాలు పెంచుతున్నారు. వారికి నచ్చని, తోటి వారిని కనీసం మనుషులుగా కూడా చూడకుండా అన్ని రకాలుగా హింసిస్తున్నారు. అన్ని రకాల వివక్షతలను పాటించే, మను ధర్మాన్ని తమ సిద్ధాంతంగా నమ్ముతూ, దానిని క్రమేణా ఆచరణలో పెడుతున్నారు.
ఆశ్చర్యకరంగా, సమాజంలో ఉన్న మంచిని కాస్తా చిదిమేస్తూ, చెడును ప్రోత్సహిస్తున్న పాలకులే నేడు హోలీని ఘనంగా జరుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. రంగులు అద్దుతూ తమ అసలు రంగు బయటపడకుండా దాచేస్తున్నారు. ఆ ముసుగును తొలగించి, చెడును నిలవరించి, మంచిని పెంచిన నాడే అసలైన హోలీ పండగ.
ఎ. అజ శర్మ,
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.