
అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరేంటి? ఒక దృఢమైన సంకల్పం, దృఢమైన వైఖరి లేకుండా పేరుకు తగ్గట్టు ఎటుపడితే అటు గాలిలా పయనించడమేనా పవన్ కళ్యాణ్ చేసేది. తన రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలించిన అందరి నుంచి ప్రస్తుతం ఈ మాట వినిపిస్తుంది. పవనిజం అంటూ సినిమాలు, లెఫ్టిస్ట్ భావజాలంతో చెగువెరాలాంటి వారు తనకు అదర్శమూర్తులని గతంలో, పార్టీ ఆవిర్భావ సమయంలోనూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అటువంటిది పూర్తిగా లెఫ్ట్ టు రైట్‌కు తన వైఖరి మార్చడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
పదకొండు ఏళ్ల జనసేన ప్రస్థానం ఏంటి? 11వ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి దిశానిర్దేశం చేసిందేంటి? అధినేత పవన్ కళ్యాణ్ సందేశంపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఆవిర్భావ వేడుకకు భారీగా తరలివచ్చిన జనసైనికులకు నిరాశే ఎదురైందా? నాలుగు భాషలలో నాలుగేసి ముక్కలు మాట్లాడి బహుభాషా ప్రావిణ్యాన్ని కనబరిచిన పవన్ కళ్యాణ్ భవిష్యత్‌లో పార్టీ అడుగులేంటి? చేపట్టబోయే కార్యక్రమాలేంటన్నది చెప్పకపోవడం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత కూటమిలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీల ప్రస్తావన తేకపోవడం, కనీసం వాటి అమలు ఏవిధంగా ఉన్నదన్న సంగతి చెప్పకపోవడం నిరాశ పరిచింది. తాము అధికారంలో ఉన్నామనే భావంతోనే ఆవిర్భావ సభను జయకేతన సభగా నిర్వహించారు. కానీ పార్టీ భవిష్యత్‌ను నిర్దేశించలేక పోయారన్నది విశ్లేషకుల మాట.
జాతీయ పత్రికలు కూడా పవన్ వైఖరిని ఎండగట్టాయి. సనాతన ధర్మం, జాతీయ వాదం సడన్‌గా ఎందుకు పుట్టుకొచ్చాయన్న ప్రశ్నలకు పార్టీ ఆవిర్భావ సభ వేదికగా పవన్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. చిన్నతనం నుంచి ఇంట్లో రామజపం చేసేవాడినంటూ చిన్ననాటి పరిస్థితులు, నాటి అనుభవాలు, ఇంట్లో సంగతులు పవన్ చెప్పుకొచ్చారు. చెగువెరాలాంటి వారి నుంచి కూడా తాను భిన్నత్వంలో ఏకత్వం లక్షణాన్నే చూశానని, తనది మొదటి నుంచి సనాతన ధర్మమేనని తేల్చి చెప్పారు.
అయితే, గతంలో పవన్ వివిధ సందర్భాలలో చెప్పుకొచ్చిన కమ్యూనిజం ఇప్పుడు ఎటు పోయింది? దానికి కారణం ఏంటనే ప్రశ్నలు ఎదురుగా బాణాలుగా దూసుకొస్తున్నాయి. ఏదైనా ఇప్పుడు పవన్ సనాతన ధర్మ సారథి, దానికే కట్టుబడతారన్నది ఆయన చెబుతున్న మాటే.
కూటమిగానే మరో 15 ఏండ్లా?
ఏ రాజకీయ పార్టీ అయినా తాము సొంతంగా అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. ప్రస్తుతం ఇంకొక పార్టీతో భాగస్వామ్యంలో ఉన్నా, పార్టీ వేదికపై మాట్లాడేటప్పుడు భవిష్యత్తులో ఒంటరిగా గెలుస్తామని, అధికారం తమదేననే దిశలోనే అధినేత ప్రసంగాలు ఉంటాయి. నిన్నటి జనసేన పిఠాపురం సభలో అలాంటిది కనిపించలేదు. ఇంకో 15, 20 ఏళ్ల పాటు వైసీపీకి అధికారం రాదని, కూటమి రాష్ట్రాన్ని ఏలుతుందని జనసేన అధినేతతో సహా పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు.
గత పార్టీ సభలలో కార్యకర్తల నుంచి సీఎం, సీఎం నినాదాలు మిన్నుముట్టాయి. ఈసారి ఆ నినాదాలు రాకుండా జాగ్రత్త పడ్డారు. కూటమి ధర్మాన్ని పాటించాలనుకున్నారో, అధికారంలోకి వచ్చి సంవత్సవం కూడా కాలేదనుకున్నారో కానీ, పార్టీ భవిష్యత్ ప్రణాళిక ఎక్కడా కనిపించలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం మరో దశాబ్దం పాటు రాష్ట్రాన్ని పాలించాలని అందుకు అనుగుణంగా పనిచేసుకు పోదామన్న భావనే జనసేనాని మాటలలో కనిపించింది. వైసీపీ నేతలపై విసుర్లు, చలోక్తులతో సాగిన పవన్ ప్రసంగంలో పార్టీ శ్రేణులు ఆశించిన విషయం మాత్రం ఏదో మిస్సయింది.
కాపుల ఆశలు నెరవేరేనా? బీజేపీ డైరెక్షన్లో జనసేన?
రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కాపు సామాజిక వర్గం ముందునుంచి ఆశ కనబరుస్తుంది. దానిని నెరవేర్చుకునేందుకు పవన్ సారథ్యంలోని జనసేనకు ఆ సామాజిక వర్గం అండగా నిలిచింది. తమ కాపు నేత పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని, అప్పుడే కాపులకు రాజ్యాధికారం వచ్చినట్టని భావించారు, భావిస్తున్నారు.
అయితే, పవన్ కళ్యాణ్‌లో మాత్రం ఆ భావన కనిపించడం లేదు. తొందరపాటు ఉన్న వారిని తాను కోరుకోవడం లేదని, బలమైన మనస్తత్వం దేశభక్తి ఉన్నవారు తన వెంట నడవాలని కోరుకుంటున్నానని జనసేనాని తెగేసి చెప్పారు. జాతీయ స్థాయిలో పనిచేసే విధంగా నాయకులను తీర్చిదిద్దుతానని చెప్పుకొచ్చారు. అంటే, పవన్ దేశభక్తి భావజాలం ఎటుదారితీస్తుందన్న అనుమానం కలుగుతోంది. బిజెపి జెండా మోయకున్నా కమలం ఎజెండాను జనసేనాని అమలు చేస్తున్నారు. అదే భావాలతో ముందుకెళ్తున్నారు.
దక్షిణాదికి బీజేపీ కీలక ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ మారతారనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే తమిళనాడులో డిఎంకె వ్యతిరేకిస్తున్న త్రిభాషా సూత్రాన్ని సమర్ధిస్తూ, ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. దేశంలో అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలని సూచించారు. వెంటనే పవన్ వ్యాఖ్యలకు సినీనటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో జవాబిచ్చారు. మాతృభాషపై తమిళులకు అభిమానం ఉండటం తప్పా అంటూ ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీని, గోద్రా వంటి గత సంఘటనలను కూడా ప్రస్తావించిన పవన్ తనలోని హిందుత్వ భావజాలం ప్రదర్శిస్తూనే, కమలం హిడెన్ ఎజెండాను అమలు చేస్తున్నారా అనిపించింది.
దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యంపై వైఖరి మారిందా?
దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం కొనసాగుతోందా? తమిళనాడు హిందీ విషయంలో చేస్తున్న పోరాటం, డిలిమిటేషన్ పేరిట దక్షిణాది రాష్ట్రాలలో ఎంపీ సీట్ల సంఖ్యను తగ్గిస్తున్నారన్న వాదన రోజురోజుకు బలపడుతోంది. ఈ సమయంలో పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. గతంలో దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం కొనసాగుతోందంటూ జనసేనాని చేసిన ఘాటు వ్యాఖ్యలు, హెచ్చరికలు ఇప్పుడు అందరూ గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్‌ను టీటీడీ ఈవోగా చేసి తెలుగు ఐఏఎస్‌లను అవమానపరిచారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన పవన్, అప్పట్లో ఉత్తరాది ఆధిపత్యంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. మరి ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాది ఆంతర్యం ఏమిటని, దేశమంతా ఒకటేనని చెప్పడం, మాటలతో ఊగిపోవడం చూస్తుంటే జనసేనకి ఒక సిద్ధాంతం ఉందా. ఊసరవెల్లిలా తన అభిప్రాయాలను పవన్ మార్చేసుకుంటుంటే పార్టీ పరిస్థితి భవిష్యత్ ఏంటన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
2009లో జనసేనను స్థాపించినప్పటి పవన్ కళ్యాణ్, నాటి భావజాలం 2014 ఎన్నికల నాటికి మారిపోయాయి. 2019 ఎన్నికల్లో మరోమలుపు తిరిగి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. ఒంటరి పోరుతో దిమ్మతిరిగిన ఆ ఫలితాలతో మళ్లీ తన వైఖరిలో మార్పు తెచ్చుకున్నారు. వామపక్ష భావజాలం నుంచి పూర్తిగా బిజెపి భావజాలంలోకి మారిపోయి ఆ పార్టీతో పొత్తన్నారు. ప్రస్తుతం కూటమితో పార్టీకి అధికారం కూడా తోడైనా, జనసేన పార్టీని అధినేత పవన్ ఎటు తీసుకెళ్తున్నారు. పార్టీ సిద్ధాంతాలేమిటనే ప్రశ్నలకు పవనే జవాబు చెప్పాలి. లేకుంటే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా తన వైఖరి మార్చుకున్నానని అయినా స్పష్టంచేయాలి.
పిఠాపురంలో గెలుపు ఎవరివల్ల..?
పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ తన అడ్డాగా మార్చుకున్నారు. చంద్రబాబుకు కుప్పం, జగన్‌కు పులివెందులలా ఇప్పుడు పిఠాపురం పవన్ సొంతం, ఇదీ ఇప్పుడు జనసైనికుల మాట. జనసేన ఆవిర్భావ సభలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుపై ఆ పార్టీ నేత పవన్ సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పవన్ కళ్యాణ్‌ను పిఠాపురం ప్రజలే గెలిపించుకున్నారని, ఎవరైనా పవన్‌ను తామే గెలిపించామని చెప్పుకుంటే వారి ఖర్మ అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ పరోక్షంగా తెలుగుదేశం పిఠాపురం సీనియర్ నేత వర్మను ఉద్దేశించి చేసినవని అందరూ టక్కున చెబుతున్నారు.
మరి గతంలో తన గెలుపులో వర్మ పాత్ర ఎనలేనిదంటూ పవన్ కళ్యాణ్ ఎందుకు సన్మానించారని వర్మ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కోసం పొత్తు ధర్మం పాటించి వర్మ తన సీటును త్యాగం చేసిన విషయాన్ని ప్రత్యర్ధులు గుర్తుచేస్తున్నారు. కూటమి వల్లే పవన్ గెలిచారన్నది నిజం. పవన్ చెప్పినట్టుగానే కూటమి కట్టడం ద్వారా జనసేన బలపడటం, తెలుగుదేశం పార్టీని బతికించడం కూడా నిజం. ఏదిఏమైనా జనసేన భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది. దిశానిర్దేశం చేయకుండా పార్టీ ఆవిర్భావ సభ ముగించడం మాత్రం లోటును మిగిలిస్తోంది. అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.