
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకై ఈరోజు విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు ప్రకటించారు. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు అందరం ఐక్యంగా నడుంకట్టాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల్లో భాగంగా విజయవాడ, ధర్నా చౌక్ వద్ద ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన నిరసనలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు తీరు మార్చుకోవాలని, విశాఖ ఉక్కు పరిశ్రమకు క్యాపిటల్ మైన్స్ కేటాయించేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టం వస్తుందనే సాకుతో తెగ నమ్మాలని కేంద్రం ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. కేంద్రం కుట్రలను అందరూ ఐక్యంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా రక్షించుకుంటామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ అన్నారు. జీవనోపాధికి అవకాశమున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాభాల్లో నడుస్తున్న ఫ్యాక్టరీని నష్టాల్లో ఉందని చూపించడం తగదని హితవు పలికారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ వి నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిశ్రమకు అందిస్తున్న బొగ్గును రద్దు చేయటం సబబు కాదన్నారు. ఉద్యోగులను తొలగించటం, జీతాలు సక్రమంగా చెల్లించకపోవడం దారుణమన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి లంక దుర్గారావు, నక్క వీరభద్రరావు, ఏఐటీయూసీ నాయకులు కొట్టు రమణారావు, నాయకులు తాడి పైడయ్య సంగుల పేరయ్య, ముఠా తిరుపతయ్య, బిల్డింగ్ నాయకులు రమణ, బేవర శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు భత్తుల రాంబాబు, ట్రేడ్ యూనియన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.