
భావ ప్రకటనా స్వేచ్ఛ కనుమరుగవుతున్న కాలంలో మనం జీవిస్తున్నాము. బౌమల్ సనల్ వంటి ధీర స్వరాలు ఇపుడు మరెన్నో కావాలి.
75 ఏళ్ల వయసున్న అల్జీరియాకు చెందిన రచయిత తొలి నవల 1999లో వెలువడింది. ఈ మధ్యనే ఆయన అల్జీరియా పౌరసత్వం వదులుకుని ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నారు. ఆయన నిరంకుశత్వాన్ని ఖండించటమే కాక ప్రగతిశీల విలువలకు కట్టుబడి ఉన్నారు. అధికారంలో ఎవరున్నా వాస్తవాలు చర్చకు పెట్టేవారు. ఆయన ఓ అంశాన్ని లేవనెత్తాడంటే పాలకులు బెంబేలెత్తాల్సిందే. అతనే సనల్. ప్రస్తుతం సనల్ కు మనమంతా బాసటగా నిలవాల్సిన సమయం ఇది. సంఘీభావం ప్రకటించాల్సిన సమయం.
నవంబర్ 16న అల్జీరియా ప్రభుత్వం సనల్ ను ఆ దేశ విమానాశ్రయంలో అరెస్టు చేసింది. కారణాలు మాత్రం వెల్లడించలేదు. అప్పటినుండి క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న సనల్ కు బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయాయి. అల్జీరియా ప్రభుత్వం తగిన వైద్య సదుపాయం కూడా అందించటం లేదు. ఇది ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన తప్ప మరొకటి కాదు. అల్జీరియా ప్రభుత్వ దమనకాండను ఎలుగెత్తి ఖండిస్తున్న ధీర స్వరాన్ని గొంతు నులమటం తప్ప మరొకటి కాదు.
యూరోపియన్ యూనియన్ దేశాల మేధావులు సనల్ విడుదలకై డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. డిసెంబర్ లో అల్జీరియా ఉన్నత న్యాయస్థానం సనల్ విడుదలకై పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించింది. దాంతో ఫిబ్రవరిలో సనల్ నిరాహారదీక్ష చేపట్టారు. ఎంతటి కఠినాత్మునలైన, ప్రభుత్వాలనైనా కదిలించిన నిరసన రూపం నిరాహారదీక్ష. ఈ దీక్ష కేవలం అల్జీరియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటానికి మాత్రమే కాదు. తన దుస్థితిని ప్రపంచానికి తెలియజేయటానికి కూడా. ప్రభుత్వ స్పందన ఆలస్యమయ్యే ఒక్కో రోజు సనల్ ను మృత్యువుకు మరింత దగ్గర చేస్తుంది.
ఈ పరిస్థితి సనల్ కు ఎదురవుతున్న వ్యక్తిగత ఇబ్బంది మాత్రమే కాదు. ఆయన రచనలు దేశానికి మార్గదర్శకాలు. ఒక రాక్షసుడి ప్రమాణ స్వీకారం ఆయన రాసిన మొదటి నవల. అప్పటి నుండి అల్జీరియాను ముంచెత్తుతున్న మతోన్మాదం, స్తబ్ధతకు గురైన పౌర సమాజం గురించి విమర్శనాత్మకంగా రాస్తూనే ఉన్నారు.
‘2084: ప్రపంచం అంతం’ పేరుతో రాసిన నవల సైద్ధాంతిక స్వచ్చత ముసుగులో సమాజంలో ఎగబాకుతున్న నియంతృత్వం గురించి ప్రశ్నిస్తారు. సంకెళ్ళ పాలవుతున్న ప్రజాస్వామ్యం గురించి హెచ్చరిక కూడా ఈ నవల.
ఈ నవల ప్రచురణ దశలోనే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నది. సెన్సార్ కత్తిరింపులకు కూడా గురైంది. బెదిరింపులు వచ్చాయి. సామాజిక వెలివేతకు గురయ్యారు రచయిత. అయినా సనల్ సత్యాన్వేషణ మార్గాన్ని విడవాడలేదు. బెదిరింపులకు లొంగలేదు. వెలివేతకు తలవంచలేదు. ఆ నవ లో చర్చించిన అంశం అల్జీరియా, ఫ్రాన్స్ లకు పరిమితం అయింది కాదు. సార్వత్రిక స్వభావం కలిగిన అంశం. నిర్భయంగా మాట్లాడలేక పోవడమే ఈ నవల కథాంశం. కనుమరుగవుతున్న స్వేచ్చ గురించి చర్చిస్తారు రచయిత. ఆయన చేస్తున్న పోరాటం రెండు దేశాల మధ్య ఉన్న దౌత్యవివాదాలకు పరిమితం అయింది కాదు. అంతర్జాతీయంగా మేధో స్వాతంత్ర్యానికి సంబంధించిన అంశం. ఈ ధిక్కార స్వరాలే ప్రపంచాన్ని స్వేచ్ఛా వాయువులతో నింపాయి.
ఎమిలీ జోలా రాసిన బహిరంగ లేఖ డ్రైఫస్ ఎఫైర్ బాగోతాన్ని బట్టబయలు చేసింది. వక్లావ్ హావెల్ చెక్ అసమ్మతివాదులతో కలిసి రాసిన చాప్టర్ 77 తూర్పు యూరప్ దేశాలలో ప్రజాస్వామ్య ఉద్యమాలకు తెర తీసింది.
సనల్ కూడా ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న రచయిత. ఏ స్థాయిలోనైనా అణచివేత ను ప్రశ్నించలేక పోవడం లొంగుబాటు మనస్తత్వానికి ప్రతీక.
అందువలన అంతర్జాతీయ పౌర సమాజం మౌనం వీడాలి. సనల్ కు ఉన్న ద్వంద్వ పౌరసత్వం కారణంగా అయన్ను ఖైదు చేయటం ఫ్రాన్స్ అల్జీరియాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. సనల్ నిర్బంధం ప్రగతిశీల భావాల పట్ల, మానవహక్కుల పట్ల ఫ్రాన్స్ కు ఉన్న నిబద్ధతకి సవాలు విసురుతుంది. సాంస్కృతిక మేధో కార్యకర్తలు, పౌరసమాజం, పత్రికా రంగం ఈ చర్యను ఖండించాలి. మానవహక్కుల పట్ల నిబద్ధత కలిగిన వాళ్ళమని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు అన్నీ సనల్ విడుదలకు, సరైన వైద్య సదుపాయాలు అందించేందుకు అల్జీరియా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
సనల్ కు సంఘీభావం ప్రకటించడం అంటే కార్యాచరణకి సిద్ధం కావడమే. దౌత్య వేదికల ద్వారానూ, దరఖాస్తులు, అర్జీలు ద్వారా, బహిరంగ ప్రచారం ద్వారా కార్యాచరణ రూపొందించాలి. ఆందోళన వ్యక్తం చేసినంత మాత్రాన సరిపోదు. సనల్ ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వ మానవ సౌభ్రాతృత్వం, కనీస మానవ హక్కులను కాలరాసే నిరంకుశత్వాన్ని సవాలు చేయాలి. నిలువరించాలి. ఇది కేవలం సనల్ ఒక్కడి స్వేచ్ఛ కోసం సాగుతున్న పోరాటం కాదు. ప్రశ్నించే గొంతుకను నులిమెందుకు చేసే ప్రతి ప్రయత్నాన్ని వ్యతిరేకించేందుకు సాగుతున్న పోరాటం. అర్థంపర్థం లేని అరెస్టులను ప్రశ్నించేందుకు సాగుతున్న పోరాటం. సనల్ రోజు రోజుకి చావుకు దగ్గరవుతున్నారు. ఆయనను కోల్పోవడం అంటే నియంతృత్వాన్ని సవాల్ చేసే గొప్ప గొంతుకను కోల్పోవడమే. నియంతృత్వాన్ని సవాలు చేసినందుకు ఓ వ్యక్తికి మద్దతుగా ప్రపంచ ప్రగతిశీల పౌరసమాజం నిలవడం అన్నది బహుశా చరిత్రలో అరుదైన సందర్భం అవుతుంది. నెల్సన్ మండేలా మొదలు లీజియబావ్ వంటి వారి సరసన సనల్ శిఖర సమానుడై కూర్చుంటారు.
జీన్ మైఖేల్ బ్లాంక్వర్
రచయిత 2017- 22 మధ్య కాలంలో ఫ్రెంచి విద్యాశాఖ మంత్రి గా పని చేశారు. పారిస్ లోని పాంథియన్- అసస్ విశ్వ విద్యాలయంలో రాజ్యాంగ న్యాయశాస్త్రం ఆచార్యులు.
(ప్రాజెక్ట్ సిండికేట్ ప్రత్యేక సౌజన్యంతో)
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.