
బీహార్‌లోని చాలా చోట్ల గంగా నది నీరు స్నానం చేయడానికి పనికిరాదు: సర్వే
బీహార్ ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం, బీహార్ రాష్ట్రంలోని ఎక్కువ స్థానాలలో గంగా నది నీరు స్నానం చేయడానికి పనికిరాదు. ఎందుకంటే ఈ నీటిలో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉంది. ఇది కీలకంగా గంగా, దాని ఉపనదుల ఒడ్డున ఉన్నటువంటి నగరాలు విడుదల చేసే సీవేజ్/ఇళ్లలోని వ్యర్థజలాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
న్యూఢిల్లీ: బీహార్ ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం, బీహార్‌లో గంగా నది నీరు ఆ రాష్ట్రంలోని ఎక్కువ స్థానాలలో స్నానం చేయడానికి పనికిరాదు. ఎందుకంటే ఈ నీటిలో ‘బ్యాక్టీరియా’ ఎక్కువ మోతాదులో ఉంది.
వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ ప్రకారం, బీహార్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు(బీఎస్‌పీసీబీ) రాష్ట్రంలోని 34 ప్రదేశాలలో గంగా నది నీటి నాణ్యతను ప్రతి 15 రోజులకు ఒకసారి పర్యవేక్షిస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ మధ్య బీహార్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం ‘గంగా నీటిలో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో(మొత్తం పరిమాణంలో కొలిఫాం, ఫీకల్ కొలిఫాం)ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది కీలకంగా గంగా నది దాని అనుబంధ ఉపనదుల ఒడ్డున ఉన్నటువంటి నగరాల నుంచి విడుదలయ్యే మురికి/ఇళ్లలోని వృధానీటి వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.’
సర్వేలో బీఎస్‌పీసీబీ చేసిన నీటి నాణ్యత పరీక్ష పరిణామాలతో దీనిని వెల్లడించారు. రిపోర్ట్‌లో తెలిపినదాని ప్రకారం ‘ఇతర పారామీటర్, పీహెచ్(ఆమ్లత్వం/క్షారత్వం), కరిగిన ఆక్సిజన్ ఇంకా జీవ రసాయన ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) గంగా నదీ బీహార్‌లో దాని ఉపనదులలో నిర్ధారిత సరిహద్దులలో ఇవి లభించాయి. నీటిని ఆధారంగా చేసుకొని జీవించే జీవులకు, వన్యప్రాణుల విస్తరణకు, చేపలపెంపకానికి ఇంకా వ్యవసాయానికి గంగా నది నీరు ఉపయోగకరంగా ఉన్నట్టుగా సర్వే ద్వారా తెలుస్తుంది.’
నది ఒడ్డున ఉన్నటువంటి పెద్దపెద్ద నగరాలలో బక్సర్, ఛప్రా, దిఘ్వారా, సోన్పూర్, మనేర్, దానాపూర్, పాట్నా, ఫతుహా, భక్తీయార్‌పూర్, బాఢ్, మోకామా, బేగుస్రాయ్, ఖగాఢీయా, లఖీసరాయ్, మనీహారీ, ముంగేర్, జమాల్పూర్, సుల్తాన్‌గంజ్, భాగల్పూర్, కహల్గావ్ ఉన్నాయి.
గంగా నదిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని, ఇది ఆలోచించాల్సిన విషయమని రిపోర్ట్ మీద స్పందిస్తూ బీఎస్‌పీసీబీ అధ్యక్షులు డీకే శుక్లా పీటీఐకు తెలిపారు.
అంతేకాకుండా, ‘మానవ మలమూత్రాలలో ‘ఫీకల్ కోలీఫాం’ బ్యాక్టీరియా ఉంటుంది. శుద్ధిచేయని మురుగునీటి ద్వారా మంచినీటిని ఇది కలుషితం చేస్తుంది. దీని స్థాయి నీటిలో ఎంత శాతం ఎక్కువ అవుతుందో, వ్యాధులను వ్యాప్తి చేసే బ్యాక్టీరియా అందులో అంతే ఎక్కువ పెరుగుతుంది. సీపీసీబీ ప్రకారం ఫీకల్ కోలీఫాం అనుమతించదగిన పరిమితి 2,500 ఎంపీఎన్ ఇది ప్రతి 100 మి.లీలో ఉంటుంది’ అని శుక్లా అన్నారు.
చాలా ప్రదేశాలలో గంగా నదిలో మొత్తం కోలీఫాం, ఫీకల్ కోలీఫాం చాలా ఎక్కువగా ఉంది. దీని వల్ల ఇది స్నానం చేయడానికి యోగ్యంకాదని తెలుస్తుందని ఆయన చెప్పారు. దీనికి పరిష్కారంగా మరో కీలక అధికారి ‘రాష్ట్రంలోని మురుగునీటి శుద్ధి కర్మాగారాలు(ఎస్టీపీ) సరిగా పనిచేసేలా బీఎస్‌పీసీబీ అడుగులు వేస్తుంది’ అని తెలిపారు.
‘రాష్ట్రంలోని కొన్ని ఎస్టీపీల మీద నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా మేము సంబంధిత అధికారులకు నిర్దేశాలను జారీ చేశాము.’ అని శుక్లా చెప్పుకొచ్చారు.
సర్వేలో తెలిపిన దాని ప్రకారం, ‘పారిశ్రామిక యూనిట్లతో పాటుగా ఎస్టీపీ/సీవరేజ్ కాలువల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు/మురుగునీటి నాణ్యతను కూడా బీఎస్‌పీసీబీ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం బోర్డ్ ద్వారా వివిధ ప్రదేశాల నుంచి 2,561 నీరు/వ్యర్థాలు/మురుగునీటి నమూనాలను సేకరించారు.’
గంగా నీటి నాణ్యతకు సంబంధించి బీఎస్‌పీసీబీ తాజా డేటా ప్రకారం, కచ్చీ దర్గా బిదూపూర్ వంతెన వద్ద పరిశీలించిన ఫీకల్ కోలీఫాం స్థాయి 3,500 ఎంపీఎన్/100 మి.లీ, గులాబీ ఘాట్(5,400 ఎంపీఎన్/100 మి.లీ), త్రివేణీ ఘాట్(5,400 ఎంపీఎన్/100 మి.లీ), గాయ్‌ఘాట్ (3,500 ఎంపీఎన్/100 మి.లీ), కేవాలా ఘాట్ (5,400 ఎంపీఎన్/100 మి.లీ) గాంధీ ఘాట్, ఎన్ఐటీ(3,500 ఎంపీఎన్/100 మి.లీ) ఇంకా హాథీదహ్లో 5,400 ఎంపీఎన్/100 మి.లీగా తెలుస్తోంది.
గడిచిన రోజులలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్‌లో మహాకుంభమేళా కొనసాగింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ప్రకారం అక్కడి గంగా నది నీటిలో కలిసిన మానవ, పశు మలం కారణంగా ఫీకల్ కోలీఫాం ఆ నీటిలో ఎక్కువగా ఉంది. దీని వల్ల ఇది స్నానం చేయడానికి యోగ్యం కాదు. వివిధ అవసరాల నిమిత్తం మానిటర్ చేయబడిన అన్ని చోట్ల ఫీకల్ కోలీఫాం వల్ల గంగానీటి నాణ్యత స్నానం చేయడానికి పనికిరాదని సీపీసీబీ నివేదిక ఆధారంగా ఎన్జీటీ తెలిపింది.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈ సర్వేను ఖండించారు. అంతేకాకుండా గంగా నది నీరు కేవలం స్నానం చేయడానికే కాదు, తాగడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. అయినప్పటికీ, ఆయన దీని కోసం ఎటువంటి శాస్త్రీయమైన నివేదికను సాక్ష్యంగా చూపించలేదు.
ద వైర్ హిందీ స్టాఫ్
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.