
ఎక్స్‌లెన్స్ అండ్ అచీవ్మెంట్ ప్రోగ్రాంకు భారత దేశం నుండి ఎంపికైన ఏడుగురిలో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడుగా నేను కూడా ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్ 11వ తేది నుంచి అక్టోబర్ 30 వరకు అమెరికాలోని ఒహియో రాష్ట్ర కెంట్ స్టేట్ యూనివర్సిటీలో 50 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. భారతదేశం తరఫు నుంచి నేను ప్రాతినిధ్యం వహించాను. 60 దేశాల నుండి ఎంపికైన ఉపాధ్యాయులు అమెరికా ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వ విభాగాలైన ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ ఎక్సేంజ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కల్చరల్ అఫైర్స్‌లు ఆయా యూనివర్సిటీలలో నిర్వహిస్తుంటాయి.
కార్యక్రమంలో భాగంగా విద్యా, సాంస్కృతిక అంశాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుంది. దీంతో పాటు, అక్కడి స్థానిక పాఠశాలలను సందర్శించి, ఆ పాఠశాలలో బోధించే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం పొందిన నేను అమెరికా దేశ పర్యటనలో తెలుసుకున్న అనేక విద్య, సాంస్కృతికమైన అంశాలు మీతో పంచుకుంటున్నాను.
కెంట్స్టేట్ యూనివర్సిటీలో జరిగిన ఈ శిక్షణకు 20 దేశాల నుంచి 21 మంది ఇంగ్లిష్, గణిత ఉపాధ్యాయులు హాజరైయ్యారు. వీరు 5 అంశాల్లో శిక్షణతో పాటు పరిశీలనా అనుభవాన్ని పొందారు. జనరల్ పెడగోగి(బోధనా శాస్త్రం)లో భాగంగా నూతన బోధనా పద్ధతులు, ఇంగ్లీషు బోధనలో నవీన పద్ధతులు, రోజు వారీ బోధనలో అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి బోధించడం వంటి అంశాలపై 45 రోజుల పాటు చర్చలు జరిగాయి.
చర్చల్లో వివిధ దేశాల ఉపాధ్యాయుల అనుభవాలు..
భారత దేశంలో ఆయా విభాగాల్లో ప్రస్తుత స్థితి గతుల గురించి ఈ చర్చల్లో నేను వివరించాను. అంతేకాకుండా యూరోప్ ఖండ దేశాలైన ఉక్రెయిన్, జార్జియా, ఎస్తోనియా, అర్మేనియా, మాల్డోవ్, బెలారస్, దక్షిణ అమెరికా దేశమైన బలీవియా, కరీబియన్ దేవులైన డొమినికన్ రిపబ్లిక్, ఆఫ్రికా దేశాలైన కెన్యా, అల్జీరియా, మోజంబిక్, ట్యునీషియా, ఆసియా దేశాలైన థాయిలాండ్, నేపాల్, బంగ్లాదేశ్, లావోస్, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు చెందిన ఉపాధ్యాయుల అనుభవాలను తెలుసుకున్నాను. పర్యావరణ విద్య, బాలికా విద్య, మహిళా సాధికారత వంటి అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొన్నాను.
భారత దేశంలోని స్త్రీల స్థితిగతులు ఇతర దేశాల మహిళల స్థితిగతులకు దగ్గరి పోలికలు ఉన్నాయని, ఇప్పటికి అమెరికాలాంటి అగ్ర రాజ్యంలో సైతం మహిళల పట్ల అనేక రంగాల్లో వివక్ష ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. యూనివర్సిటీ స్థాయిలో ఉన్న మహిళా ప్రొఫెసర్ల జీతభత్యాలు అదే ఉద్యోగం చేస్తున్న పురుషల కంటే తక్కువగా ఉండటం పట్ల మహిళా ప్రొఫేసర్లు అసంతృప్తిగా ఉండటమే కాక, పోరాటాలు కూడా చేస్తున్నట్లు తెలుసుకున్నాను.
అలాగే, విద్యా రంగంలో ఆధునిక సాంకేతికతను మేళవించి బోధించడం ఎలాగో ప్రత్యక్ష పరిశీలన, అనుభవ పూర్వకంగా నేర్చుకున్నాను. గూగుల్ క్లాస్ రూమ్‌ను ఉపయోగించి బోధించడం, కృత్రిమ మేధను మేళవించి బోధన, అభ్యసించే విధానాన్ని ఎలా మెరుగు పరచుకోవాలి, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ లాంటి వాటిని ఉపయోగించి అభ్యాస ప్రక్రియను మరింత ఆసక్తికరంగా, ఉపయోగకరంగా మార్చడంలాంటి అంశాలను నేర్చుకున్నాను. అంతేకాకుండా ఆంగ్ల భాషా బోధన ఆసక్తికరంగా ఉండడానికి పిక్చర్బుక్ రీడింగ్‌ను ఒక బోధన ప్రక్రియగా ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం.
పాఠశాలల సందర్శన, బోధన..
అన్నిటికంటే ముఖ్యంగా, ఈ పర్యటనలో మేము అమెరికన్ ప్రభుత్వ పాఠశాలలను ప్రత్యక్షంగా సందర్శించాము. అక్కడి విద్యా బోధనను దగ్గరిగా పరిశీలించడం, అక్కడి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడం, భారతదేశ పాఠశాలలో విద్యా బోధనతో పాటు నిర్వహించే అనేక విద్యేతర, విద్య అనుబంధ కార్యక్రమాలు, భారతీయుల భాష, వస్త్ర ధారణ, పండుగలు, కుటుంబ విలువలు, ఆహార అలవాట్లు, ఆహార పదార్థాలలాంటి విషయాలను అక్కడి పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించాను.
అక్కడి పాఠశాలల్లో అత్యాధునిక మౌలిక వసతుల కల్పన బాగుంది. ఉపాధ్యాయులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ టీచింగ్ లైసెన్స్‌ను పరీక్షలు రాసి పునరుద్ధరించుకోవాలి. బోధనాభ్యాసన క్రమంలో బోధనోపకరణాలను ఎక్కువగా ఉపయోగిస్తారని గమనించాను. అక్కడి పాఠశాలల్లో ఆరవ గ్రేడ్ నుంచి వృత్తి విద్యకు సంబంధించిన కోర్సులను ఐచ్ఛికంగా తీసుకునే వెసులుబాటు ఉంది. ఉన్నత పాఠశాలల్లో కెరీర్ స్పెషల్స్ అనే పేరుతో 11 రకాల వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయని తెలిపారు. అక్కడి ఉపాధి అవకాశాలను బట్టి ఎప్పటికప్పుడు ఈ వృత్తి విద్యా కోర్సులు ప్రవేశ పెడుతున్నారని, అది విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉందని తెలుసుకున్నాను.
సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ లాంటి కోర్సులు కూడా తొమ్మిదవ గ్రేడ్ నుంచే అందుబాటులో ఉన్నాయని తెలిసి ఆశ్చర్యమేసింది. కాస్మెటోలజీ లాంటి కోర్సులు, అటవీ శాస్త్రం, టీచింగ్ ప్రొఫేషనల్ కోర్సు, మార్కెటింగ్ కోర్సు, బిజినెస్ అండ్ స్పోర్ట్స్ లాంటి కోర్సులతో పాటు, ఫ్యూచర్ హెల్త్ ప్రొఫెషనల్స్ అనే కోర్సులు భవిష్యత్‌లో డాక్టర్స్ అవ్వాలి అనుకునే వారికి ఉన్నత పాఠశాల స్థాయిలోనే ప్రాథమిక ఆరోగ్య చికిత్సా ప్రక్రియలు నేర్పిస్తూ ఉండటం నాతోపాటు అందరికీ అమితాశ్చర్యం కలిగించింది.
ఇంకా గమనించిన విషయం ఏంటంటే, త్రీడీ సాంకేతిక యంత్రాల ద్వారా త్రీడీ ముద్రిత వస్తువులు కూడా పాఠశాలల్లో తయారు చేస్తున్నారు. అంతేకాకుండా వాటిని మార్కెట్ చేయడం కూడా జరుగుతోంది. ఒక వస్తువును రూపొందించడం, మళ్లీ దాన్ని మార్చడంలాంటివి అన్నీ పాఠశాలలోనే జరగడం చూశాం. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి దోహదం చేసేలా అక్కడి సిలబస్, విద్యా బోధన, పాఠశాల నిర్వహణ ఉందని తెలుసుకున్నాం. అక్కడి విద్యార్థులు అందరికీ గూగుల్ క్రోమ్ బుక్ తప్పనిసరి ఉపకరణంగా ఉంది. దాంతోనే విద్యాభ్యాసం, అభ్యసన కృత్యాలు, మూల్యాంకనం కూడా జరుగుతున్నట్టుగా గుర్తించాము. అయితే, అదే సందర్భంలో అక్కడి విద్యార్థుల చేతిరాత ఆకర్షణీయంగా లేకపోవడం గమనించాను. క్రోమ్‌బుక్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆ పరిస్థితి వచ్చిందని అక్కడి ఉపాధ్యాయులు తెలిపారు.
తెలంగాణ పాఠశాలలో అన్వయించదగిన కార్యక్రమాలు..
అక్కడి పాఠశాలలను సందర్శించడంతో తెలంగాణలోని పాఠశాలల్లో అన్వయించదగిన కార్యక్రమాలను గుర్తించాను. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టాబ్లెట్స్‌ను చదువు కోసం ఉపయోగపడే వస్తువుగా అందించాలని భావిస్తున్నట్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలిసింది. ఒకవేళ అదే జరిగితే తెలంగాణలోని పాఠశాలల్లో కూడా ఆధునిక సాంకేతిక వస్తువుల మేళవింపుతో విద్యార్థులకు బోధనాభ్యసం ఆసక్తికరంగాను, ఉపయోగకరంగానూ మార్చవచ్చు. అనేక రకాల అప్లికేషన్స్‌తో అభ్యసనను సులభతరం, వేగవంతం చేయవచ్చు.
స్థానిక కెంట్ స్కూల్స్ బోర్డు మీటింగ్‌లో అతిథిగా పాల్గొనడంతో అనేక విషయాలు తెలిశాయి. ముఖ్యంగా అక్కడి పాఠశాలల నిర్వహణ స్థానిక కమ్యూనిటీ ఎంపిక చేసిన పాఠశాల బోర్డు చూస్తుంది. దీనివల్ల అక్కడి ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేయడం జరుగుతోంది. అక్కడ ప్రతి పాఠశాలలో అదనపు ఉపాధ్యాయులు ఉండటం వల్ల ఎవరైనా టీచర్లు సెలవులో ఉన్నట్లైతే, విద్యార్థులకు నష్టం జరగకుండా అదనపు ఉపాధ్యాయులను తరగతులకు కేటాయిస్తారు. అక్కడి పాఠశాలలకు నిర్వహణ కోసం కావాల్సిన ఆర్థిక వనరులు అత్యధిక శాతం స్థానిక కమ్యూనిటీలే సమకూరుస్తాయి. దీని వల్ల ఆయా స్థానిక పాఠశాలల బోర్డులు నిర్ణయాత్మక శక్తులుగా ఉన్నాయి.
అమెరికా దేశంలో అత్యాధునిక సాంకేతికత ఉపయోగించబడే పాఠశాలలతో పాటు అసలు ఎలాంటి ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని, పరికరాలను ఉపయోగించని అమిష్ పాఠశాలను కూడా సందర్శించాము. అక్కడ ఏ రకమైన విద్యుత్ పరికరాలు కూడా వాడని స్థితి ఉంది. ఆ విద్యార్థులు కేవలం ఎనిమిదవ తరగతి వరకే చదువుతారు, తర్వాత ఎలాంటి ఉన్నత చదువులు చదవరని తెలుసుకుని నిర్ఘాంత పోయాను. ఈ దశలో అమిష్ కమ్యూనిటీ ప్రత్యేకంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది.
అమెరికన్ ప్రజల స్థితిగతులు, సంస్కృతి పరిశీలన..
ఈ క్రమంలో స్థానిక అమెరికన్ ప్రజల స్థితిగతులను, సంస్కృతినీ దగ్గరగా పరిశీలించడం కోసం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇద్దరు ఫుల్బ్రైట్ స్కాలర్లకు ఒక ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ చొప్పున కేటాయించారు. ఆ ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ ఫుల్బ్రైట్ స్కాలర్లను వారింటికి లంచ్ లేదంటే డిన్నర్లకు ఆహ్వానించడం, వారి కుటుంబ కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేయడం, వారి వంటకాలు, అతిథులుగా వెళ్లిన ఫుల్బ్రైట్ స్కాలర్ల దేశాల వంటకాలను వారు రుచి చూడటంలాంటివి కూడా ఎక్కువగా జరిగింది. ఫుల్బ్రైట్ స్కాలర్‌గా అక్కడి స్థానిక పండుగలు హాలోవీన్‌లో పాల్గొనడం, గుమ్మడికాయను వివిధ ఆకారాల్లో చెక్కడంలాంటి సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి అనుభూతిని కలిగించింది.
అంతేకాకుండా, ప్రపంచ శాంతి కాంక్షిస్తూ జరిగిన పెయింటింగ్ పోటీలలో పాల్గొనడం, కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా ఫుల్బ్రైట్ స్కాలర్లు కృత్రిమ చేతులను తయారు చేసి ఇవ్వడం జరిగింది. అక్కడి నేషనల్ పార్క్‌కు వెళ్లి సర్వీస్ చేయడంతో పాటు, దగ్గర్లో ఉన్న క్లీవ్‌లాండ్ నగరంలో ఉన్న చారిత్రాత్మక కళాక్షేత్రంలో ప్రసిద్ధి చెందిన ఫ్రెంచ్ విప్లవ నేపథ్యంతో సాగే నాటకం ‘లే మిసెరబుల్స్’ను ప్రత్యక్షంగా చూశాను. అదే నగర నడిబడ్డున వివిధ దేశాల శరణార్థులు నిర్వహిస్తున్న గార్డెన్‌ను కూడా సందర్శించాను. అక్కడే ఉన్న వివిధ దేశాల సంస్కృతి ఉద్యానవనంను సందర్శించడం, మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళి అర్పించడంలాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను.
వివిధ నగరాల సందర్శన..
కార్యక్రమంలో వచ్చిన నాలుగు రోజుల సెలవులో అమెరికాలో స్థిరపడిన చిన్న నాటి మిత్రులు నగేష్ చండ్ర, వేణు మేడ, సత్యవర్ధన్ వెంపటి, సురేష్ బస్వలను 30 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అత్యంత సంతోషాన్ని కలిగించింది. వారితో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్లాంటి నగరాలను, హాలీవుడ్‌ను సందర్శించడం మంచి జ్ఞాపకంగా జీవితాంతం మిగిలి ఉంటుంది. కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన నయాగరా జలపాతం సందర్శన జీవిత కాలంలో మర్చిపోలేని అనుభూతిగా చెప్పవచ్చు.
ఈ ఫుల్బ్రైట్ స్కాలర్స్ తిరిగి వెళ్ళాక, వారి పాఠశాలల్లో అమలు చేయగలిగే బోధనా పద్ధతులు అమలు చేయవచ్చు. అలాగే ఆయా అంశాల వారీగా విద్యార్థులకు లేదంటే ఇతర ఉపాధ్యాయులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే, వాటికి ఫుట్బ్రైట్ గ్రాంట్స్ మంజూరు చేస్తుంది. వివిధ దేశాలకు చెందిన ఫుల్బ్రైట్ స్కాలర్స్‌ను ఆన్లైన్ విధానంలో ఇక్కడి విద్యార్థులకు గెస్ట్ లెక్చర్స్ ఏర్పాటు చేయవచ్చు.
ఈ ఫుల్బ్రైట్ టీచింగ్ కార్యక్రమం వ్యక్తిగతంగా, వృత్తి పరంగా విజ్ఞానదాయకంగా, ఉత్తేజ పరిచేలా, స్ఫూర్తినిచ్చేలా ఉంది. అమెరికాతో పాటు వివిధ దేశాల విద్య, సాంస్కృతికపరమైన అంశాలు తెలుసుకోగలిగాను. ఇది నిత్య చైతన్యస్ఫూర్తిగా జీవితాంతం గుర్తు ఉంటుంది.
– సంక్రాంతి రవి కుమార్
(సంక్రాంతి రవికుమార్ 2005లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం ఖమ్మం జిల్లా పల్లిపాడులోని కొణిజర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌ను బోధిస్తున్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.