
ఉత్తమ రచనల నేపథ్య వివరాలు రచయితలకు మార్గదర్శకాలయ్యే క్రియావాచకాల(వర్క్ బుక్స్) లాంటివి. ఆధునిక భారతీయ ఉత్తమ రచయితల్లో ఒకరైన ఆచార్య ఎస్ఎల్ భైరప్ప వృత్తిరీత్యా తత్త్వశాస్త్ర ఆచార్యులు, ‘సత్యం – సౌందర్యం’ పై సిద్ధాంత గ్రంథం రాశారు. ప్రవృత్తిరీత్యా కుటుంబ తాత్త్విక నవలా రచయిత. తమ ప్రధాన రచనల నేపథ్యాన్ని వివరిస్తూ కన్నడంలో రాసిన వ్యాసాల సంకలనం – నానేకె బరెయుత్తేనె- నేనెందుకు రాస్తాను. ఇందులో పర్వ నేపథ్యంపై రాసిన సుదీర్ఘవ్యాసం- అటు రచయితలకు మార్గదర్శక క్రియా పుస్తకంగాను – ఇటు ప్రాచీన భారతీయ సంస్కృతి, భౌగోళికత మీద ఆసక్తి ఉన్నవారికి ఒక అద్భుతమైన క్షేత్ర టిప్పణి (ఫీల్డ్నెట్స్) గాను ఉపకరిస్తుంది. దానికి కొద్దిగా సంక్షిప్త పరిచిన అనువాదమిది..
1966లో కావచ్చు, చిక్కుమంగుళూరులో ఓ సభ జరిగింది. ఆ కార్యక్రమంలో నా స్నేహితుడు ఎం నారాయణప్ప అతిథి పరిచయోపన్యాసం చేశాడు. ఉపన్యాసంలో ఆయన ధాటి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అయితే ప్రసంగిస్తూ నా గురించి ఓ మాట అన్నాడు ‘ఈయన రాసింది ఈ మాత్రమే కాదు, మహాభారతాన్ని నవలగా రాయబోతున్నారు. త్వరలో బయటికి వస్తున్న దాన్ని చదవడానికి మేమంతా కుతూహలంగా ఎదురు చూస్తున్నాము.’ అప్పటికి నేను ప్రకటించింది కొద్దిపాటే. విషయాభావంతో ఈ స్నేహితుడు భవిష్యత్తు బాకా ఊదాడు అనుకున్నాను. రాత్రి ఇంటికి వచ్చి భోంచేస్తున్నప్పుడు ఆక్షేపణ తెలిపాను. ‘నా మాట అబద్ధమని ఎలా చెబుతావు? కుంతి, కర్ణుడు, ద్రౌపది మొదలైన పాత్రల స్వరూపం అలాకాదు, ఇలా ఇలా అని ఎన్నోమార్లు చర్చించావు కదా..! అదలాగే రాస్తే మంచి నవల అయితీరుతుంది’ అని తన్ను తాను సమర్థించుకొన్నాడు. నేను ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత మూడు నాలుగు నెలలకు, ఒక ఉత్తరం రాస్తూ ‘మహాభారతం పై నవల రాయడం గురించి ఆలోచిస్తున్నావా? దాన్ని నువ్వు తప్పక రాసి తీరాలి’ అని పునరుద్ఘాటించాడు. ఒక నవల నా మనస్సులో ఎలా రూపుదిద్దుకొంటుందనే దాన్ని ఎంత వివరించినా ఈ వైద్య విద్వాంసుడికి తెలియదనుకొని నాలో నేను నవ్వుకొన్నాను.
ఆ తరువాతి సంవత్సరం కావచ్చు, ఆశ్వయుజ – కార్తీక మాసాల్లో గఢ్ వాల్ వైపు హిమాలయాల్లో తిరుగుతుండగా బహుపతీ పద్ధతి ఉన్న ఓ చిన్న పల్లెలో రాత్రి పడుకోవలసిన సందర్భం ఏర్పడింది. ఇంటికి కోడలుగా వచ్చిన స్త్రీ, అన్న తమ్ములందరికీ సమానంగా భార్యే. మూడు-నాలుగేళ్ల కిందటి ఆంధ్రప్రభ దినపత్రికలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఇలాంటి సందర్భాన్నే వివరిస్తూ అభినవద్రౌపది అనే వృత్తాంతం ప్రచురించబడింది. ఎంత మంది మగవాళ్లున్నా అందరూ అందరికీ సమానంగా మొగుళ్లే అవుతారు. పెళ్లి మాత్రం పెద్దవాడి పేరిట జరుగుతుంది. హక్కు, ఆచరణల్లో సోదరులందరికీ సమానాధికారం ఉంటుంది. ఇలాంటి ఉదంతాలను వివరించే మానవ సంస్కృతివేత్తల గ్రంథాలను చదివాను. కానీ స్వయంగా చూస్తున్నప్పుడు మాత్రం కుతూహలం, ఉద్విగ్నత, సంభ్రమం ఈ కుటుంబ వ్యవస్థ ఆంతర్యాలను, ఆచరణ వ్యత్యాసాలను గూర్చి ఆలోచిస్తూ అలాగే నిల్చుండిపోయాను. సుమారు రెండు తాలూకాల దాకా విస్తరించిన పల్లెల్లో ఈ పద్ధతి ఉంది. వాళ్లందరూ బ్రాహ్మణులు, లేదా క్షత్రియులు మొత్తం మీద పై జాతుల వారే ఉన్నారు.
తమలో ద్రౌపది కాలం నుంచి ఈ సంప్రదాయమున్నట్లు చెబుతున్నారు.
తరువాతి పర్యటనలో కొద్ది రోజుల పాటు నా దృష్టి ఇలాంటి పల్లెల, ఈ పద్ధతుల, వీటి మూలాల మీద నిమగ్నమైంది. కనిపించే ప్రతి ముఖంలోనూ
కళ్లు ద్రౌపదిని వెదుక్కోసాగాయి. మనస్సు ఆమె పాత్రను కల్పించుకోసాగింది. ఇలా పర్యటన ముందుకు సాగేకొద్దీ, అక్కడి అనేక స్థలాలు, మహాభారతానికి ముఖ్యంగా పాండవుల ఐతిహ్యాలకు సంబంధించినవిగా అర్థం కాసాగాయి.
బదరి, జ్యోతిర్మఠ పర్వతాల మధ్య లోయలోని పాండుకేశ్వరానికి వెళ్లేపాటికి తన పుంశక్తిహీనతను పోగొట్టుకోవడానికై అక్కడికి వచ్చి చివరకు అక్కడే మరణించిన పాండుమహారాజు, ముగ్గురు పిల్లలను కన్న కుంతి, ఆమె సవతి మాద్రి మనసంతా ఆక్రమించారు. అంతవరకు బలంగా వెంటాడుతున్న ద్రౌపది కూడా అనుసరించింది. అంతేకాదు, హిమాలయాల ఎత్తు, ఆకృతి, తెలుపు, పచ్చందనాలు ఎప్పుడూ నా కల్పన మూలాలను ప్రేరేపిస్తూనే ఉంటాయి. పిల్లల్లా ఉల్లాసంతో ఎగిరి, అరచి, గంతులేసేలా, యతుల్లా గంభీరంగా బ్రతుకు చావుల గురించిన చింతనలో నిమగ్నమయ్యేలా, మహెూత్కట ప్రేమికుల్లా తియ్యటి స్మృతుల్లో తేలాడే జీవనరమణీయత, ఏకాంతికత, కాంక్షాతీవ్రతల్లో మునిగిపోయేలా హిమగిరులు చేస్తుంటాయి. నేను చదివిన ఉపనిషత్తులు, భారతం, ఇతర ప్రాచీన కృతుల్లో కొత్త అర్థాలను ఉన్నట్టుండి స్ఫురింప చేస్తుంటాయి. బయటి ప్రపంచాన్ని మరచి, హిమాలయాల ఎత్తు పల్లాల్లో పర్యటించిన వాడు. భారతీయ సంప్రదాయ మూలాలను కళాత్మకంగా గ్రహించగలడని నేను చాలా సార్లు అనుకొంటుంటాను. అందుకోసం అక్కడికి మళ్లీ మళ్లీ వెళుతుంటాను. స్విట్జర్లాండులోని ఆల్ఫ్స్ పర్వత శిఖరాల్లో నాకు ఇలాంటి భావనలు, పారవశ్యం కలగలేదు. వృక్ష వైవిధ్యం, విస్తారత, ఆకృతి, ఔన్నత్యం మాత్రమే అందుకు కారణాలు కావు. సాంస్కృతికంగా నేను హిమాలయ శిఖరాలకు చెందిన వాడిని. నా సంప్రదాయాన్ని నిర్మించిన వ్యాస, కాళిదాసు, ఉపనిషత్తులను ప్రేరేపించిన చోటు ఇదేనన్న స్పృహ ఉంది. ఆల్ఫ్స్ సందర్శనలో మరో విధమైన మనోవిన్యాసం ఏర్పరచుకొన్నాను. హిమాలయాల వంగిన భుజాలమీద, ఎదమీద పాకుతున్నప్పుడే గృహభంగి, గ్రహణ, నిరాకరణ, దాటు నవలలు మొలకెత్తాయి. మహా భారతంలోని పాత్రలు కూడా లోన్నుంచి తొంగిచూడ్డం ప్రారంభించాయి.
ఢిల్లీలో ఉన్నంతవరకూ పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాటి ప్రాంతాల్లో నాకు తారసపడ్డ స్త్రీ, పురుషుల రూపాలను, ఆకృతులను, సామాజిక పద్ధతులను, మనోధర్మాల వ్యత్యాసాలు మొదలైన వాటిని జాగ్రత్తగా గమనిస్తుండే వాడిని. వారి పూర్వీకుల సామాజిక ఆచారాల మీద పుస్తకాలు చదువుతుండే వాడిని. ఒక విధంగా వీరు నేరుగా మహాభారతానికి సంబంధించిన వారు అనే భావం స్పష్టం కాసాగింది. 1965లో పాకిస్తాన్ యుద్ధంలో వేలాదిమంది పంజాబ్ సైనికులు మరణించడం, విధవలైన వారి భార్యలు అలాగే ఇతర అనేక విధవలు తమ పిల్లలతో పాటు తరువాత తమ భర్తల సోదరులతో చేసుకొన్న ‘ఛాదర్ డలానా’ రీతి మారుమనువు, అలా మారుమనువు చేసుకొన్న ఒక స్త్రీతో నేను దీర్ఘంగా చర్చించి తెలుసుకొన్న సందర్భం – ఇవన్నీ ఆ ప్రజలు మహాభారత సంస్కృతికి దాక్షిణాత్యులైన మన కంటె చాలా దగ్గరి వారు అనే భావాన్ని కలిగించాయి.
1971లో మైసూరుకు బదిలీ మీద వచ్చాను. నా ప్రాంతం నుంచి- కర్ణాటక భాష, జీవితాల నుంచి – దూరంగా ఉత్తరాదిలో గడిపిన పన్నెండు సంవత్సరాలు నా మనస్సూ, భావన, ఆకాంక్షలు అన్నీ బలంగా కర్ణాటక వైపు లాగుతుండేవి. అంతవరకు రాసిన ప్రతి నేపథ్యం కర్ణాటకమే.. కర్ణాటకకు వచ్చిన తరువాత అంతకాలం నా కుతూహలాన్ని ప్రేరేపించి నేను పన్నెండు సంవత్సరాల పాటు చూసిన ఉత్తర భారత జీవితాన్ని భావనలో పట్టుకోలేకపోయానేమో చెప్పలేను.
ఉత్తర భారతదేశంలో పన్నెండేళ్ళున్నప్పటికీ వారి జీవితాన్ని నేరుగా సమకాలీన వస్తువుగా చేసుకొని రాయాలనే పట్టుదల నాకు కలగలేదనిపిస్తుంది. ఎందుకంటే నా బాల్య, యౌవనాలు ఇరవై ఆరు సంవత్సరాలు గడిచిన పిమ్మట నేను ఉత్తర భారతానికి వెళ్లింది. జీవితం, సంస్కృతులను గ్రహించే శక్తి, భావనాత్మక తాదాత్మ్యం ఆ వయస్సు లోపల కలిగేలా తరువాతి దశలో అందులోనూ ఉద్యోగం చేసుకొంటూ పరాయిల్లాగా గడిపే మాలాంటి వారికి సాధ్యంకావు. దాన్ని గూర్చి రాయడమెలా? అయితే భావనాతాదాత్మ్యమనే మాట అర్థంలో మహాభారతం నాకు కూడా చెందిందే, కర్ణాటక భాష, సంస్కృతులకు చెందిందే. మధ్యలో చోటు చేసుకొన్న చరిత్ర వల్ల మనలాగే ఉత్తరం వైపు వాళ్ళకూ దూరమైనదే. ఒక అర్థంలో నేను చూసిన ఉత్తర భారత జీవితాన్ని గ్రహించే రీతి మరో అర్థంలో మొత్తం భారతదేశాన్ని – కాదు, నా మొత్తం జీవితంలో వెంటాడుతున్న కొన్ని సమస్యల మూలాన్ని గుర్తించడానికి ఉపయోగపడే సాధనం. ఇలా మహాభారతాన్ని అధ్యయనం చేయాలనే ఒత్తిడిలో నుంచి ప్రారంభమైంది. మరోదాన్ని చదవడం మనస్సుకు అసాధ్యమైంది. అయితే నేను భారతాన్ని చదవాలనుకొంటున్నది, సాహిత్య రచన కోసం కాదు. ఈ దేశ సంస్కృతి ఒక రూపం నుంచి మరో రూపం పొందిన మధ్య కాలపు స్పష్టమైన చిత్రం కోసం. ఇదో నవల కావచ్చు అనే ఆశ, నమ్మకం ఒక్కోసారి కలుగుతున్నా రాయాలనే నిర్ణయం అప్పట్లో ఏర్పడలేదు. మన సాంస్కృతిక మూలాలను, మహాభారతమనే సాహిత్యకృతి మూలంగా వాటి మూర్త స్వరూపాన్ని గ్రహించడం మాత్రమే అప్పటికి స్పష్టమైన నా ఉద్దేశ్యంగా ఉంది.
కన్నడంలో కుమార వ్యాసుణ్ణి పూర్తిగా చదివాను. పంపభారతాన్ని అక్కడ కాస్త, ఇక్కడ కాస్త తెలుసుకున్నాను. అయితే ఇవి సంస్కృతి అధ్యయనం దృష్టితో మూలభారతానికి పూర్తి దూరమయినవి. కృష్ణశాస్త్రిగారి వచన భారత సంగ్రహమొకటే కన్నడంలో లభించే వ్యాసరూపం. ఇది ఇంతకు ముందే చదివాను. ఇప్పుడు మూల వ్యాసభారతాన్ని ఆమూలాగ్రం చదవాలనే అభిలాష కలిగింది.
పరిష్కృతమైన సుక్తాంకర్ సంపుటులు మున్నుడి చూశాక వాటిని వదిలి గోరఖ్ పూర్ అపరిష్కృత సంపుటులను తెప్పించుకొన్నాను. గడ్డి, పరక, వాసన, రంగులన్నిటినీ తీసేసి వడగట్టి చేసిన చక్కెర కంటె, గానుగతో చేసిన బెల్లం, చెరకుకూ, చెరకు గడలకూ దగ్గరగా ఉంటుందన్న నా ఊహ ప్రయోజనకారి అయింది. ఇప్పుడు మనకు లభిస్తున్న వ్యాస భారతరూపంలో కౌరవ కథాబంధానికి అనావశ్యక మనిపించే కథలు, ఉపకథలు, ఉపదేశాలు, రాజనీతి, ధర్మనీతులు అనేకమున్నాయి. అయితే వేటిన్నింటిని వదలకుండా కలిపి చదివినప్పుడు కౌరవకథలోని సాంస్కృతిక నేపథ్యం గ్రహించడం సులభమవుతుంది. ఉదాహరణకు జూదమాడడం ప్రాచీన ఆర్యరాజుల జీవన విధానం కావడం, మహాభారతంలో వచ్చే నలోపాఖ్యానం లోనూ కనిపిస్తుంది. మిగిలిన అన్ని విషయాల్లోనూ సద్గుణ రూపుడైన నలుడు జూదానికి రానని ఎందుకు చెప్పలేదు? ఆడాలనే ఆసక్తి అతనికీ ఉంది. యుద్ధానికి పిలిచినప్పుడు రానని చెప్పడం పేడితనమనిపించుకొన్నట్లే జూదానికి రమ్మన్నప్పుడు రాననడం కూడా పేడితనం కిందనే లెక్కించే సామాజిక పద్ధతి అప్పుడుంది. నల, ధర్మరాజులను పరస్పరం పోల్చిచూస్తే మనం వారి సామాజిక విశ్వాసాలను సులభంగా గుర్తించవచ్చు. నాకు కావలసింది వ్యాస కథ శుద్ధ సాహిత్యక రూపం కాదు..!
ఇలా పురాణకథల్లో నిండి ఉన్న అపరిష్కృత పాఠాన్నే మొదటి నుంచి చివరిదాకా చదివాక అదో చారిత్రక దాఖలాగా కనిపించింది. ఇదంతా చదివే సరికి ఒకటిన్నర సంవత్సరం గడచి పోయింది. తరువాత మహాభారత కాలం నాటి చరిత్రను అధ్యయనం చేయడానికి మొదలుపెట్టాను. మనకిప్పుడు దొరుకుతున్న రూపంలోని వ్యాసభారతం రూపొందిన కాలమే వేరు, భారత కథ జరిగిన కాలం దానికంటే చాల వెనకటిది.దాదాపు ఒక్క వెయ్యి సంవత్సరాల మునుపటిది కావచ్చని విద్వాంసులు సతార్కికంగా చర్చించారు. ఇప్పుడున్న రూపంలో ఆ రీతిలో ఆ వివరాల ప్రకారం భారత కథ నిజంగా జరిగిందా? జరిగిందనడానికి ఆధారముందా? లేదా కాలకాలానికి పరిణామం పొందుతూ చివరకు ఈ రూపం ధరించిన భారతంలోని కావ్య సత్యం వేరే, దానికి మూలమైన చారిత్రక సత్యం వేరేనా? ఇలాటి ప్రశ్నలతో కొంతకాలం గడిపి వాటికి సంబంధించిన పరిశోధనలను చదువుతుండేవాడిని. అంతలో నాకు కావలసినదేమిటనే స్పష్టత లభించసాగింది.
భారతకథావివరాల చారిత్రక సత్యం కంటే వాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సత్యాలు ఎక్కువ మహత్కరమైనవిగా అనిపించి, ఆ దృష్టితో మాత్రమే అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. కొందరు విద్వాంసులు అభిప్రాయపడుతున్నట్లు క్రీ.పూ. 12వ శతాబ్దిని, భారతకథ జరిగిన కాలంగా నేనూ ఒప్పుకొన్నాను. ఫలానా శతాబ్దమనే కాలం లెక్కకంటే ఎక్కువగా, సామాజిక, ఆర్థిక, రాజకీయ, జీవితంలోని ఒక నిర్ధిష్టమైన అవధిలో ఈ కథ జరిగింది. వైదిక సంస్కృతి వికాసంలోని ఒక కచ్చితమైన ఘట్టాన్ని అది సూచిస్తుంది. యజ్ఞయాగాదులు అనేక రీతుల్లో పెరిగి, పూర్తయిన కాలం అది. చింతనే ప్రధానమైన ఉపనిషత్తుల ఆరంభకాలం కూడా అదే కావచ్చు. వ్యాసులనే పేరున్న వారు కొందరున్నా, వేదాలను వింగడించిన, బ్రహ్మసూత్రాలను ప్రవచించిన, భారతాన్ని రచించిన వ్యాసుడొక్కడే అని సంప్రదాయం చెబుతున్నది. మొత్తం మీద ఆ పరంపర సూచించే సంస్కృతి అధ్యయనమే నాకు ముఖ్యవిషయమయింది.
అయితే, చరిత్రలో నాకు మొదటి నుంచి ఆసక్తి ఉంది. భిన్న భిన్న సందర్భాలలో భారతీయ చరిత్రలోని కొన్ని పార్శ్యాలను అధ్యయనం కూడా చేశాను. అయినా మార్గదర్శనానికి, నేను అధ్యయనం చేస్తున్నప్పుడు నాతో చర్చించడానికి నాకవసరమైన గ్రంథాలను, వ్యాసాలను సులభంగా నా దృష్టికి తేవడానికి ఒక విద్వాంసుని సహాయం అవసరమై ఉంది. అంతేగాక, నేను ప్రాచీన భారతదేశాన్ని సమాజశాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం మొదలైన దృష్టి కోణాల్లోంచి అర్థం చేసుకోవలసిన అవసరముంది. వీటిల్లో పరిణితులైనవారి సహాయం కోసం ప్రయత్నించాను. కానీ అదృష్టం నా మీద దయ చూపలేదు. గడచిన రెండు, మూడు (ఇప్పటికి మరో నాలుగు కలుపుకోవాలి – అను) దశాబ్దాల నుండి సంస్కృతం లేకుండానే భారతీయ తత్త్వశాస్త్రం, చరిత్ర, ధర్మశాస్త్రం, చివరకు సంస్కృత సాహిత్యం, సాహిత్య మీమాంసలను చదివి, రాసి, వాటిని బోధించే డాక్టరేట్ పట్టాలను దానం చేసే సంప్రదాయం మన విశ్వవిద్యాలయాల్లో ప్రారంభమయ్యాక నా అవసరాన్ని తీర్చగలిగే వారు లభించక పోవడంతో నాకు ఆశ్చర్యం కానీ నిరాశ కానీ కలగలేదు. పూనా, బనారస్ వంటి చోట్లకు కొన్ని దినాలు వెళ్లటమో, లేదా అక్కడి స్నేహితులకు ఉత్తరాలు రాయటమో మాత్రమే మిగిలిన దారి అని తోచింది.
ఉత్తరభారతంలో నివసించి, విశ్వవిద్యాలయాల సాన్నిహిత్యం ఉన్నందువల్ల ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవహారం కష్టమనిపించలేదు. కొద్దివారాల్లోనే నాకు కావలసిన ప్రారంభిక మార్గదర్శకం నేను చదవవలసిన గ్రంథ సూచి లభించింది. బెంగళూరులో పెద్దలు ఆచార్య వీ సీతారామయ్య పుస్తకాల వివరాలు ఇచ్చారు. నాకు అవసరమైన పుస్తకాలు చాలా వరకు మైసూరు విశ్వవిద్యాలయంలోనే ఉన్నాయి. చదవడం ప్రారంభించాను. అదో కొత్త ఉత్సాహం, కొత్త ప్రపంచాన్ని, కొత్త జీవనవిధానాన్ని పరిచయం చేసుకొంటూ నా సమకాలీన సంస్కృతి, విశ్వాస, ఆచార విచారాలు మూల బీజాలను గుర్తుపట్టే గొప్ప అనుభవం.
పరిశోధన అంటే ప్రయాస, చాకిరీ భారం కాదు. ఆపుకోలేని ఒత్తిడి, ఆరాటాల వల్ల కలిగే వెదుకులాట. మొదట్లోని అస్పష్టత పోయి నా టిప్పణి వివరాలు(నోట్సు) పెరుగుతూ (ఆచార్య ఎన్. బాలసుబ్రహ్మణ్యం, హుబ్లిలోని పా.వేం. ఆచార్య వంటి వారితో చర్చలు మొ॥ వాటితో) మూడున్నర సంవత్సరాలు (గడిచాక ఈ అవధిలో కొన్ని అంశాలు వివరాలు నాకు స్పష్టమయ్యాయి.
వేదకాలం చివరి భాగంలోని జీవన విధానం, కృషి, పశుపాలన వారికి తెలిసిన లోహాలు మొదలైన సాంకేతిక జ్ఞానం, రాజ్యపాలన విధానం, యుద్ధ విధానం, ఆహార విహారాలు, ధార్మిక ఆచరణలు ఆర్యులలో ఉన్న శాఖలు, కులాలు, ఆర్యేతర కులాలు, ఆర్య – ఆర్యేతర కులాల సన్నికర్షలు, పరస్పరం వారి మధ్య జరిగిన వివాహ, లైంగిక సంబంధాలు, అప్పటి ఉత్తర భారత భౌగోళిక వివరాలు, అరణ్య – వ్యవసాయిక భూమి వివరాలు ఇలాంటి అంశాలు స్పష్ట మౌతూ వచ్చి, నేను ఆ కాలంలో జీవిస్తున్న భావన కలిగింది. ఆ జీవితానికి నేను సమకాలీనుడయ్యాను. ఆ కాలంలో బ్రతుకసాగాను. ప్రాచీన భారత సంస్కృతికి ఏ పార్శ్యం మీది పుస్తకమైనా దానికి మహాభారతమే చాలా వరకు ఆధారం. బౌద్ధ జాతక కథల మీద అక్కడక్కడ ఆధారపడ్డా, వేదోపనిషత్తుల్లో వచ్చే జీవన వివరాల ఆధారంగా ఒక చారిత్రక చిత్రాన్ని సిద్ధం చేసుకోవాలనుకొన్నా, మహాభారతం కంటె మించిన సుసంపన్న ఆధారం మరొకటి ఉండదు. ఇలా నా అధ్యయనం కొత్త కొత్త పార్శ్యాలను చూడసాగింది.
ఈ పరిశోధనలు, అధ్యయనాలు, చింతనలు, చర్చల ఫలితంగా సుప్తచేతనలో రూపుదాల్చిన చిత్రాల పరిణామంగా పాత వ్యాసభారత కథాచట్రంలోనే ఒక కొత్త భారతం నా మనసులో అవతరించసాగింది. ఇది ఊహించని విషయం కాదు. నా మనస్వభావం నాకు తెలుసు. అమూర్త ప్రత్యయాల స్థాయిలో గ్రహించి చింతించినది. చివరకు మూర్త చిత్రంగా అభివ్యక్తమయ్యేంత వరకు, నేను గ్రహించడం పూర్తయినట్లు నాకే అనిపించదు. కళాత్మక మనోధర్మంలోని మూలగుణమే ఇది. ఈ అధ్యయన, చింతనల ఆఖరి పరిణామమంటే మహాభారతంలోని పాత్రలు, కుంతి, ద్రౌపది, కృష్ణ, భీమాదులు భిన్న స్వరూపంతో నాకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తుల్లా, నా లోపల ఉన్న వాళ్లల్లా నా వ్యక్తిత్వంలోని ఒక్కొక్క పార్శ్వంలా కనబడసాగారు. ఈ పాత్రల గురించి నవల రాయాలన్న భావం ఖచ్చితంగా ఏర్పడిపోయింది.
నా నవల వస్తువు కూడా భావనలో బలపడిపెరిగింది. కూర్చొని రాసి, అభివ్యక్తి క్రియ సంపూర్ణమయ్యేవరకు దాని స్వరూపం ఎలాగుంటుందో తెలియడం మాత్రం సాధ్యం కాదు. ఇక పరిశోధన చాలనిపించింది. ఈ చదివిన వివరాలన్నీటినీ ఒక క్రమంలో కూర్చుకోవడమెలా? అనే ప్రశ్న బాధించసాగింది.
ఒక విధంగా నేను రాయాలని మొదట అనుకొన్నది చారిత్రక నవలను. ఇది నేను ప్రయత్నిస్తున్న మొట్టమొదటి చారిత్రక నవల..! ఆ దృష్టితోనే వివరాలను సేకరించాను. అయితే, అట్టే చూస్తే ‘చారిత్రక’ మనే ప్రత్యేక వర్గీకరణే సాహిత్యకృతికి చెల్లదేమో..! క్రియ జరిగింది మూడు-నాలుగు వేల సంవత్సరాల క్రిందటని భావించినా వేషభాషణ, ఆహార విహార నివాసాదుల బాహ్య వివరాలు మనవాటికంటె భిన్నంగా ఉన్నప్పటికీ, సాహిత్య కృతికి మూలద్రవ్యం మానవ భావమే మానవుల ఆశ, ఆకాంక్ష, నిరాశ, సుఖదుఃఖాలే. ఈ వస్తువును గూర్చినేను రాయ సంకల్పిస్తుంది ఒక చారిత్రక రచనను రాయాలన్న ఉద్దేశంతో కాదు, నన్ను వేధిస్తున్న కొన్ని భావాలను, మానవ సంబంధాలకు సంబంధించిన ప్రశ్నలను శోధించడానికి ఈ చారిత్రక వస్తువు అనుకూలమైన సన్నివేశాలను ఇస్తున్న కారణంగా దీన్ని ఎంచుకొన్నాననే అవగాహన స్పష్టమయ్యేకొద్దీ నేను క్రమపరచుకొన్న సామగ్రిని చూసే దృక్పథమే మారిపోసాగింది. నేను అభివ్యక్తీకరించదలచిన భావాలకు అంతరంగ సమస్యలకు తగిన విశ్వసనీయమైన బాహ్య రూపాన్ని ఇవ్వడానికి మాత్రం ఈ సామగ్రి సహాయపడుతుంది. అంతే..! అనే కొత్త చూపు తేటపడింది. ద్రౌపదిలాగా అయిదుగురు భర్తలను కట్టుకొన్న స్త్రీ అంతరంగంలో నిజంగా సుఖంగా ఉండడం సాధ్యమా? సాహిత్య రచనలో సంభవించే క్రియ వాస్తవమూ, సాధ్యమూ అయ్యేతీరాలన్న నియమం లేదు. వాస్తవంలో లేని ఒక సన్నివేశాన్ని నిర్మించి అందులో బ్రతికే మానవ జీవి ఎలా స్పందిస్తాడనే విషయాన్ని రచయిత శోధిస్తాడు.
నాలో బలంగా రూపు దిద్దుకొంటున్న పాత్రల సన్నివేశాలు బాహ్యపరికరాలను స్పష్టంగా గ్రహించడానికి, భారత కథ జరిగిన స్థలాలను పరిశీలించడం తప్పని సరి అనిపించింది. ఉత్తర భారతంలో లోగడ బాగా తిరిగినప్పటికీ ఈ రచనోద్దేశానికి నాకున్న పరిచయం నిరుపయోగమనిపించింది. కొత్తగా వాటిని చూడాలను కొన్నాను. మైసూరులోని కేంద్రశాసన విభాగంలో ఉన్న డా రమేశ్ ఒక నమూనా పటం తయారుచేసి నేను చూడవలసిన ప్రదేశాలు, వాటి స్థలవివరాలు ఇచ్చారు. వాటిపై జరిగిన పురాతత్త్వశాఖ త్రవ్వకాల పరిశోధన వివరాలన్నిటినీ చదివి, నోట్సు రాసుకొని, 1975 ఆగస్టు నెల చివర పశ్చిమ భారత ప్రయాణం ప్రారంభించాను. వెళ్లే చోటికల్లా రైలు బస్సు సౌకర్యాలు లేవు. వసతి మాట సరే సరి. దొరికినది తినడం తప్ప దారిలేదు. కలరా, టైఫాయిడ్ నిరోధక సూది మందులను తీసుకొనే బయల్దేరాను.
రాత్రి అహ్మదాబాదులో రైలెక్కి మరుసటి రోజు మధ్యాహ్నం వెరావల్‌లో దిగాను. మధ్య గుజరాత్లో ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేయడం వల్ల గుజరాత్, సౌరాష్ట్రాలు నాకు కొత్తకాదు. లోథల్ త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు వెళ్లి చూసొచ్చాను. భౌగోళిక వివరాలు తెలిసినా ఇప్పుడు బయలుదేరింది యాదవులు వచ్చి స్థిరపడ్డ ప్రాంతాన్ని కళ్లారా చూడడానికి. సోమనాథం (ప్రభాస పట్టణం) దగ్గర ‘భిల్ల’ వద్ద కృష్ణుడు వేటగాని బాణం తగిలి ప్రాణం విడిచిన చోటుగా చెప్పబడే ఒక స్థలముంది. సోమనాథమైతే ఇటీవలి చరిత్రకు సంబంధించింది. ఒకటిన్నర రోజు ఆ చుట్టుపట్ల తిరిగి బస్సెక్కి పోరుబందరుకు వచ్చాను. గాంధీ పుట్టిన ఊరని కాదు, కృష్ణుని స్నేహితుడు సుదాముడు (కుచేలుడు) పుట్టిన ఊరని..! అరదినం అక్కడ గడిపి సముద్ర తీరం మార్గంలో బస్సెక్కి ద్వారక చేరుకొన్నాను. ద్వారక ఇప్పుడైతే వైష్ణవ సంప్రదాయం వారికి పుణ్యస్థలం. అయితే నాకు కావలసింది యాదవుల ద్వారక. కృష్ణుడు కట్టాడని చెప్పే ద్వారక చిత్రం. కృష్ణుని చరమదశలో సముద్రం పొంగి ఆ నగరాన్ని మింగేసిందని భారత ఖిలభాగం హరివంశం చెప్పిన దాని గురించి కావాలి. నా అన్వేషణ కొనసాగిస్తూ హోటల్లో దిగి స్నానపానాదులయ్యాక మందిరానికి వెళ్లి స్థలచరిత్ర బాగా తెలిసిన వారెవరు అని విచారించాను.
నేనడిగిన నలుగురైదుగురు డా జీజే థాకర్ పేరు చెప్పి, వారింటి గుర్తులు చెప్పారు. నేరుగా వారివద్దకు వెళ్లాను. డా థాకర్ ఎనభై ఏళ్లు దాటిన విద్వాంసులు. వృత్తిపరంగా వైద్యులైనా ఆయుష్షునంతా ద్వారక చరిత్ర పరిశోధనలో గడిపినవారు. భారత హరివంశాలనేకాదు వైష్ణవ సంప్రదాయ గ్రంథాలన్నింటినీ సమూలంగా చదివి, కావలసిన చోట కంఠగతంగా శ్లోకాలు చెప్పి వ్యాఖ్యానం చెయ్యగలవారు. వారు లెక్కవేసి గుర్తించిన చోట భూమి అడుగులో పురాతన కట్టడం అవశేషాలు దొరికాయి. అదే కృష్ణుని అంతఃపురమని థాకర్ విశ్వాసం, వాదన. వారి వాదాన్ని సంశయించినా ఆ స్థలవివరాలు అంతబాగా తెలిసినవారు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారు ఎత్తయిన నాలుగో అంతస్తుపై కూర్చొని చూపుడువేలితో, ఊళ్లోని అన్ని దిక్కులను చూపిస్తూ, సాయంకాలందాకా మాట్లాడారు. భోజనాదికాల సదుపాయం చూశారు. తాను ద్వారకపై గుజరాతీలో రాసిన ఒక చిన్న పుస్తకం ఇచ్చారు. దాన్నక్కడే ఒకరిచేత చదివించుకొని, వివరాలు తెలుసుకొన్నాను.
గుజరాతీ చదవడం కాస్త ఇబ్బంది కానీ ఎవరైనా చదువుతూంటే అర్థం చేసుకోగలను. ఆ పుస్తకంలో వారు కృష్ణుని ద్వారక నక్షాను ఇచ్చారు. సాయంకాలం తోడుగా తీసుకొని ఊరంతా చూపిస్తూ, తాము మధ్యాహ్నం చెప్పిన దాన్నే మళ్లీ వివరించారు. యాదవులు మథుర నుంచి వలస వచ్చిన దారి రైవతక పర్వతం మొదలైన వాటిపై నేను చదివి అర్థం చేసికొన్న దాన్ని వారూ అంగీకరించారు.
రాత్రి ఒక్కడినే సముద్రతీరంలో పన్నెండు గంటల వరకు తిరిగి గదికి వెళ్లి పడుకొన్నాను. తెల్లవారి వెలుతురు రాకముందే లేచి ద్వారక లైట్ హౌస్‌కు వెళ్లాను. ఇటీవల లైట్ హౌస్ నుంచి దూకి చావడం మొదలయిందని ప్రభుత్వం వారు ప్రవేశాన్ని రద్దు చేశారు. నన్ను డా. థాకర్ పంపారని ఇంగ్లీషులో వాదించాక అనుమతించారు. ఓ మోస్తరు ఎత్తుగా ఉన్న దాన్ని ఎక్కి ద్వారక, దాని ఆవల కొండల సాలు, సముద్ర తీరాన్ని చూస్తూ చాలాసేపు అలాగే నిలబడ్డాక ఈ పర్యటన నిజమైన ఉద్దేశ్యం, ప్రయోజనాలు నెరవేరినట్లు స్ఫురించింది. ఆ ఎత్తు నుంచి చూస్తున్నప్పుడు నా మనస్సు పందొమ్మిది వందల డెబ్బయి అయిదు నుంచి సంపూర్ణంగా విముక్తి పొంది, యాదవుల కాలానికి వెళ్లిపోయింది. అప్పటి ఊరు, సముద్రం, జనజీవనం, చుట్టు పక్కల భౌగోళిక వివరాలు అన్నీ నా అనుభవంలోకి వచ్చాయి. సమకాలీన వస్తువును గురించి రాసే రచయిత వివరాల కోసం వెదుక్కోనక్కర్లేదు. అతనికి తెలియకనే అతని అనుభవం పేర్చుకొన్న వివరాలు, రచన అవసరానికి కావలసిన రూపంలో వెలికి చొచ్చుకొని వస్తాయి. చారిత్రక వస్తువు వివరాలు అతని అనుభవానికి అందకుండా కేవలం పరిశోధక బుద్ధికి మాత్రం గోచరం కావడం వల్ల రచనారూపంలోని ద్రవస్థితిలోకి రావు. అయితే నాకు ఇప్పుడు ద్వారక నా అనుభవమే అన్న భావం కలిగింది. ఒక్కో విషయంలో కాస్త అస్పష్టత ఉండొచ్చు. (సమకాలీన అనుభవ వివరాల్లో మాత్రం అన్నీ స్పష్టంగా ఉంటాయా?) అయితే భావనాత్మకంగా యాదవుల ద్వారకలో నేను ప్రవేశించాను. కావలసినప్పుడు ప్రవేశించగల శక్తి, దారుల జ్ఞానం లభించింది. హరివంశంలో చెప్పిన బలరామ, కృష్ణ, ఉగ్రసేనాది పాత్రలే కాకుండా ద్వారకలోని సామాన్య జనుల పరిచయమూ నేను ప్రవేశించిన భావ ప్రపంచంలో కలిగింది. దీంతో యాదవుల అధ్యాయాన్ని రాస్తున్నప్పుడు క్రతువు, అతని తల్లి, ఉగ్రసేనుని భార్య సఖి, ఆభీర, మధుర నుంచి వచ్చిన నందకుడు మొదలైన పాత్రలను సృష్టించగలిగాను. యయుధాన, సత్యకులను నాకు అవసరమైన రూపంలోకి తిప్పుకోగలిగాను. కొత్త పాత్రల, సన్నివేశాలను సృష్టించుకోగలిగే సామర్థ్యం కలిగింది. యాదవుల జగత్తు నా భావనానుభవం విడదీయలేని భాగంకావడం వల్లే, మరుసటిదినం ఓఖమండల్ (బాణాసురుని కుమార్తె ఉష ఉన్న ప్రాంతం) చుట్టి వచ్చి, ఆ మరుదినం రాజ్‌కోట్ బస్ ఎక్కాను. ఇది వెనుక నేను చూసిన పట్టణమే. కాని 20వ శతాబ్దిలోని ఈ పట్టణం మీద నాకు ఆసక్తి లేదు. అది నా కంటికి ఆనడమూ లేదు.
యాదవులు మథుర నుంచి వలస వచ్చిన మార్గం పట్ల భిన్నాభిప్రాయాలుండవచ్చు. కానీ, వారు ఆరావళి శ్రేణుల వెంబడి రావడాన్ని భౌగోళికంగా సంశయించే అవకాశం లేదు. ప్రాచీన భారతంలోని దారులే అనంతరం రాజమార్గ, వాణిజ్యమార్గాలై, బ్రిటిషువారి రైలు దారులయ్యాయనడానికి తగినన్ని ఆధారాలున్నాయి. ఇప్పుడెలానూ విరాటనగరం, మథురవెళ్లాలి. రైలుమార్గం వదలి, బస్సు మీద రాజస్థాన్‌లో, మునుపు చూసినప్పటికీ మళ్లీ, ఉదయపూర్, ఏకలింగజి, నాథాద్వార, ఆబు, అజయమేరు, జయపూర్ వెళ్లి చూశాను. అర్జునుడు సుభద్రతో కలిసి చేసిన రథ ప్రయాణం, యాదవులు వలస వచ్చిన వాతావరణం సాక్షాత్ అనుభవంలోకి వచ్చాయి.
ఓ పొద్దున్నే జయపూర్‌లో బస్సెక్కి, పదకొండున్నరకు విరాటనగరం చేరుకొన్నాను. మహాభారత కథను నిజమని ఒప్పుకొంటే అజ్ఞాతవాసం చేసిన విరాటనగరం అదే అనడానికి ఎటువంటి సందేహమూ లేదు. ఇప్పుడది చాలా వెనుక బడ్డ పెద్ద గ్రామం లేదా చిన్నపట్టణం. తాలూకా కేంద్రం.
దారి పక్కన గుడిసెలే హోటళ్లు. వాటిల్లో జుయ్యిమంటున్న సహస్రకోటి ఈగల్ని చూసి భయం కలిగింది. ఇదే ఊరిలో భీముడు చేసిన వంట ముసురు తిని ఇంత అసంఖ్యాకంగా పెరిగాయా అన్న అనుమానం వేసింది. ఆకలి చల్లార్చుకోవడానికి మరోదారిలేదు. ఒక హోటల్లో ఎక్కువ పైకమిచ్చి నా ఎదురుగ్గా కాచిన నీటితో తడిపి చేసిన మూడు చపాతీలను, వేడి పాలతో కలిపి తిన్నాను. వాటి మీద కూడా వాలి చచ్చే చారిత్రక సంప్రదాయమున్న ఈగలు.
ద్వారకలో ప్రజలు డాక్టర్ థాకర్ ని సూచించినట్లు. ఈ ఊళ్లో వారు ఆచార్య – దేవేంద్రజీ శర్మ పేరు చెప్పారు. దిగడానికి ఊళ్లో హోటలు లేదు. నేరుగా శర్మగారింటికే వెళ్లాను.
వారు భోజనం చేసి పొడవైన ఉయ్యాల బల్లమీద పడుకొని నిద్రిస్తున్నారు. లేపొద్దని పక్కకు కూర్చున్నాను. అయితే ఆయన రెండు నిముషాల్లోనే లేచికూర్చున్నారు. ఎవరో బయటివారు వచ్చారని నిద్రలోనే అనిపించి మెలకువ వచ్చిందట. ముప్ఫై అయిదేళ్ల వయసుంటుంది. భారతీయుల రంగయినా అలెగ్జాండర్ పాత్రకు సరిపోయేలాంటి చక్కటి మైకట్టు, వ్యాయామంతో సుశిక్షితమైన స్ఫురద్రూపం. ఎంతో గౌరవంగా హిందీలో మాట్లాడించారు. నా ఉద్దేశ్యం విని ‘పాండవులు వచ్చిన విరాటనగరం ఇదేనని ఎలాగంటారు?’ అని ప్రశ్నించారు.
‘నేపాల్‌లో ఒక విరాటనగరంముంది. అజ్ఞాతవాసం చేసింది మా ఊళ్లేనని అక్కడివాళ్లు చెబుతారు. అయితే గోగ్రహణం చేయడానికి హస్తినాపురం నుంచి అంతదూరం వెళ్లడం అసంభవం. విరాటరాజుకు చెందిన ఉపప్లావ్యాన్ని పాండవులు యుద్ధ సన్నాహాలకు కేంద్రంగా చేసుకొన్నారని భారతంలో ఉంది. నేపాల్ నుంచి యుద్ధ సన్నాహాలు చేసుకొన్నారన్నది నమ్మశక్యంగా లేదు.’
‘శభాష్’ అంటూ సంతోషంగా, తలుపు వద్ద ఉన్న సేవకుణ్ణి కేకేసి ‘చూశావా? దక్షిణ భారతం నుంచి వచ్చిన ఈ విద్వాంసులు కూడా మన ఊరే నిజమైన విరాటనగరమంటున్నారు. అర్థం చేసుకో మన ఊరి మహిమను..! (అంటూ నా వివరాలను అడిగారు. నా పేరు చెప్పాక) రెండు నిముషాలపాటు ఏదో జ్ఞాపకం చేసుకొని లోపలికి వెళ్లి ‘వంశ వృక్ష’ హిందీ అనువాదంతో తిరిగి వచ్చారు. చేతులు చూచి ఆలింగనం చేసుకొన్నారు. ఆ ఊళ్లో ఉన్న రెండు రోజులు రాజోపచారం. చివరిరోజు సార్వజనిక సన్మానం. ఆ ఊళ్లో ముఖ్యంగా చూడవలసింది భీముని గుహ, శ్మశానం, ఛోటాకురుక్షేత్ర (గోగ్రహణ యుద్ధం జరిగిన చోటు) బాణగంగ, శమీవృక్షం. శమి వృక్షం ఊరికి అయిదుమైళ్ల దూరంలో ఉంది. శర్మగారు ఊళ్లోని ప్రతి మూలనూ, రాళ్లనూ, బండలనూ పాండవ కథాసందర్భంతో జతపరచి వివరించారు. జనపదాల్లోని, ఐతిహ్యాలు పురసంస్కృతి అవగాహనకు ముఖ్య ఆధారాలు.
విరాట నగరమే కాదు అటు చుట్టు పక్కల అంతా కొండలే కొండలు. ఇలాంటి భూలక్షణాల మధ్య రథయుద్ధమైతే సాధ్యం కాదు. రథసంచారమే అసాధ్యం. గోగ్రహణం యుద్ధంలో కౌరవ ముఖ్యులందరూ రథాల్లో వచ్చారని మన కవులు వర్ణించారు. అర్జునుని యుద్ధ రథానికి ఉత్తరుడు సారథియైన విషయం సుప్రసిద్ధం. వ్యాస భారతంలో కూడా ఈ ఘట్టం చాలా స్వారస్యకరంగా వర్ణితం. ఒక సందర్భంలో ఉత్తరుడే అర్జునునికి ‘దారుకో వాసుదేవస్య యథా శక్రస్య మాతలిః..! తథా మాం విద్ధి సారథ్యే శిక్షితం నరపుంగవ’ అని చెబుతాడు. కొండలిప్పటివి కావు. ఇలాంటి చోట రథ సంచారం సాధ్యం కాదన్నది దీన్ని రాసిన కవికి తెలియదా? బహుశః అతను విరాట నగరాన్ని చూసి ఉండడు. చూసినా నరనారాయణ కల్పనకు లోనైన అతనికి, అర్జునుని యుద్ధమంటే రథం, ధ్వజం, శంఖాలు లేకుండా ఎలా సాధ్యం? కౌరవ మహారథులు కూడా చతురంగ బలాలతోనే వచ్చారంటాడు. మొత్తం మీద, విరాట నగర భూలక్షణాలు నాలో ఇలాంటి ప్రశ్నలను లేవదీశాయి.
ఛోటాకురుక్షేత్రం – గోగ్రహణ యుద్ధ స్థలం – దగ్గరనే భీముని గుహ అని పిలువబడే గుహ ఒకటుంది. విరాటనగరం తాలూకాలోని ప్రజలు ఇప్పటికీ భీముణ్ణి పూజిస్తారు. కీచకుడు దొరికిన ఆడవాళ్లను బలాత్కరించే వాడు. భీముడు అతన్ని చంపడంవల్ల, మిగిలిన మగవాళ్ల మర్యాద నిలిచింది. కొత్త దంపతులిప్పటికీ భీముని గుహకు వెళ్లి పూజలు చేస్తారు. పిల్లల తలవెంట్రుకలు తీయించడానికీ అక్కడికి వస్తారు. మేము వెళ్లినప్పుడు అక్కడికో జంట వచ్చింది. ఈ పూజలెందుకు? అని అడిగితే, మొదట ‘మా రివాజు’ అన్నాడు. తరువాత శర్మగారు గట్టిగా చెప్పాక ‘నా భార్యపై ఎవడైనా కన్నువేస్తే వాణ్ణి చంపి పాతరెయ్యడానికి భీమదేవుడు శక్తినిస్తాడు’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.
ఆ మాటలు విని నా మనస్సు మళ్లీ చరిత్ర, సాహిత్య సమస్యల పట్ల తిరిగింది. వేలాది సంవత్సరాల నుంచి ప్రజలు పూజిస్తున్న ఆ వ్యక్తి ఉదంతం నిజం కాకూడదా? పాశ్చాత్య చరిత్రకారులు అడిగే లిఖిత దాఖలాలే కావాలా చరిత్రను ధ్రువపరచడానికి? మనవారైతే మహాభారతాన్ని ఇతిహాసం అనే పిలిచారు. పురాణ శబ్దానికి మూలార్థం ‘వెనుక జరిగింది’ అన్నారు. అంతేకాక, ఏ ఆధారమూ లేకుండా ఒక స్థలం విూద ప్రజల నమ్మకం పెరగదు. ఇక్కడైతే భారతం లిఖిత కథకు ప్రజల నమ్మకమూ చేరి గట్టిపడింది. కీచకుణ్ణి చంపిన కథ నిజం కాకపోయినా ప్రజల మనస్సులో అది పాదుకొల్పిన భావం అబద్ధం కాదు. ఇక్కడ సాహిత్యకారునికి కావలసిన సత్యం ఏమిటి? భార్యను బలాత్కరించడానికి వచ్చిన వాని చంపి పాతరేయ్యాలన్న ప్రథమ ప్రవృత్తి మనందరికీ ఉండదా? పాశ్చాత్య పురుషులకు మాత్రం ఉండదా? ఈ సార్వకాలిక, సార్వత్రిక పురుషభావం లేదా, పురుషాహంకారం, పురుష యాజమాన్యం సాహిత్యానికి యథార్థ వస్తువు కాదా? కీచకుణ్ణి చంపితే మళ్లీ పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం దాపురిస్తుందనే భయ వివేకం ధర్మరాజును ఆపింది. అర్జునుడిదీ అదే ఆలోచన. భీమునికి ఈ వివేకం లేదని కాదు. అయినా అతనిలో పురుష ప్రవృత్తి పైచేయి అయింది. ఆ పురుష ప్రవృత్తి తోనే అతను ద్రౌపది ప్రేమకు నాథుడయ్యాడు. అర్జునుడూ అదే ప్రమాణంలో తన ప్రభుత్వాన్ని పోగొట్టుకొన్నాడు. ఈ సాహిత్య సన్నివేశమూ, పాత్రలూ ఇప్పటికీ నిజం. కొత్తకాలానికి చెందిన కొత్త సందర్భాన్ని సృష్టించి, ఇలాంటి వస్తువు మీద రాయొచ్చు అనిపించింది.
మునుపు సాళ్వపురమైన అల్వర్ పట్టణానికి విరాటనగర్ నుంచి ప్రయాణమై వెళ్లాను. సాల్వరాజు నగరాన్ని సౌభానగరమని కూడా పిలిచేవారు. అక్కడి ఐతిహ్యాల గురించి చెప్పే వారెవరూ దొరకలేదు. అక్కడ ప్రసిద్ధమైన కోట ఇటీవలిదే. అక్కణ్ణుంచి మథుర వెళ్లాను. పెద్దమసీదు కప్పివేసిన కృష్ణ జన్మస్థలాన్ని వెనుకవైపు సందుగుండా వెళ్లి చూడాలి. కంసుని ఆస్థాన స్థలాన్ని కూడా చూపుతారు. ఇప్పుడు మథుర ఒక యాత్రాస్థలమే. అక్కడి నుంచి ఢిల్లీ ఇంద్రప్రస్థానికి బయల్దేరాను
– ఎస్ఎల్ భైరప్ప
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.