
థానే- బోరివలి ట్విన్ రోడ్ టన్నెల్ ప్రాజెక్టు విషయంలో తమకు వ్యతిరేకంగా దాఖలైన పిల్‌ను కొట్టివేయాలంటూ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పును ముంబై హైకోర్టు రిజర్వ్ చేసింది.
సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సవాలు చేస్తూ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈఐఎల్ ఈ పిటీషన్‌ను దాఖలు చేసింది. బోరివలి- థానే మధ్య రూ.16,600.40 కోట్ల విలువైన ట్విన్ ట్యూబ్ రోడ్ టన్నెల్ ప్రాజెక్టుపై సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయించాలని రవిప్రకాష్ తరఫున గతంలో పిల్ దాఖలైంది. దానిని సవాల్ చేస్తూ మేఘా వేసిన పిటీషన్‌పై ముంబై హైకోర్టులో ఆసక్తికరంగా వాదనలు కొనసాగాయి. ఇరు పక్షాల ప్రముఖ న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, డారియస్ ఖంబాటా మేఘా తరఫున వాదిస్తూ రవి ప్రకాష్ పిల్ దాఖలు చేయడానికి చట్టపరమైన అర్హత లేదని అన్నారు. మేఘా తరఫు వాదనలను సమర్థిస్తూ ఆ పిల్‌పై విచారణ చేయడం సమర్థనీయం కాదని కేంద్ర ప్రభుత్వం, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ తమ వాదనను వినిపించాయి. రవిప్రకాష్ తరఫున వాదనలు కొనసాగాయి.
పిల్ ఎందుకు వేశారు..?
ముంబై నగరంలోని థాన్- బోరివలీ ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు రూ.16,600 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రారంభమైంది. దీని కోసం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి మేఘా ఇంజనీరింగ్ సంస్థ నకిలీ బ్యాంకు గ్యారెంటీలను సమర్పించిందంటూ పిల్ దాఖలయింది. నకిలీ బ్యాంకు గ్యారెంటీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ కొనసాగించాలని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రవి ప్రకాష్ ఈ పిల్‌ను దాఖలు చేయడం విశేషం.
ఎక్కడో కరేబియన్ దీవుల్లో వున్న యూరో ఎగ్జిమ్ బ్యాంకు నుంచి ఒక ప్రభుత్వ ప్రాజెక్టు కోసం మేఘా సంస్థ గ్యారెంటీలను ఇవ్వడం, వాటిని ముంబై మెట్రోపాలిటిన్ అథారిటీ అధికారులు అనుమతించడాన్ని పిటీషనర్ తప్పుపట్టారు. దీనిలో ఎంఎంఆర్డీఏ అధికారులు చేతులు కలిపారని ఆరోపించారు. మన దేశంలోని ఆర్బీఐ అనుమతి పొందిన ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకు నుంచే గ్యారెంటీలు పొందాలన్న నిబంధనలను తుంగలో తొక్కారని, మేఘా నుంచి ఇలాంటి గ్యారెంటీలను స్వీకరించడం ఆమోదయోగ్యం కాదన్నది పిటీషనర్ వాదన.
పోటాపోటీగా వాదనలు..
ఈ క్రమంలో రవిప్రకాష్ దాఖలు చేసిన పిల్‌ను మేఘా సంస్థ సవాల్ చేసింది. ఈ పిటిషన్ వెనుక తమ సంస్థతో వున్న వ్యక్తిగత వివాదాలు కారణమని మేఘా తరఫు న్యాయవాదులు వాదించారు. 2025 ఫిబ్రవరి 12, 13 తేదీలలో రవిప్రకాష్ తన మీడియా సంస్థ, సోషల్ మీడియా పోస్టులతో పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రసారం చేశారని ఆరోపించారు. ఆ ట్వీట్ ద్వారా న్యాయ వ్యవస్థనూ విమర్శించారని వాదించారు. ఎంఈఐఎల్ తరఫున సీనియర్ న్యాయవాది డారియస్ ఖంబాటా వాదనలు వినిపించగా రవిప్రకాష్ తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ వాదించారు.
వ్యక్తిగత వివాదాల కోసం కాకుండా మంచి విశ్వాసంతో పిల్లు దాఖలు చేయాలని ఖంబాటా నొక్కిచెప్పారు. దుర్వినియోగం నిజమైన పిల్లను బలహీనపరిచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి వాటిని అడ్డుకోక పోతే అసలైన పిల్ల విషయంలో ఆలోచించాల్సి వస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఈ కేసు చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేస్తోందని వాదించారు.
‘బంతి ముంబై హైకోర్టులో ఉంది, కానీ మనల్ని మనం మోసం చేసుకోకూడదు, ఇది న్యాయమైన మ్యాచ్ కాదు. మాట్లాడటానికి ధైర్యం చేసే వారిని తొక్కేటప్పుడు ధనవంతుల కోసం వంగి, మోకరిల్లి, సాష్టాంగ నమస్కారం చేసే వ్యవస్థను మనం వ్యతిరేకిస్తున్నాము. ధన్యవాదాలు’ అంటూ జర్నలిస్ట్ రవిప్రకాష్ ట్వీట్ చేయడం న్యాయ వ్యవస్థను అవమానించడమే అవుతుందన్నారు. ఈ కేసుకు మీడియా కవరేజ్ ఇచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని, రవిప్రకాష్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిఐఎల్‌ను దుర్వినియోగం చేశారని ఖంబాట అన్నారు. తన కంపెనీ ట్రేడ్‌మార్క్‌లను అమ్మడం, డబ్బును స్వాహా చేయడం వంటివాటిని, తనపై దాఖలైన కేసులను జర్నలిస్ట్ దాచడానికి ప్రయత్నించారని కూడా ఆయన వాదించారు.
నిబంధనల ప్రకారం, పిఐఎల్ దాఖలు చేసే ముందు పార్టీలు తమపై ఉన్న అన్ని వ్యాజ్యాలను బహిర్గతం చేయాలని ఖంబాట అన్నారు. పిల్ అనేది ప్రచారం కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడరాదన్న ఖంబాట వాదనను, మేఘా తరుఫునే వాదిస్తున్న మరో ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీ కూడా సమర్థించారు. మహారాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ బీరేంద్ర సరాఫ్ ప్రభుత్వ వాదన వినిపించారు. పిల్‌కు అర్హత లేదన్న వాదనను సమర్థించారు. పిటీషనర్ న్యాయవ్యవస్థపై తక్కువ విశ్వాసం చూపించడమే కాకుండా వ్యాజ్యంలో ఉన్న పార్టీల గురించి కూడా మాట్లాడారని, ఇది నేరపూరిత ధిక్కారానికి సమానమని వాదించారు. అటువంటి పిఐఎల్‌లను అనుమతించడం వారి దుర్వినియోగాన్ని ప్రోత్సహించడమే అవుతుందన్నారు.
ఎంఎంఆర్డీఏ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఎంఈఐఎల్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది డారియస్ ఖంబాటా వాదన వైపే నిలిచారు.
రవిప్రకాష్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, తన క్లయింట్ ఎక్స్ పోస్ట్ అనుచితమైందని అంగీకరించారు. అలాగని దాని ఆధారంగా మాత్రమే పిటిషన్‌ను కొట్టివేయవద్దని కోర్టును కోరారు. ‘కోర్టు పిటిషనర్‌ను అనుచితంగా భావిస్తే, అతన్ని పార్టీగా తొలగించి, అమికస్ను నియమించండి, కానీ ఈ సమస్యను చాప కిందకు నెట్టవద్దు’అంటూ ప్రశాంత్ భూషన్ సమస్యను హైలెట్ చేశారు.
ప్రతివాదుల వాదనలపై భూషణ్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ, ‘కోర్టు ఈ విషయాన్ని విచారించకుండా నిరోధించడానికి ఎంత దూరం వెళ్ళగలరో ఆశ్చర్యకరంగా ఉంది. సొలిసిటర్ జనరల్‌తో పాటు నలుగురు సీనియర్ న్యాయవాదులు కోర్టు పిటిషన్‌ను అర్హతల ఆధారంగా విచారించకుండా నిరోధించడానికి కలిసి వచ్చారన్నారు.
ఎవరైనా తప్పులను బహిర్గతం చేసినప్పుడు, వారు తమ గొంతులను పెంచకుండా నిరోధించడానికి పరువు నష్టం దావాలు వేయడం సహజమని, అందులో భాగంగా తన క్లయింట్ రవిప్రకాష్పైనా పరువు నష్టం దావా వేశారని దానిని ఈ కేసు మెరిట్స్‌తో ముడి పెట్ట వద్దన్నారు.
పిల్ టెండర్ ప్రక్రియ గురించి చట్టబద్ధమైన ఆందోళనలను లేవనెత్తిందని, ఎంఈఐఎల్కి అనవసరమైన సహాయాలు జరిగాయా లేదాని ప్రశ్నించారని వాదించారు. రాజకీయ పార్టీల ఎన్నికల బాండ్ల కొనుగోళ్లకు, మేఘా సంస్థకు వున్న సంబంధాలను కూడా ప్రశాంత్ భూషన్ హైలైట్ చేశారు.
మేఘా అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఒక ప్రభుత్వం ఉంది, రేపు మరొక ప్రభుత్వం ఉండవచ్చు. ఈ కంపెనీకి ప్రతిఫలం వచ్చిందా లేదా అన్నదే మా ప్రశ్న అంటూ భూషణ్ తన వాదన వినిపించారు. రవిప్రకాష్ తనపై దాఖలైన కేసులను వెల్లడించకుండా నిబంధనలను ఉల్లంఘించారనే ప్రతివాదుల వాదనను కూడా ప్రశాంత్ భూషణ్ తోసిపుచ్చారు. ప్రస్తుత పిటిషన్‌తో సంబంధం లేకపోతే గత కేసులను పిటిషనర్ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ఇరు పక్షాల వాదనల తర్వాత ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే న్యాయమూర్తి భారతి డాంగ్రేలతో కూడిన ధర్మాసనం ఎంఈఐఎల్ విజ్ఞప్తిపై తన తీర్పును రిజర్వ్ చేసింది.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.