
భారతదేశ ఎన్నికల చిత్ర పటాన్ని మార్చడానికి బీజేపీ అంబుల పొదలో ఉన్నది జనాభా మాత్రమే కాదని గ్రహిస్తే – నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకించేవాళ్లు బాగా పని చేయగలుగుతారు.
నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ మీద ఉన్న ప్రతిష్టంభన 2026లో తొలగిపోయాక జరగబోయేదాని గురించి దక్షిణాది రాష్ట్రాలు పడుతున్న భయాలు కొట్టేసేవి కావు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను బహిరంగంగా, గట్టిగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ‘ఇది తన్నుకొస్తున్న ప్రమాదమని’ అని హెచ్చరించడం సబబే.
జనాభా ప్రాతిపాదికన జరిగే నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ ఉత్తరాది రాష్ట్రాలకు అనుకూలంగా మారి ఇప్పుడున్న సమతూకాన్ని మార్చబోతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బహుళ రాజకీయ పార్టీల ఉనికి కూడా ఆందోళన కలిగించే విధంగా తగ్గిపోయింది. కానీ స్టాలిన్ ఈ ఆందోళనలను వ్యక్తం చేసేటపుడు ప్రస్తావించిన రెండు విషయాలు అర్ధవంతం గా లేక పోవడమె కాక అపార్థానికి తావిచ్చేలా కూడా ఉన్నాయి.
ఒకటి తమిళనాడు మహిళలను పిల్లలను కనే యంత్రాలుగా మారమని ఆయన ఇచ్చిన అసహ్యకరమైన పిలుపు. రెండోది గతంలో జనాభా నియంత్రణను సరిగ్గా పాటించిన రాష్ట్రాల మీద కక్ష తీర్చుకునే మార్గంగా మాత్రమే బీజేపీ పునర్వ్యవస్థీకరణ ఆయుధాన్ని అర్థం చేసుకోవటం. ఎన్నికల నియోజక వర్గాల సరిహద్దులు మార్చడానికి ఇప్పటివరకూ అమలులో ఉన్న జనాభా ప్రాతిపదికను మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదు అనే వాదన ఒక విషయాన్ని ఏమరుస్తుంది. ఇటువంటి ఎదురుదాడులతో పునర్వ్యవస్థీకరణ ద్వారా బీజేపీ అసలు ఏమీ చేయబోతుంది అనే విషయం మరుగున పడిపోతుంది.
జనాభాను ప్రధాన ప్రామాణికంగా తీసుకోవటం, లేక తీసుకోకపోవటంతో సంబంధం లేకుండా ఒక రాజకీయ ప్రేరణతో జరిగే జెర్రీ మాండరింగ్ (ఒక పార్టీ ప్రయోజం కోసం ఎన్నికల జిల్లాల సరిహద్దులు మార్చే విధానం -అను) ను అర్థం చేసుకోవటానికి స్టాలిన్ ఎక్కువ కష్టపడనవసరం లేదు. హిందూ మెజారిటీ జమ్మూ ప్రాంతానికి ఎన్నికల ప్రయోజం కలిగించటానికి జనాభా తర్కాన్ని వదిలేసిన జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సంగతి మన ముందు వుండనే వుంది.
2011 జనాభా లెక్కల ప్రకారం ఏర్పాటు అయిన ‘2022 జమ్మూకశ్మీర్ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ’ తుది ఆదేశాల ప్రకారం జమ్మూ ప్రాంతానికి 43 అసెంబ్లీ నియోజక వర్గాలు, కశ్మీర్ కు 47 నియోజక వర్గాలు ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు అయిన 7 నియోజక వర్గాలను భౌగోళికంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా, రాజకీయంగా విభిన్నంగా వుండే ఈ రెండు ప్రాంతాల మధ్య పంచటం లో మౌలిక సమానత్వాన్ని కూడా పాటించలేదు. ఏడులో ఆరు నియోజక వర్గాలను హిందూ మెజారిటీగా ఉన్న జమ్మూకు కేటాయించారు. ముస్లిం మెజారిటీగా ఉన్న కశ్మీర్ జనాభా కంటే జమ్మూ జనాభా తక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూ డివిజన్ జనాభా 53.5 లక్షలు కాగా, కశ్మీర్ జనాభా 68.88 లక్షలు. గత దశాబ్దంగా రెండు ప్రాంతాలలో జనాభా పెరుగుదల ఒకేలాగా వుంది. దేశ సగటు పెరుగుదల కంటే చాలా తక్కువగా వుంది. నియోజక వర్గాల
సరిహద్దులను పునర్నిర్మించటానికి ప్రాథమిక పునాదైన జనాభా ప్రాతిపదికను తప్పు పద్ధతిలో పరిగణనలోకి తీసుకొని జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇది దక్షిణాది రాష్ట్రాల భయాలకు భిన్నమైంది. అది కూడా పెద్ద ఎత్తున లోపభూయిష్టంగా జరిగింది. నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం భౌగోళిక సామీప్యత, భౌతిక లక్షణాలు, పరిపాలక ప్రాంతాల సరిహద్దులు, రవాణా సౌకర్యాలు, ప్రజల సౌలభ్యం -ఇవన్నీ రెండో ప్రాతిపదికగా వుంటాయి.
జమ్మూకశ్మీర్ ఎన్నికల చిత్రపటాన్ని పునర్ వవస్తీకరిస్తూ జనాభా కంటే -వైశాల్యం మీదా, సరిహద్దు ప్రాంతాల వంటి ప్రాతిపదికల మీద పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎక్కువ దృష్టి పెట్టింది. ముస్లిం మెజారిటీ నియోజక వర్గాలను పెద్దవి చేసి, హిందూ మెజారిటీ నియోజక వర్గాల సంఖ్యను పెంచి -ఈ సూత్రాలను కూడా తనకు నచ్చినట్లు అమలు చేసింది. విచిత్రమేమిటంటే -మారుమూల వెలివేతకు గురి అయి, మిలటరైజేషన్ పాలిట పడి, లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) అంతటా వ్యాపించి ఉన్న నియోజవర్గాలను పట్టించుకోలేదు కానీ, ఈ సూత్రాలను అంతర్జాతీయ సరిహద్దుకు (International Boarder) దగ్గరలో ఉన్న నియోజక వర్గాలకు మాత్రం ఏరి కోరి అమలు చేశారు. అంతర్జాతీయ సరిహద్దు రేఖకు దగ్గరలో ఉన్న నియోజక వర్గాలు హిందూ మెజారిటీ ఉన్నవి కావడం, LoC కి దగ్గరలో ఉన్న నియోజక వర్గాలు ముస్లిం మెజారిటీ ఉన్నవి కావటం యాదృచ్ఛికం కాదు.
జమ్మూకశ్మీర్ నియోజక వర్గాల్లో చాలావాటిని సూక్ష్మంగా పరిశీలిస్తే -ప్రాంతాలను విచ్చలవిడిగా ముక్కలు చేయటం, రవాణా సౌకర్యం లేని నియోజక వర్గాలను కలపటం వంటి చర్యలతో హిందూ ప్రాంతాల ఏకీకరణ పథకం చెప్పకనే అమలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. పార్లమెంటరీ నియోజక వర్గాల సంఖ్య అలాగే వుంచి, పునర్వ్యవస్థీకరణ కమిషన్ తయారు చేసిన ముక్కల చెక్కల అసెంబ్లీ నియోజక వర్గాల సరిహద్దులు అంతటా ఒకేలాంటి నమూనాకు జండా ఊపాయి.
పునర్వ్యవస్థీకరణకు ముందు కశ్మీర్ కు మూడు పార్లమెంటరీ నియోజక వర్గాలు వుండేవి. బారాముల్లా, శ్రీనగర్, అనంతనాగ్. జమ్మూకు జమ్మూ-పూంచ్, ఉదాంపూర్ అనే రెండు పార్లమెంటరీ నియోజక వర్గాలు ఉండేవి. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అనంతనాగ్ ను చీలికలు చేసి, ఒకదాన్ని శ్రీనగర్ కు కలిపి, ఇంకోదాన్ని జమ్మూ ప్రాంతపు రాజౌరి-పూంచ్ లకు కలిపి -అనంతనాగ్ నియోజక వర్గ ముస్లిం ప్రాతినిధ్యాన్ని 98% నుండి 84%నికి తగ్గించారు.
అనంతనాగ్-రాజౌరి పార్లమెంటరీ నియోజక వర్గాన్ని తయారు చేయటంలోని అసంబద్ధత
భౌతికంగా, సాంస్కృతికంగా విడివడి వుండే ఆ రెండు ప్రాంతాలను తర్కరహితంగా ఒక దగ్గరకు తీసురావటంలోనే వుంది. అనంత్ నాగ్, పూంచ్ లు ఒక పర్వత రహదారి ద్వారా విడివడి వున్నాయి. ఏడాదికి ఐదు నెలలు శీతాకాలంలో ఈ రెండు ప్రాంతాల మధ్య సంబంధాలు తెగిపోతాయి. అంతేకాకుండా అనంత్ నాగ్ నియోజక వర్గంలో భాగంగా ఉన్న షోపియాన్ ను ఈ నియోజకవర్గం పరిధి నుండి తొలగించారు. ఈ రెండు ప్రాంతాలను కలిపే రోడ్డు షోపియాన్ పట్టణ మధ్యభాగలోంచి వెళుతూ ఉన్నా కూడా ఈ పని చేశారు. అంటే ఇక్కడ నియోజకవర్గాల పునర్వవస్థీకరణ వెనక కేవలం జనగణన ఒక్కటే ప్రామాణికంగా లేదు. జనగణనకు మించిన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని అనంతనాగ్ ఉదంతం వివరిస్తోంది.
కశ్మీర్ లో ఈ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ పనంతా భౌగోళిక అందుబాటు, ప్రజల అవసరాల ప్రాతిపదికన పనిచేసే జిల్లాలను తయారు చేయటానికి కాకుండా -కశ్మీర్ సాంస్కృతిక, రాజకీయ పొందికను విడగొట్టే ఉద్దేశపూర్వక ప్రయత్నమని అందరూ అంటున్నారు. నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ బీజేపీకి రబ్బర్ స్టాంప్ అని జమ్మూలో కూడా అనేక ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అలాంటి ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేకపోయినా తన గత 25 ఎమ్మెల్యేల స్థాయి నుండి 29 ఎమ్మెల్యేలకు ఎగబాకి -బీజేపీ ఈ ఎన్నికల్లో తన ప్రయత్న ఫలితాలను బహుమతిగా పొందింది.
జమ్మూకశ్మీర్ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రారంభానికి చాలా ముందే షరతులను నిర్ణయించారు. 2002 పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, 2019 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 60వ సెక్షన్ ప్రకారం -జమ్మూకశ్మీర్ లోని పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజక వర్గాలను పునర్బుభజించి వాటి సంఖ్యను పెంచే పనిని కమిషన్ కు ఒప్పగించారు. ఇదంతా ముందస్తుగా నిర్ణయించినట్లుగానే జరిగింది. ‘జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతపు అసెంబ్లీలో సీట్లు 107 నుండి 114కు పెరుగుతాయి’ అనే నిర్ణయం ముందే జరిగింది. ఈ 114లో 24 సీట్లు పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రజలకోసం అట్టి పెట్టారు.
జమ్మూకశ్మీర్ లాగానే, పార్లమెంటు భవనం సైజును కూడా ముందే లెక్కలు వేసి నిర్ణయించినట్లున్నారు. రాజకీయ చదరంగపు పావులను వాటి వాటి స్థానాల్లో అట్టే పెట్టారు. రెండు ఏళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేసిన నూతన పార్లమెంటు భవనంలో ఎన్నికైన సభ్యులు కూర్చోవటానికి 888 సీట్లు వున్నాయి. ఈ సంఖ్య ఇప్పుడున్న 543ను మించి పోయింది. దూరదృష్టితో చేసిన ఈ భవన నిర్మాణం ఇప్పుడు ప్రతిపాదిస్తున్న నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ కారణంగానే. ఏ మాత్రం స్ఫూర్తినివ్వని ఆ భవనం ఒక కళారహిత భూత గృహం. అప్రస్వామిక విస్తరణకు నిలయం. ఆ భవనం అందవిహీనంగా వుండటం యాదృచ్ఛికం కాదు. అది సమస్యాత్మక ప్రయోజనాన్ని సులభతరం చేస్తుంది.
ఆ భవన ప్రయోజం బీజేపీ సులభంగా చొచ్చుకుని పోలేని దక్షిణాది భారతదేశాన్ని మరుగుజ్జుని చేయటం ఒక్కటే కాదు. ఈ రాష్ట్రాల్లో జనాభా సంఖ్యలు బిజెపి చేతిలో ఉన్న సులభ సాధనమే. కానీ పార్లమెంటులో బీజేపీ కి ఉన్న అదనపు బీజేపీ ప్రతినిధులతో, అదనపు సీట్లను పెంపొందించుకునే కోరికున్న బీజేపీ అంబుల పొదలో ఒక్క ఆయుధం మాత్రమే వుండదు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ అనుభవం బాగా తెలియచేసింది.
దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే ఈ సెగ తగలబోవటం లేదు. ఉత్తరాది నియోజకవర్గాలు కూడా ఈ పరిణామాల వలన ఇబ్బంది పడబోతున్నాయి. జమ్మూకశ్మీర్ ప్రయోగం విశదపరిచినట్లు ప్రతిపక్ష పార్టీల ఎన్నిక అదృష్టాల మీద నిర్ణయాత్మక ప్రభావం పడబోతోంది.
దేశవ్యాప్తంగా ఇంకా పునర్వ్యవస్థీకరణ ప్రతిష్టంభన తొలగక ముందే జరిగిన జమ్మూకశ్మీర్ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో ప్రతిపక్షాలు ప్రదర్శించిన మౌనం ఆ రాష్ట్రాన్ని ఏకాకిని చేసింది. తర్కరహితంగా చేసిన జెర్రీ మాండరింగ్, ఓటింగ్ హక్కు ఉన్న నామినేటెడ్ సభ్యులను ప్రవేశపెట్టటం లాంటివి -వాళ్ల కుట్రలుగా, తప్పుడు అడుగులుగా పరిగణించవచ్చు. ప్రతిపక్షాలు అనైకమత్యంతో అదే తప్పును మళ్లీ చేయకూడదు.
ఐక్య వ్యూహం కోసం కొన్ని రాజకీయ పార్టీల దగ్గరకు మాత్రమే చేరిన స్టాలిన్ -ఉత్తర దక్షిణ విభజన నుండి వైదొలిగి, దేశవ్యాప్త పొందిక కోసం విశాలమైన సవావలు విసరాలి. జనాభా విషయం మాత్రమే కాదు, పాలమెంటు విస్తరణ కోసం జరిగే ఎలాంటి పునర్వ్యవస్థీకరణ పద్ధతి అయినా తర్కబద్దంగా, న్యాయంగా, పారదర్శకంగా, అందరూ పాల్గొనే విధంగా వుండాలి. ఏ రాష్ట్రపు బలాన్ని కూడా తగ్గించటం లేదని హోమ్ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చినా -బీజేపీ నుండి ఆ హామీ నెరవేరుస్తారని ఆశించటం ఎక్కువే అవుతుంది. జమ్ముకశ్మీర్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను లోతుగా అధ్యయనం చేస్తే ఆయన వాగ్దానాలు ఎందుకు నమ్మకాన్ని కోల్పోయాయో తెలుస్తుంది.
ఈ పనంతా న్యాయంగా జరపలేమనుకొంటే, దీన్ని ఇంకో దశాబ్దం వరకు జరపకుండా ఆపవచ్చు. ప్రజాస్వామ్యాన్ని బలిష్టం చేయటం కేవలం సంఖ్యల మీద ఆధారపడదు.
అనూరాధా బాసిన్
అనువాదం: రమాసుందరి
అనురాధ బాసిన్ కశ్మీర్ టైమ్స్ మేనేజింగ్ ఎడిటర్. ‘ఏ డిస్మాంటిల్డ్ స్టేట్: ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీర్ ఆఫ్టర్ 370’ పుస్తక రచయిత్రి.
ఈ వ్యాసం మొదట Newslaundry.com లో ప్రచురితం అయింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.