
ప్రజారాజ్యం పార్టీ 2008లో ఆవిర్భవించి, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయానికి కారణమై 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో విలీనమై పూర్తిగా అంతరించిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో కోస్తాంధ్రలోని కాపు సామాజిక వర్గంలోని అసంతృప్తిని ఆధారంగా చేసుకుని 2014 ఎన్నికల నాటికి జనసేన పుట్టుకొచ్చింది. అయితే, ఈ ఎన్నికల నాటికి జనసేనకు తనపై తనకు నమ్మకం లేకపోవడం వల్ల తెలుగుదేశం, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చింది.
2014 ఎన్నికలలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కాపుల ఓట్లను పెద్ద ఎత్తున పొందగలిగింది. కానీ 2019 ఎన్నికలలో పూర్తిగా వైఫల్యం చెందింది. అయితే, 2024 నాటికి తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమిలో భాగంగా 21 శాసనసభ 2 లోక్‌సభ స్థానాలల్లో ముఖ్యంగా కోస్తాంధ్రలోని కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాలలో గెలుపొందింది.
నాగబాబు ‘ఖర్మ’ సిద్ధాంతం..
ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి పదవితో పాటు మరో రెండు మంత్రి పదవులను పొందడంతో పాటు, జనసేనలో పని చేసిన వారికి కొంతమంది ‘కుల సంఘాల కార్పోరేషన్’ ఛైర్మన్ పదవులను ఇప్పించి 2025 మార్చి 14న పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. ప్రాథమికంగా పార్టీ ప్లీనరి అన్నారు చివరకు సగం దినం సమావేశంగా ముగిసింది. ఒక వేళ ప్లీనరి జరిగినట్లైతే రాష్ట్ర, దేశ రాజకీయాలపై ఆ పార్టీ లోతుగా చర్చించి తన తీర్మానాలను ఆమోదించవలసి ఉంటుంది. అటువంటి సాంప్రదాయానికి స్వస్తి చెప్పి కేవలం ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఉపన్యాసాలకు ఆవిర్భావ దినోత్సవం పరిమితమైంది. ప్రజాప్రతినిధులు తమ ప్రసంగాలలో అధినాయకుడుని పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు తమ విధేయతను ప్రకటించారు. ఇటువంటి విధేయతను ప్రకటించడం ప్రతిపార్టీలో జరిగే తంతే ఇందులో కొత్తదనం ఏమిలేదు. అయితే నాగబాబు ‘ఖర్మ’ సిద్ధాంతం కొంత విమర్శలకు దారి తీసింది.
కొత్తదనం లేని పార్టీ అధినేత ప్రసంగం..
ఇక పార్టీ అధ్యక్షుడు చేసిన సుదీర్ఘ ప్రసంగంలో కొత్తదనం ఏమిలేదు. పవన్‌కళ్యాణ్ గతంలో అనేకసార్లు ఏదో ఒక సందర్భంలో చెప్పిన మాటలనే తిరిగి చెప్పారు. ఇందులోనే పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ఒక స్పష్టత రాకపోగా మరింత అస్పష్టతను సృష్టించింది. తన ప్రసంగంలో ప్రధానంగా తెలంగాణ కవి దాశరథి నుంచి గుంటూరు శేషేంద్ర శర్మ, అలాగే గద్దరు నుంచి సనాతన ధర్మం వరకు తన వ్యక్తిగత జీవితాన్ని జోడిస్తూ మాట్లాడారేగాని తన పార్టీ విస్తరణ, వివిధ సామాజిక వర్గాల పట్ల, ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతున్న కులగణన, డీలిమిటేషన్ వంటి అంశాలను దాటవేయడం ద్వారా ఆ పార్టీ కేవలం వ్యక్తి, కుటుంబం, పదవులపైన ఆసక్తిని తెలియజేస్తుంది. కాని సామాజిక రాజకీయ మార్పుకు ఏం చేయబోతుంది, అదే విధంగా తొమ్మిది నెలల పాటు అధికారంలో ఉండి చేసిందేమిటి అనే విషయాలను చెప్పలేదు.
కరువును విస్మరించి జల్సా సినిమా జోకులు..
ఫిబ్రవరి నెల నుంచే రాయలసీమలో కరువు విలయతాండవం చేస్తున్నప్పటికి, బడ్జేట్ సమావేశాలలో ఎక్కడ కూడా కరువు గురించి మాట్లాడకపోగా జల్సా సినిమాలోని జోకులను చెప్పుకున్నారు. అలానే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కూడ రాయలసీమ కరువు గురించి ఒక్కమాట కూడా మాట్లాడకపోగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సంపన్న కోస్తాంధ్ర ఉద్యానవనాలకు వర్తింప చేశారు. ఈ పథకాన్ని కరువు నివారణకు ఉపయోగించవలసి ఉన్నప్పటికి, వలసలను నివారించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఫలితంగా ముసలి వాళ్లను ఇళ్ల దగ్గర వదిలేసి, పిల్లాపాపలతో బ్రతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని కోస్తాంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రవంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
వాస్తవానికి కృష్ణ, గుంటూరు వంటి జిల్లాలల్లో పత్తి, మిరప చేనులలో పని చేస్తున్న వ్యవసాయ కార్మికులు పశ్చిమ కర్నూలు జిల్లా నుంచి వలస వచ్చేవారే. అంటే వలస కార్మికులు రాయల సీమ నుంచి వచ్చి కోస్తాంధ్ర వ్యవసాయ భూముల్లో పనిచేయడం వల్ల సంపన్న వర్గాలు ప్రయోజనం పొందుతున్నవాయి. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా వెనుకడిన ప్రాంతాల అభివృద్ధికి తన దగ్గర ఉన్న కార్యాచరణ ప్రణాళిక ఏంటి అనేది ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దీంతో రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు పెరిగి అవి ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో అనేది వేచిచూడాలి.
కులగణనపై మౌనం అప్రజాస్వామికం..
ప్రస్తుతం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న మరొక విషయం ‘కులగణన’. ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న తెలంగాణ, కర్నాటక అదే విధంగా బీహార్ రాష్ట్రాలలో ప్రభుత్వాలు కులగణన జరిపించాయి. తమిళనాడు రాష్ట్రం ఇప్పటికే 69% రిజర్వేషన్లు కల్పిస్తుంది. బిసి జాబితాలో తమను చేర్చమని అడుగుతున్న సామాజిక వర్గ పునాదితో ఏర్పడిన జనసేన కులగణన గురించి ఆవిర్భావసభలో ప్రస్తావించకపోవడం వల్ల రాష్ట్రంలోని వెనుకబడిన కులాల ప్రజలు నిజంగా ఆ పార్టీ అనుకూలంగా ఉందా లేక వ్యతిరేకంగా ఉందా? అని అనుమానం వస్తుంది.
2024 ఎన్నికలల్లో కూటమి ప్రభుత్వం వెనుకబడిన కులాలు ఓటు వేయకుండ అధికారంలోకి రాలేదనేది వాస్తవం. అటువంటప్పుడు జనసేన కేవలం కోస్తాంధ్ర కాపు సామాజిక వర్గం, దళితులలోని ఒక ఉపకులం వల్ల మాత్రమే అధికారంలోకి రాలేదనే విషయాన్ని గ్రహించాలి. అంతేకాకుండా కులగణనపై తన వైఖరి ఏంటో ప్రకటించకుండ దాటవేయడం అప్రజాస్వామికం, ఎంతో కీలకమైన అంశాన్ని దూరంగా ఉంచి జనసేన క్రింది కులాలకు ఏ సామాజిక న్యాయం చేయబోతుందనేది ప్రశ్నగా మిగిలింది.
కీలకమైన అంశాన్ని పక్కకు పెట్టిన జనసేన..
దేశవ్యాప్తంగా, మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశం ‘డీలిమిటేషన్.’ ఈ అంశం గురించి కూడా జనసేన పక్కన పెట్టింది. 1970వ దశకం నుంచి 50 ఏళ్లు వాయిదా పడుతూ వస్తున్న నియోజక వర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం వివాదస్పదమవుతుంది. దక్షిణ భారతదేశంలో సాధించిన సామాజిక, మానవాభివృద్ధి వల్ల జనాభా స్థిరీకరించబడింది. అదే ఉత్తరభారతదేశంలో జనాభా విపరితంగా పెరిగిపోయింది. పెరిగిన జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి దక్షిణ భారతదేశానికి పార్లమెంట్ ప్రాతినిధ్యంలో అన్యాయం జరుగుతుందని తమిళనాడు, కేంద్రం నుంచి రావలసిన నిధులు తగ్గుతాయని కేరళ 2024 ఎన్నికల ముందు నుంచి మాట్లాడుతున్నాయి. ప్రస్తుతం ఇది జాతియ సమస్య దీన్ని దాటవేయడమంటే ఒక రాజ్యాంగబద్ధంగా జరగవలసిన అంశాన్ని 50 ఏళ్లు కేంద్రంలో పాలకులు విస్మరించినట్లుగానే, రాజకీయ పార్టీ కూడ కాస్త పక్కన పెట్టడం వల్ల ఎంత వరకు జనసేనకు ప్రజల నుంచి మద్దుతు లభిస్తుంది అనేది మరొక ప్రశ్న.
జనసేనకు ఏడు మూల సూత్రాలు అని చెప్పింది. అయితే, ఇందులో వికేంద్రికృత ప్రజాస్వామ్య పాలన లేకపోవడం వల్ల జనసేన ఏ విధంగా ప్రజలను అధికారంలో భాగస్వామ్యం చేస్తుంది? అధికార వికేంద్రికరణ అంటే కేవలం ఒకరోజు గ్రామ సభను అంతర్జాతీయ సంస్థ ఇచ్చే సర్టిఫికేట్ల కోసం నిర్వహించడం కాదు కదా!
ఇందులో లేవనెత్తిన విషయాలన్ని ఆ పార్టీ రాజకీయ ఆలోచన, సైద్ధాంతిక భూమికకు సంబంధించిన అంశాలు, ఇటువంటి విషయాలు ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తుకు సంబంధించినవి, వీటిని విస్మరించి రాజకీయాలు ఎలా చేస్తారు. విశాల ప్రజాబాహుళ్యానికి సంబంధించిన విషయాలను విస్మరిస్తున్నారంటే అది ‘‘సైద్ధాంతిక పేదరికమే’’.
ప్రొఫెసర్.ఇ.వెంకటేశు
రాజనీతి శాస్త్ర విభాగం
హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.