
మానవ జీవితానికి ముందే నిర్ణయించిన అర్థం ఏదీ లేదని కాదు, దానికి ఒక అర్థాన్ని తనే కల్పించుకోవాలని జీన్ పాల్ సార్త్రే అంటారు. మనిషి అస్తిత్వాన్ని తన ఆలోచనలే నిర్ణయిస్తాయి. మనిషి స్వేచ్ఛను, చైతన్యాన్ని, అర్థాన్ని తన ఆలోచనల్లోని పరిపక్వత నిర్ణయిస్తుంది. సమాజం, సాహిత్యం, జీవితానుభవాలు ఆ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. ఈ మూడింటిలో సమాజం, జీవితానుభవం అనేవి కాలాన్నిబట్టి రూపొందుతాయి, మార్పుచెందుతాయి. సాహిత్యం వ్యక్తిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. సాహిత్య తత్త్వం మానవ జీవన సూత్రం చుట్టూ అల్లుకొని శాశ్వత ముద్రను వేస్తుంది, సమాజాన్ని జాగృతం చేస్తుంది. సాహిత్యంలో భాగమైన కవిత్వం ద్వారా జూకంటి జగన్నాథం అస్తిత్వ స్పృహను కలిగిస్తున్నారు.
ప్రముఖ తెలుగు కవి జూకంటి జగన్నాథం ఐదు దశాబ్దాలుగా కవిత్వం రాస్తూ ఈ జూన్ 20 నాటకి డెబ్భై ఏళ్ళను పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పద్దెనిమిది కవితా సంపుటాలు, ఒక కథా సంపుటి, ఒక వ్యాస సంకలనాన్ని వెలువరించారు. కవిగా నిరంతరం సామాజిక ఆర్ధిక రాజకీయ సాహిత్య పరిణామాలను గమనింపులోకి తీసుకుంటూ అస్తిత్వ స్పృహను వ్యాప్తి చేస్తున్నారు. జూకంటి కవిత్వంలో ప్రధానంగా ప్రజల బాధలు గాథలు, ప్రపంచీకరణ పరిణామాలు, ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం, అస్తిత్వ ఉద్యమాలతో మమేకత కనిపిస్తాయి.
డెబ్బయ్యవ దశకంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడింది. సిరిసిల్లా, జగిత్యాల ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించారు. మానవ హక్కులమీద, ప్రజల మీద తీవ్ర నిర్బంధాలు విధించబడ్డాయి. ఆ సమయంలో కవిగా ప్రజలను చైతన్య పరుస్తూ జూకంటి జగన్నాథం ధిక్కార కవిగా బయలుదేరారు. ప్రజా అస్తిత్వ పోరాటాల మీద అమలవుతున్న కర్కశత్వాన్ని నిలదీశారు. ఉపాధి లేక సిరిసిల్ల ప్రాంతం నుంచి కూలీలుగా వలస వెళ్తున్న సందర్భాలను అక్షర బద్దం చేశారు. పాలకుల ఆర్ధిక ప్రణాళికల డొల్లతనాన్ని బట్టబయలు చేశారు. గ్రామీణ వ్యవసాయం, వృత్తులు కూలిపోతున్న వైనాల్ని చిత్రించారు. ‘పాతాళ గరిగె’ వేసి ఆత్మహత్యల కారణాలని అన్వేషించి హృదయార్ద్రంగా కవిత్వం రాశారు.
తొంభయ్యవ దశకంలో మొదలైన ఆర్ధిక సంస్కరణలు, ప్రపంచీకరణ పరిణామాలను అధ్యయనం చేసి, కవిత్వం ద్వారా ప్రజలను జాగరూకులను చేశారు. మార్కెట్ విస్తరణ, మానవ సంబంధాల విచ్ఛిన్నం, పెరిగిపోతున్న లౌల్యాలను, తరిగిపోతున్న విలువలను తూకం వేస్తూ నిక్కచ్చిగా నిలబడి పీడిత ప్రజల స్వరంగా కవితా ప్రసారమయ్యారు. సామ్రాజ్యవాదపు పరిణామాలను, వ్యవస్థలు అంతకంతకు పతనమౌతున్న తీరును ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’గా మారుతున్న సందర్భాలను అక్షరీకరణ చేశారు. ‘వాస్కోడిగామా.కామ్’ కవితా సంపుటంతో ఆధునికత పేర కొల్లగొట్టబడుతున్న సార్వభౌమత్వాన్ని ఎరుకలోకి తీసుకువచ్చారు.
గంగడోలు, బొడ్డుతాడు, ఒకరోజు పది గాయాలు, తల్లికొంగు వంటి కవితా సంపుటాలలో స్థానిక అస్తిత్వ పోరాటాల ఎత్తుపల్లాలను, ప్రజల ఆకాంక్షలను వమ్ము చేస్తున్న వైనాలను కవితా పాఠం చేశారు. వాస్తవ సంఘటనలను, వాటి పూర్వాపరాలను తన కంటితో చూసి విమర్శనాత్మకంగా, కళాత్మకంగా అభివ్యక్తం చేయడం జూకంటి కవిత్వంలో చూడవచ్చు. తన ప్రాంత, దేశ వర్తమాన స్థల కాలాల చరిత్రను, వాటి పరిణామాలను సూక్ష్మస్థాయిలో అవగాహన చేసుకొని వాటి మూలలను పసిగట్టి వస్తు, శిల్పాల కళ చెడకుండా రచనలు చేయడం జూకంటి కవిత్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ఇటీవలి రాజపత్రం, చిలుక రహస్యం వంటి కవితా సంకలనాలు మారుతున్న రాజ్య స్వభావాన్ని, కార్పొరేటీకరణ ఫలితాలను, లుప్తమవుతున్న సామాజిక సామరస్యాన్ని పసిగట్టి ప్రదర్శిస్తాయి. ‘చెట్టును దాటుకుంటూ, పస, ఊరు ఒక నారుమడి, సద్దిముల్లె, ఒక కప్పు చాయ్ నాలుగు మెసేజ్లు, మనాది వంటి కవితా సంకలనాలలో విస్థాపనకు గురవుతన్న గ్రామాలు, జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఆధునిక సాంకేతికత, అప్పుల పాలవుతున్న మధ్యతరగతి జీవితాలు, మారిపోతున్న వ్యక్తిత్వాలను దుర్భిణి ద్వారా చూపిస్తాయి.
మానవ స్వభావాల్లోని వైరుధ్యాలను, సంఘర్షణను, వలస జీవితాలను, కార్మికుల వెతలను ఆధారంగా చేసుకొని ‘వైపని’ కథా సంకలనం తీసుకువచ్చారు. రాజకీయ చదరంగ క్రీనీడల జాడలను వ్యాసాలుగా రాసి ‘గాంధీ గారి మూడు కోతులు’ పేరుతో వెలువరించారు.
జూకంటి సాహిత్యాన్ని అధ్యయనం చేసినప్పుడు దేశం ఎటుపోతోంది? మనిషి ఎటుపోతున్నాడు? గ్రామం ఏమౌతుంది? వంటి కోణాలు స్థూలంగా మన దృష్టికి వస్తాయి. వివిధ సామాజిక ఉద్యమాలు, సాహిత్య ఉద్యమాల చైతన్యం అందుతుంది.
జూకంటి కవిత్వం గ్రామ స్థాయి నుంచి అగ్రరాజ్య స్థాయి వరకు పరిశీలనగా చేసిన వ్యాఖ్యానం. వ్యవస్థలలోని బోలుతనం, మానవ సంబంధాల్లోని డొల్లతనం చూపించిన సూక్ష్మ దర్శిని. అసమ అభివృద్ధి, ప్రపంచీకరణ, క్విడ్ ప్రోకో వంటి వాటిని ముందే దర్శించి నిర్మించిన కవితా నైపుణ్యం. ఉద్యమాలలో ప్రజల వైపు నిలబడి మాట్లాడిన నిబద్ధ, నిమగ్న, జాగృత వాణి.
(వ్యాస రచయిత బూర్ల వేంకటేశ్వర్లు కరీంనగర్లోని శ్రీరాజరాజేశ్వర ఆర్ట్స్&సైన్స్ కళాశాలలో తెలుగు సహాయాచార్యులుగా పనిచేస్తున్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.