
యూపీ పోలీసు నియామక ప్రక్రియను “పారదర్శక”మైనదిగా కేంద్రహోంమంత్రి అమిత్‌షా కితాబిచ్చారు. కానీ ఇదే పరీక్ష నిరుడు పేపర్ లీక్ వల్ల రద్దైంది. పరీక్షను నిర్వహించిన గుజరాత్ కంపెనీ ఎడుటెస్ట్కు సుదీర్ఘమైన కళంకిత చరిత్ర ఉంది. ప్రశ్నా పత్రం లీక్ తర్వాత అనివార్యంగా ఈ కంపెనీని యూపీ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. బీజేపీకి చెందిన ప్రముఖ నేతలతో ఎడుటెస్ట్ కంపెనీ వ్యవస్థాపక డైరెక్టర్ దగ్గరి సంబంధాలను కలిగి ఉన్నారు.
న్యూఢిల్లీ: 2025 జూన్ 15న లక్నోలో జరిగిన ఓ కార్యక్రమానికి కేంద్రహోంమంత్రి అమిత్‌షా హాజరైయ్యారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల “ఇప్పటి వరకు అన్నింటికంటే భారీ నియామకాల ప్రక్రియ”లో భాగంగా ఎంపిక చేయబడిన 60,244 కానిస్టేబుల్లకు నియామక పత్రాలను అందించారు.
ఈ నియామకాలు పూర్తిగా పారదర్శకమైనవిగా చెప్తూ, “నియామకాల విషయంలో ఎటువంటి సిఫార్సు కానీ లంచం, కుల- రక్తసంబంధంలాంటివి కానీ ప్రభావం చూపలేదు. కేవలం సామర్థ్యం ఆధారంగా ఎంపిక జరిగింది” అని అమిత్‌షా కితాబిచ్చారు.
ఈ మాటల్లో వాస్తవం ఎంత?
అనేక కారణాల రీత్యా హోంమంత్రి మాటలు సందేహాస్పదంగా ఉన్నాయి.
మొదటిది, గత ఏడాది సరిగా ఇదే పరీక్ష, అంటే “కానిస్టేబుల్ సివిల్ పోలీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్- 2023” మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీని మీద యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారించింది. పేపర్ లీక్ అవ్వడంతో గత ఏడాది ఈ పరీక్షను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ సమక్షంలో అమిత్‌షా కితాబిచ్చే సమయంలో ఈ విషయాలను మర్చిపోయారు.
పేపర్ లీక్‌తో పరీక్ష రద్దు అయ్యాక మళ్లీ పరీక్షను నిర్వహించారు. దాని ఆధారంగా ప్రస్తుత నియామకాలు జరిగాయి. ఈ రెండవ పరీక్ష పారదర్శకత గురించి మాట్లాడానికి ముందు గత ఏడాది రద్దైన పరీక్ష గురించి ప్రస్తావించడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఘటన అనేక అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టింది.
రెండవది, ఈ పరీక్షను నిర్వహించే ఎడుటెస్ట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని బీహార్ ప్రభుత్వం వేరే పేపర్ లీక్ ఘటనలోనే చాలా కాలం ముందే నిషేధించింది.
ఇదంతా జరిగినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కంపెనీకు మళ్లీ పరీక్షలు నిర్వహించే కాంట్రాక్టును అప్పగించింది. వీటన్నింటిని అమిత్‌షా విస్మరించారు.
మూడోవది, ఈ కంపెనీ గుజరాత్‌కు చెందినదని, దీనికి బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని అమిత్ షా మర్చిపోయారు.
నాలుగోవది, 2024 జూన్ 20న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్ చేసిన తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని సీఎస్ఐఆర్(శాస్త్రీయ- పారిశ్రామిక పరిశోధన మండలి)సంస్థ సెక్షన్ ఆఫీసర్(ఎస్ఓ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్ఓ) నియామకాల కోసం ఎడుటెస్ట్ సేవలను పొందడాన్ని కొనసాగించారు. ఇందులో తీవ్రమైన అవినీతి అక్రమాలు జరిగనట్టుగా ఆరోపణలు వచ్చాయి. అమిత్‌షా వీటి మీద కూడా దృష్టి పెట్టలేదు.
అంటే, ఏ పరీక్షనైతే దేశ హోంమంత్రి పారదర్శకమైనదని చెప్పారో, దాని చరిత్ర కేవలం పేపర్ లీక్, అవినీతి ఆరోపణలతోనే నిండిపోలేదు. ఆ పరీక్షను నిర్వహించే కంపెనీ నిషేధించబడుతూ ఉంది. అంతేకాకుండా నిషేధాలు కొనసాగుతున్నప్పటికీ ఈ కంపెనీ అన్ని పరీక్షలను నిర్వహిస్తూనే ఉంది.
పేపర్ లీక్ పరీక్ష నేపథ్యం..
ఉత్తర ప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్ నియామకాల భర్తీ కోసం 2024 ఫిబ్రవరి 17, 18 తేదీలలో పరీక్షలను నిర్వహించారు. 48 లక్షల కంటే ఎక్కువ మంది యువత ఇందులో భాగస్వామ్యమయ్యారు. కానీ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ వచ్చింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కాపీ కొడుతూ పట్టుబడ్డ 120 కంటే ఎక్కువ మందిని ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. నిజమైన అభ్యర్థుల స్థానంలో పరీక్ష రాయడానికి కూచున్నారనే ఆరోపణల నేపథ్యంలో మరికొంతమందిని పట్టుకున్నారు. అంతేకాకుండా మరికొందరు అభ్యర్థులను మోసం కూడా చేశారు.
“122 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 15 మందిని ఏటా, 9- 9 మందిని మవూ, ప్రయాగ్‌రాజ్, సిద్ధార్థనగర్‌లో, ఎనిమిది మందిని గాజీపూర్‌లో, ఏడుగురిని అజమ్‌గఢ్‌లో, ఆరుగురిని గోరఖ్‌పూర్‌లో, అయిదుగురిని జైన్‌పూర్‌లో, నలుగురిని ఫిరోజాబాద్‌లో, ముగ్గురు- ముగ్గురును కౌశాంబి- హాత్రస్లో, 2- 2 ఝాంసీ, వారాణసి, ఆగ్రా, కాన్పూర్‌లో, ఇంకా చెరొక్కరిని బలియా, దేవరియా, బిజ్నౌర్ నుంచి అదుపులోకి తీసున్నామ”ని అప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ప్రశాంత్ కుమార్ చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల్లో అవకతవలు..
ప్రశ్నా పత్రాలు లీకేజీ ఆరోపణల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ఎస్టీఎఫ్‌ను ఏర్పాటు చేసింది. 2024 మార్చిలో బలియా నివాసి నీరజ్ యాదవ్‌ను ఎస్టీఎఫ్ అదుపులోకి తీసుకుంది. వాట్సాప్ ద్వారా అభ్యర్థులకు ప్రశ్నోత్తరాలను పంపినట్టుగా అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఇదేకాకుండా అనేకమందిని అదుపులోకి తీసుకున్నారు.
కంపెనీ మీద ప్రశ్నల వెల్లువ..
రాష్ట్ర నలుమూలల నుంచి అభ్యర్థులు లక్నోకు చేరుకొని నిరసన ప్రదర్శనలు చేశారు. చివరికి యోగీ ఆదిత్యనాథ్ పరీక్ష రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
గుజరాత్‌కు చెందిన ఏజెన్సీ ఎడుటెస్ట్కు ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను అప్పగించడం జరిగింది. దానిని రాష్ట్ర ప్రభుత్వం పేపర్ లీక్ ఆరోపణల తర్వాత 2024 జూన్ 20న బ్లాక్‌లిస్ట్ చేసింది.
ఈ కంపెనీ మీద ప్రశ్నలు రావడం ఇది మొదటి సారి కాదు.
యూపీ పోలీసు నియామక పరీక్షల టెండర్ పొందడాని కంటే ముందే బీహార్‌లో నిర్వహించిన పరీక్ష ప్రక్రియలలో అవినీతి, అక్రమాల కారణంగా ఎడుటెస్ట్ బ్లాక్‌లిస్ట్‌కు గురైంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని నిరుడు ది వైర్ మూడు భాగలలో ప్రచురించింది. తన లోతైన విశ్లేషణాత్మక నివేదికలో చాలా విషయాలను పేర్కొన్నది.
బీజేపీ నేతలతో బ్లాక్‌లిస్ట్ కంపెనీకు దగ్గరి సంబంధం..
పదేపదే వివాదాలలో చిక్కుకుంటున్నప్పటికీ దీనికి బీజేపీ పాలిత రాష్ట్రాలలో, స్వయంగా నరేంద్ర మోదీ అధ్యక్షతలోని సీఎస్ఐఆర్ నుంచి కాంట్రాక్టులు అందాయి. ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ గుజరాత్లో జరిగింది.
ఈ కంపెనీని కేవలం చాలా సార్లు బ్లాక్‌లిస్ట్ చేయడమే కాకుండా, దీని వ్యవస్థాపక డైరెక్టర్‌కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, ప్రతీ బీజేపీ నేతతో మంచి సంబంధాలు ఉన్నాయని ది వైర్ నివేదిక తెలిపింది.
ఎడుటెస్ట్ వ్యవస్థాపక డైరెక్టర్ సురేశ్‌చంద్ర ఆర్య ఒక ప్రముఖ హిందూ సంఘం ‘సార్వత్రిక ఆర్యప్రతినిధి సభ’కు అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ సభ 2018 సంవత్సరంలో నాలుగు రోజుల అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, సంఘ్‌కు చెందిన పలువురు ప్రముఖులు పాలుపంచుకున్నారు. మహాసమ్మేళన ప్రారంభోత్సవంలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఉన్నారు. ఇంకా సురేశ్‌చంద్ర ఆర్య స్వాగతోపన్యాసమిచ్చారు.
న్యూఢిల్లీలో 2023 ఫిబ్రవరిలో దయానంద్ సరస్వతి 200వ జయంతి వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేశారు. ఆర్యసమాజానికి సంబంధించిన ఈ కార్యక్రమం సందర్భంగా సురేశ్‌చంద్ర ఆర్య, పీఎం మోదీతో పాటు వేదిక మీద ఉన్నారు. మోదీ తన ప్రసంగంలో సురేశ్‌చంద్ర గురించి ప్రస్తావించారు.

సురేశ్‌చంద్ర కొడుకు అంటే ఎడుటెస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ ఆర్య 2017లో పరీక్షకు సంబంధించిన అవినీతి కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా జరిగనప్పటికీ ప్రధానమంత్రి అధ్యక్షతలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్ఐఆర్, ఇతర రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలు ఎడుటెస్ట్ను పరీక్ష నిర్వహించాల్సిన కాంట్రాక్టులను ఇచ్చారు.
సీఎస్ఐఆర్ సెక్షన్ ఆఫీసర్(ఎస్ఓ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఎఎస్‌ఓ) నియామక పరీక్ష విభిన్న దశలలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి దశ పరీక్ష 2024 ఫిబ్రవరి 5- 20 మధ్య దేశంలోని వేరువేరు ప్రాంతాలలో ఆన్లైన్లో జరిగింది. 2024 ఫిబ్రవరి 8న ఉత్తరాఖండ్ పోలీసులు ఒక పరీక్ష కేంద్రం మీద రైడ్ చేశారు. నిందితుడు అంకిత్ ధీమాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఒక అభ్యర్థి పశ్నపత్రాన్ని పరిష్కరించానని తను అంగీకరించాడు.
ఇటువంటి అనేక ఆరోపణల తర్వాత అభ్యర్థులు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(సీఎటీ)ను ఆశ్రయించారు. కానీ అక్కడ ఏ నిర్ణయం తీసుకోకముందే, 2024 జూలై 7న దేశంలోని ప్రధాన నగరాలలో జరిగిన రెండవ దశ పరీక్షలో నిర్వహణ లోపాలు, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి .
అమిత్ షా ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష గతాన్ని, ఆ పరీక్షను నిర్వహించిన కంపెనీ చరిత్రను పరిశీలించి ఉంటే, ‘అవినీతి రహిత ప్రక్రియ’ అని ఆయన చెప్పుకోవడానికి బదులుగా తన సొంత ప్రభుత్వాలు చేసిన లోపాలను ఎత్తి చూపేవారు.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.