
మార్చి 13వ తేదిన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేరుతో ఒక సర్క్యులర్ విడుదల అయ్యింది. యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించకూడదని, ఆందోళనల పేరుతో యూనివర్సిటీ నిర్వహణకు ఆటంకం కల్గిస్తున్నారని ఈ చర్యలను నిషేధిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి చొరబడటం, యూనివర్సిటీ అధికారులు, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం, ధర్నాలు, ప్రదర్శనలు, ఆందోళనలు వంటివి చేయకూడదని నిర్దేశించారు. ఒకవేళ ఈ చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని, ఆ తర్వాతే రిజిస్ట్రార్, ఇతర అధికారుల దగ్గరకు రావాలని సర్క్యులర్‌లో పొందుపర్చారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్దమైంది. దీనిని నియంతృత్వ చర్యగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉస్మానియా యూనివర్సిటీకి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ వందేళ్ల చరిత్రలో ఎన్నో ప్రజా, విద్యార్ధి ఉద్యమాలకు యూనివర్సిటీ చూసింది. ప్రజా వ్యతిరేక పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహించారు. 1938లో స్టేట్ కాంగ్రెస్ వందేమాతరం గీతలాపన చేయాలనే పిలుపును ఇచ్చింది. దీంతో విద్యార్థులు గేయాలపన చేస్తే వారిని సస్పెండ్ చేశారు. సస్పెండైన విద్యార్థులకు మద్దతుగా సమ్మె నిర్వహించిన చరిత్ర ఉస్మానియాది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఉస్మానియా చైతన్యం ఎలాంటిదో, తెలంగాణ చరిత్రలో అనేక కీలకమైన పరిణామాలకు ఉస్మానియా విద్యార్ధుల చైతన్యమే కారణమని చెప్పవచ్చు.
ఏ పాలకులైతే ప్రజావ్యతిరేకత విధానాలను అవలంభిస్తున్నారో, అటువంటి వారికి వ్యతిరేకంగా ఉస్మానియా నిరంతరం పోరాడుతూనే ఉంది. అటువంటి యూనివర్సిటీలో రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తు, యూనివర్సిటీ స్వతంత్రను దెబ్బతీసే విధంగా ఆంక్షలు విధిస్తూ సర్క్యూలర్ విడుదల చేశారు.
గత బిఆర్ఎస్ పాలనలో నిర్బంధాలు, నియంతృత్వం, పెరిగిందని, ప్రజాస్వామ్యం అపహాస్యమయిందని రేవంత్ గగ్గోలు పెట్టారు. తన ఎన్నికల ప్రసంగాల్లో, కార్యక్రమాలల్లో మేం ఆరు గ్యారంటీలను ఇచ్చాం ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ప్రకటించారు. హక్కులను, రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పారు. కానీ పాలనలో వాటికి భిన్నంగా పరిపాలన చేస్తున్నారు.
ప్రజలు, విద్యార్థులు తమ అసమ్మతిని, నిరసనను ప్రకటించడానికి ధర్నాలు, ఆందోళనలలాంటివి చేసుకునే హక్కులను రాజ్యాంగం కల్పించింది. కానీ రాజ్యాంగ హక్కుకు భిన్నంగా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వ్యవరిస్తున్నారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమం, 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి సర్య్కూలర్‌ను విడుదల చేయలేదు. నాడు ముళ్ళకంచెలు, గేట్లను మూసి, బారికేడ్లతో ఆంక్షలు విధించారు. కానీ, ఏనాడూ ప్రజాస్వామిక హక్కులను కాలరాసింది లేదు.
యూనివర్సిటీలో అనేక ఆంక్షలు పెట్టిన అధికారులు, అవన్నీ ప్రభుత్వానికి తెలియకుండానే సర్క్యూలర్‌ను విడుదల చేశారా? అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు అడిగినా కూడా అధికార పార్టీ నేతలు కనీసం స్పందించలేదు. రాజ్యాంగ హక్కులను హరించే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజ్యాంగ హక్కుల గురించి తెలియదా? ఓవైపు తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని మరి రాజ్యాంగాన్ని కాపాడాలని అడుగుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మాత్రం హక్కులను అడగ వద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆంక్షలు విధిస్తున్నారు.
కొన్నిరోజుల క్రితం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో రాజకీయాలు, విద్యార్ధి ఉద్యమాలు, విద్యార్థుల పాత్ర గురించి ప్రస్థావించారు. విద్యార్ధులు విద్యార్ధి సంఘాలలో పని చేయాలని, రాజకీయాలు గురించి ఆలోచించాలని, అప్పుడే మంచి రాజకీయాలు ఉంటాయని ప్రకటించారు. అన్ని భావాలపై చర్చలు ఉండాలని యూనివర్శీటీలలో ఈ రకమైన చర్చలు అవసరమని చెప్పారు. కానీ, ఆయన తన మాటలకు విరుద్ధంగా యూనివర్సిటీల స్వతంత్రను దెబ్బతిసే చర్యలకు తెరలేపారు.
సెంట్రల్ యూనివర్సిటీలలో కనీసం విద్యార్ధి సమస్యల పరిష్కారం కోసం విద్యార్ధి సంఘాల గుర్తింపు ఎన్నికలు ఉంటాయి. మరి రాష్ట్ర యూనివర్సిటీలలో ఇలాంటి ఎన్నికలు లేవు. సమస్యలు పరిష్కారం కోసం ఎవరిని అడగాలి? ఎవరు ఆందోళన చేయకపోతే ఎవరు స్పందించి, పరిష్కారం చేస్తారు. ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు తెలియదా?
ఇప్పుడిప్పుడే ఉన్నత విద్యలోకి అణగారిన వర్గాలు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు వస్తున్నారు. ఈ విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఈ విద్యార్థుల అభివృద్ధి కోసం బడ్జెట్లో ఎంతశాతం నిధులు ఇస్తున్నారు. ఈ వర్గాల విద్యార్ధులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటి? నిధులు ఇవ్వకుండా, సరైన సౌకర్యాలు కల్పించకుండా, లైబ్రరీ సౌకర్యాలు ఇవ్వకుండా, మెస్ ఆధునికీకరణ చేయకుండా, నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ప్రైవేటు విద్యాసంస్థల మాదిరిగా రెగ్యులర్ కోర్సులను, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో భారీగా ఫీజులను పెంచారు. అంతేకాకుండా కొన్ని కోర్సులను ఎత్తివేశారు. చాలా సంవత్సరాలు నుండి అధ్యాపకులను, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు చాలా నష్టం జరుగుతోంది. ఈ చర్యలతో క్రింది వర్గాలకు ఉన్నత విద్య అందకుండా చేసి, ఆంక్షల పేరుతో వారిని విద్యకు దూరం చేసే కుట్రలు చేస్తున్నారు.
చదువుకునే పరిస్థితి లేకుండా చేస్తే ప్రశ్నించకుండా, పోరాడకుండా ఎలా ఉంటారు? హాస్టల్స్‌లో త్రాగునీరు లేదు. నాణ్యమైన భోజనం లేదు. ఇటువంటి సందర్భాలో చాలా సార్లు అమ్మాయిలే రాస్తారోకో చేశారు. మరి పరిష్కరించారా? హస్టల్స్లో పెచ్చులు ఊడి విద్యార్థులు గాయాల పాలైతే, ఏ అధికారి పట్టించుకున్న దాఖలాలు లేవు. యూనివర్సిటీలో ఈ ఏడాది కాలంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సమస్యలను పరిష్కరించింది? మరి పేద వర్గాల విద్యార్థులు సక్రమంగా చదువుకోకుండా ఉన్నటువంటి ఆటంకాల గురించి ప్రశ్నించవద్దా? అడగవద్దా? అడిగితే యూనివర్సిటీ నిర్వహణకు ఆటంకం కలిగించినట్టుగా పరిగణిస్తారా?
ప్రతిపక్ష నేతగా రేవంత్, కాంగ్రెస్ నేతలు ఎన్నికల వేళ యూనివర్సిటీకి వచ్చారు. విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర బడ్జెట్లో ఎందుకు నిధులను కేటాయించలేదు? ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయటం లేదు? స్కాలర్‌షిప్స్‌ను విద్యార్థులకు ఎందుకు ఇవ్వటం లేదు? వీటికి సమాధానం చెప్పకుండా ఆంక్షలు విధించి, తమ హక్కులకోసం నిరసన తెలిపే విద్యార్థుల హక్కులను కాలరాసేందుకు మాత్రం ప్రయత్నం చేస్తున్నారు.
యూనివర్సిటీలో సర్క్యూలర్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు నిర్బంధిస్తున్నారు. బలప్రయోగంతో అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత విద్యను ప్రైవేట్ పరం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా కనిపిస్తుంది. అందుకే ఇటువంటి ప్రజావ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంభిస్తుంది. కార్పొరేట్ శక్తుల నుండి నిధులను తీసుకొని మార్కెట్ అవసరాల కోసం స్కిల్ యూనివర్సిటీ తీసుకువచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములను కార్పొరేట్ శక్తులకు విక్రయించాలని నిర్ణయించారు. ఇప్పటికైనా ఉస్మానియాలో విడుదల చేసిన సర్య్కూలర్ని వెనక్కి తీసుకోవాలి. అంతేకాకుండా కాంగ్రెస్ ఇచ్చిన ప్రజాస్వామ్య పునరుదద్ధరణ హామీని నిలబెట్టుకోవాలి. అలాకాకుండా ఇలానే ప్రజా వ్యతిరేక పనులు చేస్తే, విద్యార్థుల- ప్రజల ప్రతిఘటనను ప్రభుత్వం ఎదురుకోక తప్పదు.
టి నాగరాజు
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి
ఫోన్: 9490098292
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.