
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లెక్స్ ఫ్రీడ్‌మన్‌తో చేసిన పాడ్‌కాస్ట్ భ్రమాన్వితాలతో, శుష్క గంభీర ప్రవచనాలతో నిండిన ఒక సంభాషణ. దీని వినిర్మాణాన్ని గమనిస్తే, ఇది మన వివేచనా శక్తి పట్ల చేసిన అపరాధంగా స్పష్టమౌతుంది. కానీ పాత్రికేయులు తమ నాయకుల సాహస కృత్యాలను తెలుసుకోవాలని ఆశిస్తారు. కాబట్టి, అనేక నైచ్యాలను దిగమింగుతూ కొన్ని ఆణిముత్యాలనైనా మిగిల్చే ప్రయత్నం చేశాం.
ఫ్రీడ్మన్ తన మూడు గంటల సంభాషణను ఆహారనియమాల ప్రస్థావనతో ప్రారంభించారు. “మై ఆప్కో బతానా చాహుంగాకి మై ఉపవాస్ రఖా హై(నేను ఉపవాసం ఉన్నానని మీతో చెప్పదలుచుకున్నాను)అది రెండు రోజులుగా, 45 గంటలుగా, కేవలం నీటితో, ఏ ఘనాహరం లేకుండా, మీతో చేసే ఈ సంభాషణ పట్ల గౌరవ సూచకంగా, తగిన మానసికస్థితిని తెచ్చుకునేందుకై ఉపావాసం చేశాను” అని తెలిపారు. పాత్రలలో జీవించే ఘనమైన నటులు కూడా సిగ్గు పడేట్లుగా చేసిన ఆ పాత్రికేయ కళ ఒక 24 క్యారట్ల పరుసవేది. సంవత్సరంలో కొన్ని నిర్థిష్ట దినాలలో, తాను ఇంటర్యూ చేస్తున్న వ్యక్తి ఉపవాసం ఉంటారన్న పరమ సత్యానికి ఆకర్షితుడై ఫ్రీడ్మన్ తన ఆకలిపేగుల నోరు మూయించారు.
మోదీ ఆజన్మ బ్రహ్మచారి అని తెలుసుకున్నాక ఫ్రీడ్ మన్ ఆ ఉత్కృష్ట సాధనకై కూడా ప్రయత్నించారా? అనే సందేహం కలుగుతుంది. ఫ్రీడ్మన్ ఇంటర్యూలో చివరికి వేళ్ళేకొద్దీ, మరింత లోతుగా వెళ్ళి, చాలా వినయంగా, “హిందూ మంత్రాలను లేదా ధ్యానాన్ని నాకు నేర్పించగలరా” అని మోదీని వేడుకున్నారు. ఫ్రీడ్మన్ తాను గాయత్రీ మంత్రం నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానీ, తన ఉపవాస దీక్షలో ఎంతో కొంత జపించానని తెలిపారు. అందుకు సాక్ష్యంగా ఆయన ఉపవాసం వల్ల పీక్కుపోయిన తన కడుపును కెమెరాకు చూపుతూ, మోదీని మంత్రాల ప్రాముఖ్యతను తనకు వివరించమని వినయంగా కోరుకున్నారు.
తన అమెరికన్ శిష్యుడికి మంత్రాలు, ధ్యానం గురించి వివరిస్తూ ప్రధాన మంత్రి మోదీ ఉత్కృష్ఠ పత్రికా వ్యాసంగపు దృష్టికోణం ఎలా ఉండాలో శిష్యుడితో పంచుకున్నారు. పాత్రికేయులు ఈగల వలె కాకుండా, తేనెటీగల వలె ఉండాలని చెప్పారు. “ఒక ఈగ మలినంపై వాలి, దాన్ని అన్ని చోట్లా వ్యాపింపచేస్తుంది, కానీ తేనెటీగ అలా కాదు పుష్పాలపై వాలి తేనేను సేకరిస్తుంది, అంతేకాదు, దోషం చేసిన వారిని కుట్టడానికీ వెనుకాడదు” అని మోదీ సుద్దులు చెప్పారు.
గౌరవ ప్రధానమంత్రి గత దశాబ్ధంలో తాను ఇంటర్యూ బహుకరించిన పాత్రికేయుల జాబితా వడపోస్తే, ఆయనను కుట్టిన తేనెటీగ పాత్రికేయుడెవరూ కనపడలేదు. అంటే ఆయన ఇప్పటిదాకా ఈగ పాత్రికేయులనే ప్రోత్సహించారా? అడిగే ధైర్యం మనం చేయలేం.
కానీ మనం ఒకటి కోరుకోగలం. ప్రధాన మంత్రి, ప్రజాస్వామ్యపు ఆత్మ ‘విమర్శ‘లోనే ఉందని సూత్రీకరించినప్పుడు, ఈ అమెరికన్, గత దశాబ్ద కాలంగా, కల్పిత కేసులను ఎదుర్కొంటూ భారతీయ కారాగారాలలో మగ్గుతున్న భిన్నాభిప్రాయం కలిగిన పౌరుల గురించి అడిగితే ఎంత బావుండేది! అని తప్పక వాంఛిస్తాం.
పోనీలెండి, ఫ్రీడ్మన్ తన ఉపోద్ఘాతంలోనే తాను ఇంటర్యూ చేయబోతున్న నాయకుడు, వంతెనలు కట్టేవాడే కానీ కూల్చేవాడు కాదని గంభీరంగా ప్రకటించేశారు. “ఎవరు ఎక్కడ నుంచి వచ్చినా, ప్రతి ఒక్కరినీ సానుభూతితోనే చూస్తారు.” అని ఫ్రీడ్మన్ అభివర్ణించారు. మన నాయకుడి గురించి మనకు తెలియని ఈ ముఖం ఆయన కనుగొన్నందుకు మనం గర్వపడతాం. కానీ మన ప్రధాన మంత్రి గుజరాత్ అల్లర్ల ప్రస్థావనను త్రోసిపుచ్చినప్పుడు, ఫ్రీడ్ మన్, మోదీ అనేక సంవత్సరాల క్రితం కుక్కపిల్ల వ్యాఖ్యలో దాగివున్న సానుభూతిని గురించి కూడి అడిగితే బావుండేది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి కుతూహలపు చొరవ ఉందని నిందించ లేనప్పుడు, ప్రధానమంత్రి అమాయక అనుచరులకు ఆయన దంబాలు విదేశీ విధానంపై ఆయన గాఢమైన లోతైన ప్రకటనలుగా కన్పిస్తే మనం తప్పు పట్టలేం.
పాడ్‌కాస్ట్‌లోని మరో భాగంలో, అమెరికన్ అధ్యక్షుడితో మోదీకి ఉన్నటువంటి గాఢమైత్రి గురించి తెలుసుకుంటాం. ఇది ఆద్యంతం ఈ ఇద్దరు నాయకుల ఆహ్లదకర దృశ్యాలతో అలంకరించబడివుంటుంది. కానీ ఎక్కడా ఆ శ్వేత భవనంలో నివసించే వ్యక్తి విధించే పన్నుల గురించి కానీ, ఆందువల్ల తీవ్రంగా నష్టపోతున్న భారతీయ పరిశ్రమ గురించి కానీ, అవమానకరంగా భారతీయులను విమానంలో ఇండియాకు వెనక్కి పంపటం గురించి కానీ ప్రస్తావనకే రావు.
పెద్ద ప్రజాస్వామ్యాలు ట్రంప్ 2.0 ను నమ్మదగనిదిగా, విఘాతం కల్గించేదిగా భావిస్తూ ఉండగా మన ప్రధానమంత్రి, ట్రంప్ ఈసారి ”చాలా ఎక్కువగా సన్నద్దత”తో ఉన్నాడనీ, ఆయనకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందనీ నిర్ధిష్టమైన అడుగులు వేస్తున్నాడనీ బలంగా నొక్కి చెప్తున్నారు. చాలా ప్రజాస్వామ్యాలు ట్రంప్ కొత్త బృందం పట్ల సందేహాస్పదంగా ఉంటే, మన నాయకుడికి అది ఒక బలమైన, సామర్థ్యం కల బృందంగా గోచరిస్తోంది.
ఈ అనుబంధపు సయోధ్యకై ఆయన ప్రయత్నాలు అటువంటివి. అవి ఎంతలా అంటే మన విశ్వగురు డోగ్(DOGE)ను దాని బాస్ ఎలాన్ మస్క్‌ను అభినందించేంతగా. ఆయనేమో యూరప్ నుంచి తీవ్రమైన ప్రతిస్పందనను ఎదుర్కొంటున్నాడు. యూరప్ ఖండమంతా టెస్లా అమ్మకాలు భారీగా పడిపోయాయి. కానీ మన ప్రధాన మంత్రి తన ఇంటర్యూ చేసే వ్యక్తితో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచే తనకు మస్క్ తెలుసని, డోగ్ (DOGE)తాత్వికత, ఆయన పరిపాలన దక్షత క్రింద, పరిపాలనలో బాగా లోతుగా కలిసిపోయాడని కితాబిచ్చారు.
బహుశా ఇందులోని గూడార్ధం మరీ ఎక్కువ వీక్షకులను ఈ సంభాషణ వైపు ఆకర్షించలేక పోయింది. కృత్రిమ మేధ సహయంతో చాలా భాషలలో వారు తమ యూట్యూబ్ ఛానెళ్ళద్వారా ప్రసారం చేసిన తర్వాత కూడా, మన ప్రధాన మంత్రి యూట్యూబ్ ఛానల్‌కు 27.3 మిలియన్ల మంచి చందారులు ఉండగా, ఫ్రీడ్‌మన్‌కు 4.6 మిలియన్ల చందాదారులు ఉండగా అది ఫ్రీడ్మన్ ఛానల్లో 13.21 లక్షల వీక్షణాలు కాగా, ప్రధానమంత్రి వేదిక పై అందులో మూడవ వంతు మాత్రమే అంటే 4.07 లక్షల వీక్షణాలు మాత్రమే ఉన్నవి. అతి ఎక్కువ మంది ప్రజలున్న దేశ ప్రధానిగా ఆయనకు ఇలా జరిగింది.
నేటి కాలాలలో ప్రత్యామ్నాయ వాస్తవాలకు చోటు లభిస్తున్నప్పుడు, మనం ఒక పాత్రికేయుడితో ఆయన ఇంటర్యూని ఊహించగలమా? ప్రధాన మంత్రి, ఫ్రీడ్‌మన్‌కు కాళీ దేవత, వివేకానందల గురించిన ఒక సంఘటన వివరించారు. ఇది ఆయనను బాగా ఉత్తేజ పరిచిందట. మరో ప్రముఖ సంఘటన ఈ ఋషి గురించీ, ఈ దేవత గురించీ వేరే ఒకటి ఉంది.
1890లలో వివేకానంద కశ్మీర్‌ను సందర్శించినప్పుడు, దేవాలయాలు, మహమ్మదీయుల చేత ధ్వంసం చేయబడటం చూసి ఖిన్నుడైనాడట. ప్రఖ్యాత ఖీర్ భవాని ఆలయం వద్ద ఆయన, ప్రజలు ఇంత అపవిత్రం జరుగుతుంటే, తీవ్ర ప్రతిఘటన లేకుండా ఎలా మిన్నకున్నారు? అనుకున్నాడట. నేనే గనుక ఇక్కడ ఉంటే నేనెప్పటికీ ఇటువంటి ఘోరాన్ని సహించేవాడిని కాదనీ, కాళిమాతను రక్షించేందుకు ప్రాణత్యాగం చేసేవాడిననీ అనుకున్నాడట. అప్పుడు కాళీ దేవత ప్రత్యక్షమై ఆయనను మందలించిందట. ”నన్ను నమ్మని వారు నా గుళ్ళలోకి జొరబడి, నా రూపాలను ధ్వంసం చేస్తే ఏమిటి? దానితో నీకేం పని? నువ్వు నన్ను రక్షించేవాడివా? లేదా నేను నిన్ను కాపాడతానా?” అని అడిగిందట. కానీ మరో సందర్భంలో ఖీర్ భవాని ఆలయం వద్దే మరో సంఘటన జరిగింది.
గుడి దీనావస్థను చూసి ఆయన కించపడుతూ తాను బేలూరులో కట్టినట్లుగానే ఇక్కడ కూడా ఒక కొత్త గుడిని నిర్మిద్దామని కోరుకున్నాడు. మరోసారి కాళిమాత ప్రత్యక్షమయి “బిడ్డా! నేను కావాలనుకుంటే లెక్క లేనన్ని గుడులను తెచ్చుకోగలను. ఈ క్షణంలో, ఈ స్థలం వద్దే ఒక ఏడంతస్థుల స్వర్ణ దేవాలయాన్ని లేపగలను” అన్నది. ఈ మాటలు ఆయనలో జ్ఞానోదయం కల్గించి, సమూల మార్పుకు కారణభూతమైయ్యాయి.
వివేకానంద “నా దేశ భక్తి అంతా పోయింది. ఇంకేం మిగలలేదు” అని భావించాడు. ఆయన సన్యాసత్వానికి పరాకాష్టగా నిలిచే నిజమైన సన్యాసిగా మారారు. నిజానికి భారతీయ నాయకుడైన మోదీ, ఆయనను ఇంటర్యూ చేసే అమెరికన్ వ్యక్తి హిందూ మతంలోని ఈ కథ వైపు చూస్తే బావుండేది. కానీ మన ప్రధాన మంత్రి పాత్రికేయుల కంటే పాడ్‌కాస్టర్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నందు వలన, మనల్ని మనం మనకొక ఇంటర్యూ ప్రసాదించే దాకా నోరు కట్టేసుకోక తప్పదేమో.
అశుతోష్ భరద్వాజ్
అనువాదం: ఐ.వి.రమణారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.