
కుటుంబం, వివాహం, కులం, రాజకీయంలా మతం కూడా మానవ సమాజ ఉపరితల అంశమే. దుర్క్ హైం, మలినోవ్స్కీ, బ్రౌన్ తదితర ఆధునిక పండితులు మతాన్ని సామాజిక నియంత్రణా సాధనంగా పరిగణిస్తుంటే, వెబర్ మాత్రం ప్రొటస్టెంట్ మత నియమాలు పెట్టుబడిదారీ విధానం ఆవిర్భావానికి దోహదం చేశాయని భావించాడు. ఆగస్ట్ కామ్టే మాత్రం ఈ అవగాహనలకు విరుద్ధంగా మతాన్ని శాస్త్రీయ ఆలోచనకు తావు ఇవ్వని అభిభౌతిక అంశంగా పరిగణించాడు. మత విశ్వాసులు మాత్రం ఇహలోక విషయాలను పక్కనపెట్టి పరలోక సౌఖ్యాల ప్రాప్తి కోసం ఆందోళన పడుతున్నారు.
అయితే, ఈ నిర్వచనాలు మతం, దాని చారిత్రక గతి తర్కాన్ని ఏ మేరకు వివరించగలుగుతున్నాయనే ప్రశ్న మాత్రం అపరిష్కృతంగానే మిగిలిపోయింది. సమీప గతం వరకు సకల కార్యకలాపాలను మతం అనే ప్రయాణంతో అంచనా వేయడం కొనసాగింది. అయితే ఈ మధ్య కాలంలో మతానికి ఉండే సామాజికి ప్రాముఖ్యతను ప్రశ్నించసాగారు. వ్యవహారం ఈ రకంగా తిరగబడడానికి కారణం ఏంటి? మతం కేవలం ఆచార స్థాయికి కుదించుకుపోయిందా?
‘ఆహారం, నిద్ర, భయం, మైథునాలు అనేవి మానవాళికి జంతుజాలానికి సమాన ఫాయిదాలో ఉండేవే, మతం ఒక్కటే ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టం చేస్తుంది. మత భావనలు లేని మనిషి జంతువుతో సమానం’అని వెయ్యి సంవత్సరాల క్రితం నాటి ‘హితోపదేశం’వివరిస్తుంది. జంతు సహజాతాలు సంపూర్ణమైన విజ్ఞానంగా మారిన తీరు గురించి పాశుపత శైవులు అభివర్ణిస్తారు.
వేదాలు, ఉపనిషత్తులు, ధర్మ సూత్రాలు వంటి బ్రాహ్మణ సంప్రదాయాలు, బౌద్ధం, జైనం వంటి శ్రమణ సంప్రదాయాలు మతం సామాజికంగా నిర్వహించే పాత్ర గురించి సమగ్రమైన అవగాహన అందిస్తాయి. ‘మతం అనేది ఈ విశ్వ ఆవిర్భావాన్ని, నియంత్రణనను వివరించే సంవిధానం’అని పై గ్రంథాలు వివరిస్తాయి.
70,000 ఏళ్ల క్రితం నాటి జ్ఞాన విప్లవం మూలంగా మానవులు సామాజిక కార్యకలాపాలు చేపట్టారని పరిశోధనలు సూచిస్తున్నాయి. అప్పటి మార్పులు జీవ పరిణామక్రమాన్ని అనుసరించి వివరించిన పరిస్థితులు లేవు. కామ, క్రోధ, లోభాలు వంటివి జీవ పరిణామ కార్యకలాపాలు. సామాజిక కార్యకలాపాలు దృక్పథాల నుంచి అవతరిస్తాయి. మతం అనేది ఈ తొలిదశలో ఏర్పడింది.
సమాజం అనేది ఊహాజనిత వాస్తవాల మీద ఆధారపడి ఉంటుందని ఆధునిక చరిత్రకారుడు యువల్ నోవా హరారీ అభివర్ణిస్తాడు. జాతి, డబ్బు, దేవదేవుళ్లను మానవ సమూహాలు సమిష్టిగా నిజం అని భావిస్తాయి. ఆదాము- అవ్వ, మనువు- శతరూప వంటి కథనాలను మానవులు పరస్పర విశ్వాసాల పంపిణీ ఆధారంగా రూపొందించుకుంటారు.
చైతన్యం ద్వారా ఈ విశ్వసృష్టికి సంబంధించిన తాత్విక వ్యవస్థలను మతపరమైన భావధార అభివృద్ధి చేసింది. తర్వాత కాలంలో వీటిని పురాణాలుగా చెలామణిలోకి తీసుకువచ్చారు. యజ్ఞాలు, పూజలు వంటి ఆచారాలను అభివృద్ధి చేసి సమాజంలోకి చొప్పించారు. ప్రపంచాన్ని నియంత్రించడానికి విలువల వ్యవస్థ ఆవిర్భవించింది. నియమాలు, ఆచారాలు, నైతిక విలువలువంటివి ఆ వ్యవస్థలో భాగంగా ఏర్పడ్డాయి.
అంటే మతానికి ఐదు పార్శ్వాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. తత్వం, ఆచారం, విలువల వ్యవస్థ ప్రతీకలు, మత నిర్మాణం. ఈ ఐదు పార్శ్వాలు భాష్యం చెప్పడానికి నియంత్రణకు సాధనాలుగా మారాయి. మానవ చైతన్యానికి ముడి పెట్టేందుకు దోహదపడ్డాయి.
మత చైతన్యం..
మానవులు అందరిలో అన్నమయకోశం, ప్రాణమయ కోశం, మనోమయకోశం, విజ్ఞానమయ కోశం, అనంతమయ కోశం అనే ఐదు తిత్తులు ఉంటాయని తైతరేయ ఉపనిషత్తు వివరిస్తుంది. జంతువులలో కూడా మొదటి మూడు తిత్తులు ఉంటాయి. నాల్గవ తిత్తి కలిగి ఉన్న కొద్దిమంది మానవులు క్రమశిక్షణతో ఒబ్బిడిగా ఉంటారు. ఐదవ తిత్తి పరిపూర్ణ చైతన్యంలో, ఆత్మలో, సంలీనం కావడానికి అవసరమైన స్వీయాన్వేషణకు దోహదపడుతుంది. మతానికి ఈ ఐదు కోశాలే ఆలంబనగా ఉంటాయి. మానవులలో తొలుత ఇతర జీవ కోటిపట్ల, పూర్వీకులపట్ల, ఈ విశ్వం పట్ల బాధ్యతతో ఎలా మెలగాలో తెలివిడి ఏర్పడింది. ఆధిపత్య భావన అభివృద్ధి చెందిన కొద్దీ ఈ బాధ్యతలు అడుగంటి పోయాయి. తదనుగుణంగా మతంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.
భారతీయ చరిత్ర మత పరిణామక్రమ స్వభావాన్ని నిర్ధారిస్తుంది. క్రీ.పూ వెయ్యి సంవత్సరాల కాలం సంభవించిన వ్యవసాయిక విప్లవం ప్రాంతీయ రాజ్యాలను, వర్ణవ్యవస్థను నెలకొల్పింది. అయితే వీటిని తృణీకరించడం ద్వారా ప్రతిఘటన కూడా తలెత్తింది. క్రీ పూ 500 సంవత్సరాల క్రితం మొదలైన పట్టణీకరణ వాణిజ్య విస్తరణ, సామ్రాజ్య విస్తరణలకు దారి తీసింది. దీంతో విదేశీ దురాక్రమణలు, సాంస్కృతిక సంలీనాలు మొదలయ్యాయి.
క్రీ.శ 4వ శతాబ్దం గుప్తులకాలంలో తిరిగి ఆధిపత్య ధోరణులను నెలకొల్పేదానికి, భూస్వామ్య విధానానికి అంకురార్పణ జరిగింది. గుప్తుల అనంతర కాలంలో వివిధ కులాలు ఆవిర్భవించాయి. క్రీ.శ 100వ సంవత్సరం నాటికి భూస్వామ్య విధానం విస్తరించి మొరటుగా తయారవడం ప్రారంభమయ్యింది. అప్పట్లో మతం సమాజాన్ని ప్రజాస్వామికరించడానికి పెనుగులాడింది.
20వ శతాబ్దం తొలినాళ్లలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందడం మొదలయ్యింది. 1990 నాటికి ఆర్థిక మార్పులకు దారి తీసింది. చరిత్ర మూలమలుపులు అన్నింటా మతం అనేది ఆధిపత్యం స్థిరపడడానికి, ఆధిపత్య ధోరణులను ప్రతిఘటించేందుకు సైద్ధాంతిక భూమికను సిద్ధం చేసింది.
మతంలో భారీ మార్పులు..
మానవాళి వ్యవసాయంలో స్థిరపడిన కాలంలో తొలిసారిగా మతంలో ప్రధానమైన మార్పు సంభవించిందని పరిశోధకులు గుర్తించారు. వేలాది సంవత్సరాలుగా సంచార జీవులుగా మెలిగిన మానవాళి బహుదేవతారాధన ఆశ్రయించింది. సృష్టికి మూలమైన అతీతశక్తి ఏదో ఉందని విశ్వసించింది. యక్షుల నిరుక్త నిఘంటువు దేవతలు అంటే దయతో కోరినది ఇచ్చువారిగా అభివర్ణించింది వైదిక సంప్రదాయం దేవతలను పృథ్వి(కోర్కెలకకు భూమిక), అంతరిక్ష(కోర్కెల యవనిక) ద్యులోక(కోర్కెలను జయించే స్థితప్రజ్ఞత) వంటి మూడు గణాలుగా వర్గీకరించింది. ప్రతి గణాన్ని తిరిగి 11 ఉపగణాలుగా విభజించి ప్రతి ఉపగణానికి 33 మంది దేవతలను ప్రతినిధులుగా నిలిపింది. సంచార మతం అతీతశక్తులను దైవంగా కొలిచి ఆరాధించింది.
మానవాళి వ్యవసాయంలో స్థిరపడ్డాక మతం అనేది అతీత శక్తులకు బదులు సంపూర్ణ జ్ఞానాన్ని(బ్రహ్మను దీనికి ప్రతినిధిగా ప్రతిష్ఠించి) ఆలంబనగా చేసుకుంది సామాజిక ఆధిపత్యం. దానికి ప్రతిఘటన రెండూ కూడా మతపరమైన కార్యకలాపాల్లో భాగంగా మారాయి. వైదిక మతం ఆధిపత్యానికి, శ్రమణ మతం ప్రతిఘటనకు ప్రతీకలుగా నిలిచాయి.
పారిశ్రామిక విప్లవం మతంలో మూడవ అతిపెద్ద మార్పుకు దోహదం చేసింది. ప్రొటెస్టెంట్ మతం లాభార్జనే థ్యేయంగా సాగే పెట్టుబడిదారీ విధాన ఆవిర్భావానికి తోడ్పడింది. పెట్టుబడిదారీ విధానం తొలిదశలో ప్రజాస్వామిక విలువలను పాటించిన కాలం గడిచేకొద్దీ ఈ విలువలను తుంగలో తొక్కింది. ఆధునిక మతం ఛాందసత్వానికి, అస్థిత్వ ఆధారిత వైషమ్యాలకు ఆలవాలంగా మారింది. మతం తన ఆదిమ స్వభావాన్ని, ఆచారలను కోల్పోయింది.
ఆధిపత్యం- ప్రతిఘటన..
వ్యవసాయిక విప్లవకాలంలో బహుదేవతారాధనకు పునఃభాష్యం కల్పించడంతో సామాజిక ఆధిపత్యాన్ని నెలకొల్పారు. బ్రాహ్మణ, సూత్ర గ్రంథాలు త్రిమూర్తుల ప్రతిష్ఠాపనతో ఈ ఆధిపత్యం నెలకొల్పాయి. ఈ మార్పులు వర్ణవ్యవస్థ, జనపదాల(ప్రాంతీయ రాజ్యాలు) ఆవిర్భావానికి దారి తీశాయి. సంచార తెగపెద్ద క్షేత్ర పాలకుడిగా మారాడు. వివక్షాపూరిత వ్యవస్థ ప్రజలలో భేదాన్ని వ్యాప్తి చేసింది. ఈ కష్టాల కడగండ్ల నుంచి పరిష్కారం కోసం తాత్విక ఆలోచనల మీద ఆధారపడటం పెరిగింది.
అయితే, ఈ ఆధిపత్యాన్ని నీగ్రిటో, ఆస్ర్టలాయిడ్, మంగోలాయిడ్, ద్రవిడ తెగలు ప్రతిఘటించాయి. ఈ తెగలను మతైక- సాంస్కృతిక సంప్రదాయాలలో ఎలా మిళితం అయ్యాయనేదానికి వైదిక మతంలోని రుద్రుడు శివుడిగా అవతరించడమే సాక్ష్యం.
వర్ణవివక్షకు వ్యతిరేకంగా సర్వసంగ పరిత్యాగం ముందుకు వచ్చింది. ఈ సర్వసంగ పరిత్యాగం కౌచ్ఛిక, బౌద్ధిక, హంస, పరమహంస వంటి నాలుగు స్థాయిలుగా వర్గీకరించబడింది. ఈ సర్వసంగపరిత్యాగులు ఉపనిషత్తులను ప్రతిఘటనా సాహిత్యంగా గుదిగుచ్చారు. అతీత శక్తులు ఆరాధనకు బదులుగా ‘అహం బ్రహ్మసి’ని ఆరాధనగా ముందుకు తీసుకువచ్చారు. శంకరాచార్యులు ‘బ్రహ్మ’ను సృష్టికర్తగా వర్ణించారు. అయితే ఉపనిషత్తులు నిర్వికార, నిరామయ చైతన్యాన్ని ‘ఆత్మ’గా పరిగణించాయి.
వర్ణాధిపత్యం బలపడడానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. సూత్రకాలంలో వర్ణాధిపత్యం స్థిరపడింది. వైదిక సంప్రదాయాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. కేనుడు పంచమయజ్ఞాలు, శ్రౌతయజ్ఞాల మధ్య ఉన్నటువంటి తేడాలను వివరించాడు. వర్ణాశ్రమ వ్యవస్థ, వర్ణవ్యవస్థ సమర్థకులు, వ్యతిరేకుల మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించింది. కొంతమంది ఇందుకు అంగీకరించారు. కానీ శ్రమణులు తిరస్కరించారు. తొలి సర్వసంగ పరిత్యాగులు ‘యతులు’ అని హరివాద చక్రవర్తి వివరిస్తాడు. రుగ్వేదంలో పేర్కొన్నట్లు ఈ ‘యతుల’ మీద ఇంద్రుడు చేసిన దాడి ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే దాడి అని స్పష్టం చేశాడు.
శ్రమణ సంప్రదాయాలు..
శ్రమణ సంప్రదాయాలు ఒక వెలుగు వెలిగే నాటికి జనపదాలు అంతరించిపోయి సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. యుద్ధాలు, వాణిజ్యం విస్తరించాయి. ఈ మార్పులకు అనుగుణంగా శ్రమణులు సప్రదాయ చట్రంలో తగిన మార్పులు చేర్పులు తీసుకువచ్చారు.
అంతిమ సత్యాన్ని అందుకోవడానికి శ్రమణులు ఆచరించే మార్గం బ్రహ్మణ సంప్రదాయాలతో మౌళికంగా విభేదిస్తుంది. ఇహ- పరలోకాల్లో పరమ సత్యం అంటూ ఏదీ ఉండదని, మార్పు నిరంతరాయమైనదని బుద్ధుడు బోధించాడు. బయటకు కనిపించేవన్నీ వ్యక్తిత్వ లక్షణాల సమాహారమని, ఆత్మ అనేది ఆలోచనలు, భావోద్వేగాల ప్రవాహానికి ఆలవాలమని బౌద్ధం వివరిస్తుంది. ఈ విశ్వంలో ప్రతిదీ పరస్పరాధారితం, పరమ ప్రమాణం అంటూ ఏదీ ఉండదని బౌద్ధంలోని ప్రతిత్య సముత్పాదం స్పష్టం చేస్తుంది. బుద్ధుడు ఆత్మ ఉనికిని నిరాకరించాడు. అజ్ఞానం నుండి, ముదసలితనం నుండి బయట పడేందుకు పన్నెండు సూత్రాలను ప్రతిపాదించాడు. నిర్వాణం అనేది ముక్తికి పరమపద సోపానం అని వివరించాడు.
అలాగే జైనం కూడా అసలైన చైతన్యం అనేక రూపాల్లో ఉంటుందని, జ్ఞానం అనేది స్థల, కాలాల మీద ఆధారపడి ఉంటుందని(అనేకత్వవాదం) ప్రతిపాదించింది. ప్రతి పదార్థానికి స్వరూపధర్మం ఉంటుందని అంటే మార్పుకుగురవుతూ ఉంటాయని, ఆగంతుక ధర్మం, జైనం వివరిస్తుంది.
మానవుడి ఉనికిని సజీవం, అజీవం అని రెండుగా వర్గీకరించింది. మనిషి ఉనికి సంపూర్ణంగా సమగ్రత పొందడమే ‘కైవల్యం’ అని జైనం చెబుతుంది.
మత పరిణామక్రమంపై విదేశీ ప్రభావం..
క్రీ.పూ 200 నుంచి క్రీ.శ 200వ సంవత్సరాల మధ్య పట్టణీకరణ పెరుగుదల, వాణిజ్య విస్తరణ, విదేశీ దురాక్రమణ, విదేశీ సామ్రాజ్యాల ఆవిర్భావాలతో భారత భూభాగంలో మూడవ అతిపెద్ద మూల మలుపు సంభవించింది. విదేశీ పరిపాలకులైన ఇండో- గ్రీక్ రాజు మీనాంధ్ర, కుషాణ రారాజు కనిష్కుడు వంటి వారు బౌద్ధాన్ని ఆదరించి, అవలంబించారు. ఈ సామ్రాజ్యాల పతనానంతరం విదేశీయులు ఇక్కడి వర్ణవ్యవస్థలో ఇమడడం సమస్యాత్మకంగా మారింది. శ్రమణ సంప్రదాయాలు ఇందుకు మెరుగ్గా తోడ్పడ్డాయి.
ఈ కాలంలోనే బౌద్ధంలో హీనయాన, మహాయానాలు అనే విభజన వచ్చింది. ఈ లోకంలోని సకల చరాచర జీవరాశులు నిర్వాణం పొంచేందుకు స్వార్థరహితంగా కృషి చెయ్యడమే మహాయానంగా ముందుకు వచ్చింది. వ్యక్తి నిర్వాణానికే పరిమితమైన బుద్ధుని తొలినాటి బోధనలు హీనయానంగా మిగిలిపోయాయి. మహాయానంలో విదేశీయులు అనేక సాంస్కృతిక అంశాలను జోడించారు. బౌద్ధంలా జైనం కూడా శ్వేతంబర, దిగంబర అనే రెండు సంప్రదాయాలుగా విడిపోయింది. అయితే జైనం ప్రవచించిన పూర్తి అహింసా మార్గం మూలంగా క్రమేపీ దాని ప్రభావం తగ్గిపోయింది.
గుప్తులశకం- మత రూపాంతరం..
గుప్తుల సామ్రాజ్య కాలంలో మత పరిణామక్రమం భారీ మార్పులకు లోనై గుప్తుల అనంతరకాంలో కూడా కొనసాగింది. ఈ కాలంలో పురాణాలు కీలకమైన గ్రంథాలుగా చెలామణిలోకి వచ్చాయి. శూద్రుల పట్ల అత్యంత కఠినమైన నిబంధనలను ఈ కాలంలోనే ‘స్మృతు’లలో చేర్చారని అస్పృశ్యత పెచ్చరిల్లిందని పరిశోధకులు విశ్వసించారు.
బ్రహ్మణమతంలో కూడా శైవ, వైష్ణవ, శాక్తేయ పేరిట మూడు తెగలు ఆవిర్భవించాయి. ఐదవ శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దం వరకు ఇవి ఆభివృద్ధి చెందుతూ వచ్చాయి. ప్రాచీన కాలపు శివ, విష్ణు రూప గుర్తులకు పునఃభాష్యం చేయడంతో మతం నుండి విడగొట్టుకొని శాక్తేయ మతం ఆవిర్భవించింది.
ఈ కాలంలోనే అవతరాల సిద్ధాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. మహాయాన బౌద్ధం నుండి ప్రేరణపొంది బ్రాహ్మణ మతంలో భక్తి సంప్రదాయం పొదుపుకుంది. విష్ణు అవతారాన్ని వ్యవస్థీకృతం చేశారు. శైవ మతం కూడా అవతారాల సిద్ధాంతాన్నే ఆలంబనగా చేసుకుంది. ఐహిక దఃఖాల నుండి భక్తులకు విముక్తి కల్పించడానికే భగవంతుడు విష్ణు అవతారం ఎత్తాడని, శివుని అవతారం ఎత్తాడని వైష్ణవ, శైవమతాలు బలమైన నమ్మికను ఎగదోశాయి. ముఖ్యంగా సమాజంలో అట్టడుగు వర్గాలలో ఈ నమ్మిక బలంగా పాతుకుపోయింది.
వివిధ కులాచారాలు అన్నీ ఈ భక్తి సంప్రదాయ చట్రంలోకి ఒదిగిపోయాయి. కొన్ని పురాణాలు శివుడుని దేవదేవుడిగా స్థుతించి స్థిరపరిచినా వైష్ణవ, శైవ సంప్రదాయాలు రెండింటికీ రాజభోగం లభించింది. సామాజికంగా కులవివక్షను అత్యంత దుర్మార్గంగా అమలు చేస్తూనే దేవుడి ముందు అందరూ సమానులే అని, ఆ దేవుడిని నిత్యం కొలవడం ద్వారా మోక్షం పొందవచ్చని భక్తి సిద్ధాంతం జనాన్ని నమ్మించగలిగింది.
ఈ కాలంలోనే భారత సామాజిక- సాంస్కృతిక జీవన విధానంలో గణనీయమైన మార్పులకు దారితీసిన సామాజిక ఆర్థిక మార్పులకు పునాది పడింది. పరిపాలనాధికారాలు వికేంద్రీకరించబడ్డాయి. శాతవాహనుల కాలంలో ఈ వికేంద్రీకరణ మొదలయింది. ఈ కాలంలోనే పూజారులకు, ఆలయాలకు దేవుని మాన్యం కింద భూములు, పల్లెలు రాసివ్వడం ప్రారంభమయ్యింది. మౌర్యులు, గుప్తుల కాలంలో సుణిక్షిత భారీసైన్యం ఉండేది. శాతవాహనుల కాలానికి వచ్చేసరికి భూస్వామ్య ప్రభువుల బలగాల మీద ఆధారపడటం పెరిగింది. 7, 8 శతాబ్దాలలో సైనిక అధ్యక్షులకు, క్షేత్రస్థాయి పరిపాలకులకు భూములు ఇనాం హక్కులు ఇవ్వడంతో భూస్వామ్య సమాజం అవతరణ వేగవంతం అయ్యింది. భూస్వామ్య వర్గం కొత్తగా ఉనికిలోకి వచ్చింది.
గుప్తుల కాలంలో దూరప్రాంత వాణిజ్యం తగ్గుముఖం పట్టింది. పర్యవసానంగా మూడు- నాలుగు శతాబ్దాలలో పట్టణీకరణ తగ్గుముఖం పట్టింది. అస్పృశ్యత గతంలోకంటే మరింత పెరిగింది. గుప్తుల అనంతకాలంలో భారత భూభాగంలో అనేక చిన్నచిన్న రాజ్యాలు అవతరించాయి. గౌడ, మౌఖారి, పుష్యభూతి, గుర్జర్, ప్రతీహార, పాళ, పల్లవ, పాండ్య, రాష్ట్రకూట, చౌహాన్, గద్వాల్ సామ్రాజ్యాలు ఇలా అవతరించినవే.
రాజకీయాధికారంలో వస్తున్న ఈ మర్పుల నడుమనే భూస్వామ్య విధానం రెండు అంచెలలో వేగంగా విస్తరించింది. ఇనాం భూముల మీద న్యాయపరమైన, పరిపాలనాపరమైన అన్ని హక్కులు దఖలు పడడంతో స్థానిక ప్రజానీకం మీద పాలకులే రాజ్యాంగయంత్రంగా మారారు. దీంతో భూయాజమాన్యం ఆస్తుల ఆక్రమణ, నిర్బంధ చాకిరీలకు పాల్పడుతూ, రైతుల నుండి ఇష్టారాజ్యంగా కౌలు వసూళ్లు చెయ్యడం పరిపాటిగా మారింది.
ఆధిపత్యమత భావధారలో భాగంగా వైదిక కాలం నుండి రాజుని సాక్షాత్తు దేవుడిగా భావించే సంప్రదాయం చెలామణిలో ఉంది. భూస్వామ్య విధానం బలపడడం ద్వారా రాజు భూమి మీద వెలసిన దేవుడి ప్రతినిధిగా ఒక వెలుగు వెలిగాడు. 6 వ శతాబ్దంలో మొదలయిన తాంత్రిక విద్య 8వ శతాబ్దం నాటికి బాగా విస్తరించింది. మద్యం, మగువ, శృంగారం, స్మశాన నివాసం లాంటి ఆచారాలు ఈ తాంత్రిక విద్యలో భాగంగా మారాయి. బౌద్ధంలో వజ్రయాన, శైవంలో కాపాలిక/కాలముఖ సంప్రదాయాల పేరిట ఈ ఆచారాలు పాటించేవారు. ఇవన్నీ ఆధిపత్యాన్ని ప్రతిఘటించే నిరసన రూపాలుగా అనేకమంది పండితులు అభివర్ణించారు.
తాత్విక చింతనాభివృద్ధి..
ఇదే కాలంలో బ్రహ్మణ, శ్రమణ మతాల మధ్య జరిగిన చర్చోపచర్చలలో భాగంగా సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, వేదాంత అనే ఆరు తాత్విక ధోరణులు క్రమంగా రూపుదిద్దుకున్నాయి.
ఆదిశంకరాచార్యులు వేదాంతానికి అద్వైత సిద్ధాంతాన్ని జోడించారు. తదనంతర శతాబ్దాలలో వైష్ణవ తాత్విక చింతనకు అనేక పాయలు తోడయ్యాయి. మధ్వాచార్యులు(12వ శతాబ్దం) ద్వైతవాదం, నివారా ఆచార్యులు(7వ శతాబ్దం) ద్వైతాద్వైతం, వల్లభాచార్యుల(15వ శతాబ్దం) శుద్ధాద్వైతం, రామానుజాచార్యుల(11వ శతాబ్దం) విశిష్టాద్వైతాలు వైష్ణవ సిద్ధాంతంలో ఉపసంప్రదాయాలుగా వెలుగులోకి వచ్చాయి. గుప్తులకాలంలో ఈ తాత్విక చింతనలు వాటి ఆదర్శాల మీద బలమైన ప్రభావం చూపించాయి. ఇదే కాలంలో శివతత్వం కూడా వేదాంత ధోరణులను ఆలంబనగా చేసుకుని అభివృద్ధి చెందింది.
ఇదే కాలంలో బౌద్ధం కూడా అభివృద్ధి చెందింది. 4వ శతాబ్దంలో ఆర్య అసంగ్ ప్రభోదించిన విజ్ఞానవాదాన్ని(చైతన్యవాదం) వసుబంధు మరింత ముందుకు కొనిపోయాడు. నాగార్జునుడి శూన్యవాదంతో బౌద్ధమత తాత్విక ప్రయాణం ఆరంభమయింది. 9వ శతాబ్దంలో మొదలైన సహజయాన వజ్రాయనం ఆధిపత్యభావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ నైతిక విలువలు నిర్లక్ష్యం చెయ్యడం మూలంగా ప్రజాబాహుళ్యంలో గౌరవం కోల్పోయింది. మారిన పరిస్థితులను ఆకలింపు చేసుకోలేకపోవడం మూలంగా 9-10 శతాబ్దాలలో బౌద్ధంలో ప్రతిష్టంభన నెలకొంది. పర్యవసానంగా బౌద్ధులు, శైవుల మధ్యన మతఘర్షణలు చెలరేగాయి. అనేక హింసాత్మక ఘటనలు చరిత్రలో నమోదయ్యాయి. పాళరాజుల కాలంలో ఈ ఉద్రిక్తతలు మరింత ప్రస్ఫుటమైయ్యాయి. బౌద్ధ దేవతా మూర్తులైన అపరాజిత, సాంబర్లతో పాటు స్వయానా బుద్ధ విగ్రహాలను మలిచిన తీరు ఇందుకు తార్కాణం. ఈ నేపథ్యంలో బౌద్ధం ప్రభావం క్రమేపీ పలుచబడింది.
హిందూమతం- నూతన సంప్రదాయాల ఆవిర్భావం
బౌద్ధం, శైవ మతాల మధ్య చెలరేగిన ఘర్షణలను సమసిపోయేలా చెయ్యడానికి 10వ శతాబ్దంలో నాద సంప్రదాయం ఆవిర్భవించింది. బౌద్ధం తరువాత భారతదేశ చరిత్రలో మొదలయిన రెండవ అతి పెద్ద మత ఉద్యమం నాద సంప్రదాయం అని ప్రముఖ చరిత్రకారుడు హజారీ ప్రసాద్ ద్వివేది అభిప్రాయపడ్డారు. బౌద్ధ, శైవ మతాల మధ్యన ఐక్యత సాధించే క్రమంలో హిందూమతం ఆవిర్భవించింది. 13వ శతాబ్దానికి ముందు ‘హిందూ’ అనే పదం మత ఉనికికి సంబంధించింది కాదని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త డేవిడ్ లోరెన్జెన్ స్పష్టం చేశాడు.
విద్యాపతి రచించిన ‘కీర్తిలత’, ‘పురుష పరీక్ష’ గ్రంథాలలో తొలిసారిగా ‘హిందూ’ అనే పదాన్ని మతానికి ప్రతీకగా వాడారని ప్రముఖ సామాజిక శాస్ర్తవేత్త హేతుకర్ ఝా ఉదహరించారు. చాంద్రవరదాయి రచించిన ‘పృధ్వీరాజ్ రాసో’ గ్రంథంలో కూడా ‘హిందూ’ పదాన్ని మతానికి ప్రతీకగా వాడారు. పురుష పరీక్షలో హిందూమత శాశ్వత నిర్మాణం కోసం మతాన్ని కులాచారం, సాధారణ ధర్మాలుగా విభజించారు. వివిధ కులాచారాలను మత సంప్రదాయాలుగా వర్గీకరించారు. నైతిక విలువలను నాలుగు పురుష అర్థాలుగా విభజించి వాటిని సాధారణ ధర్మంగానే పేర్కొన్నారు. కులాచారాలు, సాధారణ ధర్మాలు అన్నీ కలిసి నిజమైన మతంగా(హిందూమతం) వెలుగొందుతుందని విద్యాపతి భావించాడు. శైవ, వైష్ణవ, శాక్త, బౌద్ధ, జైన సంప్రదాయాలన్నింటినీ ఉమ్మడి ‘హిందూ ధర్మం’గా పేర్కొన్నారు. అంటే వివిధ మత సంప్రదాయాల సమాహారంగా హిందూ మతం ఉనికిలోకి వచ్చింది. వివిధ మత గ్రంథాలే హిందూ మత గ్రంథాలుగా పరిగణించారు. ఈ క్రమంలోనే బుద్ధుడిని విష్ణువు పునర్జన్మావతారంగా అభివర్ణించారు.
సనాతన ధర్మ మూలాలు- ఆధునిక హిందూమతం..
ప్రస్తుత కాలంలో హిందూమతాన్ని సనాతన ధర్మంగా ప్రచారం చేస్తున్నారు. కానీ, చరిత్రలో సనాతనధర్మం పేరిట ఎలాంటి మతప్రసక్తి లేదు. థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకురాలు అనిబిసెంట్ తొలిసారిగా సనాతన ధర్మాన్ని హిందూమతానికి పర్యాయపదంగా తన రచనల్లో వాడారు. అప్పటి నుంచి సనాతన ధర్మం అంటూ ఒకటి ఉందని హిందువులలో భ్రమలు కల్పించే ప్రయత్నాలు కొనసాగుతూ వస్తున్నాయి. బ్రిటిష్ వలస పాలనా కాలంలో చేపట్టిన జనాభా గణనలో హిందూ సమాజంలో బౌద్ధులు, జైనులు, సిక్కులను వేర్వేరు మతాలుగా గుర్తించింది.(సిక్కు మతాన్ని వైష్ణవమతంలో ఉపతెగగా భావిస్తుంటారు.)
14-15 శతాబ్దాలలో ఉత్తర భారత భూభాగంలో శ్రీ(రామావత్) సంప్రదాయం లేక రామానంద సంప్రదాయం మత ఘర్షణల నివారణకు నడుం కట్టింది. ఆ కాలంలో వైష్ణవ మతంలోని అద్వైత, ద్వైత, ద్వైతాద్వైత, శుద్ధాద్వైత, విశిష్టాద్వైత సంప్రదాయాలతో పాటు వైష్ణావతరాన్ని కొలిచే సగుణ, నిర్గుణ సంప్రదాయాలు దేనికదే తన సంప్రదాయాధిపత్యాన్ని రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రామానందుడు విష్ణువు, శివుడు, రాముడు, కృష్ణుడు అందరూ ఆ బ్రహ్మ సృష్టే కాబట్టి వీరిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువా కాదు, అందరూ సమానులే అనే వాదాన్ని ముందుకు తీసుకువచ్చాడు. ”జాత్ పాత్ పూఛే నహీ కోయీ, హరికో భజాయెనో హరికో హోయ్”(కులం, మతం గురించి ఎవరూ అడగరు, హరిని కొలిచే ప్రతి ఒక్కరూ హరికే చెందుతారు) అంటూ మత వైషమ్యాలను తగ్గించేదానికి కృషి చేశాడు. అంతేకాదు భూస్వామ్యక్షీణ విలువలయిన కుల వివక్ష, అస్పృశ్యతలకు వ్యతిరేకంగా బలంగా ప్రచారం చేశాడు. ఉత్తరాదిన రామానందుడి బోధనలు బహుళ ప్రజాధరణ పొందాయి.
రామానుజాచార్యులు ప్రారంభించిన విశిష్ఠాద్వైత వైష్ణవ భక్తి సంప్రదాయం నుంచి రామానందుడి సంప్రదాయం ఆవిర్భవించింది. దక్షిణభారత భూభాగంలో వేల ఏళ్ల క్రితం సాగిన ఆళ్వార్ యోగి ఉద్యమంలో శూద్రులు, మహిళలను కూడా పన్నెండు మంది మహాయోగులలో అంతర్భాగం చేసుకుంది. కుల వివక్షను తిరస్కరించింది. రామానందుడి గురువు ఈ రకమైన కుల వివక్షకు గురికావడంతో రామానందుడు శ్రీ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతిఘటననోద్యమాన్ని కొనసాగించారు.
ఇస్లాం- సుల్తానుల పరిపాలనా కాలం
13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల పరిపాలన మొదలు కావడంతో భారతీయ సాంస్కృతిక రంగం ఇస్లామిక్ ప్రపంచలో కాలుమోపింది. 16వ శతాబ్దంలో మొఘలులు అధికారం దక్కించుకునే వరకు భారత భూభాగంలో గులాం, ఖిల్జీ, తులుక్, సయ్యద్ల పాలన కొనసాగింది. సుల్తానుల పరిపాలనా కాలంలో రాజ్యమతంగా ఇస్లాం కొనసాగింది. ప్రజల మీద ఇస్లాం మతావలంబన కోసం నిర్బంధం కూడా అక్కడక్కడా కొనసాగింది. కొంతమంది హిందువులు నిర్బంధంగా ఇస్లాం మతాన్ని స్వీకరించారు. కానీ, శూద్రులు మాత్రం కుల వివక్ష పీడనను వదిలించుకోవడానికి ఇస్లాం మతాన్ని ఆశ్రయించారు. 7వ శతాబ్దం నాటికే సింధ్ ప్రాంతంలోనూ, 9వ శతాబ్దం నాటికి ఉత్తర భారత ప్రాంతంలోనూ ఇస్లాం భావజాలం వ్యాప్తి చెందింది.
ఇస్లాం వ్యాప్తికి సూఫీ సాధువులు ఎంతగానో తోడ్పడ్డారు. షరియత్(ఇస్లాం చట్టం)కు బదులు తారీఖత్(ఆధ్యాత్మిక మార్గం)ను సూఫీ సాధువులు ఆలంబనగా చేసుకున్నారు. సూఫీ సాధువులు చిస్తీ , సుప్రవర్ది, ఖద్రియా, వక్షాబందీ, రసూల్ షాపి, మదారియావంటి సంప్రదాయాలు అనుసరిస్తూ సహనం, ప్రేమ, శాంతి, భాతృత్వం వంటి ఉదార విలువలను ప్రచారం చేశారు. బౌద్ధం క్షీణిస్తున్న క్రమంలో ఆ మతావలంబకులు ఎక్కువమంది ఇస్లాంమతం స్వీకరించారు. సుల్తానుల పరిపాలనలో ఉలేమాలు కీలకపాత్ర పోషించారు. సికిందర్ లోడీ పరిపాలనా కాలంలో శైవ, వైష్ణవ మతస్థుల మధ్య నెలకొన్న ఘర్షణల పూర్వరంగంలో వైష్ణవులలో అఖాడాల పేరిట బలగాలు ఆవిర్భవించాయి.
మొఘలుల పరిపాలన- మత విధానాలు
16వ శతాబ్దంలో మొఘలుల పరిపాలన మొదలుకావడంతో ఇస్లాం పాలకుల దృక్పథంలో మార్పులు వచ్చాయి. మొఘలులు హిందువుల భావోద్వేగాలను గౌరవిస్తూ, వారి అభిమానాన్ని చురగొనడానికి అనేక మత సంస్కరణలు తీసుకువచ్చారు. సంకుచిత మనస్తత్వం ఉన్నటువంటి ఉలేమాలు ఈ ఉదార విలువల సంస్కరణల పట్ల విముఖత వ్యక్తం చేశారు. దీంతో పాటు కొన్ని సందర్భాలలో తిరుగుబాటు చేశారు. అక్బర్ చక్రవర్తి రామానంద్ తెగవారికి ‘నానక్ పంత్’ వారికి భూములు కేటాయించడంతో పాటు ఆర్థిక సాయం కూడా అందించాడు. రామభక్తిని పెంపొందించడానికి, రామ్ లీలా ఉత్సవాలకు అనేక విధాలా ప్రోత్సాహకాలు కల్పించాడు. సీతారాముల బొమ్మలతో నాణేలు ముద్రించి పంపిణీ చేశాడు. స్వామి నరహరిదాస్, గోస్వామి తులసిదాస్లకు ఎంతగానో తోడ్పాటు అందించాడు.
అక్బర్ తర్వాత మొఘల్ పరిపాలకులు, ఔరంగజేబ్ సహా, తొలుత ఈ ఉదారవాద విధానాలను కొనసాగించారు. అయితే, ఔరంగజేబ్ సింహాసనం అధిష్ఠించిన 11 ఏళ్ల తర్వాత సంప్రదాయ ఉలేమాల ఒత్తిడికి లొంగిపోయాడు. తన సోదరుడు దారా షికోకు అనుకూలంగానూ, లేదూ తన సంకుచిత విధానాలను వ్యతిరేకించిన దేవాలయాలు ఉలేమాల ప్రోద్బలంతో ధ్వంసం చేశాడు. తన విధానాలకు మద్దతుగా నిలిచిన దేవాలయాలకు తోడ్పాటు ఇచ్చాడు.
పారిశ్రామిక విప్లవం- వలసపాలకులు భాష్యాలు..
పారిశ్రామిక విప్లవానంతరం భారతదేశ మత యవనిక మార్పులకు లోనయింది. ఆగస్ట్ కోమ్టే ప్రభావంతో పారిశ్రామిక విప్లవం తొలినాళ్లలో మతాన్ని మూఢ విశ్వాసంగా పరిగణించారు. మానవ చరిత్రలో సామాజికాభివృద్ధిని కోమ్టే మతైక, తాత్విక, సానుకూల అనే మూడు దశలుగా అభివర్ణించాడు. మానవాళి ఈ సృష్టిని ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదికలేని అతీతశక్తుల సృష్టిగా భావించింది. తదనంతరం తాత్విక చింతన ద్వారా విశ్వాసాల నిగ్గు తేల్చుకుంది. అంతిమంగా శాస్త్రీయంగా పరీక్షకు నిలబెట్టింది. విశ్వాసాలను శాస్త్రీయంగా పరీక్షకు నిలబెట్టడమే సరైన దృక్పథం అని కోమ్టె వాదించాడు.
‘మతం- మానవత్వం'(రెలిజియన్ అండ్ హ్యూమానిటీ అనే పుస్తకంలో మతపరమైన ఆలోచనలను మూఢ విశ్వాసాలుగా పరిగణిస్తూనే వీటికి నైతిక ఉపయోగం ఉందని’ కోమ్టె రాసుకువచ్చాడు. అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణంతో ఈ దృక్పథం అతికినట్టు సరిపోయింది. సమాజం కండబలం మీద కంటే వాణిజ్య ఆధారిత వ్యవస్థ ద్వారా మానవాళికి స్వేచ్ఛను కల్పిస్తుంది. అని పెట్టుబడిదారీ వ్యవస్థ సిద్ధాంతీకరిస్తుంది. కోమ్టే వాదనలు ప్రజాస్వామ్యం పేరిట వస్తువినిమయవాద విస్తృతవ్యాప్తికి, లాభాపేక్ష కేంద్రక విలువలకు రాచబాటలు వేసింది. బ్రిటిష్ వలస పాలకులు భారతదేశంలో క్రమేపీ పెట్టుబడిదారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, దేశానికి స్వాతంత్ర్యం లభించే వరకు ఈ వ్యాప్తి పరిమితంగా ఉండింది. అదే సందర్భంలో ప్రజాజీవితాన్ని భూస్వామ్య సంబంధాలు ప్రభావితం చేస్తుండేవి. స్వాతంత్య్రానంతర కాలంలో కొన్ని దశాబ్దాల పాటు ఈ సంకర విధానాలు కొనసాగుతూ వచ్చాయి.
భారతీయ సమాజంలో తొలిదశలో అత్యంత అనాగరికమైన సతీసహగమనం, బాల్య వివాహాలు, వితంతువుల పునర్వివాహంపై నిషేధం, కుల వివక్ష, అస్పృశ్యతవంటి మూఢాచారాలతో కునారిల్లుతూ ఉండేదని చరిత్ర అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ చరిత్ర అధ్యయనం కూడా రెండు విధాలుగా కొనసాగింది. జర్మన్ చరిత్ర అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ చరిత్ర అధ్యయనం కూడా రెండు విధాలుగా కొనసాగింది. జర్మన్ చరిత్ర అధ్యయనవేత్త మాక్స్ ముల్లర్ ప్రాచ్యవాదాన్ని అనుసరిస్తే జేమ్స్మిల్, పాస్టర్ ఛార్లెస్ గ్రాంట్లు ఆధునిక వినిమయవాదాన్ని అనుసరించారు.
ప్రాచ్యవాదం భారతదేశాన్ని ఆధ్యాత్మిక చింతనకు, తత్వవేత్తలకు నెలవయిన భూమిగా చిత్రీకరించింది. తప్పితే భౌతిక పరిస్థితులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక ఆధునిక వినిమయవాదమేమో దేశంలోని కులవివక్ష, అస్పృశ్యత, సతీసహగమనం వంటి దురాచారాలన్నింటికీ హిందూమతమే మూలకారణమని ఆరోపించింది. పాస్టర్ ఛార్లెస్ గ్రాంట్ భాష్యాలన్నీ దేశంలో క్రైస్తవమతవ్యాప్తికి ఉద్దేశించినవిగా కనబడతాయి. క్రీ.శ 1వ శతాబ్దం మధ్య కాలంలోనే క్రైస్తవం భారతదేశంలో కాలుపెట్టింది. కానీ, 1800 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వలస పాలన మొదలయిన తరువాత కానీ ఆ మత నడవడిక వెలుగులోకి రాలేదు.
భారతదేశంలో చోటు చేసుకున్న రెండు మత సంస్కరణ ఉద్యమాలు ఆర్యసమాజం, బ్రహ్మసమాజం పట్ల ఈ చరిత్రకారుల అంచనాలలో వలసవాద పక్షపాత ధోరణులు ప్రస్ఫుటమవుతాయి. హిందూ కులీన వర్గాలు బ్రిటిష్ ప్రాపకం కోసం, హిందూమతం మీద ఉన్న దురభిప్రాయాన్ని కొంత మేరకయినా తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ రెండు మత సంస్కరణోద్యమాలు చేపట్టారనే వాదన కూడా ఉంది.
రామ్ విలాస్ శర్మ రచించిన ‘శాన్ శాంతవన్ కి రాజ్యక్రాంతి’ అనే పుస్తకంలో 1857 తిరుగుబాటుకు సన్నాహకంగా స్వామి దయానంద సరస్వతి చేపట్టిన కార్యకలాపాల గురించి వివరంగా పేర్కొన్నారు. స్వామి దయానంద సరస్వతి తన గురువు స్వామి చిర్రానంద ఆయన గురువు స్వామి పూర్ణానంద మరో ఇద్దరు మౌల్వీలతో కలిసి పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతమంతా పర్యటించి 1857 తిరుగుబాటుకు(బహదూర్ షా జఫర్ అనే ముస్లిం పాలకుడు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు.) తగిన సన్నాహాలు చేశారని దయానంద సరస్వతి గోసంరక్షణ ఉద్యమాన్ని చేపట్టాడు. మత, సామాజిక సంస్కకరణలను కోరుతూ 1857లో ఆర్యసమాజ ఉద్యమం ప్రారంభించాడు. బ్రిటిష్ పరిపాలనలో హిందూ కులీనులకు భాగం కల్పించే ఉద్దేశ్యంతో ముస్లిం వ్యతిరేక ప్రచారం కూడా శృతిమించి చేపట్టాడు. వేదాలు మాత్రమే ఆధ్యాత్మిక గ్రంథాలుగా అభివర్ణిస్తు ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం, శాక్తేయమతాలన్నింటినీ దయానంద సరస్వతి తీవ్రంగా విమర్శించాడు.
1857 తిరుగుబాటుకు ముందు హిందూ- ముస్లిం కులీనులు ఇరువురూ దేశం నుంచి బ్రిటిష్ వారిని పారద్రోలగలం అనే విశ్వాసంతో ఉన్నారు. అయితే ఆ తిరుగుబాటు విఫలం కావడంతో ఈ ఐక్యత కూడా బదాబదలయిపోయింది. హిందూ కులీనులు బ్రిటష్ వారి సేవలో తరించి పోతుంటే ముస్లింలు తమ అధికారాన్ని కోల్పోయారు. దాదాపు ఆర్థ శతాబ్దం పాటు ఆంగ్లేయుల మీద ఉన్న ద్వేషంతో ఇంగ్లీష్ విద్యకు దూరంగా ఉన్నారు. బ్రిటిష్ పాలకులు తెలివిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని హిందూ- ముస్లింల మధ్య విద్వేషాలను రగిలిస్తు విభజించి, పాలించే తమ విధానానికి పదును పెట్టారు.
దయానంద సరస్వతి కంటే చాలా దశాబ్దాలకు ముందుగానీ రాజా రామ్మోహన్రాయ్ సంఘసంస్కరణోద్యమానికి శ్రీకారం చుట్టారు. బహుదేవతారాధన, విగ్రహారాధనలను రాయ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఏకేశ్వరవాదాన్ని ప్రచారం చేశాడు. 1815లో ఆత్మీయసభ పేరిట ప్రారంభించిన సంస్థను 1828లో బ్రహ్మ సమాజంగా మార్చాడు. సతీసహగమనం, బాల్య వివాహాలు, పరదావంటి అనాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. 1872లో ప్రత్యేక వివాహ చట్ట రూపకల్పనకు దోహదం చేశాడు.
ప్రత్యామ్నాయ థృక్పథాలు- ఆధునిక పరిణామాలు..
రాజారామ్మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతులకు భిన్నమైన థృక్పథాన్ని స్వామి రామకృష్ణ పరమహంస ముందుకు తెచ్చాడు. నిజమైన ఆధ్యాత్మికవాది తరతమ భేదాలను అధిగమించినప్పుడే పరమహంస స్థాయికి చేరుకుంటారని బోధించాడు. ‘యధోమత, తధోపథ’ (ఎన్ని దృక్పథాలో అన్ని మార్గాలు) అని ప్రకటించాడు. ఇస్లాం, క్రైస్తవ మతాలను కూడా ఆచరించి మతాల మధ్యన భేదభావాలు లేవని స్పష్టం చేశాడు. అయితే, హిందూ కులీనులకు ఇలాంటి సాధికార మతాచారాల పట్ల ఎలాంటి ఆసక్తి లేకపోవడంతో పరమహంస బోధనలు, ఆయన అనుయాయులు నిర్లక్ష్యానికి గురయ్యారు. చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి ఆహ్వానం లేకున్నా హాజరయి తన ప్రసంగం ద్వారా హిందూమత ప్రత్యేకత గురించి వివరిస్తూ స్వామి వివేకానంద సర్వధర్మ సమభావనను ప్రభోదించాడు.
ఈ పరిణామాలన్నీ మతం పేరిట హిందూ- ముస్లిం కులీనులు రేపుతున్న ఘర్షణల వెనుక ఉన్న మోసకారితనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. నిజానికి ఈ కులీనులకు మతం పట్ల అసలయిన అనురక్తి, ఆసక్తులు లేనే లేవు.
20వ శతాబ్దం చివరి నాటికి పెట్టుబడిదారీ విధానం ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇచ్చేసింది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అస్థిత్వాల ఆధారంగా మత ఛాందసత్వాన్ని రెచ్చగొడతూ ఉంది. మతాచారాలు వాటి మౌళిక భావనల నుండి దూరం జరిగాయి. అవినీతిపరులైన మత గురువులకు ఎక్కడలేని గౌరవం, రక్షణలు లభిస్తున్నాయి. అంతర్జాతీయంగా చెలరేగుతున్న మత ఘర్షణలు వాస్తవానికి రాజకీయం స్వార్థ ప్రయోజనాల కోసం సాగుతున్నవే తప్పవాటిలో అసలయిన మత అంశాలు లేనే లేవు.
ముగింపు
మతం అనేది చైతన్యానికి సంబంధించిన కార్యకలాపాలను అనుసరించేది అయితే సైన్సు భౌతిక ప్రపంచ మర్మాలను అన్వేషిస్తుంది. సైన్సు అనేది ఏది, ఏమిటి, ఎందుకు అనేవి వివరిస్తుంది. కానీ మతం మాత్రం ఏమి ఆచరించాలో నిర్దేశిస్తుంది.
చారిత్రకంగా చూస్తే మానవాళిని మతం రెండు విధాలుగా ప్రభావితం చేసింది. సాహిత్యం, సంగీతం, నృత్యం, గణితం, రసాయనశాస్ర్తం, ఖగోళ శాస్ర్తం తదితర శాస్త్రాలను అభివృద్ధి పరిచేందుకు తగిన సైద్ధాంతిక దిశానిర్దేశం చెయ్యడంతో పాటు సంక్షేమ కార్యకలాపాల ద్వారా సమాజంలో సమతుల్యత సాధించేందుకు దోహదం చేసింది. ప్రాచీనకాలపు ఆశ్రయాలు, నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు, రామాయణ- మహాభారత గ్రంథాలు ఇవన్నీ అందులో భాగమే
మానవ జీవితం ఐహిక, ఆముహ్మిక ఆలోచనల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. మానవుని చైతన్యపూర్వక కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థ లేదు. మతం లేని పక్షంలో మానవులు ఈ భూగోళం మీద అత్యంత వినాశకర ప్రాణికోటిగా తయారై ఉండేది. నైతిక విలువలు క్షీణించి పోవడం మూలంగా అలవిమాలిన వినిమయ ధోరణులు, అతి ఆధ్యాత్మిక ధోరణులు ప్రబలి పోతున్నాయి. మానవాళి పురోగమనంలో తీవ్ర ఒడిదుడుకులకు దారి తీస్తున్నాయి. పారిశ్రామిక విప్లవానంతరం ఆధ్యాత్మిక ఆలోచనా ధోరణులు ధ్వంసం అయిపోయాయి. మానవాళి ఇవాళ ఆధ్యాత్మిక అరాచకత్వంలో చిక్కుకు పోయింది.
విచ్చలవిడి వస్తు వినిమయవాదం జీవిత ఆదర్శంగా మారిపోవడంతో విచ్చలవిడి దోపిడి నెలకొన్నది. గత వందేళ్లలో ఈ భూమి మీద ప్రకృతి వనరులు 23 రెట్లు అంతరించిపోయాయి. రాబోయే 200 ఏళ్లలో ఈ భూమి మానవ నివాసయోగ్యం కాకుండా పోతుందన్న స్టీఫెన్ హాకింగ్ అంచనా నిజమయ్యే ప్రమాదం ఎదురవుతున్నది.
ప్రస్తుతంలో ఉత్పత్తి లేకుండా ప్రకృతి వనరులను స్వాహా చేసి లాభాలను పోగేసుకునే దళారి పెట్టుబడిదారీ విధానం మొదలయ్యింది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఒక విధేయ సమాజాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది. ఆధిపత్య భావజాలం ప్రజలకు కష్టాలు, కడగండ్లకు గురిచేస్తు నానాటికీ పరాయికరణకులోను చేస్తుంది. కాబట్టి మతం చారిత్రక గతితర్కాన్ని ప్రస్తుత ఏకపక్ష పక్షపాత వాతావరణంలో అలాంటి మత ప్రతిఘటనా శక్తులు ఉనికిలో లేకుండా పోయాయి.
పురుషోత్తం
అనువాదం: కె సత్యరంజన్
(వ్యాసకర్త పురుషోత్తం పాట్నా కేంద్రంగా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ‘మత చరిత్ర గతి తర్కం’ మీద త్వరలో పుస్తకాన్ని వెలువరించనున్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.