
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మహాసంపన్నుల రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చినంత స్థాయిలో గతంలో ఎన్నడూ ఇంత బాహాటంగా ఏ పార్టీకీ మద్దతు ఇవ్వలేదు. రిపబ్లికన్ అభ్యర్థిగా జార్జి బుష్ జూనియర్ మొదటిసారి ఎన్నికైనప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న గుత్త కంపెనీలు అమెరికా రాజకీయాలపై చూపిస్తున్న ప్రభావం గురించి తీవ్రమైన చర్చ జరిగింది. అప్పటి నుండి రాజకీయాల్లో ధన ప్రభావం గురించిన చర్చ కొనసాగుతూ వచ్చింది. తాజాగా ట్రంప్ కొలువులో ఎలన్ మస్క్ వంటి కుబేరులు నేరుగా విధాన రూపకల్పనలో కీలక స్థానాలకు చేరటంలో అమెరికాలో రాజకీయాలు, పెట్టుబడి మధ్య ఉన్న కొద్దిపాటి గీత కూడా చెరిగిపోతున్నట్టయ్యింది. అయితే ఇదంతా ఒక ఎత్తు. ప్రస్తుతం ట్రంప్ వాణిజ్య యుద్ధాలకు తెరతీయటంతో ఈ కుబేరులతో దోస్తీ ఎంతకాలం కొనసాగతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రూపకల్పనకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పునాదులు పడ్డాయి. ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలును నిర్దేశించి నియంత్రించే ఐక్యరాజ్యసమితి, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్, ఐరాస అనుబంధ సంస్థలు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ సెటిల్మెంట్స్ వంటి సంస్థలు తెరమీదకు వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్ పునర్నిర్మాణంలో అమెరికా పెట్టుబడులు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ద్రవ్య విధానాల మధ్య సారూప్యత, సామీప్యత, కరెన్సీ మారకం రేట్లు, వంటి విషయాలను పర్యవేక్షించే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పలుకుబడి, ప్రభావం 1970 తర్వాత క్రమేణా క్షీణించసాగింది. ఈ ఏర్పాటు నుండి అమెరికా వైదొలగటంలో భాగంగా 1970 దశకంలో అప్పటి వరకూ అంతర్జాతీయ మారకం మాధ్యమంగా ఉన్న బంగారం స్థానంలో డాలర్‌ను స్థిరీకరించుకోవటంలో భాగంగా అమెరికా ప్రభుత్వాలు ఒంటెత్తు పోకడలకు పోయాయి. చివరకు 1980 నాటికి అమెరికా తన దుందుడుకుతనంతో డాలర్‌ను ఆధిపత్య కరెన్సీ స్థానానికి చేర్చింది. ఆ విధంగా అన్ని దేశాల భాగస్వామ్యంతో అమల్లో ఉన్న అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ క్రమంగా అమెరికా ప్రయోజనాలకు పెద్దపీట వేసే సాధనంగా మారింది. పేద దేశాల సార్వభౌమమత్వాన్ని తిరిగి నాలుగు దశాబ్దాల తర్వాత అమెరికా ట్రంప్ నేతృత్వంలో అటువంటి చర్యల దిశగా అడుగులు వేస్తోందా అన్నది చర్చనీయాంశంగా ఉంది.
1970 దశకంలో ద్రవ్య వ్యవహారాలను ఏకపక్ష చర్యలతో తన గుప్పిట్లోకి తెచ్చుకున్న అమెరికా ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రత్యేకించి అమెరికాయే కోరుకుని దేశాల మెడలు వంచి కుదుర్చుకున్న ప్రపంచ వాణిజ్య ఒప్పందం పర్యవసానంగా ఏర్పాటైన అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పడు అంతర్జాతీయంగా తన వస్తువులు, సేవలు, ఉత్పత్తులకు అడ్డే ఉండకూడదని యుద్ధం చేసిన ప్రపంచ స్థాయిలో సార్వత్రిక సరళీకరణ వ్యూహానికి, అవధుల్లేని, నామమాత్రపు షరతులతో ఉన్న వాణిజ్య చట్రాన్ని స్థాపించటానికి నడుం కట్టుకున్న అమెరికా ఇప్పుడు విచ్చలవిడి సుంకాల పేరుతో అదే చట్రాన్ని కూకటి వేళ్లతో సహా కుళ్లబొడవటానికి సిద్ధమవుతోంది. ఇటువంటి అంతర్జాతీయ వాణిజ్య సరళీకరణ, సుంకాల సరళీకరణ, సేవల సరళీకరణ ఫలితంగా మహా సంపన్నులైన కంపెనీలకు కారుచౌకగా వచ్చిన సరుకులు, శ్రమ శక్తే పునాది. ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న చర్యలు, ప్రత్యేకించి అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలకు దారితీసే చర్యల ఫలింతంగా కారుచౌకగా లాభాలు దండుకునే అవకాశాలు ఈ మహాసంపన్నులకు తగ్గిపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఉదాహరణకు అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రాంతీయ వాణిజ్యమే యాభై శాతం ఉంటుంది. ప్రపంచీకరణ ప్రస్తుత దశలో ఏ ఒక్క వస్తువూ, సరుకూ యాభైయ్యేళ్ల క్రితం జరిగినట్లు సంపూర్ణంగా ఒకే దేశంలోనే తయారు కావటం లేదు. ఒకదేశంలో తయారైన విడి భాగాలు మరో దేశంలో అసెంబిల్ అయ్యి సంపూర్ణమైన సరుకు రూపం తీసుకుని ప్రపంచమంతటా పరుగులు తీస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ప్రారంభిస్తున్న వాణిజ్య యుద్ధం ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో అన్న సందేహం అందరినీ పట్టి పీడిస్తోంది. దీనికంటే ముఖ్యమైన ప్రశ్న ట్రంప్ పాలన మరోసారి 1970ల దశకంలో లాగా అమెరికా ఆధిపత్యాన్ని స్థిరీకరించేందుకు సాధనంగా పని చేస్తుందా అన్నది మరో కీలకమైన ప్రశ్న.
ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్యంలో యాభై శాతం ప్రాంతీయ వాణిజ్యమే. అంటే ఏ ఖండంంలో ఆ ఖండంలోని దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యమే. అనేక సందర్భాల్లో విడి భాగాలు సంపూర్ణమైన సరుకుగా మారకముందు అనేకసార్లు సరిహద్దులు దాటాల్సి వస్తుంది. అలా సరిహద్దులు దాటిన ప్రతిసారీ 25 శాతం పన్నులు కట్టడం అంటే ఉత్పత్తి వ్యయం పెరగటం. ఉత్పత్తి వ్యయం పెరగటం అంటే ధరలు పెరగటం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలు పెరగటం అంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను 1970ల్లో చమురు సంక్షోభాలు ఓ ఊపుఊపినట్లు ఊపటమే. కనీసం 1970 దశకంలో వివిధ దేశాలకు పెట్టుబడులు, మౌలిక వనరులు, సేవలు అవసరం ఉన్నాయి. కొరత కూడా గణనీయంగానే ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితి అది కాదు. పూర్తిగా భిన్నమైంది. కొరత స్థానంలో మిగులు వస్తుసేవలు, సరుకులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయిలో ద్రవ్యోల్బణానికి దారితీయటం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయటమే అవుతుంది. ఈ విధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకుదేలైన తర్వాత ట్రంప్ మిత్రులు, సన్నిహితులుగా ఉన్న కుబేరులు, సహస్ర కుబేరులకు కూడా సమస్యాత్మకం కానుంది.
ఉదాహరణకు అమెరికాకు వ్యవసాయోత్పత్తులు ఎగుమతి చేస్తున్న దేశాల్లో మెక్సికో ప్రథమ స్థానంలో ఉంది. మొత్తం అమెరికా దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయోత్పత్తుల్లో 63 శాతం మెక్సికో నుండి దిగుమతి అవుతున్నాయి. పళ్లు, కూరగాయల్లో 47 శాతం మెక్సికో నుండి దిగుమతి అవుతున్నాయి. వీటిపై దిగుమతి సుంకాలు విధించటం అంటే అటు మెక్సికో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టడంతో పాటు అమెరికాలోని వినియోగదారుల జీవితాలపై మరిన్ని భారాలు మోపటమే అవుతుంది.
తాజాగా స్టాండర్ట్ అండ్ పూర్ రేటింగ్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమెరికాకు దిగుమతి అవుతున్న చిన్న వాహనాలు, కార్లు సరఫరాలో జపాన్, దక్షిణ కొరియా, యూరప్ దేశాలను కాదని మెక్సికో అధికభాగం అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఉదాహరణకు నిస్సాన్ కంపెనీ అమెరికాకు ఎగుమతి చేసే కార్లలో 27 శాతం మెక్సికో నుండి సరఫరా చేస్తుంటే హోండా కంపెనీ 13 శాతం, ఫోక్స్‌వాగన్ కంపెనీ 47 శాతం మెక్సికో నుండే సరఫరా చేస్తున్నాయి. ఈ దిగుమతులపై సుంకాలు పెంచటం అంటే మెక్సికో ఆర్థిక వ్యవస్థతో పాటు ఈ కంపెనీల వార్షిక లాభాలను కూడా నష్టపర్చటమే అవుతుంది. గతంలో ట్రంప్ 2018లో కూడా ఇటువంటి చర్యలకు తెరతీయటంతో మెక్సికో కూడా ప్రతిచర్యగా అమెరికా నుండి మెక్సికోకు వచ్చే దిగుమతులపై సుంకాలు విధించింది. కానీ ఈ సారి అలాంటి చెదురుమదురు స్పందనలతో పనికాదు. సరిపోవు.
ఇక్కడే ట్రంప్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న సహస్రకుబేరులు వీక్లింక్గా పనికొస్తారు. భారత్ చైనాలతో పాటు యూరప్, లాటిన్ అమెరికాల నుండి చౌకగా వచ్చే దిగుమతులే వారి లాభాలకు ప్రాథమిక పునాదులు. కాబట్టి వారి లాభాలకు కోతపడే పరిస్థితులు సృష్టించగలిగితే ట్రంప్ లాంటి మదగజాలను మచ్చికచేసుకోవటం తేలికే అవుతుంది. ఈ విధానం ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో ప్రాథమిక రోడ్ మ్యాప్‌ను ఇక్కడ చర్చించుకోవచ్చు.
అమెరికా కేంద్రంగా ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవాలంటే ప్రపంచమంతా సరఫరా చేయాలి. దీన్నే దౌత్య వాణిజ్య భాషలో మార్కెట్ యాక్సెస్ (దేశీయ మార్కెట్ తలుపులు తీయటం) అంటారు. ట్రంప్ ఏయే దేశాలపైన అయితే వాణిజ్య సుంకాలు విధిస్తామని బెదిరిస్తున్నారో ఆయా దేశాలు అమెరికా కేంద్రంగా ఉన్న గుత్త కంపెనీల ఉత్పత్తులు తమతమ దేశాల్లో అమ్ముకోవాలంటే ట్రంప్ ప్రతిపాదిస్తున్న వాణిజ్య యుద్ధానికి స్వస్తి చెప్పాలన్నది ఓ డిమాండ్‌గా ముందుకు తీసుకురావచ్చు. ఈ డిమాండ్‌పై తొలుత బ్రిక్స్ దేశాలు(భారత్, రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) ఓ అవగాహనకు వస్తే ఈ ఉమ్మడి అవగాహనను జి 20, జి 77 వంటి వేదికల ద్వారా నిర్ణయం చేయవచ్చు. ఏ పెట్టుబడిదారుడికైనా తయారయిన సరుకులు అమ్ముడై తిరిగి రొక్కం చేతికి వస్తేనే లాభం చూడటం సాధ్యమవుతుంది. ట్రంప్ నుండి వాణిజ్య సుంకాల బెడద ఎదుర్కొంటున్న దేశాలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తే ట్రంప్‌కు సన్నిహితంగా ఉన్న గుత్తాధిపతుల లాభాలకు కోతపడుతుంది. దీంతో పాటు ఆయా గుత్త కంపెనీలు వర్ధమాన దేశాల్లో తమ సరుకులు అమ్ముకోవడం ద్వారా సంపాదించే లాభాలపై పన్నులు విధించవచ్చు. ఈ విధంగా చేయటం ద్వారా ట్రంప్ నిర్ణయాలు వివిధ దేశాల మధ్య దౌత్య సమస్యల స్థాయి నుండి ఉత్పత్తిదారులు, వినియోగదారుల మధ్య ఉన్న సమస్య స్థాయికి మార్చవచ్చు. తద్వారా వర్ధమాన దేశాల స్వయంత్రిపత్తిని, అంతర్జాతీయ సంబంధాల్లో సున్నితత్వాన్ని బతికించుకోవచ్చు.
ఏప్రిల్ మొదటి వారంలో ఎలన్‌మస్క్ ఉత్పత్తి చేసిన ఎలక్ట్రిక్ కార్లు టెస్లా భారతదేశానికి దిగుమతి అవుతున్నాయి. ఈ కార్లు మన దేశీయ మార్కెట్లో అమ్ముకోవాలంటే మస్క్‌కు ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా అదనపు పన్నులు చెల్లించేలా కేంద్ర ఆర్థిక శాఖ, ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవచ్చు. ఇవన్నీ విధాన నిర్ణేతలకు తెలీదా అంటే తెలీదని కాదు. కానీ గతిలేని పరిస్థితుల్లో అమెరికాతో అంటకాగాల్సి వస్తోందనీ, వారి షరతులు అంగీకరించాల్సి వస్తోందనీ ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ప్రజల ముందుకు తీసుకురావల్సి వస్తోంది.
ఈ విధానాల వలన జరగబోయే పర్యవసానంపై కూడా పాఠకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ట్రంప్ నేతృత్వంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను లోతైన సంక్షోభంలోకి నెడతాయి. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు వివిధ వర్గాల స్పందన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి తాజాగా ప్రపంచం అనుభవించిన కోవిడ్ ఉదంతాన్ని పరిశీలించవచ్చు. ఈ కోవిడ్ ఆపత్కాలంలో రోజువారీ కార్మికులు పొట్ట చేతబట్టుకుని బతుకుజీవుడా అంటూ కాలిబాటన ఇల్లుచేరారు. ఒక మోస్తరు మధ్య తరగతి వారు ఆసుపత్రుల్లో ఐసొలేషన్ సెంటర్లలో సేదదీరారు. మరింత ధనికులు వ్యక్తిగత ఐసియూ యూనిట్లలో సేదదీరారు. చివరకు కంపెనీలు తొలి దఫా మార్కెట్లోకి తెచ్చిన వాక్సిన్లను లక్షలు పెట్టి కొన్నారు. కానీ పేదలు మాత్రం ఈ వాక్సిన్లు సాధారణ ధరలకు అందుబాటులోకి వచ్చే వరకూ ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇదే వలయం ప్రస్తుత సందర్భంలోనూ జరుగుతుంది.
ట్రంప్ విధానాల వలన తలెత్తే అంతర్జాతీయ సంక్షోభంలో తొలుత పేద దేశాలు, వర్ధమాన దేశాలు, అంతో ఇంతో అగ్రరాజ్య స్థానంలో కోసం పోటీ పడుతున్న భారత దేశం లాంటి దేశాలు తొలి దశల్లో నష్టపోతాయి. కానీ సంపన్న దేశాలు ఇప్పటివరకూ పోగేసుకున్న లాభాల్లో ఎంతో కొంత కరిగించుకుంటే తప్ప మనుగడ సాగించలేని పరిస్థితికి నెట్టబడతాయి. దీనికి భిన్నంగా వర్ధమాన దేశాలు, మధ్య ఆదాయ దేశాలు సమస్యను ఉత్పత్తిదారులు, వినియోగదారుల మధ్య సమస్యగా మార్చటం ద్వారా తొలిదశలోనే గుత్త కంపెనీల లాభాలపై వేటుపడే ప్రమాదం ఉంటుంది. విశాలమైన వినియోగదారుల మార్కెట్ కలిగిన భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనా వంటి దేశాలు అమెరికా కేంద్రంగా ఉన్న గుత్త కంపెనీల ఉత్పత్తులపై విధించే పన్నుల ద్వారా దేశీయంగా అదనపు ఆదాయ వనరులు సంపాదించుకోవచ్చు. ఈ అదనపు ఆదాయ వనరులను దేశంలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలకు వెచ్చించవచ్చు. అన్ని దేశాలు, ప్రధానంగా ప్రపంచ గుత్తాధిపతులకు కావల్సిన ఉత్పత్తి సాధనాలను సరఫరా చేసే దేశాలన్నీ ఈ మార్గాన్ని అనుసరిస్తే ఎక్కడో పన్ను ఎగవేసే స్వర్గధామాలున్నాయంటూ ఒకదేశంపైకి మరో దేశాన్ని పురిగొల్పి అందరి వద్ద నుండీ మరిన్ని రాయితీలు పొందే కుయుక్తులకు ముగింపు పలవకవచ్చు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.