
తెలుగునాట శ్రీవెంకటేశ్వర సురభి నాటక బృందానికి ఎంతో పేరుప్రఖ్యాతలు ఉన్నాయి. ఎవరూ ప్రదర్శించని విధంగా సురభి నాటక సంస్థ నాటకాలను ప్రదర్శిస్తుంది. నాటికలు, జానపదాలు, సోది, పద్యాలు అన్ని తెలుగు రంగస్థలానికి సంబంధించిన మౌఖిక సాంప్రదాయంగా చెప్పవచ్చు. సురభీ నాటక సమాజం ఆరుతరాలుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం నాటక కంపెనీని ఆరోతరం నటులు నడుపుతున్నారు. సురభి నాటకం గురించి పట్టించుకోకపోతే ఆధునిక తెలుగు సంస్కృతి అసంపూర్ణంగా ఉంటుంది.
వనారస గోవిందరావు సురభి సంస్థను 1885లో ప్రారంభించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా సురభి గ్రామంలో మొదటిసారి తోలు బొమ్మలాటను సంస్థ ప్రదర్శించింది. మహా భారతంలోని విరాటపర్వంలో ‘కీచక వధ’ కథతో ఈ సంస్థ ప్రయాణం మొదలైంది. పద్యాలు కలిపి చేసిన తొలి తోలు బొమ్మలాట ప్రదర్శనగా దీనికి గుర్తింపు ఉంది.
అయితే, ప్రస్తుత ఆరోతరం నటులు రంగస్థల నాటకానికి మారారు. అయినా వారి నాటకాలు మాత్రం పురాణగాథలుగానే కొనసాగుతున్నాయి. సంస్థ ప్రదర్శించే నాటక ప్రదర్శనలలో ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. వేదికపై వాన, మంటలు, ఎగిరే పిట్టలు వంటివి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫిబ్రవరిలో సురభి సంస్థ రెండు నాటకాలైన జై పాతాళభైరవి, మాయాబజార్‌ను ఉచితంగా ప్రదర్శించింది. నేను మూడు ప్రదర్శనలను చూశాను. ఈ నాటకాలు చూసే ఆనందం వర్ణించనలవి కానిది. ఒక రిటైరయిన అధికారి, ఒక విదేశీ పర్యాటకురాలు ఆమె కొడుకు, తమ తమ పిల్లలతో చాలా కుటుంబాలు ప్రదర్శనను చూడడానికి వచ్చారు. ఇన్స్టాగ్రాం సమాచారంతో ఊరిలోని అనేకమంది రావడంతో విభిన్నమైన ప్రేక్షకులతో ప్రాంగణం కళకళలాడింది.
సురభి నాటక కంపెనీ ప్రదర్శించిన నాటకాలలో కథాకథనం అంతా తెలుగునుడికారంలో అల్లారు. అంతేకాకుండా చాలాకాలం ప్రేక్షకులకు గుర్తిండి పోయే దృశ్యచిత్రాలను వారు రూపొందించారు. నిప్పుల చక్రం, ఎగిరే బాణాలు వంటి ప్రత్యేక సాంకేతిక చిట్కాలు ఈ ఇంద్రజాలానికి రంగులద్దాయి. ఘటోత్కచుడు, అభిమన్యుల సంవాదం సందర్భంలోని సంగీతం నిజంగా ఎన్నదగింది. మాయాబజార్ నాటక ప్రదర్శనలో ఒక ఏడోతరం బుల్లి నటుడు వేదిక పైకి వచ్చి ”ఇదిగో మాయాబజార్” అనగానే అందరి మొహాల్లో నవ్వులు వెలిశాయి.
రాక్షస పడతి హిడింబ ఒక పురుషుడు వేయటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలానే శ్రీకృష్ణ పాత్రను ఒక మహిళ పోషించింది. స్త్రీలు వేదికపైకి రావడం అరుదైన కాలం నుంచి సురభి సంస్థ స్త్రీలతో ప్రదర్శనలు చేయించిన విషయం విదితమే.
‘జై పాతాళ భైరవి’లోని మాంత్రికుడు ప్రదర్శనను కొల్లగొట్టాడు. అతని నవ్వులోని క్రూరత్వానికి ఒక పిల్లవాడు జడుసుకున్నాడు. తలతుంచినాక మాంత్రికుడి తలకాయ ఎగరడం, దేవత తన స్వీయరూపంలోకి తిరగిరావడం నిజంగా చూడ దగ్గవిగా చెప్పుకోవచ్చు. ప్రతి ప్రదర్శన తర్వాత వారి సాంకేతిక అంశాలపై వివరంగా చర్చించడానికి వారు ప్రేక్షకులను ఆహ్వానించారు. ఏది తేలికగా దొరకని ప్రపంచంలో ఇదొకటి ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
కోవిడ్-19, సామాజిక మాధ్యమాలు సురభి నాటక సంస్థను కష్టాల్లోకి నెట్టాయి. రెండు గంటల నాటకానికి పెట్టుబడి పెట్టే నిర్మాతలు దొరకపోవడంతో సురభి కొత్త నాటకాల రూపకల్పన చేయటం లేదు. కొన్నిసార్లు ప్రేక్షకులకు కానుకగా వారి పేరెన్నిక గల నాటకాలను ఈ బృందం ప్రదర్శిస్తుంది.
140 ఏళ్ల క్రితం కుటుంబ సాంప్రదాయంగా మొదలైన సురభి నాటక సంస్థ వారి ప్రదర్శనల్లో బయటవారు పాల్గొనడం నిషేధించింది. ప్రస్తుత సురభి సంస్థ దర్శకులు సురభి జయచంద్ర వర్మ తాత పద్మశ్రీ సురభి బాబ్జి ఈ నియమాన్ని నిలకడగా పాటించారు. అయితే ఆరోతరం సురభి వారు కొత్తవారికి ద్వారాలు తెరిచారు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.