
సంవృద్ధి అనేది 1950ల నాటికి ఆర్థికవేత్తలు పరిష్కరించాల్సిన సాంకేతిక సమస్యగా మారింది. ఎనిమిది గంటల పనిదినావశ్యకత అనే భారం నుంచి విముక్తి వాగ్ధనమిచ్చిన సంవృద్ధి, అవసరానికి మించిన వస్తూత్పత్తికే అంకితమయింది. తను ఇచ్చిన మాట ప్రకారం ఏ రకమయిన సంబరానికీ అది తోడ్పడలేదు. సంవృద్ధి అనేది పనిగంటల విషయంలో పూర్తిగా విఫలమయి మృత్యువులోకి జారుతూ ఉంటే , ఈ పుస్తకం ఇక దానిని సమాధి చేయటానికి తోడ్పడుతుంది.
న్యూయార్క్: సంవృద్ధి అనే ఆలోచనకు ప్రపంచంలో సుదీర్ఘమైన, సంక్లిష్టమైన చరిత్ర ఉంది. ఉత్తర అమెరికాను ఆక్రమించి, జయించిన యూరోపియన్లందరూ అక్కడి ఆహార సంవృద్ధిని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడి ఆకాశం పక్షుల గుంపులతో చీకటిమయమై ఉంది. నీటిలో రకరకాల చేపలు గుంపులుగా గుంపులుగా తిరిగుతున్నాయి. అడవులు, పచ్చిక బయళ్ళలో ఎక్కడ చూసినా వేటాడి తినగలిగిన చిన్న జంతువులు పాకుతున్నాయి. అక్కడి వారిని లొంగదీసుకోవాలని, న్యూ ఇంగ్లాండ్‌లోని నేలను సాగుచేయాలని నిర్ణయించుకుని వచ్చినవారు కూడా, ప్రత్యేకించి అక్కడి సంవృద్ధిని చూసి ఆందోళన చెందారు. అక్కడి విపరీతమయిన సంవృద్ధి తమ మనసులను ప్రాపంచిక బాధ్యతల నుంచి, కష్టపడాల్సిన అవసరం నుంచి దూరం చేస్తుందేమోనని భయపడ్డారు.
ఐరోపాలో అప్పుడప్ప్పుడే గొప్ప సంపన్నకేంద్రాలుగానూ, కేందీకృతమవుతున్న భూసంపదగానూ ఎదుగుతున్న ప్రాంతాలు, స్వతంత్ర ఆర్థికావలంబన కలిగి, తామే యజమానులుగా లేదా నిపుణులయిన వృత్తికారులుగా ఉన్నవారని భయపెట్టాయి. అందుకే తమ ఆత్మలను, స్వేచ్చనూ ప్రమాదంలో పెట్టి న్యూ ఇంగ్లాండ్ ప్యూరిటన్లుగా వారు అమెరికాకు పారిపోయి వచ్చారు. ఎక్కడయితే అలాంటి సంపదలు అంత తేలికగా దొరకవో, గొప్ప ఎస్టేట్లు విలసిల్లవో, కొత్తగా తయారయిన మహానుభావులు పాలించకుండా ఉంటారో అలాంటి చోటును వారు కోరుకున్నారు. కష్టించి పనిచేసేవారు, దేవుని పట్ల భయం కలిగినవారు సంపద పోగుపడిన చోట్లలో నివసించినట్లయితే విలాసజీవనం, సోమరితనం పరమావధిగాగల వారిపై ఆధారపడి, వేతన బానిసలుగా బతకవలసివస్తుంది. ఎంతకయినా తెగించే యజమానుల అదుపులో ఉండవలసి ఉంటుంది. అలాంటప్పుడు దేవుని చిత్తాన్ని తాము స్వేచ్ఛగా అనుసరించడాన్ని ఎంచుకున్నామని ఎలా చెప్పుకోగలరు?
గ్రేట్ మైగ్రేషన్ సిద్ధాంతకర్త అయిన జాన్ వైట్, జాన్ వింత్రోప్ (“సిటీ అపాన్ ఎ హిల్” గవర్నర్) నాయకత్వంలో 30,000 మంది ఆంగ్లేయుల ఆత్మలను అమెరికాకు తీసుకువచ్చాడు. ఆయన 1630లో ప్రచురించిన “వ్యవసాయదారుల విన్నపం” అనే కరపత్రంలో మెసాచూసెట్స్ బే కంపెనీ ఏర్పాటు చేయడంవలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఒక ప్రశ్నకు జవాబుగా ఇలా రాస్తాడు. “అత్యున్నత ప్రయోజనము ఇక్కడి స్థానిక ప్రజలకు లభించాలి. వాణిజ్యము, మన ఉదహరణీయ జీవనం ఇక్కడి ప్రజలకు నాగరికతను నేర్పి, తద్వారా వారి ఆత్మలను రక్షించడానికి ఉపయోగపడాలి”.
ఈ కరపత్రాన్ని రాస్తున్నప్పుడు జాన్ వైట్‌కు, తను ఎరిగిన పరిమిత న్యూ ఇంగ్లాండ్ రాతిమయ భూములు మాత్రమే దృష్టిలో ఉన్నాయి. అలాంటి చోట ఆయన ఒకే సామర్ధ్యాన్ని గుర్తించాడు. చిన్నభూ కమతాలలో చేయగల కఠినమైన పరిశ్రమ. అది మాత్రమే అన్యజనుల భూమిపై తమను స్థిరపడేలా చేసేది. తన రచనలో మొత్తం మీద, “భక్తి, సమర్ధతలకన్నా మిన్న అయినవేవీ ఇప్పుడు మనకు తెలియదు” అని బలంగా చెబుతాడు.
అధికానికి హద్దుగా ఏర్పరుచుకున్న ఈ కల్పిత సరిహద్దే, ఆ తర్వాత అమెరికన్ల స్వభావాన్ని నిర్వచించే అంశమయింది. ఇది తెల్ల వలస ప్రజల ఊహలలో ఉండే ద్వంద్వస్వభావాన్ని సూచిస్తుంది. ఇక్కడి భూమి “వర్జిన్ ల్యాండ్”. ఏ మనిషయినా తనకు నచ్చినచోట ఒక ఫార్మ్ హౌస్‌ను నిర్మించుకొని సొంతం చేసుకోగలిగిన విశాల పరిధిగలిగిన భూమి. తన తీరుబాటు సమయాన్ని ఆ నేలపై వెచ్చించడం ద్వారా అది అతని ఆస్థిగామారి, అతనిని ప్రభువుగానూ, పర్యవేక్షకునిగానూ, యజమానిగానూ మార్చగలిగిన భూమి. అది అతనికి హోదాను కలిగిస్తుంది. మరో వైపు తాము ఏర్పరుచుకున్న సరిహద్దు గీతల ప్రకారం అదో మోసపూరితమయిన సంవృద్ధిమయ ఆకర్షణ. ఈ సంవృద్ధిని అనుభవించడం అంటే ఏ పురుషుడయినా, స్త్రీ అయినా స్థానికుడయి పోవడమే అవుతుంది. అటువంటి ఆటవికమయిన ఆనందాలను అనుభవించడంవలన కలిగే ఫలితాలను తమ సంచలనాత్మక కథనాలలో సువార్తీకులు, మార్గదర్శకులు, బంధీలు వెల్లడి చేసేవారు
ఈ రకమయిన సరిహద్దురేఖలను 1890లలో మూసివేయడం అనేది అమెరికా ఆర్థిక, సాంస్కృతిక అంశాలలో ఒక ముఖ్యమయిన మార్పు. ఫ్రెడరిక్ జాక్సన్ మూడేళ్ళ తర్వాత దీనిని ప్రముఖంగా గుర్తించాడు. కానీ ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించిన అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఇవన్నీ, సరిహద్దు రేఖల భద్రతా కవాటం లేకపోవడం వలన ఆస్తి లేని ప్రజలలో సామాజిక వర్గాలనే భావనలు “ప్రారంభమై”, యూరప్‌లో మాదిరి అవి ఏర్పడి, దృఢపడే ధోరణికి సంబంధించినవి. పంతొమ్మిదవ శతాబ్ది చివరలో యూరప్‌లో జరిగిన అసాధారణ వర్గపోరాటాలు అమెరికాలోని ఆప్పటి పరిస్థితులలో బలపడి కార్మికవర్గ విప్లవానికి దారితీస్తాయా అన్న దానికి సంబంధించినవి.
నూతన సరిహద్దులు
ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో సంవృద్ధికి సంబంధించి అవగాహన, భయం- అనే రెండు రకాల కొత్త సరిహద్ధు రేఖలు కనపించాయి. ఇవి రెండూ కూడా భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనల నుండి ఆవిర్భవించాయి. ఈసారి, సంవృద్ధి- సహజ దానాల రూపంలో కాకుండా, ఉత్పత్తి పూర్తయిన వస్తువుల మిగులు, ఎటువంటి ఆర్థిక వెసలుబాటూ లేని నిష్క్రియాత్మక మూలధనం రూపంలో కనిపించింది. అవసరానికి మించి ఉత్పత్తయిన వస్తువుల ఉపాంత విలువ దివాళా దిశగా సున్నాను చేరింది. అమెరికన్ సామ్రాజ్యంగా మనం ఎరిగిన ఈ కొత్త సరిహద్దు రేఖ భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనలకు స్పష్టమయిన, నిరంతరాయమైన పరిణామమయింది. పాత సరిహద్ధు రేఖలను మూసివేయడం ద్వారా తలెత్తిన ఈ సామాజిక ప్రశ్నను, మానవ నిర్మిత అదనపు వస్తువులను విదేశీ మార్కెట్లకు అమ్మడం లేదా పెట్టుబడులు పెట్టడం ద్వారా అమెరికా ఆయా చోట్లకు ఎగుమతి చేసింది.
ఈ సరిహద్ధు రేఖలు కాక, వేరే కొత్త సరిహద్దురేఖలను ఏర్పరచిన మార్గదర్శకులు చాలా తక్కువగా ఉండేవారు. లేదా వారికి తక్కువ విలువ ఉండేది. వారు ప్రతిపాదించినవి ఆచరణలో సందిగ్ధమయినవిగా ఉండడమే బహుశా దీనికి కారణం కావొచ్చు. ఇలాంటి అగమ్యగోచరమయిన పరిస్థితిని పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఆర్థికవేత్త, సైమన్ ప్యాటెన్, తన బహుళాదరణ పొందిన పుస్తకం, “న్యూ బేసిస్ ఆఫ్ సివిలైజేషన్”లో వివరించాడు. ఇది 1907లో ప్రచురితమయింది. దానిలో ప్యాటెన్, అమెరికా లోటు యుగము నుంచి అదనపు యుగానికి, బాధాకరమయిన ఆర్థిక వ్యవస్థ నుంచి ఆనందమయ ఆర్థిక వ్యవస్థకు మార్పు చెందిందని అన్నాడు. అయితే ఆవశ్యక శ్రమ ముగిసిపోవడం గురించిగానీ, నిజ జీవితంలో కాల్పనిక విలాసమయ ఆనంద భూమి (LAND OF COCKAIGNE) గురించి గానీ, ఆ పుస్తకంలో ప్యాటెన్ చర్చించలేదు. దానికి బదులుగా వస్తువులకు వినియోగదారుల డిమాండ్ పెరిగి, వ్యవస్థీకృతమై, అంతులేకుండా పేరుకొని ఉన్న అదనపు సరుకులు లాభసాటి ధరలకు అమ్ముడవుతాయా లేదాని ఆయన ఆశ్చర్యపోయాడు.
అలాంటి అనుత్సాహకర పరిస్థితులను ఉద్దేశిస్తూ, ప్యాటెన్ ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించాడు. మానవ చరిత్రలోనే మొదటిసారిగా, సంతృప్తిని వాయిదా వేసుకోవడం లేదా “రానున్న వర్షాకాలానికి దాచుకోవడం” వంటివి ఆర్థికాభివృద్ధికి ఆటంకాలని ఆయన అన్నాడు. వినియోగదారుని ఆధారంగా నడిచే ఘటనా క్రమాలలో అటు శ్రమశక్తికిగానీ, ఇటు పెట్టుబడికిగానీ అదనపు చేర్పులేవీ అవసరం ఉండవని ఆయన ఊహించాడు. ఫలితంగా లాభాన్ని ఆశించే పెట్టుబడిదారుల పరిస్థితి, 1930లో జాన్ మేనార్డ్ కీన్స్, తన పుస్తకం “ఎకనామిక్ పాజిబిలిటిస్ ఫర్ ఆర్ గ్రాండ్ చిల్డ్రన్”(ECONOMIC POSSIBILITIES FOR OUR GRAND CHILDREN)లో చెప్పినట్టుగా, “కొంతవరకూ అసహ్యకరమైన జాఢ్యం”గా, “పురాతన సామాజిక వ్యవస్థకు సంబంధించిన అవశేషామయ గుర్తు”గా మారింది. అమెరికాతో పాటుగా సంవృద్ధి అనే భావన అభివృద్ధి చెందుతూ వచ్చింది.
ప్యాటెన్ విద్యార్థులు, అనుచరులు “ఆనందమయ ఆర్థిక వ్యవస్థ” లక్షణాలు, అర్థాలను నొక్కి చెబుతూ, వాటిని విస్తృతంగా ప్రజానీకంలోకి తీసుకెళ్లారు. ది న్యూ రిపబ్లిక్ వ్యవస్థాపక సంపాదకుడయిన వాల్టర్ వెయిల్, ది న్యూ డెమోక్రసీ (1912) అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఆర్థికాభివృద్ధే ప్రజాస్వామ్యమని భావించినట్లయితే, శాశ్వత మిగులు యుగంలో పన్నుల ద్వారా ఆదాయ పునఃపంపిణీ ఎందుకు, ఎలా వీలుపడుతుందో, అసలు అలా ఎందుకు పునఃపంపిణీ చేయాలో ఆయన ఆ పుస్తకంలో వివరించాడు. ది న్యూయార్క్ రిపబ్లిక్ రచయితలలో ఒకరయిన స్టూవర్ట్ చేజ్ “ది ఎకానమీ ఆఫ్ అబండెన్స్” (1934) పేరుతో రాసిన పుస్తకంలో మహా ఆర్థిక మాంద్యానికి మూలాలను విశ్లేషించాడు.
ప్యాటెన్ ఊహించిన పద్ధతిలోనే ప్రభావవంతమయిన వినియోగదారుల డిమాండ్ లేకపోయినందువల్లనే మాంద్యం ఏర్పడినట్లుగా తానూ ఊహించాడు. “కీనీషియన్ కన్సెన్స్” కు, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్డ్ “సలహామండలి” సభ్యుడయిన రెగ్జ్ఫోర్డ్ జి టగ్వెల్ బాహాట మద్దతుదారు. ఆర్థిక సంక్షోభానికి మిత వినిమయం అతి ముఖ్యమయిన కారణమని జె ఎ హబ్సన్ వాదించాడు. విలియం జేమ్స్ “ఆనందమయ ఆర్థిక వ్యవస్థ” గురించి ఎంతగానో ఆందోళన చెందుతూ, తన పుస్తకం “ద మోరల్ ఈక్వలెంట్ ఆఫ్ వార్” లో ప్యాటెన్ను ప్రస్తావించాడు. ప్రజలకు తగినంత పని లేకపోయినట్లయితే తమంత తాము ఆహారం సంపాదించుకోలేరని ఆయన ఆ పుస్తకంలో రాశాడు. వీరిద్దరు రాసిన రచనల నుంచి ప్యాటెన్ చెప్పిన నీతిని కీన్స్ స్వయంగా భుజాలకెత్తుకున్నాడు.
పాశ్చాత్య నాగరికత ఎదుర్కొంటున్న ప్రశ్నను కీన్స్ ప్రపంచం ముందుంచాడు. సంపదను కూడబెట్టడమనే ఏనిమల్ కంపల్సివ్ అర్జ్ ను అనుసరించి సరుకుల కొరతను అంచనావేసి, నిర్దేశించగలిగే పద్ధతికి బదులుగా, సరుకులను అత్యంత ప్రభావవంతంగా కేటాయించేందుకు రూపొందించిన “అసహ్యకర జాడ్యం” స్థానంలో, ఏ నైతిక విధానం అయితే సరిపోతుందని ఆయన ప్రశ్నించాడు. ప్రాచీన క్రైస్తవ నిర్దేశాకాలపై ఆధారపడిన సామాజిక నైతికత వస్తుమయ సంవృద్ధికి పూచీ పడుతుందా అని ఆయన అడుగుతాడు.
1950ల నాటికి, అందరూ కాకపోయినా చాలా మంది ఆర్థికవేత్తలు వ్యక్తిగత పొదుపులు, పెట్టుబడులు ఆర్థిక ఎదుగుదల, అభివృద్ధులకు ప్రధాన చోదకాలు కావని తేల్చారు (ఏదీ ఏమైనప్పటికీ, ప్రభుత్వ పెట్టుబడి చాలా కాలం క్రితమే ప్రైవేట్ పెట్టుబడిని అధిగమించింది). వేతనాలు, జీతాలు ఆదాయవనరులుగా ప్రశ్నార్ధకమయిన చోట, వస్తువుల డిమాండ్ కన్నా వస్తువుల పంపిణి తక్కువగా పరిగణింపబడుతుందన్న అర్థం వచ్చింది. సమస్య సరుకుల ఉత్పత్తిలో లేదు. వినియోగంలోనే ఉంది. లేదా మరింత స్పష్టంగా, పెట్టుబడికి, శ్రమకు మధ్య ఆదాయ పంపిణీని సాధించడంలో ఉంది. అప్పుడే అది సరుకులపై అదనపు మొత్తాన్ని చెల్లించడానికి వీలయిన వినియోగదారుల డిమాండ్‌ను ఆఫర్ పై సృష్టించగలుగుతుంది. సంవృద్ధి అనేది ఆర్థికవేత్తలు పరిష్కరించాల్సిన సాంకేతిక సమస్యగా మారింది. ఎనిమిది గంటల పనిదినావశ్యకత అనే అమాయకత్వం నుంచి విముక్తి వాగ్ధనమిచ్చిన సంవృద్ధి, అవసరానికి మించిన వస్తూత్పత్తకే అంకితమయింది. తను ఇచ్చిన మాట ప్రకారం ఏ రకమయిన సంబరానికీ అది తోడ్పడలేదు.
వినియోగదారుల పరిస్థితి
1950లలో సామాజిక శాస్త్రవేత్తలు చేసిన ఆవిష్కరణలను పరిశీలించినప్పుడు వాటిలో కొట్టొచ్చినట్టుగా కనపడేది వారి ఊహాలలోని వైఫల్యం. పని అంతం ఒక సహజ పరిణామము, బూర్జువా తదననంతర దశ ఆగమనము, “ఇతరులచే నిర్దేశించబడే వ్యక్తి” (OTHER -DIRECTED INDIVIDUAL) – ఇలాంటి ఆవిష్కరణలన్నీ సంవృద్ధిని ముందుగానే అంచనా వేసి చేసిన ఊహలు. అవి వాటి అర్థంలో ఉత్పత్తికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే అంచనాతో చేసినవవే. డానియెల్ బెల్, హన్నా అరేండ్ వంటి ప్రభావశీల రచయితలు, భవిష్యత్తులో రానున్న శ్రమరహిత ఉత్పత్తి గురించి పుస్తకాలు రాశారు. హాన్నా అరేండ్ స్వయంగా కార్ల్ మార్క్స్ ను అంచనా వేయడానికి నియోగించబడిన వ్యక్తి. మార్క్స్ సృజనాత్మక కృషిపై తనకు కేటాయించిన అధ్యయనం ఆయనకు తీవ్రమైన ఆసక్తిని కలిగించే విషయమైంది (మార్టిన్ హైడిగ్గర్ కు సంబంధించిన ఆర్టిజనల్ కాన్సెప్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద వర్ల్డ్ కు ఉద్దేశపూర్వకమయిన రహస్య పునరావాసమే ఇది).
అదే సమయంలో డేవిడ్ రైస్మన్ “ది లోన్లీ క్రౌడ్” (1950) అనే పుస్తకాన్ని రాసినందుకుగానూ టైమ్ మ్యాగజైన్ మీద ముఖచిత్రంగా వెలుగులోకి వచ్చాడు. ఈ పుస్తకంలో, ఫ్రాంక్ఫర్ట్ స్కూల్‌కు సంబంధించిన – మాక్స్ హోర్ఖైమర్, థియోడర్ అడోర్నో, ఎరిక్ ఫ్రోమ్, వారి మిత్ర బృందాన్ని; వారు ప్రస్తావించిన “అంతర్గత-నిర్దేశిత” వ్యక్తి (INNER DIRECTED MAN) ఎక్కడ ఉన్నాడనే విషయాలను నివేదించి వారిని ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఫలదాయకమయిన, శక్తివంతమయిన స్వీయనియంత్రణ కలిగిన, ఏదయినా చేయగల శక్తి కలిగిన ఆ అంతర్గత-నిర్దేశిత (INNER DIRECTED MAN) పంతొమ్మిదవ శతాబ్ది వ్యక్తే, ఇరవయవ శతాబ్దంలో “ఇతరులచే నిర్దేశించబడే”( OTHER DIRECTED), సరుకుల, సమాచార మందకొడి వినియోగదారుడిగా, అంతగా వెలుగులోకి రాని సాధికార వ్యక్తిత్వంగా మారాడు. బహుశా అతడే తను కోల్పోయిన గత ప్రాభావాలకు ప్రతీకారంగా ముందుకొచ్చి సామాజిక ఉద్యమాలలో భాగస్వామి అవుతాడు.
ప్రఖ్యాత చరిత్రకారుడు డేవిడ్. ఎమ్ . పోటర్ విడివిడిగా ఉన్న ఈ పోగులన్నింటినీ కలిపి “పీపుల్ ఆఫ్ ప్లెంటీ” (1954) అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకంలో ఆయన, మితిమీరిన సహజ, కృత్రిమ ఆవాసాల విపరీతత్వం(out size extravagance of its natural and artificial habitat) ఆధారంగా “అమెరికన్ల స్వభావాన్ని” గురించి రాశాడు. దీనిలో ఆయన రాసింది అందమయిన చిత్రమేమీ కాదు. ఇందులో చెప్పిన “ఇతరులచే నిర్దేశించబడిన వ్యక్తి” (OTHER DIRECTED INDIVIDUAL) స్పష్టంగా అందరికన్నా వెనుకబడినవాడు. తన ప్యూరిటన్ పూర్వీకులనుండి నేర్చుకోవాలసిన అవసరం ఉన్నవాడు. ప్రొటెస్టంట్ పని నైతికతను, సంవృద్ధి ఏమి చేస్తుందోనన్న భయం కూడా అతడు నేర్చుకోవలసిన అంశాలలో ఒకటి.
“సంవృద్ధిని సాధించడానికి ముందుగా ప్రజలు ఉత్పాదకతను పెంచడాన్ని గురించి ఆందోళన చెందుతారు” అని రైస్ మన్ అంటాడు. “వారి స్వభావం రీత్యా, దీనికి కఠినమయిన ఓర్పు, పరిశ్రమ అవసరమవుతాయి. భౌతిక పర్యావరణంపై ఆధిపత్యం వహించడానికి ఏకాగ్రత కావాలి. వారి వైయక్తిక ఆర్థిక వ్యవస్థలో పొదుపు, వివేకం, సంయమనమూ అవసరమవుతాయి. కానీ ఒక సారి సంవృద్ధిని సాధించిన తర్వాత ఒకప్పుడు ఎంతో విలువయినవిగా భావింపబడిన లోటు మనస్తత్వం ఇక ఎంతమాత్రమూ సమాజ పురోగతికి పనికిరాదు. ఆదర్శవంతుడయిన వ్యక్తి మంచి ఉత్పత్తిదారుడిగా కన్నా మంచి వినియోగదారుడి లక్షణాలను సంతరించుకోవాలి. అతడు విస్తృతమయిన తన విరామ కాలాలకు సరిపోయేటట్టుగా ఆసక్తులను పెంపొందించుకోవాలి. ఇక ఇప్పుడు అతడు కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కానీ ఔత్సాహిక పారిశ్రామికుడు కాదు. అతడు అనేకంగా ఉన్న ఏదో ఒక వాణిజ్య సేవలలో నిమగ్నుడై ఉన్నవాడే కానీ, ఉత్పత్తిలో ఎంత మాత్రమూ పాల్గొనేవాడు కాడు. ఇక అతనికి పర్యావరణంపై తన యాజమాన్యం కన్నా తన తోటి వారితో సహృద్భావ సంబంధాలు మిన్నగా మారుతాయి”.
ఈ వర్ణన సుపరిచితంగానూ, కాస్త హాస్యస్పదంగానూ అనిపించినట్లయతే, దానికి కారణం పోటర్. అతడు విల్లీ లోమన్కు సంబంధించిన నేపథ్యాన్ని మమూలు మాటలలో సరిపోయేటట్టుగా రాసి పీర్ రివ్యూడ్ అకడమిక్ జర్నల్ ద్వారా మనకు అందించాడు. కానీ సుసాన్ సోంటాగ్, పాల్ గుడ్మాన్, హెర్బర్ట్ మార్క్యూస్ వంటి ప్రజా మేధావులు, ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ప్రముఖ గ్రంథాలను వల్లెవేసినట్టుగా అదే నేపథ్యం నుండి, అదే కాలాన్ని ప్రస్తావిస్తూ, అవే మాటలలో “వినియోగదారుని సంస్కృతి”పై నేరారోపణ చేస్తూ ఉన్నారు. (మార్క్యూస్ రాసిన ఇరోస్ అండ్ సివిలైజేషన్ -1955- అనే రచన స్వయంచాలిత సంవృద్ధిని అర్థం చేసుకొనే ఒక ప్రయత్నం. దీనిగుండానే మనిషి అవసరాన్ని, సంగ్రహమయిన నిజ స్వేచ్చనూ అధిగమిస్తాడు. కానీ వన్-డైమెన్షనల్ మ్యాన్ (1964) రచనలో తను ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ అవగాహనకు తిరిగి వచ్చాడు).
తిరిగి పనికి
వారి ఆరోపణ ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. అమెరికా ఆలోచన, సంస్కృతులను సంవృద్ధి ఎలా రూపొందించిందనే అంశం మీద చరిత్రకారుడయిన డేవిడ్ పోటర్ 1954లో రాసిన అద్భుత గ్రంథం “పీపుల్స్ ప్లేంటీ” నుంచి తాము ప్రేరణ పొందామని ఎజ్రా క్లెయిన్, డెరెక్ థాంప్సన్‌లు ప్రకటించారు. క్లెయిన్, థామ్సన్‌లు తాము సరఫరా దిశగా ఉన్నరాజకీయాల( SUPPLY SIDE POLITICS) మీద మాత్రమే పుస్తకం రాశామని, ఆర్థిక శాస్త్రం మీద కాదని అన్నారు. కానీ వినియోగదార సంస్కృతిపై వారు ప్రకటించిన విమర్శ, వారికన్నా ముందుగా ఆర్థర్ లాఫర్ కానీ జూడ్ వానీస్కీ కానీ లేదా రైస్మన్ కానీ రాసి ఉండవలసింది.
ఇప్పటికి కూడా మేధావులు, కొన్ని కారణాల రీత్యా వినియోగాన్ని స్త్రీ సంబంధిగా(effiminate), నిష్క్రియాత్మకతగా, అనుగుణ్యతగా, కట్టుబడేదానిగా మాత్రమే సంకేతిస్తారు. కానీ దూకుడు స్వభావిగా, సృజనాత్మకమైనదిగా, అదుపు తప్పినదిగా, విరుద్ధమయినదిగా చెప్పరు. దీనికి క్లెయిన్, థామ్సన్‌లు కూడా మినహాయింపు కాదు. ఫ్యాషన్ అనేది వినియోగ వస్తువులలో అత్యంత ఖర్చుతో కూడినదిగా ముఖ్య స్థానంలో ఉన్నప్పటికీ, అది నిరంతర విఘాతాన్ని కలిగించేదిగానే ఉంది. విరామ సమయమనేది చాలా ఎక్కువగా అనుకూలించబడిన రంగముగా మారి ప్రజలు తమంతటతాము ఒకరికొకరు లక్ష్యంగా భావించే స్థితి ఏర్పడిందేగానీ, వారి కెరియర్లను మెరుగుపరుచుకొనేందుకు దానిని ఒక సాధనంగా భావించడం లేదు. న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ అయిన క్లెయిన్, ద అట్లాంటిస్ స్టాఫ్ రైటర్ అయిన థామ్సన్‌లు వారి పాఠకులను సూటిగా ఉద్దేశించి రాస్తారు. వారు ఆర్థిక వ్యవస్థ వైఫల్యాలను తమ విమర్శలో ఎత్తిచూపడానికి భయపడరు. 1970 నాటికే అమెరికా వామపక్షం ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఉనికిలో ఉన్న అనేక నియంత్రణా విధానాలను అమలులోకి తేగలిగింది. వారు కొత్త వైఖరుల సమాచారం కోసం, కొత్త శక్తులను ఉత్తేజపరచడం కోసం, అన్నింటికీ మించి ఉత్తమమైన విధానాలను జారీ చేయడం కోసం భవిష్యత్ దార్శనిక వ్యక్తీకరణ(ARTICULATED CISION OF FUTURE) పేరుతో ఒక గొప్ప ఉద్వేగభరిత విన్నపాన్ని చేశారు. “డిమాండ్‌కు మద్దతు ఇవ్వడం అనే కీనీషియన్ చికిత్సావిధానం ద్వారా ప్రజా సమూహమంతటికీ చికిత్స చేయవచ్చుననే ధోరణి ఆర్థికాభివృద్ధికి సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించంలో అసమర్ధమైనది. అసంపూర్ణమైనది. అది సామాజికంగా ఉత్సాహకరమైనప్పటికీ రాజకీయంగా విషతుల్యమైనది. పునఃపంపిణీ అనేది ముగిసిపోయింది. దానికి బదులుగా ఉత్పత్తి విషయంలో పునర్నిర్మాణం అనేది చోటు చేసుకోవాలి. అక్కడే కఠినమైన పరిశ్రమ కూడా అవసరమవుతుంది.”
ఇది సరఫరా దిశగా సాగే రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఒక విశ్వసనీయమయిన ఆధారం. ఎందుకంటే, మితవాదపు లోటు రాజకీయాలు పునఃపంపిణీని ఏ విధంగా వ్యతిరేక దిశలో మళ్ళిస్తాయో అర్థం చేసుకొనేందుకు మనకు ఈ ఆధారం ఉపయోగపడుతుంది. మితవాద రాజకీయం పేదవారి నుంచి తీసుకొని ధనవంతులకు ప్రతిఫలంగా ఇస్తుంది. ఇక్కడ ధనవంతులవడం అంటే అవతల వారిని ప్రత్యక్షంగా నష్టపరచడం. ప్రజలలో అభివృద్ధి పట్ల ఉన్న నమ్మకాల వల్ల పెద్దఎత్తున ఆదాయం శ్రమ నుంచి పెట్టుబడి దిశగా బదిలీ అవుతుంది. దీనికోసం సంపన్నులపై పన్నుల మినహాయింపులను ఇస్తారు. అలా పన్నుల నుంచి మినహాయింపు పొందిన మొత్తం తిరిగి పరిశ్రమలపై పెట్టుబడి పెట్టడానికి, వీలు కలిగించి “మంచి రాబడినిచ్చే ఉద్యోగాల”ను కల్పిస్తుంది. ఫలితంగా తలసరి ఆదాయం పెరిగి, ఉపాంత విలువలు క్షీణించినప్పటికీ(లేదా ఆ కారణంగా) వాస్తవంగా మొత్తంమీద పన్నుల రాబడి పెరుగుతుంది.
కానీ ఈ విశ్వాసం ప్రచారంలో ఉన్నంత గొప్పగా, కార్యక్షేత్రంలో ఎప్పుడూ సఫలం కాలేదు. ఎందుకంటే దానికంత శక్తి లేదు. కానీ, వాస్తవంగా చెప్పాలంటే 1920 నుంచి, కార్పోరేట్ సంస్థలు తాము రాబట్టిన లాభాలను తిరిగి పెట్టుబడులుగా పెట్టాల్సిన అవసరం ఏర్పడలేదు. లాభాలను పెట్టుబడులుగా పెట్టినా, దాని వల్ల ఉద్యోగ కల్పన జరగలేదు. మంచి రాబడినిచ్చే ఉద్యోగాల సంగతి ఇక చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో సంపన్నులు విలాస వంతమైన పడవలను కొన్నారు. లేదా పన్ను మినహాయింపుల మొత్తాన్ని హెడ్జ్ ఫండ్లలోనూ, ప్రైవేట్ ఈక్విటీ రైడర్లలోనూ పెట్టుబడులు పెట్టారు. దీని ద్వారా కంపెనీలను కొనుగోలు చేయడానికీ లేదా వాటిని ముక్కలుగా విడగొట్టడానికి వారికి వీలయింది. ఏది ఏమైనా, ఆర్థోడాక్స్ విశ్వాసాలను సమర్థించే వారు, వారు అనుకున్న ప్రకారం అంత్యదినాలు (end of the days) రానప్పుడు, నిజమైన విశ్వాసులందరూ చేసే విధంగానే, క్యాలెండర్‌ను సవరించుకుంటారు.
కానీ క్లెయిన్, థామ్సన్‌లు దీన్ని అంగీకరించలేదు. వారు ప్రభుత్వ పెట్టుబడి ప్రగతిశీల మార్పుకు ముఖ్యమైన చోదకశక్తి అని అంచనా వేశారు. ఈ మార్పు ప్రజాస్వామ్యం పేరిట అందరికీ మేలు కలిగించేదయి ఉంటుంది. ఇంతవరకూ ఇది సరిపోయింది. కానీ ఇక్కడ, సంవృద్ధికి హామీ ఇచ్చి, ఉత్పత్తిశక్తులను బంధ విముక్తులను చేసే కఠనమయిన పరిశ్రమను ప్రభుత్వ విధానాల సాంకేతిక నైపుణ్య స్థాయికి తగ్గించడం జరగింది. దీనివల్ల ప్రతీ దశలోనూ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ఏజెన్సీలు పోటీపడీ అంతులేని ప్రకటనలను గుప్పిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తారు. ఈ సంకెళ్ళలో కఠోర పరిశ్రమ చిక్కుబడి పోతుంది.
కాలిఫోర్నియా ఒక ప్రత్యేక ఉదాహరణ. ఇక్కడ మితవాద ఉద్ధండులయిన రాన్ డిసాంటిస్, మైక్ జాన్సన్, మార్క్ ఆండ్రీస్సెన్ వంటి వారు ఉన్నారు. వీరంతా ఏ రకమైన సాంకేతిక ఆవిష్కరణలకైనా (ఆచరణలో లాభదాయకమైన సాంకేతిక మార్పు అని అర్థం) బహిరంగ శత్రువులు. ఇప్పుడు వారి కార్యక్రమాలకు, వాషింగ్టన్లో మాదిరిగా ఒప్పందాలు కుదుర్చుకుంటూ, వాటిని మనుషులు చేసే అత్యున్నత పనులుగా భావించే పెద్దమనిషి నడపుతున్న రాజకీయ విధానంతో సరిపోలగల విధానం ఒకటి కావాలి.
సంక్షిప్తంగా చెప్పాలంటే, సంవృద్ధిని సమర్థించిన దార్శనికత డొనాల్డ్ ట్రంప్ రెండవ రాకడతో చాలా చక్కగా సరిపోతుంది. ఇది కలవరపెట్టే అంశం. ఈ దార్శనికత “ఏకీకృత కార్యనిర్వాహకుడిని”(UNITARY EXECUTIVE) ఓటు హక్కుతో ఎన్నుకుంటుంది. సమాఖ్య సంస్థల స్వాతంత్ర్యాన్ని రద్దు చేసి, ప్రజాస్వామ్య పాలన నియమాలను, నిబంధనలను తుంగలో తొక్కి “పనులు పూర్తి చేయగల”(GET THINGS DONE) నాయకుడిని ప్రముఖునిగా స్తుతిస్తుంది. నిజానికి, ఈ దార్శనికతను సమర్ధించేవారికి కావలసింది ట్రంప్ లాంటి నమూనా కాదు. ఫిలడెల్ఫియాలో ఒక ప్రధాన రహదారి వంతెన కూలిపోయినపుడు, వెనువెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి, నిర్మాణాలకు సంబంధించిన స్థానిక, రాష్ట్ర, సమాఖ్య నిబంధనలన్నింటినీ పాటించనీయకుండా రద్దు చేసిన, ఆ రాష్ట్ర గవర్నర్ జోష్ షాపిరో లాంటి వ్యక్తి.
చివరకు, క్లెయిన్, థామ్సన్‌లు దివంగత ఆర్థికవేత్త మాన్కర్ ఓల్సన్ అభిప్రాయం వైపు మొగ్గారు. మాన్కర్ ఓల్సన్, జేమ్స్ మాడిసన్ పేరును అమెరికా రాజ్యాంగంలో రాసినందుకుగానూ రాజ్యాన్ని తప్పు పట్టిన వ్యక్తి. రిపబ్లిక్ స్వయంపాలనను విశాలమైన సామాజిక తలంలో “మరింత భూభాగానికి విస్తరించడం”( EXTENDING THE SPHERE) ద్వారా ప్రయోజనాలను రెట్టింపు చేయాలని ఓల్సన్ అంటాడు. కొత్తభూభాగాలను వశం చేసుకోవడం ద్వారా, కొత్త రాష్ట్రాలను కలుపుకోవడం ద్వారా వీటిని నెరవెర్చుకోవాలని ఆయన అంటాడు. మాడిసన్ కోరుకున్నట్టుగా వివిధ ప్రయోజనాలను సుదీర్ఘంగా చర్చించడం ద్వారా మరింత హేతుబద్ధమైన నిర్ణయాలు ముందుకు రాకపోగా, రాజకీయంగా చిక్కుముడులు ఏర్పడి ఆర్థిక స్తబ్ధత ఏర్పడిందని ఓల్సన్ ఆరోపించాడు.
పరిమిత వనరులను హేతుబద్ధంగా కేటాయించడం తమ పని అని నమ్మే వ్యక్తుల చేతులలో, నిపుణుల పర్యవేక్షణలో, మనకు ఏది మంచిదో మనకంటే బాగా తెలిసిన వారి ఆలోచనలలో, మనం చేయగలిగిన దానికంటే మరింత సమర్థవంతంగా పనులు పూర్తి చేయడానికిగానూ ఇప్పటికే వనరులు శక్తి తమ సొంతం చేసుకున్న వారి వల్ల సమృద్ధి అనే భావన ఎప్పుడూ ఇక్కడే చనిపోతుంటుంది. యాదృచ్ఛికంగా సరిగ్గా అక్కడే ప్రజాస్వామ్యమూ మరణిస్తుంది.
ఊహించని స్వర్గము
ఎంతో శక్తివతంగానూ, తెలివిగానూ నమ్మకాన్నిచ్చేదిగానూ ఉన్న ఈ పుస్తకంపై ఇలాంటి తీర్పునివ్వడం అంగీకారయోగ్యం కాదు. కానీ సంవృద్ధి అనే భావన, ప్రజాస్వామ్య సంభావ్యతలు- రెండూ చావు అంచులలో ఉన్న గంభీర పరిస్థితులలో ఇలా చెప్పడం తప్పనిసరి అవుతుంది.
వాస్తవంగా ఉన్న వనరుల పంపిణీకి మించి వామపక్షం ఆలోచించలేనందుకు క్లెయిన్, థాంప్సన్‌లు దాన్ని ఎంతగానో విమర్శించారు. ఉదారవాదం క్షీణించిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో, రాడికల్ వామపక్షం పంతొమ్మిదవ శతాబ్దపు బానిసత్వ వ్యతిరేక నిర్మూలనావాదుల వ్యంగ్య చిత్రాలుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ విమర్శ ఆశించదగినదేకాక, ఆమోదయోగ్యమైనది కూడా. ఈ బానిస వ్యతిరేక నిర్మూలనా వాదులు తమ ఆత్మలను పరిశుద్ధంగా ఉంచుకోవడం కోసం ఎన్నికల రాజకీయాలలో, విధాన నిర్ణయాల రూపకల్పనలో అనివార్యమైన అవినీతికి దూరంగా ఉన్నారు. కానీ క్లెయిన్, థాంప్సన్ అందించే ప్రత్యామ్నాయ దృక్పథం చాలా పాతదయిన సాంకేతిక క్షితిజ రేఖ. ఎనిమిది సంవత్సరాల క్రితం రిపబ్లిక్‌ను రద్దు చేయాలని ట్రంప్ తన ఉద్దేశ్యాన్ని ప్రకటించినప్పుడే మనం దానిని దాటి వచ్చాము.
కానీ ముఖ్యమైన విషయమేమిటంటే, క్లెయిన్, థామ్సన్‌లు సంవృద్ధి అనే భావనకు సంబంధించి ఈ పుస్తకంలో అందించాలనుకున్న దార్శనికత, ట్రిబ్యులేషన్ ఫోర్శ్ ఆఫ్ ద లెఫ్ట్ సినిమాను పోలి ఉంటుంది. దీనిలోని పాత్రలు భూమిపై సాతానుడికి వ్యతిరేకంగా పోరాడడం ద్వారా స్వర్గంలోని బాధితులలో తాము కూడా చేరేందుకు తమకున్న శక్తిని నిరూపించుకుంటాయి. సాధికారతనివ్వడం ద్వారా ప్రోత్సహించబడని సంవృద్ధే మనకు కావలసినది, అర్హమయినది. ఈ సంవృద్ధి కోసం నిబంధనలను సరలీకరించి ప్రైవేట్ పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు ధైర్యాన్నిచ్చి ఆకర్షించాల్సిన పనిలేదు. వారికోసం చట్టాలను అనుకూలంగా మలిచే అధికారుల అవసరం లేదు. గ్యారీ గెస్టల్స్ అనే చరిత్రకారుడు, “పీరియడైజేషన్ ఆఫ్ ది యూ ఎస్ పొలిటికల్ పార్టీ” లో చెప్పినట్టుగా “ఉత్తమమయిన కథ”ను చెప్పడం ద్వారా మంచిని అందించే “రాజకీయ విధానం”(POLITICAL ORDER) ( దీనినే క్లెయిన్, థామ్సన్‌లు ఎంతో ఉత్సాహంగా పేర్కొన్నారు) కోసం ఎదురు చూడడం ఇక్కడ అనవసరం. ఇక ఇప్పుడు, సంవృద్ధి అనేది సరళమయిన వాస్తవానికి కట్టుబడి ఉంటుంది. ఆర్థికాభివృద్ధికి మరింత పొదుపు, మరింతగా పని, మరిన్ని శిలాజ ఇందనాలు అవసరం లేదు(ఆ విధంగా భూమిని భస్మం చేయనవసరం లేదు). ఎందుకంటే అభివృద్ధి అనేది ఏ వేగంతో ఉన్నప్పటికీ, భారీ మొత్తంలో శ్రమనుగానీ పెట్టుబడినిగానీ కోరదు. మనకు కావలిసినదల్లా కొత్త ఆలోచనలు, భవిష్యత్తు కోసం అత్యవసరమయిన సమన్వయ దృష్టి. సంవృద్ధి అనే భావన, చారిత్రకంగా అది అన్నివిధాలుగా పుష్కలంగా ఉన్న సమయంపై శ్రద్ధ వహించినప్పుడు మాత్రమే మనం క్లెయిన్, థామ్సన్‌ల కన్న మెరుగయిన భవిష్యత్తును ఊహించగలం. రాజకీయ రహితంగా విధానాలను మాట్లాడడం అంటే అది పనికి వచ్చేది కాదు. రాజకీయాలు సామాజిక ఉద్యమాల ద్వారా చలనంలోకి వస్తాయి. ఇలా భావించడం ద్వారా మాత్రమే మనకేమి అవసరమో మనం అర్థం చేసుకోగలం. కాబట్టి పోటర్, ఓస్లన్, గెర్స్టెల్లకు బదులుగా వెయిల్‌ను మన ప్రారంభ సూచికగా తీసుకుందాం. కరుణ, దాతృత్వాలతో పన్నుల ద్వారా ఆదాయాన్ని పునఃపంపిణి చేద్దాం. ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసం సమానత్వాన్ని సాధిద్దాం. ధనవంతులు మరింత ధనవంతులయినట్లయితే ఈ రెండు లక్ష్యాలనూ సాధించలేము. ఎందుకంటే, వారు తిరిగి పెట్టుబడులు పెట్టాలన్నా, నూతన ఆవిష్కరణలు చేయాలన్నా పన్ను మినహాయింపులు వారికి ప్రోత్సాహాన్ని ఇస్తాయనే ఊహాజనిత కారణాలతో మనం వారి “సంపాదన”పై పన్ను విధించము. పన్నుల పట్ల ఏర్పరుచుకున్న ఈ నూతన వైఖరి వల్ల వొనగూరిన రాబడి ప్రభుత్వ పెట్టుబడులకు నిధులను సమకూర్చుతుంది. అప్పుడు సరఫరా దిశగా మనం సాధించబోయే దానికి హద్దులు ఉండవు. సంవృద్ధిని మనము దుబారా చేయక పోయినట్లయితే అది మనకు అందేంత చేరువలోనే ఉంది. కానీ దాన్ని అందుకోవడానికి సాంకేతిక విధానాలను మించినది కావాలి.
అనువాదం: ఎ నాగరాజు
(అబండెన్స్ రచయితలు: ఎజ్రా క్లెయిన్, డెరిక్ థామ్సన్. ప్రచురణ: అవిడ్ రీడర్ ప్రెస్, సైమన్& స్కష్టర్, 2025.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.