
అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదా ప్రపంచ కార్మికుల పండుగ ‘మే డే’వంటి ప్రధాన తేదీలు నూతన సంవత్సరంలా సరదాగా చిందులేసే సందర్భాలు కావు. ఈరోజు మనం అనుభవిస్తున్న మెరుగైన జీవనప్రమాణాలకు ఎందరెందరు, ఏఏ సందర్భాలలో, ఎన్నెన్ని త్యాగాలు చేశారో ఇటువంటి సందర్భాల్లోనైనా గుర్తుచేసుకోవాలి. అంతేకాకుండా ప్రస్తుత సమాజంలో కూడా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు, ఆర్థిక సమానత్వానికి నోచుకోని అభాగ్యుల కోసం మన వంతు కృషిగా ఏం చేయగలమనే ఆలోచనలకు పదును పెట్టే అవకాశాలుగా భావించాలి.
చారిత్రక సందర్భాలను సామాజిక చైతన్య పూర్వక దిశలో కాకుండా సంబరాలుగా జరుపుకునే విష సంస్కృతి ప్రస్తుత రోజుల్లో చాప కింద నీరులా ప్రవహిస్తుంది. స్త్రీలకు ఓటు హక్కు లేని, ఆస్తి హక్కు లేని, కనీసం ఒంటి నిండా బట్టలు కూడా కట్టుకునే అర్హత లేని, అందరు తినగా మిగిలింది మాత్రమే తినాలన్న నిబంధన నుంచి అన్ని రంగాల్లో శాసించే స్థాయికి మహిళలు చేరుకుంటున్నారు. ఇది దానంతట అది జరిగింది కాదు. ఎందరో త్యాగాల వల్ల, మరెందరివో బలిదానాల వల్ల మాత్రమే సాధించబడిందని మరిచిపోకోడదు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోరాటాలకు ప్రతీక..
మహిళా దినోత్సవం రోజున ఒకరికొకరు పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలుపుకొని, యాజమాన్యాలు ఇచ్చే చిన్నపాటి బహుమతులు తీసుకోని, సరదాగా కాసేపు ఆటపాటలతో గడిపి కావాల్సిన విందును ఆరగించి, తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం లాంటివి ఎక్కువ సంతోషాన్ని ఇస్తున్నట్లు అనిపించవచ్చు. ఇలాంటివి చేయకూడదని కాదు. వేరే ఏ సందర్భంలోనైనా ఇలాంటి కార్యక్రమాలు చేయవచ్చు.
అయితే, చారిత్రక సందర్భాల ఇతివృత్తాన్ని పెడచెవిన పెడితే ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఎంత మాత్రం ఉండవని గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పోరాటాలకు ప్రతీకగా కాకుండా సంబరాల సందర్భంగా నేటి యాజమాన్యాలు కూడా ఒక పుష్పగుచ్ఛాన్ని తమ దగ్గర పనిచేస్తున్న మహిళలకు ఇచ్చి సంతృప్తి పరుస్తున్నాయి. యాజమాన్యాల నుండి ఇలాంటి ప్రతిస్పందన కూడా పోరాటాలు సాగినంత కాలం మాత్రమే ఉంటుందని మర్చిపోకూడదు.
ఒక్కసారిగా పడిపోయిన జీతాలు..
లక్షలకొంది జీతభత్యాలు పొందుతూ పెద్ద పెద్ద కారులలో ప్రయాణిస్తూ, కార్పొరేట్ కంపెనీలలో మంచి మంచి హోదాల్లో ఉన్నవారంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక వాట్సాప్ గ్రీటింగ్‌కు పరిమితం చేసేశారు. లేదా క్లబుల్లో, స్టార్ హోటళ్ళల్లో సరదా సామూహిక విందులకు కుదించి వేశారు. ఇలాంటి పోకడల వల్ల కావచ్చు పట్టుమని పాతికేళ్లు కూడా ఒక వెలుగు వెలగని సాఫ్ట్వేర్ రంగం ఒక్కసారిగా లక్షల్లో జీతాల నుంచి వేలల్లో జీతాలకు పడిపోయింది. ఆయా కంపెనీలో జరుగుతున్న శ్రమ దోపిడీ(ఎక్స్‌ప్లాయిటేషన్)పై గళం విప్పి ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు.
జీతభత్యాలు- వసతులు బాగా పెరిగిపోయిన ప్రభుత్వ రంగాల్లో, ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో కూడా ఈ విధమైన పోకడలు పెరిగితే చాలా ప్రమాదం. మహిళా దినోత్సవం సందర్భంగా మీటింగ్ ఎందుకు, ఆ మీటింగ్‌లో ప్రసంగాలు ఎందుకు, ప్రశాంతంగా పసందైన విందు వినోదాలతో రిలాక్స్ అయితే సరిపోదా అనే భావజాలం పెరిగితే అది మొదటికే మోసంగా పరిణమించవచ్చు.
మహిళా దినోత్సవాలు లేక మరేదైనా సందర్భంలో వేడుకలను జరుపుకునేటప్పుడు సెలబ్రిటీలైన సినీ తారలను, క్రీడాకారులను, ప్రవక్తలను లేదా కమెడియన్లను, మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళను పిలిచి జరుపుకోవచ్చుగా అని సలహాలు ఇవ్వవచ్చు. కానీ, ఆరోగ్యంగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే అనారోగ్యం దరిచేరదని అన్నట్టుగానే అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడే కనీసం సందర్భోచిత పోరాటాలను మరువకుండా నిర్వహించినప్పుడే భవిష్యత్‌లో ఎదురయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకోగలమని గుర్తుంచుకోవాలి.
తమ పిల్లల విషయంలో తల్లిదండ్రుల బాధ్యత..
పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం అంటే విద్యాబుద్ధులు నేర్పించి, ఉద్యోగస్తులుగా స్థిరపరిచి, కావాల్సినవన్నీ స్థిరాస్తులు సమకూర్చడమేనని అనుకుంటాం. కానీ, ఇటువంటివి చాలా వరకు పాక్షికంగా మాత్రమే చూడాలి.
ఒక మనిషి ఆర్థిక సామాజిక సమానత్వం తాను జన్మించే ప్రదేశాన్ని బట్టి ఉంటుందట. ఒకే సమయంలో అమెరికాలో ఇండియాలో పుట్టిన పిల్లలను చూస్తే అమెరికా పౌరుడికి 80% సంపద ఎక్కువ..! అంటే మన పిల్లలకు మనం సమకూర్చుకోవాల్సినవి విద్య, ఉద్యోగాలు, ఆస్తులు మాత్రమే కాదు. అవన్నీ పుష్కలంగా అందుబాటులో ఉంచగల సమాజం కూడా ఉండాలి. అలాంటి సమాజం ఏర్పడడానికి జరిగిన కృషిలో మన పాత్ర ఎంత? ఇంకా మిగిలి ఉన్నది ఎంత? ఇలాంటి అవగాహనను పెడచెవిన పెట్టడమంటే మన పిల్లలకు భవిష్యత్తు ప్రమాదాన్ని మనమే కల్పిస్తున్నట్టు. అలాగని అందరూ ఉద్యమకారుల్లా తిరగబడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి సమూహానికి లభించిన అవకాశాల్లో ప్రతిస్పందించే అలవాటు చేసుకోవాలి.
ఆర్థికంగా బాగా స్థిరపడి బాధ్యతలన్నీ తీరిన తర్వాత సామాజిక సమస్యలను చర్చించడానికి కొందరు సుముఖంగా లేరు. అన్యాయాల గురించి పీడితుల గురించి, స్త్రీలపై దళితులపై జరుగుతున్న అత్యాచారాలను ఎవరైనా ఎత్తిచూపితే, ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎవరైనా ఎండగడితే ఇవన్నీ మనకు అవసరమా అనే విసుర్లు వేస్తున్న పరిస్థితులు కూడా ప్రస్తుత రోజుల్లో కనబడుతున్నాయి.
నినాదాలివ్వడమో, ప్లకార్డులు ప్రదర్శించడమో, ధర్నాలలో పాల్గొనడం లేదా ప్రత్యక్ష పోరాటాల్లో పాలు పంచుకోవడం వంటివన్నీ ఆర్థికంగా స్థిరపడిన కొందరికి నామోషీగా అనిపిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. మనం చాలా కష్టపడి చదివాం, దానివల్ల మంచి ఉద్యోగం సంపాదించాం, దీంతో మంచి జీతాన్ని పొందుతున్నాం, మనకెందుకు పోరాటాలు, మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే భావన కూడా కొందరిలో కనిపిస్తుంటుంది.
పట్టపగలైనా సరే పోలీసులు తలుపు తట్టి అసంబద్ధ ప్రశ్నలడిగినప్పుడో లేదా అకారణంగా ఆఫీసులో నిందలు మోపడమో లేదా నిందితులను చేయడమో జరిగినప్పుడు మనకున్న స్వేచ్ఛ స్వాతంత్య్రాల సంగతి అర్ధమవుతుంది. అప్పుడు సంఘము, సమాజము అన్నీ గుర్తుకొస్తాయి. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యం గుర్తుకు రాదు. తిరగబడి పోరాటాలు చేసే నాయకులు వారి సంఘాలు గుర్తుకొస్తాయి.
చాలా మెరుగైన సమాజంలో ఉన్నాం, స్త్రీలకు అన్ని రకాల హక్కులున్నాయని భావించేవాళ్లు గుర్తు పెట్టుకోవాల్సిందేమంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మహిళల అక్షరాస్యత ఇంకా 75 శాతానికి కూడా చేరలేదు. 35% గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో సతమతమవుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో 40% కుంటుబడి ఎదుగుతున్నారు. గృహహింస చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గృహ హింస బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గలేదు. ప్రభుత్వ రంగాలు ప్రభుత్వ డిపార్ట్మెంట్లో తప్ప ఎక్కడ కూడా స్త్రీలకు పురుషులతో సరిసమానమైన వేతనాలు అందడం లేదు. పెన్షన్ పొందుతున్న వృద్ధుల్లో 30% మంది పురుషులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. 70% మంది మహిళా పెన్షన్‌దారులు తిండికి నోచుకోలేనంత నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఇలాంటి ఘోరాతిఘోరమైన దౌర్జన్యాలను ప్రశ్నించడానికి మనకు సమయం లేకపోయినా అలాంటి సంఘాలకు చేయూతనివ్వడం నేటి అవసరమని మరిచిపోతే ఎలా..?
ప్రతిఘటించటం, పోరాటాలు చేయటం ఎవరో ‘అలాగా జనాలు’(నిరుపేదలు) చేసేవి కావని గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో మన సొంత పిల్లలే అలాంటి అలాగా జనంలా మారకూడదనే విచక్షణతో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలాంటి ప్రత్యేక సందర్భాలను జరుపుకోవాలనే చైతన్యం మనల్ని విడిచి పోకూడదు.
జీ తిరుపతయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.