
2025 సంవత్సరానికి గాను హార్ట్‌ల్యాంప్ కథల సంపుటి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌ను గెల్చుకున్నది. ఈ సంపుటి మూలం 1990లో కన్నడలో రాసిన కథల సంపుటి. కన్నడ మూల రచన అనువాదానికి బుకర్ ప్రైజ్ దక్కటం ఇదే ప్రథమం. అంతేకాదు సాధారణంగా దీర్ఘ రచనలకు, నవలలకు దక్కే ఈ బహుమతిని కథల సంపుటికి ఇవ్వడం కూడా ఇదే తొలిసారి.
హార్ట్‌ల్యాంప్ ఎంపికపై బుకర్ ప్రైజ్ 2025 న్యాయ నిర్ణేతల బృందం అధ్యక్షులు మ్యాక్స్ పోర్టర్ స్పందింస్తూ ‘‘హార్ట్‌ల్యాంప్ సంపుటి ఇంగ్లీషు పాఠకలోకానికి పూర్తిగా కొత్తది. బహుళ ఇంగ్లీషు భాషల్లో కొత్తదనాన్ని జోడించిన ఈ అనువాదం విప్లవాత్మకమైనది. ప్రయోగించిన భాష ఇంగ్లీషు పాఠకలోకానికి కొత్తదనాన్ని అందిస్తోంది. ఈ అనువాదం సాధారణంగా అనువాదం పట్ల ఉన్న అభిప్రాయాలను సవాలు చేస్తోంది.
‘‘కన్నడ నేపథ్యంలో నిత్యం హడావుడిగా ఉండే జీవితాల నడుమ ప్రాణం పోసుకున్న ఈ కథలు భిన్నమైన భాషలు, సామాజిక ఆర్థిక నేపథ్యాల నడుమ మరింత సంపన్నవంతమయ్యాయి. ఈ కథలు మహిళల హక్కులు, బిడ్డలకు జన్మనిచ్చే హక్కు, కులం, అణచివేత, విశ్వాసాలు, అధికారం వంటి విషయాలను పాఠకుల ముందుంచుతాయి.
‘‘తొలి పఠనంలోనే న్యాయనిర్ణేతలందరికీ నచ్చిన పుస్తకం ఇది. ఈ సంపుటి గురించి న్యాయనిర్ణేతలు భిన్న కోణాల్లో విశ్లేషించి మదింపు చేశారు. ఈ పుస్తకం 2025 అంతర్జాతీయ బుకర్ ప్రైజు విజేతగా ప్రకటించటానికి సంతోషిస్తున్నామని బుకర్‌ప్రైజ్.కాంలో చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
కథల సంపుటిలో ఏముంది?
ఇది12 చిన్న కథల సంపుటి. దక్షిణ భారతదేశంలో పితృస్వామిక వ్యవస్థ చేతుల్లో నలిగిపోతున్న మహిళలు, బాలికల దైనందిన జీవితాలే ఈ కథలు. 1990 నుంచి 2023 మధ్యకాలం ఈ కథల రచనా కాలం. కుటుంబం, సమాజం మధ్య నెలకొంటున్న ఉద్రిక్తతలు, ఉద్వేగాలు గురించి భాను ముస్తాక్ వివరించిన తీరు కుల, మత అణచివేతకు వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం రచయిత దీర్ఘకాలం అవిశ్రాంతంగా సాగించిన పోరాటానికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి.
చమత్కారం, సుస్పష్టతతో కూడిన రచనా శైలి పాఠకులను అలా నడిపించుకెళ్తుంది. వచన శైలిలో చెప్పిన ఈ కథలు పాఠకులను ఉద్వేగపరుస్తూ కలవరపాటుతో కూడిన భావోద్వేగాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ కథల్లో పాత్రధారులు చురుకుగా ఇంట్లో తిరిగే పిల్లలు, ఎదురు తిరగటానికి సిద్ధమైన వృద్ధులు, పెత్తనం చేసే సోదరులు, రోజువారి జీవిత సమస్యల్లో జోక్యం చేసుకుని బఫూన్లుగా మిగిలిపోయే మౌల్వీలు, తరచూ నిస్సహాయులైన భర్తలు. వీరందరితో వేగుతూ తమదైన భావోద్వేగాలను, వాటి విలక్షణతను కాపాడుకునేందుకు ప్రయత్నించే తల్లులు. మనిషి సహజత్వాన్ని దగ్గరగా లోతుగా పరిశీలించటమే ఆమెను రచయితకు తనదైన అరుదైన మేలిమి శైలిని తెచ్చిపెట్టాయి.
భాను ముష్తాక్, దీపా భాష్తీ ల గురించి..
కర్ణాటకకు చెందిన భాను ముష్తాక్ న్యాయవాది. మహిళాహక్కుల కార్యకర్త. రచయిత. ప్రగతిశీల రచయితగా 1970 దశకంలో రచనా జీవితం ప్రారంభించారు. కులదోపిడీ, వర్గదోపిడీలకు వ్యతిరేకంగా సమాజంలో అణగారిన సామాజిక తరగతుల నుంచి రచయితలను ప్రోత్సహించేందుకు ప్రారంభమైన బందాయ సాహిత్యోద్యమం నుంచి పుట్టుకొచ్చిన రచయిత భాను ముష్తాక్.
ముష్తాక్ ఇప్పటి వరకూ ఆరు కథా సంపుటాలు, ఒక కవితా సంపుటి, ఒక నవల, వ్యాస సంపుటి వెలువరించారు. రచయిత మూల భాష కన్నడ. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు, దాన చింతామణి అత్తిమబ్బే అవార్డుతో సహా పలు అవార్డులు భాను ముష్తాక్‌ను వరించాయి. ఆమె రచనల తొలి అనువాద సంపుతి హార్ట్‌ల్యాంప్. భారతదేశం నుంచి ఈ బహుమతి గెల్చుకున్నవారిలో భాను ముష్తాక్ రెండో వ్యక్తి. కన్నడ మూల భాష అనువాదానికి బుక్‌ప్రైజ్ రావటం ఇదే మొదటిసారి.
అనువాదకురాలు దీపా భాష్తి..
దీపా భాష్తి రచయిత, అనువాదకురాలు. కర్ణాటకలోని కొడుగు ప్రాంతంలో నివసిస్తారు. భాష్తీ రచనలు, వ్యాసంగం, సాంస్కృతిక విమర్శ దేశీయ భాషల్లోనూ అంతర్జాతీయంగానూ ప్రచురితమయ్యాయి. కోట శివరామ కారంత్ రాసిన నవల, కొడగిన గౌరమ్మ రాసిన కథల సంపుటిని ఆంగ్లంలోకి అనువదించారు. భాష్తీ అనువాదాలకు పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డులు కూడా వచ్చాయి. హార్ట్‌ల్యాంప్ అనువాదాన్ని దేశీయ మాండలికం స్పురణకు వచ్చేలా అనువదించానని భాష్తీ అన్నారు. భాష్తీ బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయ అనువాదకురాలు.
రచయిత, అనువాదకుల మాటల్లో హార్ట్‌ల్యాంప్..
‘‘ నా కథలన్నీ మహిళల గురించే. సమాజం, రాజకీయాలు, మతం మహిళల నుంచి ప్రశ్నించటానికి అవకాశం లేని రీతిలో విధేయతను కోరటం, ఈ క్రమంలో అమానుషమైన క్రూరత్వానికి వారిని బలి చేయటం, దాదాపుగా బానిసలుగా చూడటం వంటి విషయాలన్నీ నా కథల్లో వస్తువులుగా ఉన్నాయి. నా జీవితానుభవాలు, రోజువారీ పత్రికల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన వార్తలే నాకు ప్రేరణ. నిస్సహాయత, బాధ, అణచివేతలే నాలో భావోద్వేగంతో ఉన్న రచయితను తట్టి లేపాయి.’’ అని భాను ముష్తాక్ అన్నారు.
‘‘అనువాదం నాకు సహజత్వం. అనువాదంలో ఏ పుస్తకానికి ఆ పుస్తకం భిన్నంగానే ఉంటుంది. భాను ముష్తాక్ రచనలన్నీ చదివిన తర్వాత హార్ట్‌ల్యాంప్ సంపుటిలో ఉన్న కథలను అనువాదానికి ఎంపిక చేసుకున్నాను. కథల ఎంపికలో కానీ, వాటి అమరికలో కానీ రచయిత నాకు పూర్తి స్వేఛ్చనిచ్చారు.’’ అన్నారు దీపా భాష్తి.
ఇతర న్యాయనిర్ణేతల అభిప్రాయాలు..
‘‘మూడు దశాబ్దాల వ్యవధిలో విస్తరించిన పన్నెండు కథల్లో మనకు కన్నడ కథాసాంప్రదాయంలోని అభ్యుదయ రచయిత కనిపిస్తారు. తరచూ సమాజం అంతగా పట్టించుకోని బాలికలు, మహిళలు, దక్షిణ భారతదేశంలోని ముస్లిం సమాజంలో భాగస్వాములైన మహిళలు ఈ కథల్లో మనకు కనిపిస్తారు. ఈ కథలు సామాజిక వాస్తవాలను ఎలుగెత్తి చాటుతాయి. వర్తమాన సమాజంలో వేళ్లూనుకున్న కులం, వర్గం, మతం వంటి చీలిక శక్తులను ఎత్తి చూపుతాయి. అవినీతి, అణచివేత, అన్యాయం, హింసలతో నిండిన సమాజపు పార్శ్వాన్ని ఈ కథలు మునముందుంచుతాయి. ఇన్ని ప్రతికూల కోణాల గురించి చర్చించినా చివరకు ఈ కథల సంపుటి పాఠకుడికి ఓ తృప్తిని మిగులుస్తాయి. పాత్రల మధ్య రోజువారీ జరిగే జీవన పోరాటంలో మలుపులు, మెలికలను కళ్లకు కట్టినట్లు రచయిత చూపిస్తారు. చూడటానికి తేలికగానే కనిపించే ఈ కథల్లో లోతైన నైతిక, సామాజిక, భావోద్వేగాలు ఇమిడి ఉన్నాయి.’’
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.