
జైపూర్‌లో ప్రధాని నరేంద్రమోడీ ర్యాలీకి హాజరైన మద్దతుదారులు. ఫొటో క్రెడిట్: పీటీఐ/ఫైల్ చిత్రం
“కల్నల్ సోఫియా ఖురేషీ దేశ లౌకిక విలువల గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రస్తుతం కేంద్రంలోని అధికార పార్టీ ప్రభుత్వ రాజకీయ అభిప్రాయానికి పూర్తిగా వ్యతిరేకమైనవి.”
“భారతదేశం లౌకికదేశం, మా దేశ సైన్యం భారత రాజ్యాంగ విలువలకు అందమైన ప్రతీక” అని భారత సైనిక అధికారిక ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషీ చెప్పిన ఈ మాటలు యుద్ధ మృదంగాలు మూగబోయిన తరువాత చాలా కాలం పాటు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. తాజాగా తలెత్తిన భారత్- పాక్ ఘర్షణల నేపథ్యంలో వెల్లువెత్తిన అసంఖ్యాకమైన వ్యాఖ్యలు, వాక్యాల్లో పై వాక్యాలూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
బీజేపీ నాయకులు తమదైన హింసాత్మక దూకుడు, మతతత్వ రీతి ప్రచారంతో ఈ మాటలను మరుగునపడేలా చెయ్యడానికి శతధా ప్రయత్నిస్తారు. కానీ మనం వారి ఎత్తుగడను పారనీయకుండా నిలువరించాలి.
పాకిస్తాన్ మీద భారతదేశం ఆధిక్యతను చాటి చెప్పుకోవడానికి మన దగ్గర ఉన్న విలువైన ఒకే అస్త్రం “మా దేశం లౌకిక విలువలకు కట్టుబడిన దేశం” అని గర్వంగా చెప్పుకోగలడమే.
ప్రస్తుతానికి ఇరు పక్షాలు వెనక్కి తగ్గాయి. యుద్ధం నివారించబడింది. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.
ఇరు దేశాధినేతలూ ఎవరికి వారే “మనదే గెలుపు” అని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇరు దేశాల ప్రజానీకం తమ దేశాధినేతలకు బేషరతుగా మద్దతు పలికారు. కాబట్టి నేతలు చెప్పిన మాటలు నమ్మితీరాల్సిన అగత్యానికి నెట్టబడ్డారు. అయితే, వాస్తవాలు ఇరు దేశాల ప్రజానికాన్ని ఇరుకున పెడుతున్నాయి.
ఆ ఇబ్బందులు కాసేపు పక్కన పెడితే ఈ ఘర్షణల నేపథ్యంలో బీజేపీ, దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లు సైద్ధాంతిక భూమికలో నిర్ణయాత్మక ఓటమిని చవి చూశాయి. “జాతీయత”కు ఈ రెండు సంస్థలు ఇచ్చే నిర్వచనం దారుణంగా చావుదెబ్బ తిన్నది. భారతదేశాన్ని హిందూరాజ్యంగా అవతరింప చేస్తున్నామని బీజేపీ భావిస్తుంది. కానీ పాకిస్తాన్ కంటే మాది మెరుగైన దేశమని చెప్పుకోవడానికి భారతదేశం రాజ్యాంగ విలువలకు కట్టుబడిన లౌకికదేశమని ప్రకటించుకోవాల్సి వచ్చింది.
ఏ యుద్ధంలో అయినా ఆయుధాలతో పాటు భాష కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. భాష అనేది భావ ప్రసరణా మాధ్యమం. యుద్ధంలో పాల్గొనే రెండు దేశాలూ భావాల, ఆదర్శాల పరంగా కూడా యుద్ధం చేస్తాయి.
ఎదుటి దేశం కంటే తమ దేశమే ఆదర్శాల పరంగా మెరుగైనదని చాటి చెప్పడానికి ప్రయత్నిస్తూ యుద్ధంలో భాగస్వామి కానీ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఉక్రెయిన్ దేశం నాజీ సిద్ధాంతాలను ఎగదోస్తుంది, జాత్యహంకార ధోరణులతో అన్య మైనారిటీ జాతుల ప్రజానికాన్ని అణిచివేస్తుంది. కాబట్టే దాని మీద తాము యుద్ధానికి దిగాల్సి వచ్చిందని రష్యా ప్రకటించడం, ప్రచారం చెయ్యడం ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
గత పది రోజులుగా భావజాల రంగంలో జరిగిన యుద్ధాన్ని మనం ప్రచార, ప్రసార సాధనాల్లో చూశాం. ఈ పది రోజులూ రాజకీయ ప్రభుత్వ వర్గాలు మౌనం పాటించాయి. మన దేశం తరఫున సైన్యం అధికారిక ప్రతినిధిగా మాట్లాడుతూ వచ్చింది.

అయితే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, సైనిక అధికారిక ప్రతినిధులైన సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌లు వాడిన భాష ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఘటనకు ముందు, తర్వాత రాజకీయ ప్రభుత్వాధినేతలు వాడిన భాషకు పూర్తిగా వ్యతిరేకమైనది.
ఘర్షణలు మొదలైన మూడవ రోజున పాత్రికేయ సమావేశంలో ఖురేషీ మాట్లాడుతూ భారతసైనిక బలగాలు మసీదులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయన్న ఆరోపణలకు బదులుగా “భారతదేశం లౌకికదేశం” అని నొక్కివక్కాణించింది. తమది లౌకిక దేశం కాబట్టి తాము ఏ మతాన్ని అవమానించం, ఏ మత ప్రతీకల మీదా దాడులు చెయ్యమని ప్రత్యర్థి దేశ ఆరోపణలకు ఖురేషీ జవాబు ఇచ్చింది.
ఈ ఒక్క మాట పాకిస్తాన్‌ను ఉద్దేశించి చెప్పింది మాత్రమే కాదు. ప్రధాని మోడీ సహా అధికారి పార్టీ వారందరికీ వర్తిస్తుంది. వాళ్లకే కాదు ఆ పార్టీ అనుయాయులు, మద్దతుదారులు అందరూ విని తీరాల్సిన, గుర్తుంచుకోవాల్సిన మాట ఇది. భారత దేశ లౌకిక స్వభావాన్ని కుళ్లగించి హిందూ రాజ్యాన్ని నెలకొల్పాలని భావిస్తున్న వారందరికీ ఈ మాట చెంపపెట్టులాంటిది.
2019 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించాక పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 2014 తర్వాత “లౌకికత్వం” అనే పదాన్ని తీసి పక్కన పడేశామని మోడీ గొప్పలు పోయాడు.”లౌకికతత్వం ముసుగు కప్పుకుని ఏ రాజకీయ పార్టీ కూడా జనాన్ని ఇంకా తప్పుదోవ పట్టించలేదు” అని ప్రకటిస్తూ 2019 ఎన్నికలలో ఈ తరహా విజయాన్ని సాధించినందుకు మోడీ తనని తానే అభినందించుకున్నాడు.
మోడీ తర్వాత ఆ స్థాయి ప్రజాదరణగల బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యానాధ్ 2017లోనే “లౌకికత్వం అనే పదం పెద్ద అభద్ధం” అని ప్రకటించేశాడు.
2023లో పార్లమెంట్ సభ్యులకు అధికార పార్టీ పంచిన రాజ్యాంగ ప్రతులలో లౌకికత్వం, సోషలిజమనే రెండు పదాలూ లేకుండా చేసింది. రాజ్యాంగం నుంచి ఈ రెండు పదాలనూ తొలిగించాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యాల మీద వ్యాజ్యాలు వేస్తూ వచ్చారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ అయితే మరో అడుగు ముందుకు వేసి రాజ్యాంగ మౌలిక సూత్రాలు పవిత్రమైనవి, మార్చదగ్గ వీలులేనివి కానేకాదని అవకాశం దొరికినప్పుడల్లా చెబుతూనే వస్తున్నారు. పార్లమెంటు ఎన్ని చట్టాలు చేసినా రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో స్పష్టం చేసింది. లౌకికత్వం రాజ్యాంగ మౌలిక స్వభావంలో అంతర్భాగం. దీనిని తొలగించాలని ధనకర్ కోరుకుంటున్నారు.
ఇది కేవలం ధనకర్‌కు వచ్చిన ఆలోచన అని భావించకండి. బీజేపీ పితృసంస్థ గురువులు అందరూ లౌకికత్వాన్ని తీవ్రంగా ద్వేషించిన వాళ్లే, భారతదేశాన్ని లౌకిక గణతంత్ర రాజ్యంగా ప్రకటించడానికి మూలకారణం నెహ్రూ అనే ఒకేఒక్క కారణంతో ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు నెహ్రూ పట్ల తీవ్ర విద్వేషాన్ని ప్రకటిస్తుంటారు.
ఉద్ధవ్ థాక్రే బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్ పార్టీతో పొత్తుకుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఉద్ధవ్ థాక్రే “లౌకికవాది”గా మారిపోయాడని బీజేపీ నాయకులు హేళన చేశారు. ఆనాడు మహారాష్ట్ర గవర్నర్ కూడా థాక్రే లౌకికవాదిగా మారాలనుకుంటున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీజేపీ శ్రేణులయితే ఈ పదాన్ని తిట్టుగా చలామణి చేశారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అధికారం దక్కించుకున్న దగ్గర నుంచి ఆ పార్టీ శ్రేణులు “సెక్యులర్”(లౌకిక) అనే పదాన్ని “సిక్కులర్”గా వ్యవహరిస్తూ లౌకికత్వం అనేది జబ్బు అని, లౌకికత్వానికి కట్టుబడి ఉన్న వారందూ జబ్బుపడిన మనుషులు అని ముద్రవేయడాన్ని ముమ్మరంగా చలామణిలోకి తెచ్చారు.
“సెక్యులర్” అనే పదాన్ని బూతుగా వాడకంలోకి తీసుకురావడానికి ముందు బీజేపీ కూడా తాను “సెక్యులర్” పార్టీగా చెప్పుకోవడానికే చూసింది. మైనార్టీల హక్కుల గురించి గళం విప్పిన వాళ్ల నోళ్లు మూయించడానికి ఎల్కే అద్వానీ “కుహానా- లౌకికవాదులు” అని దబాయించడం మొదలుపెట్టారు.
అప్పటి నుంచి లౌకికత్వం అనే పదం, భావన రెండింటినీ వక్రీకరించడానికి, దాడి చెయ్యడానికి బీజేపీ- ఆర్ఎస్ఎస్లు నిరంతర ప్రయత్నాలు కొనసాగించాయి. ప్రభుత్వ పథకాలు అందరికీ అందిస్తున్నాం కాబట్టి తమది సెక్యులర్ ప్రభుత్వమే అని ఒక దశలో మోడీ సమర్ధించుకోవడానికి చూశారు. పైకి ఏం చెప్పినా లౌకికత్వం అనే పదం, భావనల స్ఫూర్తిని గొంతునులమడానికే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు చూశాయి.
లౌకికత్వానికి రాజకీయ హక్కుల సమానత్వానికి దగ్గరి సంబంధం ఉంది. ఏ మతానికి, జాతికి చెందిన వారికయినా వారి సంఖ్యతో నిమిత్తం లేకుండా సరి సమాన రాజకీయ హక్కులు ఉండాలి. ఏ మతానికి చెందిన వారికైనా రాజకీయాలలో పాల్గొనడానికి సమాన అవకాశాలు కల్పించడమే లౌకికత్వంలో ఇమిడి ఉన్న సారం.
రాజకీయ ప్రాతినిధ్యం అంటే అన్ని కులాల, అన్ని మతాల వారికి ఓటు హక్కు కల్పించడం మాత్రమే కాదు. అన్ని కులాలు, మతాలకు సంబంధించిన ప్రజానీకం తాము ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని విశ్వసనీయంగా భావించగలిగితేనే రాజకీయ ప్రాతినిధ్యం అనేది అర్ధవంతంగా మారుతుంది. కానీ బీజేపీకి సిద్దాంత మార్గదర్శకులైన గోల్వాల్కర్, దీనదయాళ్ ఉపాధ్యాయలు మాత్రం భారతదేశంలో ముస్లింలకు, క్రైస్తవులకు రాజకీయ హక్కులు ఉండకూడదని నిర్దేశించారు.
గుజరాత్ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రి అవుతాడు, జాగ్రత్త అంటూ హిందువలను బెదరగొట్టే ప్రచారం చేశాడు. అహ్మద్ పటేల్ ముస్లిం అయినంత మాత్రాన అతనికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎందుకు లేకుండా పోతుందని ఆనాడు కాంగ్రెస్ సహా ఎవరూ కూడా మోడీ ప్రచార సరళికి ఎదురు ప్రశ్నించలేదు.
అస్సాంలో కూడా ఇదే విధంగా బీజేపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టకపోతే బద్రుద్దీన్ అజ్మల్ ముఖ్యమంత్రి అవుతాడనే ప్రచారం ద్వారా హిందువుల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం సాగించారు. అస్సాంకు ప్రాతినిధ్యం వహించడానికి ఒక ముస్లీంకు హక్కు ఎందుకు లేదు? ఏ చట్టం, ఏ రాజ్యాంగం ముస్లింలకు మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలను నిరాకరిస్తుంది?
ములాయంసింగ్ యాదవ్‌ని “మౌలానా ముల్లాయం” అని సంభోదించినట్లే రాహుల్‌గాంధీని మోడీ “షహజాదా” అని వక్రంగా సంభోదిస్తూ ఉంటారు. ఈ పిలుపుల వెనుకున్న ఉద్దేశ్యం ఏంటో మనందరికీ తెలుసు.
2002లో గుజరాత్లో నెలకొని ఉన్న మతహింసాకాండ, ఘర్షణల నేపథ్యంలో శాసనసభ ఎన్నికలను వాయిదా వెయ్యాలని నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ జేఎం లింగ్డో నిర్ణయించారు. నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ “జేమ్స్ మైకేల్ లింగ్డో” అంటూ పూర్తిపేరు ప్రస్థావిస్తూ, “లింగ్డో” క్రైస్తవుడు కాబట్టి ఎన్నికలను వాయిదా వేశాడని పరోక్షంగా ప్రచారం చేసుకున్నాడు.
సోనియా గాంధీ మీద కూడా “క్రైస్తవురాలు” అనే పేరిట వ్యక్తిత్వహననానికి పాల్పడేలా ప్రచారదాడి చేశారు.
సాంస్కృతికపరంగా దేశాన్ని నిర్వచిస్తూ, రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యంతో పాల్గొనే హక్కు ఈ దేశంలో ప్రతిపౌరుడికి దక్కాలి. అదిలేని నాడు లౌకికత్వం అనే పదానికే అర్థం లేదు. కానీ ఆర్ఎస్ఎస్ , బీజేపీలో ఈ విషయంలో ఎలాంటి సందిగ్ధం లేకుండా లౌకికత్వ భావనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. పాఠ్యపుస్తకాల దగ్గర నుంచి రహదారులు, పట్టణాలు, నగరాలలో ముస్లింల నీడ లేకుండా చేసి వాటన్నింటినీ హైందవీకరించడానికి గత 11 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది.
“లౌకికత్వం” అనేది విదేశీ భావన అన్న ప్రచారం భావజాల రంగంలో కొన్ని దశాబ్దాలుగా హిందూత్వ శక్తులు కొనసాగిస్తూ వచ్చాయి. కానీ ఇవాళ భారతదేశానికి అదే “లౌకికత్వం” సైద్ధాంతిక రక్షణ కవచంగా అక్కరకు వచ్చింది. మోడీ “భాష”ను ఆరాధించే వారు ఇవాళ భారతదేశం మిగిలిన ప్రపంచదేశాల ముందు పెద్దమనిషి తరహాగా కనబడడానికి తన మెజార్టీ మతతత్వ విధానాన్ని కప్పిపుచ్చుకోవడానికే “లౌకికదేశం” అనే ముసుగు కప్పుకుందాని మోడీని ప్రశ్నించగలరా?
అనువాదం: కె సత్యరంజన్
(వ్యాస రచయిత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో హిందీ భాషాచార్యులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.