
వామపక్ష భావజాలానికి కాలం చెల్లింది అనే ప్రచారాన్ని పటాపంచలు చేస్తున్న “లెఫ్ట్ వర్డ్” పుస్తక ప్రచురణ సంస్థ రజతోత్సవ సంవత్సరంలో అడుగుపెట్టింది. అసమ్మతికి చోటు కల్పించడానికి వెరవడం లేదని ప్రచురించిన పుస్తకాల జాబితా రుజువుగా నిలుస్తుంది.
న్యూఢిల్లీ: మీకు ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ లెఫ్ట్‌వర్డ్ ప్రచురణలలో “బెస్ట్ సెల్లర్”గా కొనసాగుతున్న పుస్తకం ఏజీ నూరాని రచించిన “ఆర్ఎస్ఎస్ భారతదేశానికి ముప్పు”. ఆర్ఎస్ఎస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన ఈ పుస్తకం మోడీ 2019లో రెండవ సారి ప్రధాని పదవి చేపట్టిన సంవత్సరంలో ప్రచురించబడింది.
ఆర్ఎస్ఎస్ దాని సిద్ధాంతకర్తల భావజాలాన్ని ధిక్కరిస్తూ గత కొంతకాలంగా సాహిత్యం పుంఖానుఫుంఖాలుగా వెలువడుతుంది. నూరానీ పుస్తకం ఆర్ఎస్ఎస్ను శల్యపరీక్షకు గురి చెయ్యడం ద్వారా ప్రస్తుత భారతీయ కథనాలలో అగ్రగామిగా నిలిచింది. లెఫ్ట్‌వర్డ్ ప్రచురణ సంస్థ అభివృద్ధి పథంలో సాగుతూ అగ్రగామిగా నిలబడడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. వామపక్ష భావజాలం మీద ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున దాడి జరుగుతూ, వామపక్ష సిద్ధాంతకర్తలు, మేధావులు ఆత్మరక్షణలో పడిపోయారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో నిధుల కొరతను అధిగమిస్తూ లెఫ్ట్‌వర్డ్ పుస్తక ప్రచురణ సంస్థ రజతోత్సవ(25వ) సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
వామపక్ష సాహిత్యం మీద సాగుతున్న ప్రతికూల ప్రచారాన్ని అధిగమిస్తూ రెట్టింపు ప్రచరురణలతో మోదీ పాలిత భారతదేశాన్ని చుట్టేస్తుంది.
“బీజేపీ సంకీర్ణ పక్షాలు అధికారం చెలాయిస్తున్న ఈ కాలంలో పాఠకుల దృష్టి కోణం నుంచి చూస్తే మేం వెలువరిస్తున్న ప్రచురణలు ఆసక్తికరంగా, ప్రోత్సాహకంగా ఉన్నాయని మా అనుభవం తెలియజేస్తుంది.” అని లెఫ్ట్‌వర్డ్ ప్రచురణ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సుధాన్వ దేశ్‌పాండే వివరించారు. “గత పదేళ్లలో(ఎన్డీఏ అధికారంలో ఉన్నకాలంలో) మేం వెలువరించిన ప్రచురణలు అన్నీ బాగా అమ్ముడు పోయాయి” అని సంతృప్తిని వ్యక్తం చేశారు.
న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు ప్రబీర్ పుర్కాయస్థ రాసిన “కీపింగ్ అప్ ద గుడ్ ఫైట్” పుస్తకం గత ఏడాది ప్రచురణలలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం. ఈ పుస్తకం రెండు నియంతృత్వ అధికార ప్రభుత్వాల హయాంలో జైలుపాలైన పుర్కాయస్థ జీవితానికి సంబంధించింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనలో తొలిసారిగా జైలు పాలైన పుర్కాయస్థ మోడీ ప్రభుత్వ హయాంలో మరోసారి జైలు జీవితాన్ని చవిచూడాల్సి వచ్చింది.
గత ఇరవై ఐదేళ్లలో మన దేశ మౌళిక స్వభావంలోనే తిరిగి కోలుకోలేనంత తీవ్రస్థాయిలో మార్పులు సంభవించాయని అత్యధిక ప్రజానీకం భావిస్తున్నారు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల మీద మితవాద శక్తులు పూర్తిగా పట్టు సాధించాయి. పుస్తక ప్రచురణా రంగం కూడా ఈ మార్పులకు అతీతంగా లేదు. కానీ మితవాద శక్తులకు వ్యతిరేకత కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతూ వస్తుంది. ప్రత్యామ్నాయ భావజాల అన్వేషణలో భాగంగా ఒక కొత్తతరం లెఫ్ట్‌వర్డ్ పుస్తక ప్రపంచంలోకి అడుగిడుతున్నారు.

“ఈ కొత్త తరంలో అత్యధికులు యువతరం కావడం విశేషం. ఇరవైలు, టీనేజ్ దాటుతున్న పిల్లలు ఎక్కువగా మా బుక్షాప్లను సందర్శిస్తున్నారు. నాకు ఇది చాలా ఆశ్యర్యం కలిగిస్తుంది. ఈ ప్రపంచాన్ని అన్వేషించాలనే వారి తృష్ణ నన్ను ఉద్వేగానికి గురి చేస్తుంది.” అని దేశ్ పాండే సంతృప్తిగా చెప్పారు.
లెఫ్ట్‌వర్డ్ ప్రచురణల సంస్థ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య రాజకీయ పరమైనది కాదు, సంస్థాగతమైనది. గత రెండు దశాబ్దాలలో ప్రచురణారంగంలో గుర్తింపనలవి కాని రీతిలో చోటు చేసుకున్న మార్పుల మూలంగా తలెత్తిన సమస్యల పర్యవసానాలను సంస్థాగతంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కోవిడ్ ఉత్పాతం, వినియోగదారు ధోరణులలో వస్తున్న మార్పులు, స్వతంత్ర ప్రచురణ సంస్థలకు ఎదురయ్యే సమస్యలు వీటన్నింటినీ ఎలా ఎదుర్కొంటున్నారు?
“మితవాద శక్తులు అధికారం చెలాయిస్తున్న దేశంలో మేం వామపక్ష సాహిత్య ప్రచురణలు తీసుకువస్తున్నాం అనేది వాస్తవమే. కానీ నేను ఆ కోణం నుండి మాట్లాడాలి అనుకోవడం లేదు. అనేక స్వతంత్ర ప్రచురణ సంస్థలలో మాదీ ఒకటి కాబట్టి ఇలాంటి సమస్యలు అసాధారణమైనవని నేను భావించడం లేదు” అని దేశ్‌పాండే జవాబు ఇచ్చారు.
“రాజకీయంగా అత్యంత అననుకూల పరిస్థితులలో కూడా అసమ్మతి భావజాలానికి ఆదరణ పెరుగుతూ వస్తున్న ధోరణులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.
“ఫైనాన్షియల్ టైమ్స్” పత్రిక 2016లో వెలువరించిన నివేదకను పరిశీలిస్తే ఇందుకు సంబంధించిన చాలా ఆసక్తికరమైన వివరాలు మన దృష్టికి వస్తాయి. తుర్కియే దేశంలో ఎర్దోగాన్ పరిపాలనలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులలో అక్కడ విధ్వంసకర సాహిత్యం వెల్లువెత్తింది. “అజ్ఞాత వాస్తవికత(అండర్ గ్రౌండ్ రియలిజమ్)” పేరిట నూతన సాహిత్యధోరణులు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఈ సాహిత్యం మీద అణిచివేత కూడా అంతే తీవ్రంగా కొనసాగుతున్నది. హంగేరీ దేశంలో విక్టర్ ఓర్బాన్ హయాంలో ఆ దేశంలోని అతిపెద్ద ప్రచురణా సంస్థ “లిబ్రి”ని, ప్రధాని విక్టర్ ఓర్డాన్తో సంబంధాలు కలిగిన ఒక ఫౌండేషన్ టేకోవర్ చేసింది. దాంతో అనేకమంది రచయితలు చిన్నచిన్న ప్రచురణ సంస్థల వైపుకు మళ్లారు.”
“నా పుస్తకాన్ని ప్రచురించడానికి ఏ సంస్థా ముందుకు రాలేదు. లెఫ్ట్‌వర్డ్ ప్రచురణ సంస్థ అందుకు సాహసించింది. నా పుస్తకానికి ఎనలేని పాఠకాదరణా దక్కింది.”
– నేహాల్ అహ్మద్, నథింగ్ విల్ బి ఫర్గాటెన్: ఫ్రం జామియా టు షాహీన్‌బాగ్ పుస్తక రచయిత.
“వామపక్ష సాహిత్యానికి ఆదరణ పెరుగుతూ వస్తుంది. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే మితవాద శక్తులు రాజ్యం ఏలుతున్నా వామపక్ష సాహిత్యానికి ఆదరణ తగ్గడం లేదు. మాది ఏ రాజకీయపార్టీకి అనుబంధసంస్థ కానప్పటికీ స్థూలంగా మేం కూడా వామపక్ష సాహిత్యాన్నే వెలువరిస్తున్నాం” అని “తులికా బుక్స్” ప్రచురణ సంస్థ వ్యవస్థాపకురాలు ఇందిరా చంద్రశేఖర్ అన్నారు.
అయితే “లెఫ్ట్‌వర్డ్” ప్రచురణ సంస్థకు నిర్దిష్ట రాజకీయాలు ఉన్నాయి. సీపీఐ(ఎం) నాయకులుగా ఉన్న ప్రకాశ్ కారత్, సీతారం ఏచూరి, ప్రముఖ కార్మిక సంఘ నాయకులైన సుకోమల్ సేన్ ఈ ముగ్గురూ కలిసి 1999లో ఈ సంస్థను స్థాపించారు.
“మార్క్సిజం పట్ల మాదైన దృక్పథంతో వలస వ్యతిరేక, జాతీయ విముక్తి పోరాటాల అనుకూల అవగాహనతో మేం వామపక్ష సాహిత్యాన్ని ప్రచురిస్తున్నాం. భారతదేశం పట్ల ఈ దృక్పథంతో కూడిన పుస్తకాలు వెలువరించడం మా ప్రాధాన్యత. ప్రపంచీకరణ విధానాల మార్గం పట్టిన భారతదేశ వాస్తవికతను ఆవిష్కరించగలిగే కొత్త రచయితలకు మేం స్థానం కల్పిస్తున్నాం” అని లెఫ్ట్‌వర్డ్ ప్రచురణ సంస్థ ప్రధాన సంపాదకుడు, ట్రై- కాంటినెంటల్ సోషల్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయప్రసాద్ వివరించారు. “మార్క్సిస్టు సాహిత్యాన్ని ప్రచురించే సంస్థలలో “లెఫ్ట్‌వర్డ్” ప్రచురణా సంస్థ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలలో ఒకటిగా నిలిచింది” అని కూడా చెప్పారు.
మార్క్సిస్టు మేధావి ఐజాజ్ అహ్మద్, ఫ్రంట్‌లైన్ ఎడిటర్ ఎన్ రామ్, సామాజిక కార్యకర్త- న్యాయవాది తీస్తా సెతల్వాద్ వంటి వారు ఈ సంస్థలకు తమ రచనలు అందిస్తున్నారు.
ప్రకాష్ కారత్ ఈ సంస్థ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలలో కొనసాగుతున్నారు. సంస్థ మరో డైరెక్టర్ బాధ్యతలలో ఉన్న సీతారాం ఏచూరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికకావడంతో తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
“టర్నోవర్ పరంగా చూస్తే మేం సముద్రంలో నీటి బొట్టు వంటి వాళ్లము. కానీ నిబద్ధత ఒక్కటే మమ్మల్ని ముందుకు నడిపించే సూత్రం” అని సుధాన్వ దేశ్‌పాండే విశ్వాసంతో నిండిన కంఠంతో చెప్పారు.
అనువాదం: కె సత్యరంజన్
ద ప్రింట్ సౌజన్యంతో..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.