
Photo credits: The Hindu
ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు కేంద్రప్రభుత్వం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సభ్యదేశాలతో సహా యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్న 32 దేశాలకు పార్లమెంట్ సభ్యుల నేతృత్వంలో దౌత్యబృందాలను పంపనున్నట్లు మే 17 శనివారం నాడు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదం ప్రత్యేకించి సీమాంతర ఉగ్రవాదం విషయాలపై భారతదేశం తీసుకున్న స్పష్టమైన వైఖరిని ఈ బృందాలు ఆయా దేశాధినేతలకు, పౌరసమాజాలకు వివరించనున్నాయి. ఈ ఏడు బృందాలలో మొత్తం 59 మంది పార్లమెంట్ సభ్యులు పౌరసమాజ ప్రముఖులు పాల్గొననున్నారు. ఇందులో 39 మంది పాలక ఎన్డీఏకు చెందిన పార్లమెంట్ సభ్యులు కాగా మిగిలిన 20 మంది వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలుగా ఉన్నారు. వీరికి తోడు ప్రతిబృందంలోనూ కొంతమంది మాజీ రాయబారులు, విదేశాంగ శాఖ అధికారులు, దౌత్యనీతి నిపుణులు భాగస్వాములుకానున్నారు.
ఇందులో రెండు బృందాలకు బీజేపీ నాయకులు బీజే పాండా, రవిశంకర్ ప్రసాద్‌లు నాయకత్వం వహిస్తుండగా మిగిలిన 5 బృందాలకు జనతాదళ్ యునైటెడ్ ఎంపీ సంజయ్ ఝా, శివసేన(షిండే) ఎంపీ శ్రీకాంత్ షిండే, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేలు నాయకత్వం వహించనున్నారు.
బీజే పాండా నాయకత్వంలోని పార్లమెంటరీ దౌత్యబృందంలో బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, ఫాంగ్నాన్ కొన్యాక్, రేఖా శర్మలతో పాటు ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఓవైసీ, నామినేటెడ్ ఎంపీ సద్నాం సింగ్ సంధూ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాబ్‌నబీ ఆజాద్, మాజీ రాయబారి హర్ష్ శ్రింగ్లా సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం సౌదీ అరెబీయా, కువైట్, బహ్రైన్, అల్జీరియా దేశాలను పర్యటించనున్నది.
రవిశంకర్ ప్రసాద్ నాయకత్వంలోని బృందంలో బీజేపీ ఎంపీలు దగ్గుబాటి పురంధరీశ్వరి, సమీక్ భట్టాచార్య, ఎంజే అక్బర్‌లతో పాటు శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్, నామినేటెడ్ ఎంపీ గులామ్ అలీ ఖతానా సభ్యులుగా ఉన్నారు. వీరికి తోడుగా మాజీ రాయబారి పంకజ్ సారన్ ఈ బృందంతో పాటుగా పర్యటించనున్నారు. ఈ బృందం ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్లలో పర్యటించున్నది.
జనతాదళ్ యునైటెడ్ ఎంపీ సంజయ్ కుమార్ ఝా నాయకత్వంలోని బృందంలో మాజీ విదేశాంగ శాఖామంత్రి సల్మాన్ ఖుర్షీద్, త్రిణమూల్ ఎంపీ యూసఫ్ పఠాన్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్లతో పాటు బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజిలాల్, ప్రధాన్ బరువా, హేమంగ్ జోషీలు సభ్యులుగా ఉన్నారు. మాజీ రాయబారి మోహన్ కుమార్ ఈ బృందం వెంట దౌత్యనిపుణిడిగా వ్యవహరించనున్నారు. ఈ బృందం ఇండోనేషియా, మలేషియా, దక్షిణకొరియా, జపాన్, సింగపూర్లలో పర్యటించనున్నారు.
శివసేన ఎంపీ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే నాయకత్వంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆఫ్రికాలోని కీలకమైన దేశాలలో పర్యటించే బృందంలో బీజేపీ ఎంపీలు బాన్సూరి స్వరాజ్, అతుల్‌గార్గ్, మనన్ కుమార్ మిశ్రా, ఎస్ఎస్ అహ్లూ వాలియా, ఐయూఎంఎల్ ఎంపీ మహ్మద్ బషీర్, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర, మాజీ భారత రాయబారి, సుజెన్ చినోయిలు సభ్యులుగా ఉన్నారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వంలో అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాలలో పర్యటించే బృందంలో బీజేపీ ఎంపీలు శశాంక్ మణి త్రిపాఠి, భువనేశ్వర్ కలిత, తేజస్వి సూర్య, జేఎంఎం ఎంపీ సర్ఫరాజ్ అహ్మద్, లోక్ జనశక్తి పార్టీ(రాంవిలాస్) ఎంపీ శాంభవీ చౌదరి, తెలుగుదేశం ఎంపీ హరీష్ బాలయోగి, శిసేన ఎంపీ మిలింద్ దేవరాలతో పాటు మాజీ భారత రాయబారి తరన్‌జిత్ సింగ్ సంధూ సభ్యులుగా ఉన్నారు.
డీఎంకే నేత కనిమొళి కరుణానిధి నేతృత్వంలో స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాథ్వియా, రష్యాలలో పర్యటించే బృందంలో బీజేపీ ఎంపీలు, బ్రిజేష్ చౌతా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మియాన్ అల్తాఫ్ అహ్మద్, అర్జేడీ ఎంపీ ప్రేమ్ చంద్ గుప్తా, ఆమ్ఆద్మీపార్టీ ఎంపీ అశోక్‌కుమార్ మిట్టల్‌తో పాటు మాజీ రాయబారులు మంజీవ్ ఎస్పురి, జావెద్ అశ్రాఫ్లు సభ్యులుగా ఉన్నారు.
ఎన్సీపీ(శరద్‌పవార్) ఎంపీ సుప్రియా సూలే నాయకత్వంలోని బీజేపీ ఎంపీలు రాజీవ్ ప్రతాప్ రూఢీ, అనురాగ్ సింగ్ ఠాకూర్, వీ మురళీధరన్, ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ విక్రమ్ జిత్ షెనాయ్, కాంగ్రెస్ ఎంపీలు మానీష్ తివారీ, ఆనంద్ శర్మ, తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, భారత విదేశాంగశాఖ పూర్వ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్లు ఈజిప్ట్, కతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా దేశాలలో పర్యటించనున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.