నజీరుద్దీన్ షా, టి.ఎం. కృష్ణలకు మద్దతు పలుకుతూ ఒక అవార్డుల ప్రధానోత్సవంలో సున్నితమైన భిన్నాభిప్రాయం, అసమ్మతికీ భీతిలేని సంభాషణకూ చోటు కల్పించాలని అమోల్ పాలేకర్ ప్రేక్షకుల్ని కోరారు.
15 సంవత్సరాల్లో 50 సినిమాలు తీసిన గజేంద్ర అహిరేని నిన్ననే ఇక్కడ సన్మానించారు. ఆయన ఏడాదికి 3 కంటే ఎక్కువ సినిమాలు తీశాడు. మరి 50 సంవత్సరాల్లో 15 సినిమాలు చేసిన నాకు జెనిత్ ఆసియా అవార్డు ఇవ్వాలని నిర్వాహకులు ఆలోచించడం కేవలం యాదృచ్చికమేనా..?
ఈ అవార్డు తీసుకోవడానికి అంగీకరించే ముందుగా నేనడిగిన ప్రశ్న నాకు ఎవరు ఈ అవార్డు ఇస్తున్నారు? అని. పదుల సంఖ్యకు కూడా మించని సినిమా తీసిన, అంకెల ఆటలో నమ్మకంలేని సహచరుడు కుమార్ షహానిని ఈ అవార్డు అందచేయడానికి ఎంపిక చేశారని తెలిశాక తృప్తి పడ్డాను. 1984లో ఒక దర్శకుడిగా ఆయన స్మితా పాటిల్ తో పాటుగా “తరంగ్” సినిమాలో పరిశ్రమాధిపతి పాత్ర చేయమని కోరారు. అప్పటికీ నా సినిమాలు అనేకం రజతోత్సవాలు చేసుకున్నాయి. కానీ, నేను “సవ్వ రుపయా” అనే సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అది తక్కువ బడ్జెట్ తో ఎన్ఎఫ్డీసీ తీస్తున్న సినిమా.
భారతీయ సినిమాకు భవిష్యత్తుగా సత్యజిత్ రే భావించిన ముగ్గురిలో ఒకడైయిన విశిష్ట వ్యక్తి చేతుల మీదుగా ఈ పురస్కారం తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. తాను ఎటువంటి సినిమా తీయాలనుకుంటున్నాడో కుమారు షహానీకి స్పష్టంగా తెలుసు. ఏ చిన్న విషయంలోనూ ఆయన ఎప్పుడూ రాజీపడలేదు. ఉదయ భానుని లేత కిరణాల వెలుగులో ప్రకృతి ఒడిలో షూటింగ్ అంటే ఎవరికైనా అబ్బురమే. కానీ ఆయన అటువంటి ఉదయకాలపు షూటింగ్ ని ఆయన మొదటి రోజునే రద్దు చేశాడు. ఎందుకంటే కాస్ట్యూమ్స్ డిజైనర్ భాను అతైయ్యా నా పాత్ర కోసం రూపొందించిన కోటు రంగు ఆయనకు నచ్చలేదు.
పెద్ద బడ్జెట్ సినిమాలు చేసే రుద్దుడు పద్ధతికి దూరంగా ఉండే కొద్దిమంది సినిమా దర్శకులు ఉన్నారు. మార్కెట్ కోరికలను బట్టి తమ సినిమాలను రూపొందించకుండా బాక్సాఫీస్ వసూళ్లకు బట్టి సినిమా విజయాన్ని అంచనా వేయకుండా ఉంటారు వాళ్లు.
ఇస్తున్న డబ్బును చూసో, బాక్సాఫీస్ సూత్రాలకనుగుణంగానో ఒక సినిమాను ఎప్పుడూ అంగీకరించని అతికొద్ది మందిలో నేను కూడా ఉన్నందుకు గర్వపడుతున్నాను. సినిమా కథనంలోని నిర్మాణాత్మక ప్రవాహమే సర్వస్వం నాకు. ప్రధాన స్రవంతిలోని వ్యాపారాత్మక సినిమా పట్ల నాకెన్నడూ ఆకర్షణ లేదు. నేను అంగీకరించిన సినిమాలకంటే తిరస్కరించిన సినిమాలు ఎక్కువ ఉండటానికి బహుశా అదే కారణం కావొచ్చు.
దురదృష్టవశాత్తు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ గానే ఉంది. ఈ భావన బారతదేశపు దేశీ సినిమా యొక్క ప్రాముఖ్యతను నాశనం చేసింది. ప్రాంతీయ సినిమాలకు నేను గట్టి మద్ధతిచ్చాను. ఇది పరిశ్రమ సాంప్రదాయానికి వ్యతిరేకం. నేను బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీ చిత్రాలు అంగీకరించాను, నటించాను.
మూడు భిన్నమైన మాధ్యమాలలో నేను పని చేయగలగడం నా అదృష్టంగా భావిస్తాను. అది చిత్ర రచన అయినా, సినిమా అయినా, రంగస్థలం అయినా నేను “స్థలం” (స్పేస్) యొక్క రెండు లేదా మూడు పరిమాణాలను అన్వేషించాను. దాని దృశ్యమాన అవకాశాలను శోధించాను.
స్థలం, దృశ్యం అనేవి ఒక వలయం లాంటివి. వలయం లేకుండా కేంద్రం ఉండదు. కేంద్రం లేకుండా వలయం ఉండదు. చిత్రాలు (పేయింటింగ్) వేయటం నుంచి రంగస్థలానికి… మారినప్పుడు ఆ మూడు పరిమాణాల స్థలం కంపోజీషన్, లైట్లు అమర్చే పద్ధతి, సజీవ మానవ జీవితపు కదలికలు, ధ్వని రచన అన్నింటికీ అనంతమయిన కూర్పులకు అవకాశాలను కల్పించింది. కేవలం మాటలపై ఆధారపడిన నాటక రంగం నుంచి దూరమైన నేను రచన నుండి వెలువడే కదలికల రూపాలను పదాల అర్థాల ద్వారా చిత్రించగలిగాను. ఈ తరహా ప్రయత్నాలు నా నాటకాలకు ఒక వాస్తవికమైన అమరికనిచ్చాయి.
ఒక సినిమా దర్శకుడిగా కెమెరా విసిరిన అపరిమిత అవకాశాల వలన అవసరంలేని దృశ్యాలను తొలగించడం అనే సవాలు ఎదురయ్యింది. విభిన్నమైన దృశ్యాలు, భిన్నమైన అంశాల వర్ణాలు నా సినిమాల్లో అన్వేషించాను.
చివరికీ హాలీవుడ్ సినిమాల్లో కూడా స్త్రీ పాత్రలు ఎప్పుడూ రెండో తరగతిలో నిరుపయోగంగానే ఉంటాయి. కానీ, దాదాపుగా నా సినిమాలు అన్నీటిలో స్త్రీ పాత్రలే కేంద్రంగా ఉంటాయి. నా సినిమాలలో స్త్రీ పాత్రలను ఎప్పుడూ అణగారిన, లొంగిపోయిన, తెలివి తక్కువ పాత్రలు గా చిత్రించలేదని గర్వంగా చెప్పగలను.
వెనక్కి తిరిగి చూస్తే నా వృత్తిలో నేననుసరించిన బాట ఎప్పుడూ సరళంగా లేదు. ముందస్తు గా నిర్ణయించుకున్న పథకం ప్రణాళిక ప్రకారం నడవలేదు. అలా అని ప్రధాన స్రవంతి నియమాలకు నేను ఎన్నడూ కట్టుబడి ఉండలేదని నాకు తెలుసు. పునరాలోచన చేసినపుడంతా నా 50 ఏళ్ల వృత్తి పరమైన జీవనాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే కామూ అన్నట్టుగా “నేను తిరగబడడ్డాను కాబట్టే ఉనికిలో ఉన్నాను” అన్న మాటలు నా జీవితానికి వర్తిస్తాయని చెప్పవచ్చు.
నటుడి నుండి నేను వేరు కాదు. అది నా జీవితపు సారాంశం. నాలోని కళాకారుడిని ప్రోత్సహించినందుకు, నిజమైన ప్రేమాదరణలు నాపై కురిపించినందుకు ప్రేక్షకులకు మీ అందరికీ నేను కృతజ్ఞుడిని. ప్రేక్షకుల తెలవిపట్ల నాకు విశ్వాసం ఉంది కనుక నేనెప్పుడూ వాళ్లకి గోరు ముద్దలు తినిపించాలని అనుకోలేదు. నేను వాళ్ల పట్ల నిరంతరం నిజాయితీగానే వ్యవహరించాను.
అదే నిజాయితీతో నేను ప్రేక్షకులను మీ అందరినీ వివేచన చూపమంటున్నాను. ప్రపంచం కేవలం నలుపు తెలపుల ద్వంద్వత్వం అని నమ్మకండి. ఆ మధ్యలో అనేక బూడిద రంగు వర్ణాలకు చోటు ఇవ్వమని కోరుతున్నాను. సైద్ధాంతిక సందిగ్ధతలకు, సున్నితమైన అసమ్మతులకు, బెరుకు లేని చర్చలకు అవకాశం కల్పించాలి. ఒక బూడిద వర్ణపు సున్నితత్వాన్ని సహించే స్థితిని సృష్టించాలి. పరస్పర విరుద్దమైనవే అయినా ఆలోచనలను ఒక లోతైన విశ్లేషణ లేకుండా కొట్టిపారేసే స్థితి కాకుండా ఉండటం ఈ కాలపు అవసరం.
ఈ మూడో దృష్యకోణాన్ని పునర్నిర్మించినపుడు …
“పద్మావత్” సినిమాను ఒక కళాత్మక వ్యక్తిగా గౌరవిస్తూనే పద్మావత్ చారిత్రక వాస్తవాలను సరిగ్గా చూపనందున విమర్శించే వారికి స్థానం లభిస్తుంది.
జీసస్ క్రీస్తూ, అల్లా గురించి పాడాలనే టీఎమ్ కృష్ణ అభిప్రాయాన్ని ఇష్టపడకపోయినా అతని కచేరీ రద్దు చేయటాన్ని నిరసించేవారిని స్వాగతించాలి.
హింస పట్ల అతనికి ఉండే భయాలను పంచుకోకపోయినా ఒక గొప్ప నటుడిగా నజీరుద్ధీన్ షా ను ప్రేమించి, గౌరవించగలగాలి
మహాభారతం ప్రాజెక్టులో కృష్ణుడి పాత్ర పోషిస్తున్నందుకు అమీర్ ను ఖాన్ అన్న కారణంగా ట్రోల్ చేయకుండా ఉండే రోజులు రావాలి.
ఒక సామాజిక బాధ్యత గల నటుడిగా తీవ్రమైన విభజనలున్న ఈ కాలంలో నేను అదృశ్యమవుతున్న బూడిద వర్ణపు అనేక ఛాయలను వెతుకుతున్నాను.
“అర్భన్ నక్సలైట్” వంటి ప్రతి నాయకులను తీసుకువచ్చిన కథనాలకు లొంగిపోవొద్దు మనం.
అనంగీకరించడంతో అంగీకరిద్దాం మనం.
– అమోల్ పాలేకర్
అనువాదం : పి ఎ దేవి