
కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన వ్యక్తిగత ఆదాయపు పన్నుపై తగ్గింపు, స్థాయికి మించి ఊదరగొట్టబడింది. ఫిబ్రవరి ఒకటవ తారీఖున అన్ని వార్తా మాధ్యమాలు ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిపి ఆదాయ పన్ను పరిమితి పెరగడంతో బడ్జెట్ మొత్తం సాను కూలంగా ఉందంటూ గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కేటాయింపులు ఉన్నావంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తే ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో పూర్తిగా అవగాహన కు రాలేని ఎందరో ఈ ప్రచారాలన్నీ నిజమని నమ్మేశారు కూడా. అయితే నిర్మలా సీతారామన్ గారు ఆదాయపన్ను పరిమితిలో తగ్గింపు వ్యక్తులకు లాభం చేకూర్చడానికి అన్నట్టు కాకుండా మార్కెట్లో లక్ష కోట్ల రూపాయలు కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా వస్తు వినియోగానికి ఉపయోగమౌతుందని చెప్పకనే పెట్టుబడిదారుల పక్షాన నిలిచినట్లు చెప్పారు. ఆ తర్వాత పార్లమెంట్లో బడ్జెట్ పై జరిగిన చర్చల అనంతరం అనేక లోతైన కోణాలు బయటపడ్డవి.
దేశంలో వ్యక్తిగత ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేస్తున్న వారి సంఖ్య రమారమి 8 కోట్లు. ఇందులో ఆదాయపన్ను కడుతున్న వారి సంఖ్య 3 కోట్ల 17 లక్షలు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమంటే ఎంతో పెద్ద మొత్తంలో ఆదాయాలు ఉన్నప్పటికీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్‌లు నామమాత్రంగా ఫైల్ చేస్తున్నారు తప్ప పన్ను చెల్లించడం లేదు. ఇలాంటి కోవలో చిన్నా చితకా నుండి కోట్ల కొలది ఆదాయం కలిగిన వ్యాపారులు ఉంటారు. పెంచిన ఆదాయ పన్ను పరిమితి తర్వాత ఆదాయ పన్ను కట్టే వారి సంఖ్య ఇప్పటితో పోలిస్తే 85 లక్షల మేర తగ్గనున్నది. అనగా 2కోట్లా 50లక్షల మంది వరకు మాత్రమే ఆదాయపన్ను చెల్లించే అవకాశం ఉన్నది. కానీ ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇది వరకు ఏడు లక్షలలోపు ఆదాయం చూపించి మమ అనిపించిన వారంతా ఇప్పుడు 12లక్షల వరకు ఆదాయం చూపించి తప్పించుకుంటారు. వెరసి నల్లధనంతో వ్యాపారం చేసేవారు సంవత్సరానికి ఏ మాత్రం పన్ను చెల్లించకుండానే తమ ఆస్తులను స్థిరపరచుకుంటారన్నమాట. ఇక మరో విషయం ఏమంటే ఈ పెంచిన ఆదాయ పరిమితి కేవలం మధ్యతరగతికి మాత్రమే ఊరటను ఇవ్వడం లేదు ధనిక మరియు అత్యధిక సంపన్నులైనవారికి మరింత వెసులుబాటు కల్పించే మార్గం ఇది. కొన్ని గణాంకాలు గమనిస్తే, గతేడు కోటి రూపాయల ఆదాయాన్ని చూపించినవారు 2,27,000 మంది, 100కోట్ల ఆదాయాన్ని చూపించినవారు 263 మంది. 500 కోట్ల ఆదాయాన్ని చూపించినవారు 23 మంది. అనగా ఈ అల్ట్రా రిచ్ మొత్తం లబ్ది పొందనున్నది. ఇక మరో విషయం ఏమంటే భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య (శత కోటీశ్వరులు) దాదాపు 200 కు చేరింది అని గత సంవత్సరం వార్తలెన్నో ప్రచురితమయ్యాయి. 200 మంది బిలియనీర్లు ఉన్న ఈ దేశంలో కేవలం 23 మంది మాత్రమే 500 కోట్ల ఆదాయాన్ని చూపిస్తున్నారంటే కారణం ఏమైనట్లు? వారిని ఎవరూ ఉపేక్షిస్తున్నట్లు? 2014 నుండి ఇప్పటి వరకు ఆదాయ పన్ను పరిమితిలో లభించిన పెరుగుదల గతంలో ఎప్పుడు సాధ్యపడలేదని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఆహార ద్రవ్యోల్బణం ఇదే కాలంలో 6.8%, విద్యా సంబంధిత ద్రవ్యోల్బణం 11%, వైద్య ద్రవ్యోల్బణం 14% పెరిగిపోయాయి అన్న అంశాన్ని ప్రస్తావించలేదు. ఈ రకమైన ఖర్చుల పెరుగుదల వలన మిగులుతున్న ఆదాయం రమారమీగా సరిపోతుంది. సీతారామన్ గారు మర్చిపోయిన మరో విషయమేమంటే ఇదే కాలంలో గృహ సంబంధిత పొదుపు 25% నుండి 18.4% కి పడిపోయింది కూడా ఈ కారణాల చేతనే. ఇదే కాలంలో భారతదేశ సగటు తలసరి ఖర్చు రు 4664 గా గ్రామీణ ప్రాంతాల్లో నమోదైతే, రు 6996 గా పట్టణ ప్రాంతాల్లో నమోదైంది. దేశమంతటా సగటు ఇలా ఉంటే ఆదాయార్జితాల్లో క్రింద ఉన్న 50% మంది, అందులో మరింత క్రింద ఉన్న ప్రజానీకం ఖర్చు ఎంత తక్కువ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి. ఇక వేతనాల గురించి చూస్తే దేశంలోని మగవారి వేతనాలు 2017- 24 మధ్య కాలంలో రు 12,665 నుండి రు 11,758 కి పడిపోయాయి. స్వయం ఉపాధిలో పాల్గొనే పురుషుల ఆదాయాలు రు 9454 నుండి రు 8591 కి పడిపోయాయి.
ఆదాయ పన్ను పరిమితిని పెంచడం ద్వారా దేశ జనాభాలో 2% ప్రజలకు కాస్తంత ఊరట లభించిన మాట వాస్తవమే. కానీ అత్యధికుల ఆదాయాలు పడిపోవడం, నిత్యావసరాల ద్రవ్యోల్బణాలు పెరిగిపోవడం మరియు నిరుద్యోగం తాండవిస్తుండడం ఆందోళన కలిగించే అంశాలు వీటిని ఎదుర్కోవడానికి సరైనా ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం బాధ్యతారాహిత్యం. బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టేకన్నా ఒకరోజు ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టబడింది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాడిన పదజాలం ఏమంటే “గెట్ అవుట్ అఫ్ ద వే, రోల్‌బ్యాక్ ద పాలసి” అనగా మీ విధానాన్ని మార్చి ముంచుకొస్తున్న ప్రమాదం నుండి వెంటనే బయట పడండి అని హెచ్చరిక చేశారు. మరో అడుగు ముందుకేసి రానున్న ఆరేళ్ల కాలంలో ప్రతి ఏట 78.5 లక్షల వ్యవసాయేతర ఉద్యోగాల కల్పనా చేయకపోతే పెను ప్రమాదమే అని కూడా అన్నారు. దీని గురించి ఏ మాత్రం రోడ్ మ్యాప్ మీద ప్రకటించలేదు. గణాంకాలను తారుమారు చేసే అవ లక్షణం ఉన్న కేంద్రం పిరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా నిరుద్యోగరేటు 3.2% గా ప్రకటించింది. కానీ నిరుద్యోగ యువత 10.2% అని, పట్టభద్రులైన యువత 13% నిరుద్యోగులనే వాస్తవాలను ప్రకటించకుండా ఉండలేకపోయింది. నైపుణ్య అభివృద్ధిలో మరియు చదువుకు తగ్గ విజ్ఞానాన్ని పొందడంలో భారత యువత వెనకబడినదని గత సంవత్సరపు ఆర్థిక సర్వే లో బయటపడినప్పుడు నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేశారు కానీ ఫలితాలు ఇప్పుడు ప్రకటించడానికి ధైర్యం చేయలేకపోయారు. ఉద్యోగార్హతలలో లేమి, ఉన్న ఉద్యోగులకు సరిపడని జీత భత్యాలు వంటి పరిస్థితులు ఉన్న చోట సాలీనా 78.5 లక్షల ఉద్యోగాలను వ్యవసాయేతర రంగాలలో కల్పించాలన్నప్పుడు ఆయా రంగాలు పరిపుష్టంగా ఉండాలిగా! కాని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ ట్రేడ్ లో చైనా 28.8% కొల్లగొడుతుంటే ఇండియా 2.8% దగ్గర తచ్చాడుతున్నది. స్థూల జాతీయోత్పత్తిలో మ్యాన్యుఫాక్చరింగ్ వాటా 2014 లో 15.07% ఉంటే 2019 లో 13.46 శాతానికి కి మరియు 2023 లో 12.93 శాతానికి పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సర్విస్ సెక్టార్ మాత్రమే ఆదుకోగలదు. కానీ అలాంటి సర్వీస్ సెక్టరైన ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ను 100 శాతానికి అనుమతినివ్వడం, బ్యాంకింగ్ సెక్టార్‌ను పూర్తిగా విస్మరించడం, వ్యవసాయ రంగంలో కార్పొరేటీకరణను అనుమతించడం వంటివన్నీ సత్ఫలితాలనిచ్చేవి కావు.
మరో మాట ఏమిటంటే ఆదాయ పన్ను పరిమితి పెంచడం ద్వారా లక్ష కోట్ల రూపాయాలు ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుందని అన్నారు. అదే సందర్భంలో టాక్స్ రెవెన్యూ 11.4 పర్సెంట్ వృద్ధి ఉంటుందని కూడా చెప్పారు. లక్ష కోట్ల ఆదాయం తగ్గిపోయిన తర్వాత 11.4 పర్సెంట్ గ్రోత్ ఎలా సాధ్యమవుతుందో మాత్రం వారు వివరించలేదు. జీఎస్టీ రూపంలో వసూలు చేయబడుతున్న పరోక్ష పన్ను ప్రపంచంలో ఏ దేశంలో లేనంత, అనగా 66% విధించబడుతుంది. ఈ పన్నుల్లో అత్యధిక శాతం నిరుపేదల నుండి చెల్లించబడుతుందని ప్రభుత్వాలే బహిర్గతపరిచాయి. పరోక్ష పన్నులు ఎక్కువగా వసూలు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయడానికి వెనుకంజ వేయడం ద్వారా గ్రామీణ భారతాన్ని పూర్తిగా మరిచిపోయినట్లే అవుతది. ప్రజలను తామ మానానికి తమని వదిలివేసి కేంద్రం “ఏడు పథకాలు, ఎనిమిది లక్ష్యాలు, నాలుగు నిధులు” అంటూ ఊకదంపుడు గారడీలను ప్రదర్శిస్తోంది. అంతే కాకుండా బ్యాంకుల్లో పేరుకుపోతున్న రానిబాకీల వసూలుకు అవకాశాన్ని బ్యాంకులకు ఇవ్వకుండా, వాటిని రైట్ అఫ్ చేసే విధంగా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ వంటి వాటిని మరింత పటిష్టపరిచి, త్వరితగతిన పెట్టుబడిదారులకు పరిష్కార మార్గాలు చూపించి, వారు ఎవరి పక్షాన నిలబడుతున్నారు అనే వాస్తవాన్ని మనకు స్పష్టంగా విశదీకరించారు. గతంతో పోలిస్తే ఆరోగ్య రంగానికి 1255 కోత్లు, విద్యారంగానికి 11,584 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,019 కోట్లు, వ్యవసాయానికి 10,992 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 75,133 కోట్లు పట్టణాభివృద్ధికి 18,917 కోట్ల మేర ఈ బడ్జెట్ లో కోతలు విధించారు. విడిపోయి సాధారణ ప్రజానీకం ప్రశ్నించరు కాబట్టి సరిపోతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఫిస్కల్ డెఫిసిట్ కి ఒక ప్రాధాన్యత ఉంది. కాబట్టి దానిని 5% లోపే కట్టడి చేయడం కోసం మూలధన వ్యయంలో భారీ కోతలు ఈ బడ్జెట్లో విధించారు. కానీ పేట్రేగిపోతున్న అమెరికా అధ్జ్యక్షుడు ట్రంప్ భారత్ పై రెసిప్రోకల్ టాక్స్ వేస్తానని ఇరు దేశాల నేతలు విలేఖరుల సమ్క్షంలో తేల్చేశారు. ఎలాన్ మస్క్ టెస్లా వంటి విలాస వస్తువులపై ప్రస్తుతం భారత్ వంద శాతం పన్ను విధిస్తుంది. ఈ రెసిప్రొకేషన్ టాక్స్ వేయాలంటే 30% విధించాల్సి ఉంటుంది. అప్పుడు విదేశి చెల్లింపుల (ఫిస్కల్ డెఫిసిట్) లోటు మరింత పెరిగే ప్రమాదం పొంచేఉందన్నమాట. ప్రపంచీకరణలో పెద్దన్నలే లబ్ది పొందుతారన్న మాట పెడచెవిన పెట్టి ఉత్పాదక రంగంలో కాకుండా సేవా రంగంలో పెట్టుబడులను ఆకర్శించే ప్రయత్నాలు చేశారు. వీటి దుశ్పలితాలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి.
జి. తిరుపతయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.