
వలసపాలన కాలంలో హిందూయిజం, క్రైస్తవం మధ్య ఏర్పడిన సంబంధాలు, జరిగిన ఘర్షణల ఇతివృత్తంగా ఉన్న పుస్తకం మను ఎస్ పిళ్లై పరిశోధనాత్మక రచన. గత మూడు శతాబ్దాలుగా వలసపాలన అమలు చేసిన సామాజిక భావోద్వేగాలు ప్రేరేపించే విధానాలు, వాటికి హిందూయిజం స్పందించిన తీరే నేడు 21వ శతాబ్దిలో మనం చూస్తున్న హిందూత్వ ధోరణులకు పునాదులు వేశాయని. రాజ్యాధికారం, మతాధిపత్యం మేలుకలయికే నూతన హిందూత్వరాజ్యం. ఈ హిందూత్వరాజ్య నిర్మాణానికి మధ్యయుగాల చరిత్రలోనే పునాదులు పడ్డాయి.
ఈ సంక్లిష్ట వాస్తవాన్ని విడమర్చి చెప్పటానికి వైవిధ్యభరితమైన చారిత్రక ఆధారాలను పరిశీలింటచమే కాక అందులోని ఆధారాల ప్రాతిపదికన వలసపాలన కాలంలో భారత సామాజిక చరిత్రను పునర్మించటానికి ప్రయత్నం చేశారు. తన నిర్ధారణలకు ప్రాతిపదికగా ఉన్న సమాచారాన్ని తన రచనలోనే ప్రస్తావించారు. ఇన్ని వివరాలు ప్రస్తావించాల్సి వచ్చినందునే పుస్తకం కాస్తంత పెద్దదిగా మారింది. ఈ పుస్తకం చదివి ఆస్వాదించటానికి కాస్తంత పెద్ద మనసు, విశాల హృదయం కావాల్సిందే.
వలసవాదం దేశంలో ప్రవేశించటానికి ముందే హిందూమతంలో జరిగిన మార్పుల గురించి పిళ్లై అందించిన సమాచారం ఆసక్తికరమైనది. ఆదిమ కాలంలో ఇండో ఆర్యన్లు అనుసరించిన యజ్ఞయాగాదుల మొదలు నేటి వరకూ పరిశీలిస్తే హిందూయిజం మారుతున్న స్థలకాలాదులకు, మారుతున్న విశ్వాసాలకు, ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ వస్తుందన్న వాస్తవం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తూర్పున గంగాపరివాహక ప్రాంతం దిశగా విస్తరిస్తున్నప్పుడు మ్లేఛ్చులు తారసపడ్డారు. మ్లేఛ్చులు అంటే వారి అవగాహనలో ఆర్యులకంటే భిన్నమైన కట్టుబొట్టు జీవన శైలి ఉన్నవారు. ఆర్యుల్లాగా వైదిక సాంప్రదాయాన్ని పాటించనివారు. అయితే నిరంతరం ఆర్యుల్లోనే అంతర్గతంగా జరుగుతున్న ఘర్షణలు, నూతన పచ్చికబయళ్ల కోసం వెతుకులాట అవసరం కావటంతో ఆర్యుల భౌగోళిక విస్తరణ మ్లేఛ్చుల సంపర్కంతో కలుషితమైనా కొనసాగుతూనే ఉంది.
వైదిక మతాన్ని, ఆచార వ్యవహారాలను బ్రాహ్మణులు రూపొందించారు. వారు ప్రయాణించిన కొత్త ప్రాంతాలకు ఆ బ్రాహ్మణ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా తాము రూపొందించిన బ్రాహ్మణ్యంలోనే కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చారు. ‘ఆర్యులు అందులోనూ బ్రాహ్మణులు ఆశించిన రీతిలో హిందూయిజం రూపు దిద్దుకోలేదు. నిజం చెప్పాలంటే మార్పు హిందూయిజం డీఎన్ఏలో మిళితమై ఉంది. నిరంతరం ప్రత్యామ్నాయ ప్రాపంచిక దృక్ఫథంతో ఘర్షణ పడుతూ, తనను తాను మార్చుకుంటూ వచ్చింది.’
బ్రాహ్మణులు తమ ఆధ్యాత్మిక ప్రపంచానికి, ఆధిభౌతిక ప్రపంచానికి మధ్య ఉన్న వ్యత్యాసాలకు అనుగుణంగా తమ ఆలోచనలు, నడవడిక మల్చుకుంటూ వచ్చారు. బ్రాహ్మణులు పాటించిన ఈ మేధో వెలుసుబాటుతో కూడిన ఆచరణే వందల వేల ఏళ్లుగా ఉత్తరాది ప్రాంతంలో వారి ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కారణం అయ్యిందని రచయిత విశ్లేషించారు. అప్పటి వరకూ హిందూయిజం పరిణామంలో తలెత్తిన అన్ని ఘర్షణలనూ, వైవిధ్యాలనూ, వైరుధ్యాలనూ తమతోనే, తమలోనే ఇముడ్చుకోగలిగిన హిందూయిజం మధ్య యుగాల్లో ఇస్లాం ప్రవేశంతో గందరగోళానికి గురైంది. ఈ రచనలో ప్రధానంగా దక్షిణభారత చరిత్ర, చారిత్రక ఆధారాలను విశ్లేషిస్తుంది. పశ్చిమతీరంలో పోర్చుగీసు ప్రవేశంతో ఏర్పడిన కొత్త పరిస్థితికి అనుగుణంగా హిందూయిజం తనను తాను మళ్లీ మార్చుకునే పనిలో పడింది. పోర్చుగీసులు పశ్చిమతీరాన్ని ఆక్రమించుకున్న తర్వాత ప్రవేశించిన క్యాథలిక్ సంస్థల జోక్యంతో స్థానికులు కొందరు క్రైస్తవంలోకి మారారు. భారతదేశంలోకి ప్రవేశించిన క్రైస్తవ సంస్థల లక్ష్యం ఇక్కడున్న వారిని మతమార్పిడులకు ప్రోత్సహించటం కాదని, యూరోపియన్ తరహాలో సంస్కరణవాద ఉద్యమాన్ని ప్రేరేపించటమనీ పిళ్లై కొన్ని ఉదాహరణలను ఈ పుస్తకంలో మనముందుంచుతారు.ఈ ప్రయత్నంలో పదేపదే దాడులను ఎదుర్కొన్న క్యాథలిక్ సంస్థలు చివరకు పోర్చుగీసు ప్రభావం ఉన్న ప్రాంతాలకు తమ కార్యక్రమాలు పరిమితం చేసుకున్నాయి. 17వ శతాబ్ది నాటికి దారా సెఖోవ్తో పాటు యూరప్‌కు చెందిన కొందరు సంస్కరణవాదులు హిందూయిజానికి, ఇతర మతాలకు మధ్య మౌలిక వ్యత్యాసాలేవీ లేవని చెప్పేందుకు ప్రయత్నం చేశారు.
అటువంటి సంస్కరణవాదుల్లో ఇటలీకి చెందిన మత ప్రచారకుడు రాబెర్టో డీ నోబిలి ఒకరు. ఆయన సంస్కృతం, తమిళం నేర్చుకోవటంతో పాటు హిందూ సన్యాసుల్లాగా వేషధారణ మార్చుకుని దండకమండలాలు, ధవళ వస్త్రాలు ధరించి అగ్రకుల హిందువులతో సంవాదానికి సిద్ధమయ్యేవాడు. ఒంటి మీద ముప్పేట వస్త్ర ధారణను ధార్మిక ప్రపంచంలోని త్రిమూర్తులు, త్రిశక్తులతో పోల్చి చెప్పేవాడు. క్రైస్తవ సన్యాసులు, హిందూ సన్యాసులు ఎంత ఎక్కువగా చర్చలు, సంప్రదింపులు జరుపుతాయో అంత ఎక్కువగా రెండు మతాల ధార్మిక లక్ష్యాల మధ్య సారూప్యతలు రుజువు అవుతూ వచ్చాయి. అప్పటికే వలసపాలకులతో పాటు క్రైస్తవ సంస్థలు కూడా స్థానిక భాషలు నేర్చుకోవటం మొదలు పెట్టాయి. సంస్కృతానికి, గ్రీక్, లాటిన్ వంటి ప్రాచీన భాషలకు మధ్య పలు సాంస్కృతిక సంబంధాలున్నాయన్న విలియం జోన్స్ సిద్ధాంతం అప్పటికే ప్రపంచమంతా విస్తరిస్తోంది. హిందువులకు, యూరోపియన్లకు మధ్య సాంస్కృతిక సారూప్యతలు కూడా పెద్దఎత్తున చర్చకు వచ్చాయి. అప్పటికే తాము అనాగరికులం కాదని చెప్పుకునేందుకు తహతహలాడుతున్న హిందూ అగ్రజులు యూరోపియన్ సంస్కృతి, వేషభాషలతో మిళితం కావటానికి స్వఛ్చందంగానే ముందుకొచ్చారు.
అయితే, అనేక కారణాలరీత్యా హిందు మతాచార వ్యవహారాల్లో పదేపదే జోక్యం చేసుకునేందుకు చట్టాలు రూపొందించటంతో వలసపాకులు, హిందు ధార్మిక ప్రతినిధుల మధ్య సంబంధాలు బెడిసికొట్టనారంభించాయి. ఈ సమయంలోనే హిందూసంస్కరణవాద ఉద్యమాలు తెరమీదకు వచ్చాయి. హిందుమతంలోని మౌలిక సిద్ధాంతమైన వర్ణాశ్రమ ధర్నాన్ని అంగీకరిస్తూనే తమను తాము సంస్కరించుకోవాలన్న ఉద్యమాలు ఒక ధోరణి అయితే వర్ణాశ్రమ ధర్మాన్ని తిరస్కరించే, సవాలుచేసే సంస్కరణోద్యమాలు రెండో ధోరణి. ఫూలే రెండో ధోరణికి ప్రతిబింబం అయితే ఆర్యసమాజం, బ్రహ్మసమాజం వంటివి మొదటి ధోరణికి ప్రతిబింబం. ఎక్కడికక్కడ కులాధారిత సమాజంగా ఉన్న భారతదేశంలో కుల వ్యవస్థకు మూలాలన్నీ సనాతన హిందూ ధర్మంలో ఉన్నాయన్న వాస్తవాన్ని మొదట ప్రపంచానికి పరిచయం చేసింది రాజా రామ్మోహన్ రాయ్. దయానంద సరస్వతి ప్రారంభించిన ఆర్య సమాజం హిందూ జాతీయత సూత్రీకరణను ప్రతిపాదించటమే కాక దాన్ని స్థిరీకరింపచేశారు. ఈ ప్రయత్నంలో వలసపాలకులు కూడా తమవంతు చేయూతను అందించారు. వలసపాలకులు ఒక మతంగా ధార్మిక ఆలోచన స్రవంతిగా హిందుయిజాన్ని ఎంతగా కొనియాడారో హిందూయిజంలోని వర్ణాశ్రమ ధర్మం, ఇతర సామాజిక చెడుధోరణులను అంతే తిరస్కరించారు. అప్పటి వరకూ దేశవ్యాప్తంగా హిందూమతం అన్న ధోరణి, భావన వేళ్లూనుకోలేదు. వలసపాలకులు ప్రతిపాదించిన నిర్వచనంతోనే హిందూయిజం దేశవ్యాప్తంగా విస్తరించిన మతంగా గుర్తింపు పొందింది. అప్పటి వరకూ కులాధారిత సమాజంగానే సామాజిక జీవనం సాగుతూ ఉండేది. ఈ విధంగా బ్రిటిష్ వలస పాలకుల చేతుల్లోనే హిందూయిజం కొత్త అస్థిత్వాన్ని, నేడు మనం చూస్తున్న అస్థిత్వాన్ని సంక్రమించుకున్నది. బ్రిటిష్ మూలాలున్న చట్టాలు, వేష భాషలు మార్చుకోవాలని పిలుపునిస్తున్న ఆరెస్సెస్, సనాతనవాదులు తమ రాజకీయ అస్థిత్వమే వలసపాలకుల భిక్ష అన్న వాస్తవాన్ని ఎలా దిగమింగుతారో చూడాలి.
ఈ పుస్తకం చివరల్లో సావర్కార్ గురించిన చర్చ కనిపిస్తుంది. తొలుత బాల గంగాధర్ తిలక్ ప్రతిపాదించిన అతివాద జాతీయవాదంతో ప్రభావితమైన ఆయన 40 ఏళ్ల వయస్సులోకి వచ్చేసరికి తన సొంత బాణీ మొదలు పెట్టాడు. ఇతర మతస్తులకు పితృభూమి ఉన్నట్లే హిందువులకూ పితృభూమి, పవిత్రభూమి ఉండాలని, భారతదేశమే అటువంటి పవిత్ర భూమి కావాలన్న డిమాండ్‌తో ఆర్యసమాజం వ్యవస్థాపకుడు దయానంద సరస్వతి ప్రతిపాదించిన హిందూ జాతీయవాదాన్ని ఆత్మన్యూనతతో కూడిన నిరంతరం రక్షకుడికోసం ఎదురు చూసే హిందూత్వగా మార్చటంలో సావర్కార్ ముఖ్యమైన భూమిక పోషించాడు. సావర్కార్ వాదనలను పరిశీలించిన పిళ్లై మిగిలిన మత ఛాందసుల్లాగానే సావర్కార్ కూడా హిందూమతం అత్యంత ప్రాచీనమైనదని వాదిస్తున్న విషయాన్ని చర్చకు పెట్టి అన్ని మతాలు నిర్దిష్ట చారిత్రక నేపథ్యంలోనే పుట్టి పరిణామం చెంది ఘనీభవిస్తాయనీ, రాజ్యాంతో జరిపే లావాదేవీల్లోనే తమ ప్రాపంచిక దృక్పథాన్ని సమకూర్చుకుంటాయని రచయిత ధృవీకరిస్తున్నారు.
– అర్షియా సత్తార్
దేవుళ్లు, తుపాకులు, మత ప్రచార సంస్థలు: ఆధునిక హిందూ అస్తిత్వ నిర్మాణం
(మను ఎస్ పిళ్లై, ప్రచురణ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా- 2024, పుస్తక సమీక్ష.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.