
వెబ్ సైట్ ను ఆపివేయడంలో ఒక బిజెపి ఎంపి హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయని విమర్శకులు వాదిస్తున్నారు. రాజ్యపు అధికారం, రాజకీయపార్టీల ప్రయోజనాలు కలగలిసిపోతే ఎలాంటి సమస్యలు తయారవుతాయో ఈ సంఘటన మనకు వివరిస్తుంది.
చెన్నై: భారత ప్రభుత్వం వికటన్ గ్రూప్ పత్రికల వెబ్ సైట్ ను ఆపివేసిందనే ఆరోపణలు వచ్చాయి. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలనుండీ జర్నలిస్టు సంఘాలనుండీ విమర్శలు వచ్చాయి. ఎటువంటి ముందస్తు నోటీసుగానీ వివరణగానీ లేకుండా జరిగిన ఈ చర్యకు పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. విమర్శనాత్మక జర్నలిజాన్ని నోరు మూయించే చర్యల్లో భాగంగా వీటిని అనేకులు చూస్తున్నారు.
ముందువారంలో వికటన్ డిజిటల్ పత్రికలో ప్రచురితమైన వ్యంగ్యచిత్రంపై తమిళనాడుకు చెందిన ఓ బిజెపి నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేశాకా ఆ పత్రిక పాఠకులకు అందుబాటులో లేకుండాపోయింది. ఈ వ్యంగ్యచిత్రం ఫిబ్రవరి 10న ప్రచురితమయింది. దీనిలో భారత ప్రధాని నరేంద్రమోడి యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ పక్కన సంకెళ్లతో కూర్చొని ఉన్నట్టుగా ఉంది.
పత్రిక నిలిపివేత చర్యను ఖండిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, “వందేళ్ళ చరిత్ర కలిగిన వికటన్ మీడీయా గ్రూప్ పై తీసుకున్న ఈ చర్య పత్రికా స్వేచ్చ, ప్రజాస్వామ్యాలపై దాడి” అని అన్నాడు. “ఈ రకమైన ఏకపక్ష సెన్సార్షిప్ ప్రజాస్వామ్యంలో అభ్యంతరకరం” అని ఆయన అన్నాడు
ఈ ఘటనపై ప్రఖ్యాత జర్నలిస్టు, హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్ రామ్ ద వైర్ తో మాట్లాడుతూ తీవ్రంగా విమర్శించాడు. “వాళ్ళు చేసిన ఈ పని చట్టవ్యతిరేకమయినది. తీవ్రంగా పట్టించుకోవలసింది. వికటన్ పత్రిక వెబ్సైట్ www. vikatan.com ఒక్కసారిగా అందుబాటులో లేకుండాపోవడంతో అనేక మంది వ్యక్తిగతంగా దీనిపై ఫిర్యాదు చేశారు. వెబ్సైట్ ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోవడానికీ వికటన్ గ్రూప్ డిజిటల్ పత్రికపై చేపట్టిన ఏకపక్షచర్యలకూ దానిలో ప్రచురితమైన వ్యంగ్యచిత్రంతో సంబంధం ఉంది. ఈ గ్రూప్ పత్రికలలో వికటన్, డిజిటల్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. దీన్నీ ఎవరైనా చదవవచ్చు. వికటన్ ప్లస్ చందాదారులకు అందుబాటులో ఉంటుంది. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షునితో రెండురోజుల సమావేశం కోసం వెళ్ళడానికి ముందు ఫిబ్రవరి 10న ఈ వ్యంగ్యచిత్రం వచ్చింది. భారతీయ పౌరులను అమానుషంగా సంకెళ్ళలో బంధించి విమానంలో వెనక్కి తెచ్చినప్పుడు భారత ప్రభుత్వం స్పష్టంగా పాటించిన నిశ్శబ్ధానికి సంబంధించినదే ఈ వ్యంగ్య చిత్రం” అని ఆయన అన్నాడు.
“సంపాదక వ్యాఖ్యగానూ, వ్యంగ్యంగానూ ఈ చిత్రం అంగీకారయోగ్యమైన జర్నలిజమే అవుతుంది. ట్రంప్ తో మాట్లాడుతున్నపుడు ప్రదాని మోడీ చేతులు కట్టివేయబడి ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక సంకేతాత్మక చిత్రణ” అని అయన అన్నాడు.
ఈ వ్యంగ్యచిత్రం పాఠకులలో బాగా చొచ్చుకపోయింది. సామాజిక మాధ్యమాలలో కూడా దీనిపై ఆసక్తి పెరిగింది. కానీ బిజిపి నుండి మాత్రం దీనిపై వ్యతిరేకత ఎదురయినట్టుగా నివేదికలు అందుతున్నాయి. వ్యంగ్యచిత్రానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు, భారత ప్రసార మంత్రిత్వశాఖ మంత్రి ఎల్ మురగన్ కు ఫిర్యాదు చేశాడు. “అమెరికాలో ప్రధాని పర్యటనకు ఉన్న దౌత్యపర ప్రాధాన్యతను తగ్గించడం, డిఎంకె ను సంతోషపెట్టడం కోసమే వికటన్ పత్రిక ఈ పని చేసింది” అని ఆయన ఆయన ఆరోపించాడు. పత్రికావిలువలను ఈ వ్యంగ్యచిత్రం అతిక్రమిస్తుంది కాబట్టి పత్రికపై తగిన చర్యలను తీసుకోవాలని ఆయన వాదించాడు.
అదే సమయంలో పాఠకులకు పత్రిక అందుబాటులో లేకుండాపోవడం మీద వికటన్ పత్రిక ఒక ప్రకటన చేసింది. “వికటన్ పత్రికను నిలిపివేసినట్టుగా మాకు అసంఖ్యాక నివేదికలు అందుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి పాఠకులు పత్రిక అందుబాటులో లేదని ఫిర్యాదు చేస్తున్నారు. అయినా ఇప్పటివరకూ కూడా పత్రిక నిలిపివేయడం మీద కేంద్రప్రభుత్వం నుండి ఏ రకమైన ప్రకటనా లేదు.” ఫిబ్రవరి 10న ప్రచురితమయిన వ్యంగ్యచిత్రం మీద బిజెపి సమర్ధకుల నుండి విమర్శలు వచ్చినట్టుగా పత్రిక స్పష్టం చేసింది. “దాదాపు వందేళ్ళుగా వ్యక్తీకరణ స్వేచ్చకు మద్దతుగా మా పత్రిక దృఢంగా నిలబడి ఉంది. భావస్వేచ్చను ఎత్తిపట్టడానికి మేము ఎప్పుడూ పని చేస్తాము. దానిని మున్ముందు కూడా కొనసాగిస్తాము. వెబ్సైట్ అందుబాటులో లేకుండాపోవడం వెనుక ఉన్న కారణాల గురించి మేము వివరణని కోరుతున్నాము. మా సంపాదకబృందం ఈ విషయాన్ని సమాచార మంత్రిత్వశాఖ ముందు ఉంచుతుంది”అని అన్నది.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య చట్టబద్ధత, పారదర్శకతలకు సంబంధించి తీవ్రమైన ఆందోళనలను రేకిత్తిస్తున్నందని “విడుదలై చిరుతైగల్ కచ్చీ” పార్లమెంట్ సభ్యుడు డి రవికుమార్, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని రాశాడు. “ఈ సంఘటనలో వికటన్ పత్రికకు అతిక్రమణకు పాల్పడినట్టుగా తెలియజేయడంగానీ, పత్రికను నిలుపుదల చేస్తున్నట్టుగా గానీ ఉత్తర్వు కాపీ ఏదీ అందించలేదు. ఇలా చేయడం సహజ న్యాయాన్ని, దాని విధానాలను ఉల్లంఘించడమే అవుతుంది. ఈ రకమైన పారదర్శకలేమి రూల్ ఆఫ్ లా అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఏకపక్షమైన కార్యనిర్వహణకు ప్రమాదకర ఉదాహరణగా నిలుస్తుంది. సరైన కారణమేదీ లేకుండా వికటన్ పత్రికను ఆపివేయడం ఆమోదయోగ్యమైన జర్నలిజానికి దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ప్రజాస్వామిక చర్చకు ఊపిరితీస్తుంది”అని ఆయన రాశాడు. ఒక వేళ పత్రికను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి ఉంటే వాటిని బయటకు వెల్లడించాలని, తామే ఆపి ఉంటే తిరిగి వెబ్సైట్ ను పనిచేసేలా చేయమని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్ధించాడు. సెక్షన్ 69 ఎఆఫ్ఐటి యాక్ట్ కు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని ఆయన కోరాడు. ఈ చట్టం ప్రకారం రాతపూర్వకమైన కారణాలేవీ చూపకుండా లేదా మరో అవకాశమీయమని కోరుకొనే అభ్యర్ధనకు అవకాశమీయకుండా ఏ రకమైన రచననయినా అడ్డుకోకూడదు. భద్రత రీత్యా అవసరమనుకుంటే కొన్ని మినహాయింపులతో అయినాసరే ప్రజలకు బాధ్యత వహిస్తూ పారదర్శకతను పైకెత్తడం కోసం సదరు ఉత్తర్వులను ప్రభుత్వం వెల్లడించాలని ఆయన ప్రభుత్వానికి పిలుపునిచ్చాడు.
వికటన్ పత్రిక చరిత్రనుండి ఎన్ రామ్, ఒక పోలికను వెలికితీసి ఉదహరిస్తూ. “1987లో ఆనందవికటన్ పత్రికకు ధైర్యవంతుడు, పండితుడు అయిన నా మిత్రుడు ఎస్. బాలసుబ్రమనియన్ సంపాదకుడిగానూ, యజమానిగానూ ఉండేవాడు. అప్పుడు ఆయన సదరు ఎమ్ఎల్ఏలను మోసగాళ్ళుగా, దొంగలుగా చిత్రీకరిస్తూ ఒక పాఠకుడు వేసిన వ్యంగ్యచిత్రాన్ని ఆయన తన పత్రికలో ప్రచురించాడు. ఈ కారణంగా ఆయనను జైల్లో వేశారు. అంకితభావంగల జర్నలిస్టుల నిరసనలవల్ల రెండు రోజుల తర్వాత బయటకు వచ్చాడు. తర్వాత మద్రాసు హైకోర్ట్ ఈ అరెస్టును రాజ్యాంగ వ్యతిరేకమనీ, మాట్లాడే స్వేచ్చకూ వ్యక్తీకరణకూ పత్రికా స్వేఛ్చకూ తీరని విఘాతమని చెబుతూ కేసు కొట్టేసింది. ఆ తీర్పు మైలురాయిగా నిలుస్తుంది. ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ సమస్య మాత్రం అదే- సెన్సార్షిప్, ఏకపక్షవిధానాలు, మాట్లాడే స్వేచ్చకు వ్యతిరేకంగా చట్టవ్యతిరేక అణచివేత. వ్యంగ్యచిత్రం ప్రచురితమైన ఐదురోజుల తర్వాత తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై ఈ విషయాన్ని కేంద్రమంత్రి ఎల్ మురగన్ దగ్గరికి తీసుకపోయాడు. చట్టబద్ధమయిన విధివిధానాలయిన-నిలిపివేత ఉత్తర్వులు, ప్రకాశకునికి నోటిసు ఇవ్వడం, లేదా ఆర్టికల్ 19(2) లోని న్యాయ సమ్మతమైన నిరోధక నిబంధనల శాసనంలోని ఎనిమిది శీర్షికలు-ఇవేమీ లేకుండానే వికటన్ వెబ్ పత్రికను చందాదారులకూ, ఉచితంగా చదివేవారికీ మొత్తంగా వేల మంది పాఠకులకు ఒకేవిధంగా అందుబాటులో లేకుండా నిలిపివేశారు. ఏ శాసనాన్నీ చూపలేదు. పద్ధతులను పాటించలేదు. శతాబ్ధ కాలపు చరిత్ర కలిగిఉండి, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడానికీ విమర్శించడానికీ ఏ మాత్రమూ భయపడకుండా విస్తృత గౌరవాన్ని పొందిన మీడియా గ్రూపుమీద పారదర్శకత ఏ మాత్రమూ లేని, రాజ్యాంగేతర చర్య ప్రతీకార దుర్గంధాన్ని చిమ్మింది”అని అన్నాడు.
వికటన్ గ్రూపు 1926లో ఏర్పాటయింది. తమిళ జర్నలిజంలో ప్రత్యేకతను సంతరించుకున్నది. వారి డిజిటల్ ఉనికిని ఆకస్మికంగా, సరైన వివరణలేవీ లేకుండా ఆపివేయడంమనే చర్య భారతదేశ డిజిటల్ రంగంపై పెచ్చుమీరుతున్న రాజ్యపు సెన్సార్షిప్ ను తెలియజేస్తున్నది. అసమ్మతికి చోటే లేకపోవడాన్ని తెలియజేసే ఘంటిక అవుతున్నది.
ఈ చర్యకు వివిధ రంగాల నుండి విమర్శ వచ్చింది. “విడుదలై చిరుతైగల్ కచ్చీ”(విసికె) తమిళనాడులోని ముఖ్యమైన పార్టీలలో ఒకటి. ఇది ఈ చర్యను విమర్శిస్తూ, ప్రభుత్వ చర్య “ఒక పాసిస్టు ధోరణి”. ఆమోదయోగ్య విమర్శ పట్ల అసహనాన్ని ఇది తెలియజేస్తుందని అన్నది. మీడియాపై ప్రభుత్వ సెన్సార్షిప్ ను రాజకీయ ఒత్తిడి నిర్దేశిస్తుందన్నదానికి ఈ చర్య ఒక ఉదాహరణ అని చెన్నై ప్రెస్ క్లబ్ తో పాటుగా ఇతర జర్నలిస్టు సంఘాలు, పౌరహక్కుల సంఘాలు నిరసించాయి.
ఇంతకు ముందేన్నడూలేని ఈ నిలిపివేతను రామ్ ఇలా వివరించాడు.” ఇది కేవలం ఒక సాధారణ నిలిపివేత చర్య కాదు. పారదర్శకత లేని, “పనికిమాలిన ఎత్తులతో” సాంకేతిక యుక్తులతో డిజిటల్ న్యూస్ కంటెంట్ అందుబాటును తగ్గించడం, ఆపివేయడం ద్వారా మీడియా స్వేచ్ఛను, పాఠకుల సమాచార హక్కును లేకుండా చేసే చర్య ఇది. చట్టబద్ధతలేని ఈ ఏకపక్ష చర్య మీడియా రంగం మీద పెద్ద ప్రభావాన్ని వేస్తుంది” అని అయన అన్నాడు.
సాంకేతికంగా సెన్సార్ షిప్ ను విధించాక, చేయాల్సిన నష్టాన్ని చేశాక ఫిబ్రవరి 16న సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వికటన్ గ్రూప్ కు నోటీసు పంపిందని రామ్ అన్నాడు..
ఆ నోటీసులో మంత్రిత్వ శాఖ “వికటన్ కు సంబంధించిన వెబ్సైట్ లోని ఒక కంటెంట్ ను ఆపివేయాలని మాకు విన్నపం అందింది. సమాచార సాంకేతికతా నియమాలు, 2021 (ఇంటర్మీడియరీ గైడ్లైన్వ్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్)ను అనుసరించి మీటింగ్ ఆఫ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ ఫిబ్రవరి 17న సమావేశాన్ని ఏర్పరచనుంది. హాజరై తమ వ్యాఖ్య/వివరణలు ఏమైనా ఉంటే అందజేయాలి” అని తెలియజేసింది.
అలైస్ అడ్వెంచర్స్ లోని క్వీన్ ఆఫ్ హార్ట్స్ అసహనంతో చేసే చర్య మాదిరిగా “శిక్ష ముందు, తీర్పు తర్వాత” అనే పద్ధతిలో ఇది ఉందని రామ్ అన్నాడు.
వెబ్ సైట్ ను ఆపివేయడంలో ఒక బిజెపి ఎంపి హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయని విమర్శకులు వాదిస్తున్నారు. రాజ్యపు అధికారం, రాజకీయపార్టీల ప్రయోజనాలు కలగలిసిపోతే ఎలాంటి సమస్యలు తయారవుతాయో ఈ సంఘటన మనకు వివరిస్తుంది. ఇదంతా “రాజ్యేంగేతర పద్ధతు”ల్లో జరిగిందని రామ్ అంటున్నాడు.
వ్యతిరేకత ఎక్కువవడంతో మీడియా హక్కుల సంఘాలు రాజకీయ పార్టీలు వికటన్ గ్రూపు వెబ్సైట్ ను వెంటనే పునరుద్ధరించాలని పిలుపునిచ్చాయి. “డిజిటల్ మాధ్యమాలలో వచ్చే ఏ వార్తలనయినా కొంతమది ఇష్టపడకపోయినట్లయితే వాటిని లేకుండా చేయడం సాధ్యమే అన్నదానికి ఇది ఓ ఉదాహరణ. వారు దీనిని న్యాయస్థానాల్లో తిరస్కరించవచ్చు. అలా అయితే లక్షలాది మంది వికటన్ పాఠకులకు వెబ్సైట్ అందుబాటులోకి లేకుండాపోవడమన్నది పొంతనలేని విషయమే అవుతుంది. కానీ ఇలాంటి విషయాలు ఇప్పుడు జరుగుతాయన్నది నమ్మడం కష్టం” అని రామ్ అన్నాడు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.