
ప్రపంచం భారతదేశం నుంచి పారదర్శకతను ఆశిస్తోంది. డిప్లమాటిక్ ఔట్రీచ్లో భాగంగా వివిధ దేశాలు పర్యటించనున్న ఎంపీలకు అనేక సంక్లిష్టమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటికి సరైన రీతిలో సమాధానం చెప్పలేకపోతే ఆపరేషన్ సిందూర్ గురించి అనేక అనుమానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఆపరేషన్ సిందూర్ కాల్పుల విరమణ జరిగిన తర్వాత ప్రపంచానికి మన వాదనలను వినిపించడానికి అఖిలపక్ష బృందాలను పంపాలన్న మోడీ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం స్పష్టమే. భారతదేశం లౌకికరాజ్యమని ఐక్యంగా ఉందని నిరూపించడంతో పాటు సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ వ్యవహార శైలి గురించి లోకానికి వివరించాలన్నది ఈ ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాలలో పర్యటించే ఎంపీలు కేవలం ప్రభుత్వ వాదనలను చిలకపలుకలలా వల్లెవేయడమే కాకుండా అనేక అసౌకర్యమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలు ముందుగా రిహార్సల్స్ చేసిన ప్రశ్నలకంటే భిన్నంగాను, లోతైనవిగాను, తీవ్రమైన స్వభావంతో కూడినవిగాను ఉండే అవకాశం లేకపోలేదు.
దేశీయ విధానాలతో పాటు దౌత్యనీతిలో భారతదేశం తీసుకుంటున్న వైఖరికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు అందించడంతో పాటు ప్రజాతంత్ర క్రమం, దౌత్యనైతికత వంటివి పాటిస్తుందని ప్రపంచం ఆశిస్తుంది.
మన ఎంపీలు ఎదుర్కోబోయే కనీసమైన ఐదు ప్రశ్నలు ఇవి. ఈ ప్రశ్నలకు ఎంపీలు ఇచ్చే సమాధానాలు దాటవేసేవిలా ఉంటే మన దేశ కీర్తిప్రతిష్టలు మరింత మసకబారే అవకాశం ఉంది.
1. పహల్గాంలో జరిగిన దాడికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఎక్కడ ఉన్నాయి?
ప్రపంచం స్పష్టమైన వివరాలు తెలుసుకోవాలనుకుంటుంది. మనం చెప్పిందే విని ఊరుకోదు. పహల్గాంలో పౌరులపై దాడికి పాల్పడిన వాళ్లు ఎవరు? ఈ దాడికి పాల్పడిన వారికి పాకిస్తాన్‌కు మధ్య సంబంధం ఉందని చెప్పేందుకు భారతదేశం వద్ద ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి? ఆపరేషన్ సిందూర్ నిర్దేశిత లక్ష్యం ఏంటి? సాధించిన ఫలితాలు ఏంటి?
తమ సేనలు పాకిస్తాన్ భూభాగంలోనూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ ఉన్న అనేక ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలపై దాడి చేశామని భారతప్రభుత్వం చెప్తోంది. ఈ దాడికి సంబంధించిన ఆధారసహిత సమాచారాన్ని విదేశీ ప్రభుత్వాలు కోరనున్నాయి. ఉగ్రవాదదాడికి సంబంధించి నిరూపించడానికి వీలైన సాక్ష్యాధారాలతో కూడిన సమాచారాన్ని భారతీయ ప్రతినిధి బృందాలు ప్రపంచం ముందు ఉంచుతాయని ఆశిస్తున్నారు. కనీసం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించి నిర్బంధించడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని తమ సహచరులతో సంభాషించుకుంటున్న విషయాలను భారత నిఘా వర్గాలు గుర్తించాయా లేదా అనే ప్రశ్నలకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దక్షిణాసియాలో ఉగ్రవాద చర్యలకు సంబంధించి పరస్పర విరుద్ధమైన వాదనలు ఉన్నాయి. భారతీయ ప్రతినిధి బృందాలు ఊకదంపుడు ఉపన్యాసాలతో సరిపెట్టుకోకుండా సంపూర్ణమైన వాస్తవాలు, ఆధారాలు వెంటబెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అంతర్జాతీయ సమాజం భారతదేశ చర్యలను సమర్థిస్తుంది. 2001లో పార్లమెంట్‌పై 2008 ముంబైలో జరిగిన దాడి విషయంలో ప్రభుత్వాలు అనుసరించిన వ్యూహాలు పాటించిన పద్ధతులు ఓ నమూనాగా తీసుకోవచ్చు.
2. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారతీయ సేనలకు జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు, కూలిన విమానాలకు సంబంధించిన లెక్కల గురించి స్పష్టత ఎందుకు లేదు?
యుద్ధం ఎగజిమ్మే కారుమేఘాలు వాస్తవాలను కప్పేస్తాయి. గందరగోళానికి తావిస్తాయి. తాజాగా భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన సాయుధ ఘర్షణ కూడా దీనికి మినహాయింపు ఏం కాదు. రాఫేల్‌తో సహా భారత వాయుసేన ప్రయోగించిన పలు యుద్ద విమానాలను కూల్చామని పాకిస్తాన్ బాహాటంగా చెప్పుకుంటోంది.కానీ ఈ ప్రకటనలపై భారతదేశం ఇప్పటి వరకు నోరు విప్పలేదు.వివరాలు పంచుకోలేదు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న సైనికాధికారులు కూడా సైనిక చర్యలలో వ్యూహాత్మక లక్ష్యాల సాధనే కీలకమని, నష్టాలు లిఖించుకోవడం కాదని ఈ ప్రశ్నలకు సమాధానం దాటవేశారు.
పాకిస్తాన్ వాదనలకు భారత్ నోరుమెదపకపోవడానికి మధ్య ఉన్న మీమాంస కేవలం లెక్కలు, వివరాలకు సంబంధించిన మీమాంస మాత్రమే కాదు. భారత సైనిక పాటవానికి, ప్రతిష్టకు సంబంధించిన మీమాంస. పార్లమెంట్ సభ్యుల బృందాలు వివిధ దేశాల రాజధానులలో అడుగుపెట్టగానే వారికి ఎదురయ్యే ప్రశ్నలు మే ఏడో తేదీ వేకువ జామున అసలు ఏం జరిగింది? భారతవాయుసేనకు ఏమైనా నష్టం జరిగిందా? ప్రత్యేకించి అత్యంత ఆధునికమైనదని చెప్తున్న రాఫేల్ యుద్ధ విమానాలు ప్రయోగించబడ్డాయా? ఎన్ని రాఫేల్ యుద్ధవిమానాలు రంగంలో దిగాయి? ఎన్ని సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాయి? ఎన్ని సురక్షితంగా తిరిగి వచ్చాయి? పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోనులు, క్షిపణులు భారత్ భూభాగంలో ఉన్న ఏ ఏ సైనిక స్థావరాలను తాకాయి? అక్కడ జరిగిన నష్టం ఎంత? సైనికపరంగా జరిగిన నష్టాలు, సాధించిన విజయాల విషయంలో భారత ప్రభుత్వం లెక్కలు చెప్పడానికి ఎందుకు వెనుకాడుతోంది? భారత సేనలు లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్‌లోని ప్రాంతాలకు, ఆదేశంలోని అణ్వాయుధ కేంద్రాలకు మధ్య సంబంధం ఉందా? దూరం ఎంత? అనే విషయాలకు సంబంధించి భారత ప్రభుత్వానికి అవగాహనా- సమాచారం ఉందా లేదా? ఈ ప్రశ్నలకు సూటిగా భారతీయ ప్రతినిధి బృందం సమాధానాలు చెప్పలేకపోతే మనదేశ పరువు గంగలో కలుస్తుంది. మనం చెప్పే విషయాలు నమ్మలేనివిగా మారుతాయి.
3. విదేశాలకు వెళ్లి మరీ వివరించాలని అనుకుంటున్న ప్రభుత్వం దేశ ప్రజలతో కనీసం ఆపరేషన్ సిందూర్ విషయంలో పారదర్శకంగా ఎందుకు వ్యవహరించడం లేదు?
దేశంలో ప్రధాన ప్రతిపక్షం, పౌరసమాజం మోడీ ప్రభుత్వం అస్పష్టంగా వ్యవహరించడానికి ఎందుకు సిద్ధపడుతోందని ప్రశ్నిస్తున్నాయి. భారతదేశంలో ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించడానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరపాలనే డిమాండ్‌ను విస్మరించి విదేశాలకు వివరించబూనుకుంటున్న మోడీ ప్రభుత్వ వైఖరిని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు. కనీసం విదేశాలకు భారతదూతలుగా వెళ్లే ఎంపీలను ఎంపిక చేసే విషయంలో కూడా దేశంలోని ప్రధాన పార్టీలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపలేదు. వివిధ దేశాలకు దూతలుగా వెళ్లే ఎంపీలను, వెళ్లాల్సిన దేశాలను ఏకపక్షంగా నిర్ణయించారు. మోడీ ప్రభుత్వం విదేశాలకు ఇస్తున్న ప్రాధ్యాన్యత ఈ దేశ పౌరులకు ఎందుకు ఇవ్వడం లేదు? వివిధ దేశాలు, కనీసం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనం పట్ల విశ్వాసం ఉన్న దేశాల నుంచి ఈ ప్రశ్నలు తప్పక ఎదురవుతాయి. కేంద్రప్రభుత్వం పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను దూతలుగా మారిన అఖిలపక్ష ఎంపీలు ఎలా సమర్ధిస్తారో చూడాలి.
4. కాల్పుల విరమణ వెనుకున్న రహస్యం ఏంటి? అమెరికా పాత్రను భారతదేశం అంగీకరించిందా?
భారత్- పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణపై కుదిరిన అవగాహన విషయంలో కూడా పెద్ద ఎత్తున గందరగోళం నెలకొన్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ జోక్యం వల్లనే రెండు దేశాలు కాల్పుల విరమణకు సిద్ధం అయ్యాయని చెపుతుంటే, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాత్రం ‘అబ్బే.. అటువంటిదేం లేదు’ అని అంటున్నారు. కాల్పుల విరమణ పూర్తిగా ద్వైపాక్షిక నిర్ణయం అంటున్నారు. అయినప్పటికీ ట్రంప్ చేస్తున్న ప్రకటనలను నిర్ద్వంద్వంగా నిస్సంకోచంగా ఖండించడానికి ట్రంప్ అబద్ధం ఆడుతున్నారని చెప్పడానికి మోడీ సిద్ధపడకపోవడం మరిన్ని అనుమానాలకు, అపోహలకు అవకాశం ఇస్తుంది. వివిధ దేశాలు ద్వైపాక్షిక విషయాలలో మూడవ పక్షానికి తావులేదని ఇంతకాలం భారతదేశం పాటిస్తున్న మౌలిక విధానం నుంచి మోడీ ప్రభుత్వం వైదొలిగిందా? వైదొలుగుతోందా? ప్రపంచ అగ్రరాజ్యాల ఒత్తిడికి తట్టుకోలేక మోడీ ప్రభుత్వం దీర్ఘకాలంగా భారత్ అనుసరిస్తూ వచ్చిన స్వతంత్ర విదేశాంగ విధానానికి తిలోదకలు ఇస్తుందా అని నిలదీయకమానవు.
5. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక వ్యూహం విశ్వసనీయమైనదేనా? బాధ్యతాయుతమైన ప్రజాస్వామిక దేశం అనుసరించదగ్గ వ్యూహమేనా?
ఉగ్రవాదాన్ని ఒక్క నిమిషం సహించేది లేదని, ఉగ్రవాదులకు వారి మద్దతుదారులకు మధ్య తేడాను గుర్తించబోమని మోడీ ప్రభుత్వం చెపుతోంది. కానీ విశ్లేషకులు ఈ వైఖరిలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నారు. సరిహద్దుల్లో సాయుధ ఘర్షణకు సిద్ధపడ్డప్పుడు కనీస బాధ్యతగా భారత ప్రభుత్వం సరిహద్దు గ్రామాలలో నివసిస్తున్న ప్రజానీకానికి రక్షిత ప్రదేశాలకు ఎందుకు తరలించలేదు? ఆపరేషన్ సిందూర్ విషయంలో అశోక యూనివర్సిటీ ప్రొఫేసర్లాగా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే వారిపై ప్రభుత్వం ఎందుకు విరుచుకుపడుతోంది? ప్రశ్నించేవారిని లక్ష్యంగా చేసుకొని ఎందుకు దాడులు చేస్తుంది? కాల్పుల విరమణను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిద్ధం కావడం లేదు? విరమణ కాదని తాత్కాలిక విరామేనని ఎందుకు చెపుతోంది? దేశం దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధం అవుతోందా? అణ్వస్త్ర ప్రయోగం గురించిన ప్రస్థావనలతో మోడీ ప్రభుత్వం ఏం సాధించదలుచుకున్నది? మోడీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక వ్యూహం రాజకీయ ప్రయోజనాల కోసమా? దేశ భద్రతా ప్రయోజనాల కోసమా? దేశంలో ప్రజాస్వామిక ప్రమాణాలు, విలువలు, పారదర్శకత పాటించకుండా విదేశీ సంఘీభావాన్ని సంపాదించడం సాధ్యమేనా?
భారతీయ ప్రతినిధి బృందాలు ఈ ప్రశ్నలకు ఇంకా ఇటువంటి అనేక ప్రశ్నలకు సూటిగా నిస్సంకోచంగా నిర్ద్వంద్వంగా సమాధానాలు చెప్పలేకపోతే ఏ ప్రయోజనం ఆశించి ఈ దౌత్య వ్యూహానికి తెరతీశారో ఆ ప్రయోజనానికే నష్టం జరిగే ప్రమాదం ఉంది. తాజా ఘటనలు, పరిణామాల గురించి నిరంతరం జరిగింది జరిగనట్టుగా ప్రపంచమంతా తెల్సుకోగలిగిన ఆధునిక సమాచార సాంకేతిక వనరులున్న కాలంలో బ్రతుకుతున్నాం. మనం ఏం చెపుతున్నామో, ఏం చేస్తున్నామో, నిన్న ఏం చెప్పామో, ఏం చేశామో లోకమంతా కళ్లు చేసుకొని చూస్తూ ఉంటుంది. భారతదేశం నుంచి విస్పష్టమైన సమాధానాలు, ఆధారాలు, వివరాలను ప్రపంచం కోరుతోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.