
1972లో అమలు చేయడిన అటవీ సంరక్షణ చట్టం ఆదీవాసీల మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. తమ ఇళ్లను వాకిళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాలలో రోజువారి కూలీలుగా వెట్టి చాకిరీ చేస్తూ ఆదివాసులు కాలం వెళ్లదీశారు. ఇటువంటి పరిణామాలను ఎదుర్కొన్న వారిలో కర్నాటకకు చెందిన నాగరహోళే ప్రాంత గిరిజన తెగ కూడా ఉన్నారు. చట్టాల గురించి, తమ హక్కుల గురించి అవగాహన లేకపోవడంతో పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన తమ ఆస్తిని కోల్పోయామని నాగరహోళే గిరిజనులు తెలియజేశారు. సుమారు 39 సంవత్సరాల తర్వాత తమ భూముల కోసం తమ తాతముత్తాతలు ఉన్నటువంటి ప్రాంతానికి ఆదివాసీలు చేరుకున్నారు. తమ భూముల తమకు దక్కేలా పోరాటం చేస్తున్నారు.
నాగరహోళే ప్రాంతం కర్ణాటకలోని కూర్గ్,కేరళలోని వయానాడ్ మధ్య ఉంది. దీనిని 1955లో వన్యప్రాణుల అభయారణ్యంగా, 1988లో జాతీయ ఉద్యానవనంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిది. ఈ ఉద్యానవనంలో పులులు, ఏనుగులు, చిరుతపులులు ఇతర వన్యప్రాణులు కూడా ఉంటాయి. పచ్చని నాగరహోళే అడవిలో ఉన్నటువంటి కరడి కళ్ళు హాట్టర్ కొల్హాడి గ్రామం నుంచి అధికారుల ఆదేశంతో 1985- 86 మధ్య జెన్నుకురుబ తెగకు చెందిన ఆదివాసీలు గ్రామాన్ని ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు.
అటవీ హక్కుల చట్టం(ఎఫ్ఆర్ఏ)-2006 కింద తమ భూమిలో తాము జీవించే హక్కు ప్రకారం మే 5న జెన్ను కురుబకు చెందిన 52 కుటుంబాలు తమ పూర్వీకుల గ్రామం కరడి కళ్ళు హాట్టర్ కొల్హాడి వైపు పాదయాత్ర చేపట్టి, తమ భూములను తిరిగిపొందారు. 2025 మే 6న 52 కుటుంబాలు తమ పూర్వీకుల గ్రామంలో అడుగుపెట్టాయి.దాదాపు వంద మంది అటవీ అధికారులు వారి వద్దకు చేరుకొని ఇది రిజర్వ్డ్ అడవి అని, వెంటనే ఈ స్థలాన్ని వదిలి వెళ్లాల్సిందిగా బెదిరిస్తూ డిమాండ్ చేశారు. గిరిజన తెగలు తమ వాదనలు తెలియజేసి, చట్టపరమైన ఉత్తర్వులు వచ్చే వరకు ఎదురు చూడాలని అధికారులు అన్నారు.
కర్నాటక అటవీ శాఖ, కర్నాటక రాష్ట్ర పోలీసు, కర్నాటక రాష్ట్ర పులుల సంరక్షణ బృందం(ఎస్టీపీఎఫ్) మే 7న ఆదివాసుల ప్రాంతానికి చేరుకోగానే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.52 కుటుంబాలు ఎక్కడ అయితే క్యాంప్ పెట్టుకొని నిరసన తెలుపుతున్నాయో అక్కడికి మలిసంధ్య వేళ వందల సంఖ్యలో అధికారులు టార్చ్‌లు పట్టుకొని వెళ్లారు. ప్రజలు వేసిన టెంట్లను తీసివేయాలని ఆదేశించారు. తమకు నిరసనతో ఎటువంటి ఇబ్బంది లేదని కానీ టెంట్స్ని అనుమతించమని అధికారులు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆదివాసీలు తమ గోడును వినిపించారు.39 సంవత్సరాల క్రితం తమ భూమి నుంచి బలవంతంగా తమను దూరం చేశారని వాపోయారు. తమకు ప్రాణాధారమైన అడివిని కోల్పోయి వేరే ప్రాంతాలలో కూలీ చేసుకొని బ్రతకామని చెప్పుకొచ్చారు.

ఆదివాసీ మహిళా నాయకురాలు సుశీలా మాట్లాడుతూ “మా పూర్వీకుల జ్ఞాపకాలతో, మా దేవతలతో కలిసి మేము అడవిలో స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాం. ఇది మా భూమి, మా పూర్వీకులు మమ్మల్ని తిరిగి పిలుస్తున్నారు. మేము ఇక్కడే బ్రతుకుతాం ఇక్కడే చనిపోతాము” అని తెలియజేశారు. నాగరహోళే రిజర్వ్ ఫారెస్ట్‌లోని కరడి కళ్ళు హాట్టర్ కొల్హాడిలోని తన పూర్వీకుల భూములను తిరిగి పొందడానికి బయలుదేరిన 52 జేను కురుబ కుటుంబాలలో ఒకరు సుశీలా.
“1972లో అటవీ సంరక్షణ చట్టాన్ని అమలు చేయడంతో మా కమ్యూనిటీ 1985- 86లో బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. కొడుగు తోటలలో బానిసలా పనిచేయాల్సి వచ్చింది. మేము అటవీ సంరక్షణకు భంగం కలిగిస్తున్నామని అటవీ అధికారులు అంటున్నారు. వారు మమ్మల్ని భయపెట్టారు, వేధించారు, బెదిరించారు. ఏనుగులు మా పంటలను తుడిచిపెట్టాయి. మా ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. మాకు అప్పట్లో చట్టం గురించి ఏమీ తెలియదు” అని సుశీలా ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, 2021లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం అడవిలో తమ హక్కులను కోరుతూ కమ్యూనిటీకి ఆదివాసులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటికీ అధికారుల నుంచి వారికి స్పందన రాలేదు. దీంతో 2025 మే 5న తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పాదయాత్ర ప్రారంభించారు.
మే 6న అటవీ శాఖ, పోలీసులు, ఎస్టీపీఎఫ్ బృందం ఆదివాసీల ప్రాంతానికి చేరుకున్నారు. ఈ బృందం తమ వద్దకు వచ్చి తమని బెదిరించారని, బలవంతంగా తరిమివేయడానికి ప్రయత్నించారని జేను కురుబా తెగ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా రహదారులను మూసివేశారని, మీడియాను తమ ప్రాంతంలోకి అనుమతించలేదని పేర్కొన్నారు.
“నాగరహోళే అటవీ శాఖ మ్యాపులు మా సంప్రదాయ నామకరణ, సరిహద్దుల ఆధారంగా తయారయ్యాయి. కానీ వారు(పోలీసుల బృందం) మా భూములపై ఆక్రమణ చేసి, మమ్మల్ని ‘ఆక్రమణదారులు’ అంటున్నారు.” అని సుశీలా తెలియజేశారు.
“మా తాతముత్తాలు నివసించిన, ఇది మా పూర్వీకుల భూమి. మాదేదైతే ఉందో దానినే మేము తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాము. అడివిలోని జంతువులు మాకు హాని చేస్తాయని అధికారులు అంటున్నారు. మా పూర్వీకులు అడవిలోనే పెరిగారు. మా కమ్యూనిటీ జంతువులతో కలిసి శతాబ్దాలుగా జీవించింది. ఈ పులులు కూడా మా ఆత్మలే” అని కారడికళ్లు ఫారెస్ట్ రైట్స్ కమిటీ, నాగరహోళే ఆదివాసి జమ్మపాలే హక్కు స్థాపన సమితి సంఘ సంస్థ నాయకులు జేఏ శివు చెప్పారు.
మే 4న బెంగళూరు ప్రెస్ క్లబ్లో కమ్యూనిటీ సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తమ పోరాటాన్ని “నిరసన చర్య” అని అభివర్ణించారు. అటవీ హక్కుల చట్టం కింద తమ భూహక్కును గుర్తించాలని డిమాండ్ చేశారు. అటవీశాఖ తమ హక్కులను కాలరాస్తున్నట్టుగా ప్రవర్తిస్తుందని శివు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తమ భూములు తమకు చెందాలని రాజ్యంగపరంగా అటవీ హక్కులు తమకు వర్తించాలని ఆదివాసీ నేతలు, కమ్యూనిటీ ముఖ్యసభ్యులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా “కారడికల్లుకు చెందిన 52 కుటుంబాల ఐఎఫ్ఆర్,సీఎఫ్ఆర్,సీఎఫ్ఆర్ఆర్ హక్కులను గుర్తించి ఆమోదించాలి. అన్ని ఎస్టీపీఎఫ్, ఇతర సాయుధ బలగాలను ప్రాంతం నుంచి తొలగించాలి. నాగరహోళే ఆదివాసీ జమ్మపాలే హక్కు స్థాపన కమిటీ కారడికల్లు ఎఫ్ఆర్సీ సభ్యులతో ప్రభుత్వ అధికారులు చర్చ ప్రారంభించాలి. అడవిలోని పరిస్థితులను కవర్ చేయడానికి, బాధితులను కలవడానికి నాగరహోళేలో స్వేచ్ఛాయుతంగా మీడియాను అనుమతించాలి.” అని తమ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు.
2025 మే 8 నాటికి విడుదలైన అటవీ సంరక్షణ అధికారి ఉత్తర్వుల ప్రకారం సర్వేలు తాత్కాలికంగా ఆపివేయబడ్డాయి. 2025 మే 5 తర్వాత నాగరహోళే వైల్డ్ లైఫ్ జోన్ అత్తూర్ బేలోకి ప్రవేశించిన ఆదివాసీలంతా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి.తాము ఈ భూమిలోనే పుట్టాము, ఈ భూమిలోనే చనిపోతామని, ప్రభుత్వం- ప్రభుత్వ అధికారులు ఎంత బెదిరించిన వేధించిన తమ పోరాటం కొనసాగుతోందని ఆదివాసులు అంటున్నారు. ఆదివాసీలపై సాగుతున్న ఈ చర్యలను పౌరసమాజం ఖండించింది. ఎవరైతే తమ ఇళ్లను కోల్పోయారో వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.