
అమృత్‌సర్‌లోని ప్రతిష్టాత్మక స్వర్ణ దేవాలయంతో సహా పంజాబ్‌లో వివిధ ప్రార్ధనా స్థలాలపై పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లు ప్రయోగించిందని, పంజాబ్ రాష్ట్రంలోని ప్రార్థనా స్థలాలు పాకిస్థాన్ దాడుల భారిన పడకుండా భారత వాయిసేన సురక్షితమైన చర్యలు తీసుకున్నదని భారత సైనిక అధికారులు చేస్తున్న ప్రకటన తాజాగా విమర్శలకు కారణమైంది. ఆపరేషన్ సిందూర్ ముగిసిన తర్వాత భారత ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు.ప్రసంగంలో కూడా పాకిస్తాన్ భారత దేశంలోని ప్రార్థనా స్థలాలను, దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడుల కోసం వ్యూహం రూపొందించిందని ప్రధానమంత్రి ఆరోపించారు.
మే 19 సోమవారం నాడు భారత సైన్యానికి చెందిన అధికారులు పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల శకలాలను ప్రదర్శించారు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారతీయ వైమానిక రక్షణ వ్యవస్థలు గుర్తించి కూల్చేశాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉపయోగించిన ఎల్ 70 ఎయిర్ డిఫెన్స్ గన్స్‌తో పాటు ఆకాష్ క్షిపణులను కూడా ప్రదర్శించారు. పంజాబ్‌లోని శ్రీ హర్ మందిర్ సాహిబ్ స్వర్ణ దేవాలయంతో పాటు అనేక నగరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ చేసిన దాడులను భారత వైమానిక దళం నిష్ఫలం చేసిందని, తిప్పి కొట్టిందని సైన్యాధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టటానికి ఎంతలా ప్రయత్నించిన భారత సైన్యం సంయమనం పాటించిందని కూడా తెలియజేశారు.
మేజర్ జనరల్ శేషాద్రి మాట్లాడుతూ “వాళ్లు ప్రార్థన స్థలాలను లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేశారు. ప్రత్యేకించి అమృత్‌సర్‌లో స్వర్ణ దేవాలయంపై దాడికి పూనుకున్నారు. మే 7వ తేదీ రాత్రి 8వ తేదీ ఉదయం స్వర్ణ దేవాలయంపై ఒక్కసారిగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు దూసుకు రావడం గమనించిన భారత సైన్యం ఎయిర్ డిఫెన్స్ గన్లతో అడ్డుకుంది” అని తెలిపారు. ఎయిర్ డిఫెన్స్ గన్లను ఉపయోగించి పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను కూల్చివేశామని స్వర్ణ దేవాలయానికి పాకిస్తాన్ దాడుల వల్ల వీసమెత్తు నష్టం కూడా కలగకుండా కాపాడామని చెప్పుకొచ్చారు. స్వర్ణ దేవాలయం యాజమాన్యం కరెంట్ సరఫరా నిలిపివేయడంతో అమృత్సర్ గగనతలంపై దూసుకొస్తున్న క్షణంలో డ్రోన్లను చూడగలిగామని తెలియజేశారు.
మే 19వ తేదీ ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ జనరల్ ఆర్మీ డిఫెన్స్ లెఫ్ట్‌నెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డీ కన్హా ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ, స్వర్ణ దేవాలయంలో ప్రధాన పూజారి దేవాలయం లైట్లని ఆపివేయడంతో పాటు స్వర్ణ దేవాలయంపై ఉన్న గగన స్థలంలో రక్షణ కవచనాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించారని తెలిపారు.
స్వర్ణ దేవాలయానికి రక్షణ కవచం ఏర్పాటు చేస్తూ హెయిర్ డిఫెన్స్ గన్లను మొహరించేందుకు ప్రధాన పూజారి అనుమతించడం సంతోషించదగ్గ విషయమని, ప్రాంగణంలో మొత్తం లైట్లు నిలిపివేయడం ద్వారా పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లను చూడగలిగామని డీ కన్హా తెలిపారు. స్వర్ణ దేవాలయానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి స్వర్ణ దేవాలయం యాజమాన్యంతో చర్చించిన తర్వాతనే ఈ అనుమతి దొరికిందని కూడా ఆయన వివరించారు.
సైన్యాధికారులు ఇచ్చిన వివరణ తరువాత స్వర్ణ దేవాలయానికి నిజంగానే ముప్పు వాటిల్లనున్నదని యాజమాన్యం గుర్తించిందని ఆయన చెప్పారు. ఆ తర్వాతనే ఎయిర్ డిఫెన్స్ గన్స్ మోహరించేందుకు అనుమతించారన్నారు.స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో కరెంట్ సరఫరా నిలిపివేయడంతో అమృత్‌సర్‌లో ఏం జరుగుతుందో స్పష్టంగా చూసేందుకు, గుర్తించేందుకు సైన్యానికి అవకాశం కలిగిందని పాకిస్తాన్ ప్రయోగించిన ఆయుధాలను గుర్తించేందుకు వీలు కలిగిందని ఆయన తెలిపారు.
ఇదంతా అబద్ధం: ప్రధాన పూజారి
డీ కన్హా చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని బాధ్యతాయుతమైన సైనిక అధికారి ఈ విధంగా అసత్యలు ప్రచారం చేయటం తమను షాక్‌కు గురి చేసిందని స్వర్ణ దేవాలయం ప్రధాన పూజారి గియాని అమర్జీత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీ హర్ మందిర్ సాహిబ్ గురుద్వారా యాజమాన్యం మాత్రమే జిల్లా పాలన యంత్రాంగం ఇచ్చిన సూచనలు నేపథ్యంలో గురుద్వారా పైన ఉన్న లైట్లు ఆర్పేశారని ఆయన తెలిపారు. అదికూడా కొద్దిసేపు మాత్రమేనని స్పష్టం చేశారు. సిక్కుల ధార్మిక సంప్రదాయాన్ని అనుసరించి ప్రార్థన స్థలాలు, పూజ మందిరాలలో లైట్లు వెలుగుతూనే ఉన్నాయని వివరించారు. తద్వారా గురుద్వారా పవిత్రతను కాపాడామని కూడా ఆయన స్పష్టం చేశారు. స్వర్ణ దేవాలయంపై ఆయుధాలు మోహరించేందుకు ఎవరు అనుమతి కోరలేదని, ఎవరికీ అనుమతి ఇవ్వలేదని గియాని అమర్జీత్ సింగ్ పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయంపైన ఆకాశంలో ఆయుధాలు మొహరించేందుకు ప్రధాన పూజారి అవకాశం ఇచ్చారని సీనియర్ సైనిక అధికారులు ప్రకటించడం పూర్తిగా తప్పు అన్నారు.
శ్రీ దర్బార్ సాహిబ్, గురు రాందాస్ జి లంగర్, శ్రీ అఖండ పాట్ సాహిబ్ వంటి అన్నిచోట్ల ధార్మిక సంప్రదాయాలు తూచా తప్పకుండా పాటిస్తూ ప్రార్థనలు జరిగాయని ఆయన తెలిపారు. మే 20వ తేదీ స్వర్ణ దేవాలయం ప్రధాన పూజారి గియాని రఘువీర్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నానని స్వర్ణ దేవాలయంపై ఎయిర్ డిఫెన్స్ గన్స్ మోహరింపుకు సంబంధించి తనతో ఎవరు సంప్రదించలేదని శ్రీ దర్బార్ సాహిబ్ వద్ద అటువంటిదేమీ జరగలేదని స్పష్టం చేస్తూ సైనిక అధికారుల ప్రకటన అవాస్తవమని తేల్చారు.
సిక్కుల ప్రార్ధనా స్థలాలలో ఎక్కడ ప్రార్థనా ప్రమాణాలను, విధివిధానాలను ఉల్లంఘించి లైట్లు ఆపలేదని చివరకు మే ఏడో తేదీ నుంచి పదో తేదీ మధ్యకాలంలో పంజాబ్‌లో బ్లాక్ అవుట్ పాటించినప్పటికీ స్వర్ణ దేవాలయంలో ప్రార్థన విధివిధానాలను అనుసరించి లైట్లు వెలుగుతూనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
సైన్యం వాళ్లను తిరస్కరించిన గురుద్వారా ప్రబంధక్ కమిటీ
సిక్కు గురుద్వారా ప్రభంధ కమిటీ అధ్యక్షులు, న్యాయవాది హర్జిందర్ సింగ్ ధామీ స్థానిక పాలనా యంత్రాంగం లైట్లు ఆపే విషయంలో తమను సంప్రదించినప్పటికీ గురుద్వారా నిబంధనలకు లోబడి వారికి సంపూర్ణ సహకారం అందించామని తెలిపారు. ఈ విషయంలో సైన్యంతో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని స్పష్టం చేశారు. జిల్లా పాలనా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు స్వర్ణ దేవాలయంలో ప్రహరీ గోడపై ఉన్న లైట్లు మాత్రమే ఆర్పేశామని, మందిరంలో ఉన్న లైట్లు వెలుగుతూనే ఉన్నాయని ప్రార్థనలు యధావిధిగా సాగాయని ధామీ తెలిపారు. నగరంలో బ్లాక్ అవుట్ అమల్లో ఉన్న సమయంలో కూడా వేలాది మంది భక్తులు స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి సేవ చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. సైన్యం చెప్పినట్లుగా డిఫెన్స్ గన్స్ మొహరింపు స్వర్ణ దేవాలయం సమీప ప్రాంతాలలో ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా సైన్యంలో ఉన్నతాధికారులే ఇటువంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడటం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
తాజా సైనిక ఘర్షణలో భారత సైన్యం పోషించిన పాత్రను హార్జిందర్ ధామీ ప్రశంసించారు. కానీ అదే సైన్యం సిక్కుల పవిత్ర ప్రార్థన స్థలాల విషయంలో అసత్యపు ప్రచారాలకు పాల్పడటం ఆక్షేపించదగిన విషయమని అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ అకల్ తక్త్ జాతేదార్ గియానీ కుల్దీప్ సింగ్ గర్గాజ్ సైన్యం చెబుతున్న పరిణామాలు చోటు చేసుకున్న దాఖలాలు కనిపించడం లేదని తెలియజేశారు.
ప్రబంధక్ కమిటీతో విభేదిస్తున్న బీజేపీ రాష్ట్ర శాఖ..
రాష్ట్రంలో పాలక పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ శిరోమణి అకాళీదళ్ పార్టీలు ఈ వివాదంపై నోరు మెదపనప్పటికీ బీజేపీ రాష్ట్ర శాఖ స్పందించింది. లూథియానా నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు ఎక్స్‌లో ప్రచురించిన ఒక పోస్టులో “స్వర్ణ దేవాలయం పైకి డ్రోనులు, క్షిపణులతో దాడి చేయడానికి పాకిస్తాన్ సాహసించబూనుకోవటం తీవ్ర పరిణామాలకు దారి తీసే చర్య. నిజంగా అటువంటి దాడి జరిగి ఉంటే ప్రార్థన స్థలాల పట్ల ఉన్న గౌరవం భక్తి భావాలతో భారతదేశం అంతా ఏకమై ఉండేది. పాకిస్తాన్‌ను తునాతునకలు చేసి ఉండేది. ఈ చర్యలను అడ్డుకున్నందుకు భారత సైన్యానికి కృతజ్ఞతలు” అని రాశారు.
అనువాదం కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.