
అగ్రరాజ్యాల
ఆలోచనల రేడియేషన్
జాబిల్లి ఉపరితలాన్ని
వైఫైలా చుట్టుముట్టింది
ఆనాటి ఆకలి భారతం
పేదరిక రణరంగంలో
నినాదాల జోరు వానను
కురిపిస్తూనే ఉంది
శతాబ్దాలుగా ఓటమి
ఒప్పుకోని భూమి కదా..!
విక్రమ్ గుండెల్లో
అంతరిక్ష కలల లబ్దపు వేగం
ఉపగ్రహంగా జీవం పోసుకుంది
ప్రయత్నాల పరంపర
విసుగు చెందక
విశ్వపు వినువీధుల్లో
స్పేస్ అన్వేషణలో
నూతన ద్వారాలకై
పయనం మొదలెట్టింది
సతీష్ ధావన్ దార్శనికతకు
మన ఐక్యత భావోద్వేగాల
వెలుగుల దారిని చూపిస్తూ
యావద్దేశం మద్దతిచ్చింది
ఆర్యభట్ట నామానికి
దేశ ముఖచిత్రం వందేమాతరమై
తొలి అడుగులు వేసింది
ఎన్నో అవమానాల
అగ్ని శిఖరాల
ఎన్నో అనుమానాల
ఆలోచనల భూకంపాల
అలజడి తరంగాలను
అధిగమిస్తూనే..
నా త్రివర్ణ పతాకం
మౌనంగానే విజయకేతనపు
తిలకాన్ని జగతి నుదుటినద్దింది
యాభై వసంతాల
సుదీర్ఘ అంతరిక్ష
నవ స్వప్నపు యాత్రలో
చంద్రయాన్
ఓ సైన్స్ విప్లవం
మంగళయాన్
ఓ విజన్ ఉద్యమం
గగన్ యాన్
రేపటి భవిష్యత్
దిక్సూచి భారతం
మేరా భారత్ మహాన్
నేటి మన సింహనాదపు
జనగణమన ఛాయా చిత్రం
ఫిజిక్స్ అరుణ్ కుమార్
9394749536
(మన దేశపు తొలి ఉపగ్రహ ప్రయోగం ఆర్యభట్ట గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.