
- బీదర్ అడ్డాగా దొంగనోట్ల ముద్రణ చేశారు: బండి సంజయ్
- తెలంగాణ మాజీ సీఎం, ఉద్యమనేతపై సంచలన ఆరోపణలు
- కేసీఆర్‌పై బండి ఆరోపణల వెనుక కారణం ఏంటి?
- తీవ్రమైన ఆరోపణలు ఎటు దారితీస్తాయి..!
- బీఆర్ఎస్ ఏ విధమైన పోరాటం చేస్తుంది?
ఎన్నికల్లో గెలవడానికి ప్రత్యర్థిపై ఎంతటి బురద చల్లడానికైనా రాజకీయ నేతలు సిద్దమైపోతుంటారు. ప్రజలు నమ్ముతారా లేదానే సోయి కూడా మరచి నేతలు చేసే విన్యాసాలు ఒక్కొక్క సారి బెడిసి కొడుతుంటాయి. అలా నోటి దురుసుకు పనిచెప్పే నేతలలో తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకరు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హోదాలో బండిసంజయ్ ఉన్నారు. అటువంటి ఉన్నత హోదాలో ఉండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపై తాజాగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు బీదర్‌లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని, అక్కడ ప్రింటింగ్ చేసిన నోట్లే ఎన్నికల్లో పంచారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ముఖ్యనేతకు చెందిన ఆ ప్రెస్ వివరాలు తనకు ఒక పోలీసు ఆఫీసర్ తెలిపారని, గతంలో తెలంగాణ పోలీసులు బీదర్‌లోని దొంగనోట్ల ప్రింటింగ్ ప్రెస్‌ను మూయించేందుకు ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వ పెద్దలు అడ్డుకొని అక్కడికి వెళ్లకుండా చేశారని ఆరోపించారు. దొంగనోట్ల ముద్రణ వల్లనే కేసీఆర్ కుటుంబం కోట్లకుకోట్లు సంపాదించిందని వ్యాఖ్యానించారు. ఇంతటి తీవ్రమైన ఆరోపణ కేసీఆర్‌పై చేయడమంటే సామాన్యం కాదు. మరి అలాంటిది కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేసేటప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తారా? అనే అనుమానాలు కలుగక మానవు.
బీదర్‌లో దొంగ నోట్లు ముద్రిస్తే కేంద్రం కళ్లుమూసుకుందా?
కేసీఆర్‌కు చెందిన వ్యక్తులు బీదర్ అడ్డాగా దొంగనోట్ల ముద్రణ చేశారని మీడియా ముందే చెప్పిన కేంద్ర మంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు చర్యలు తీసుకుంటారా లేదా? గతంగతః అన్నట్లు వదిలేస్తేరా అన్నది చెప్పలేదు. కేంద్రంలో బీజేపీనే 2014 నుంచి అధికారంలో ఉంది. దొంగనోట్లను, నోట్ల అక్రమ చెలామణిని పూర్తిగా చెరిపివేయడానికే ప్రధాని మోదీ కీలకమైన నోట్ల రద్దు విధానాన్ని ప్రకటించి పెద్దనోట్లను రద్దు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడీలో పెట్టేందుకు ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఎంత ఫలితాలను ఇచ్చిందనేది పక్కన పెడదాం. అయితే దొంగ నోట్లు, హవాలా లావాదేవీలను మాత్రం నిరోధించగలిగింది. అలాంటిది దొంగనోట్ల ముద్రణ అంటే దేశ ఆర్థిక వ్యవస్థకే పెనుముప్పు తీసుకు వస్తున్నట్లు కేంద్రం పరిగణిస్తుంది. అంతటి తీవ్రమైన ఆరోపణ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై చేయడమంటే అంత ఆషామాషీగా తీసుకొనే వ్యవహారం కాదు. బీదర్‌లో ఈ ప్రింటింగ్ ప్రెస్‌ను నిర్వహించారని చూసుకున్నా, ఆ సమయంలో కర్ణాటకలోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మరి ఈ దొంగనోట్ల విషయం బండిసంజయ్‌కు ఎప్పుడు తెలిసింది. ఇప్పుడు ఎందుకు ఈ ఆరోపణలు చేయాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కూడా కేసీఆర్, బీఆర్ఎస్పై బండిసంజయ్‌తో పాటు మిగిలిన బీజేపీ నేతలు, కేంద్ర పెద్దలు అవినీతి ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఆరోపణలు చేయడం ఆ తరువాత వాటి ఊసెత్తక పోవడం పరిపాటిగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి, ధరణితో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారనే ఆరోపణలు చేసినా, వేటిపైనా చర్యలు లేవు. ఇప్పటి వరకు కేసిఆర్‌పై ఆధారాలతో ఎలాంటి కేసులు పెట్టలేదు. ఈ విషయంలో ఏం లాజిక్ ఉందో ఎవరికీ అర్థం కాదు.
కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలేమిటి?
కేసీఆర్‌పై బండిసంజయ్ చేసిన ఆరోపణలు అసాధారణమైనవి, దేశ భద్రతకు సంబంధించినవి, ఇంతటి తీవ్రమైన దొంగ నోట్ల ముద్రణ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ స్పందిస్తారా? ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదనే అసలైన ప్రశ్న. దొంగ నోట్ల వ్యవహారం అంటే కేంద్ర హోంశాఖ పరిధిలోకి వచ్చేది. అలాంటిది హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ ఈ విషయంపై విచారణకు ఆదేశించవచ్చు. లేకుంటే ప్రధాని దృష్టికి ఆధారాలతో సహా తీసుకెళ్లి కేసీఆర్‌ను బోను ఎక్కించే వీలుంది. అలాంటిది కేవలం ఆరోపణలకే పరిమితం అయితే ఒక కేంద్రమంత్రిగా బాధ్యత మాటేమిటి? ఈ ఆరోపణలు కూడా ఇంతకుముందు చేసిన ఆరోపణలలాగే ముగిసిపోతుందా?
ఏ అవకాశం దొరికినా విపక్ష నాయకులను వదిలిన దాఖలాలు ప్రస్తుత కేంద్రప్రభుత్వ బీజేపీ హయాంలో లేవు. మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐలను తమకు అనుకూలంగా వాడుకుంటుందనే వాదనా ఉంది. ఆ విషయంలో విపక్ష పార్టీలు అధికార ముఖ్యమంత్రులు మినహాయింపు కాదు.
ఈడీ కేసులు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి కేజ్రివాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యలను వదల లేదు. హేమంత్ సోరెన్, మిగిలిన ప్రతిపక్ష నేతలెందరినో ఈడీ, సీబీఐలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం మినహాయింపుగా కనిపిస్తోంది. 2014 నుంచి బీజేపీ నేతలే కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అవన్నీ రాజకీయ ఆరోపణల లాగే మిగులుతున్నాయి. కేసిఆర్‌ను ఈడీ, సీబీఐలు కనీసం టచ్ కూడా చేయడంలేదు.
బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు?
బండి సంజయ్ ఆరోపణలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రిగా వుండి భాద్యత లేకుండా ఆరోపణలు చేయడం దారుణమని విమర్శించారు. అనవసరంగా ఆరోపణలు చేసిన బండిసంజయ్‌పై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆధారాలతో ఆరోపణలు నిరూపించాలని కేటీఆర్ సవాలు విసిరారు. లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండిసంజయ్ ప్రతిసారి ఆరోపణలు చేయడం మామూలే అయినా ఈసారి శృతిమించారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ గౌరవాన్ని తగ్గించేలా ఉన్నటువంటి ఆరోపణలపై న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ సిద్దమవుతోంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య పరస్పర విమర్శలు సహజమే అయినా, బండిసంజయ్ విషయంలో ఈసారి కేంద్ర పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉదంటున్నారు.
ఇతర రాష్ట్రాలలో కూడా నేతల మధ్య ఆరోపణలు, కేసులు సాధారణంగా మారాయి. ప్రతిపక్ష, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీలపై నిరాధార ఆరోపణలు చేసినందుకు పరువునష్టం కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆఖరికి ఒకదశలో పార్లమెంట్ సభ్యత్వానికి కూడా సమస్యలు కొనితెచ్చుకున్నారు. మరి ఇప్పుడు కేసిఆర్‌పై బండిసంజయ్ చేసిన తీవ్రమైన ఆరోపణలు ఎటు దారితీస్తాయో చూడాలి. బీఆర్ఎస్ ఏ విధమైన పోరాటం చేస్తుందో గాని, రాజకీయ నేతలు ఎదుటి వారిపై చేసే ఆరోపణల విషయంలో జాగ్రత్త పడాలి. లేకుంటే ఆధారాలతో నిరూపించాల్సి ఉంటుంది. ఇటీవలే కాంగ్రెస్‌ను కూడా పాకిస్తాన్‌తో పోల్చి బండిసంజయ్ ప్రతి విమర్శలను ఎదుర్కొన్నారు. దొంగ నోట్ల ముద్రణ అంటూ చేసిన ఈ సంచలన ఆరోపణల వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.