
15 మే నాడు బికాస్ భవన్ ముందు లాఠీ దెబ్బలు తిన్న వందలాది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాప్ పరిస్థితి వేదనా భరితం. ఉద్యోగాలు పోయాయి. మరో పరీక్ష రాసి పాస్ అయ్యే సహనం, నమ్మకం లేదు. ఇంటి హోం లోన్స్ తీర్చే పరిస్థితి లేదు. అత్యంత వేదనాభరితం.కాస్తంత రిలీఫ్ పొంది డిసెంబర్ 31 వరకు పనిచేస్తే జనవరి 1 న జీతాలు తీసుకునే మరో 15 వేల మంది కూడా ఇప్పుడున్న కోర్టు ఆదేశాల మేరకు తర్వాత ఉద్యోగాలు ఉండవు. కొత్త పరీక్షలో పాస్ అయిన వారికి మాత్రమే జాబ్స్. ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి వీరిది. పైగా, పోలీసుల సమన్లు ఎదుర్కొంటూ మరింత ఆందోళనకు గురవుతున్నారు. 2016 ప్యానల్ పరిస్థితి ఇది. గెలుపు దగ్గరలో లేదు.
Tainted గా చిత్రీకరించబడినవారికి ఈ అవకాశం కూడా లేదు.ఇప్పుడున్న తీర్పు ప్రకారం. పశ్చిమ బెంగాల్ టీచర్స్ నియామకాలు 2016 ప్యానల్ మీద ఎన్నో రోజులుగా, సంవత్సరాలుగా ఆరోపణలు వచ్చాయి. కలకత్తా హైకోర్టులో కేసు కూడా కొనసాగింది. మొత్తం ప్యానల్ అవకతవకలుగా ఉండడం వల్ల హై కోర్టు ప్యానల్ ను రద్దు చేసింది. దాంతో రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభావితం అయిన టీచర్స్ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా చుక్కెదురైంది.దాదాపు 17 రకాల అవకతవకలు జరిగాయని తెలిసింది.
ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పని చెయ్యకపోతే, వ్యవస్థ అవినీతిమయం అయితే, పౌరులు సంవత్సరాల తరబడి నిద్రపోతూ ఉంటే, తప్పు పని చేసి లంచాలు ఇచ్చి మరో
అర్హత ఉన్న భారతీయుడి ఉద్యోగాలు కొట్టెయ్యాలనే దురాశ కొంత మంది పౌరుల్లో ఉంటే సామాజిక పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఇది ఒక తార్కాణం. బెంగాల్ కే కాదు దేశం మొత్తానికి ఇది వర్తిస్తుంది. ఒక eye opener. ఏదేదో చేసేసి విశ్వ విద్యాలయాల్లో సీట్లు కొట్టేసి పెద్ద పెద్ద కోర్సులు చేసేసి దండలు వేయించుకున్న వారికీ, లేదా ఉద్యోగాలు సంపాదించి ఇళ్ళను ఇంద్ర భవనాలుగా మార్చుకొని విలాసాలు అనుభవిస్తున్న వారికి ఇదో చెంప దెబ్బ. అయితే,ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ లో నిజాయితీగా ఉన్న వారు కూడా వీరి కారణంగా బలైపోవడం బాధాకరమైన విషయం.
ఇప్పుడున్న ఈ పశ్చిమ బెంగాల్ 2016 టీచర్స్ 90 శాతం మంది తృణమూల్ కాంగ్రెస్ టీచర్స్ యూనియన్ సభ్యులే. ఆ యూనియన్ కి నమ్ముకున్న వారే. కానీ, నేడు వీరికి ఏ యూనియన్ నుండి కూడా న్యాయం దొరికే అవకాశం కానరావడం లేదు. స్కూలు సర్వీస్ కమిషన్ పరీక్ష పెట్టి, ఇంటర్వూ చేసి రికమండేషన్ చేస్తేనే బోర్డు నియామకాలు చేస్తుంది.కానీ, ఇక్కడ, వందలకొద్దీ అభ్యర్థులు అలాంటి రికమండేషన్ లెటర్ లేకుండా ఉద్యోగాలు చేస్తూ,ప్రజా ధనం ఎంజాయ్ చేస్తున్నారు. కొందరైతే, పరీక్షలో మూడు మార్కులు వచ్చినా, ఓ ఎమ్ ఆర్ లో వారికి మార్కులు పెంచేసి ఉద్యోగాలు ఇచ్చేశారు. మరికొందరు ఏకంగా పరీక్షలు రాయలేదు.కొందరు ప్యానల్ లో వెనుక ఉండి ముందున్న అభ్యర్థికి తోసేసి జాబ్ సంపాదించారు. ఆ ముందు ఒకటో నంబర్ లో ఉన్న వారు నేటికీ ఉద్యోగాలు దొరక్కుండా నానా కష్టాలు పడుతుంటే, వెనుక ఉన్న వారు హాయిగా డార్జిలింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. అవినీతి ఏ స్థాయిలో జరిగిందీ అంటే ఎవరు నిజాయితీగా ఉద్యోగాలు సంపాదించారో,ఎవరు అవినీతి మార్గాలతో ఉద్యోగాలు సంపాదించారో స్పష్టంగా విడగొట్టి ప్రభుత్వ సంస్థలు కోర్టు ముందు స్పష్టం చెయ్యలేకపోయాయి. కొన్ని వేల మంది నిజాయితీగా జాబ్ సంపాదించి ఉంటారు.అందులో సందేహాలు లేవు.కానీ, వ్యవస్థాగత అవినీతి చట్రంలో వీరు కూడా ఇరుక్కున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ ప్యానల్ ద్వారా నియామకం జరిగిన ఏ ఒక్కరూ కూడా విద్యాలయాల్లో పని చెయ్యడానికి వీలు లేదు. ఆరోపించబడిన వారూ, లేనివారూ అందరూ కూడా!
అయితే, విద్యాలయాల్లో విద్యార్థులకు ఆకస్మాత్తుగా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వం అందించిన ఇంతవరకూ ఆరోపణ లేని వర్గం పని చేస్తుంది. కానీ, జనవరి 1 తర్వాత, వీరు కూడా ఉండడానికి అనుమతి ఉండదు. వీరు మరలా మరలా పరీక్షలు రాయాల్సిందే. వయస్సులో రాయితీ తప్ప ఇంకేం రాయితీ కూడా వీరికి ఉండదు. ఇదీ ప్రస్తుత పరిస్థితి. కానీ, మేం ఏ పరీక్ష కూడా రాసేది లేదు. మా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని ఈ వర్గం వాదన. నేను బాగానే రాశాను.నేను నేరం చెయ్యలేదు.నా జాబ్ ఎందుకు పోయింది? అని అమాయకంగా టీచర్స్ అడుగుతున్నారు. కార్యకారణ సంబంధం గురించి వీరికి అవగాహన లేకపోవడం విచారకరం. నేను బాగున్నా వ్యవస్థ కూడా నా బాగు కోసం బాగుండాలి అనే చైతన్యం వీరికి ఏ యూనియన్ ఇవ్వలేదు. ఒక మందుల ఫ్యాక్టరీ లో నేను బాగా నిజాయితీగా పని చేస్తున్నాను. ఉద్యోగం కూడా అలాగే నిజాయితీగా సంపాదించాను. కానీ,ఆ మందుల ఫ్యాక్టరీలో నకిలీ మందుల తయారీ జరుగుతుంది. అది ప్రజల ఆరోగ్యానికి హానికరం. కోర్టు ఆ కంపెనీకి తాళం వేసింది. అరె నేను నిజాయితీగా ఉన్నాను. నా ఉద్యోగం ఎందుకు తీసేశారు? అని అమాయకంగా ప్రశ్న వేస్తే గెలవలేం. ఇదీ అలాంటిదే. శ్యాం నగర్ ఘాట్ లో పడవ ప్రమాదం జరిగింది. నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న రాష్ మనీ ఘాట్ మూసేశారు.అరె, మా దగ్గర ఏ పొరపాటు జరగలేదు.మా ఉద్యోగాలు ఎందుకు తీసేశారు? అంటే అది అమాయక ప్రశ్న అవుతుంది. దాదాపు ఎనిమిది సంవత్సరాలు మూసేశారు. ప్రయాణీకులకు మరో ఘాట్ కి ఎండల్లో వెళ్ళడం చాలా కష్టం అయింది. కానీ తప్పలేదు . ఈ నేరాలన్నీ ఒక్క రోజులో జరిగిపోలేదు. ఎవరికైనా ఉన్న ఉద్యోగాలు పోతే ఎంత బాధాకరమైన విషయమో మనకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగాలు కనీసం సురక్షితంగా ఉంటాయి అని అందరూ నమ్ముతారు.కానీ,ఇవి కూడా ఇలా ముగుస్తాయనే విషయం ఎవరికీ జీర్ణం కావడం లేదు. ఉద్యోగం అంటే ఉద్యోగం ఒక్కటే కాదు కదా. దీని చుట్టూ ఒక జీవితం ఉంటుంది.ఆశలు ఉంటాయి. ఒకవేళ,ఈ ఉద్యోగం చూసి వివాహం కూడా జరిగితే అవతలి కుటుంబాల జీవితాలు కూడా ఇమిడి ఉంటాయి. వివాహాల్లో లక్షలు అప్పులు చేసేసి లేదా రిటైర్మెంట్ నిధులు ఖర్చు పెట్టి తన కుమార్తె హాయిగా ఉంటుంది అని పెళ్ళి చేసిన ఒక తల్లి,ఒక తండ్రి ఈ రోజు తన అల్లుడికి ఒక్క రూపాయి కూడా జీతం రాదు అని తెలిస్తే తట్టుకోగలిగే శక్తి ఎంతమందికి ఉంటుంది? అలానే, అమ్మాయి ఒక టీచర్ అని ఆ జీతం మీద ఆశపడి వివాహం జరిగితే ఈ రోజు ఆమె నిరుద్యోగి అని తెలిస్తే, ఆమె స్థానం ఆ ఇంటిలో ఎలా ఉంటుంది? ఆత్మాభిమానం తో తన ఆర్థిక అవసరాలు తీర్చకునే మహిళ ఈ రోజు ప్రతి ఖర్చుకీ అత్తగారింటి మీద ఆధారపడే పరిస్థితి ఆమెకు మానసికంగా కుంగదీస్తుంది. వామపక్ష ప్రభుత్వం విఫలం అయిందని సింగూరు,నందిగ్రాంలను హైలైట్ చేస్తూ పరివర్తన్ అని ముందుకు వచ్చిన తృణమూల్ ప్రభుత్వం నుంచి బెంగాల్ ప్రజలు ఇలా ఆశించలేదు. ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆశ పడ్డారు.
2010 కి ముందు ABTA ఉండేది క్రియాశీల పాత్రలో. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడిన లెఫ్ట్ యూనియన్ ఇది. నెలలో ఒకటో తేదీన జీతం ఇవ్వడంలో వామపక్ష ప్రభుత్వం విఫలం అయింది. ABTA కూడా ప్రతి వార్షిక సమావేశంలో ఈ డిమాండ్ చెయ్యడం డిమాండ్ గానే మిగిలిపోయింది. మమతా ప్రభుత్వం ఇది సాకారం చేసింది.అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో చేరిన డిజిటల్ గవర్నెన్స్ కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. పేపర్ వర్క్ తగ్గి సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి వల్ల కూడా ఇలా జరిగి ఉంటుంది.కానీ, ఉద్యోగులకు జీతం ఒక్కటే కాదు కదా.
పోరాటం ఉపాధ్యాయులకు నేర్పింది ABTA. ప్రతి వారం లేదా రెండు వారాలకు ఒకసారి ప్రతి ఏబిటిఎ ఆఫీసులో సమావేశం ఉండేది.టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్యలు, విద్యాలయం స్థాయిలో,రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ విషయాలు చర్చించడం జరిగేది. విద్యాలయాల బ్రాంచిలు కూడా ఆఫీస్ వేళల తర్వాత సమావేశం నిర్వహించేవి. విద్యాలయాల సమస్యలు చర్చలోకి వచ్చేవి. అవి రిపోర్ట్ రాసి పంపించడం జరిగేది. దీనివల్ల అద్భుతాలు జరగలేదు. కానీ క్రమశిక్షణ నేర్పింది. సామాజిక చైతన్యం నేర్పింది. ఆ తర్వాత తృణమూల్ వచ్చి కథ మారిపోయింది. ఆరంభంలో CPIM పార్టీ ఆఫీసుల మీద దాడులు, పార్టీ కార్యకర్తలు భయంతో అటూ ఇటూగా పారిపోవడం చూశాం. ఒక బలమైన పార్టీ వెళ్లి మరో పార్టీ వచ్చేటప్పుడు ఇలాంటివి చూశాం చరిత్రలో. .కానీ ప్రజల ఆ మౌనం వారికే నష్టం చేస్తుంది.. ప్రశ్నలు వేసే,నిలదీసే ABTA ను మూలకి తోసేశారు. ఈ రోజు ఫలితాలు ఉద్యోగులు అనుభవిస్తున్నారు. నియామకాలు లెఫ్ట్ హయాంలో ప్రతి సంవత్సరం జరిగేవి. అవినీతి ఇంత మాస్ స్థాయిలో లేకుండేది. ప్రైమరీలో లోకల్ నాయకుల సహాయంతో ఉద్యోగాల అమ్మకాలు జరిగేవి అని మనం వినేవాళ్ళం. దీన్ని మనం ప్రోత్సహించం. కానీ, మాస్ లెవెల్లో వేలకు వేల ఉద్యోగాలు లక్షలకు అమ్మకాలు మనం వినలేదు. విద్యా శాఖ మంత్రి దగ్గర కోట్ల కొలది అవినీతి సొమ్ము లెఫ్ట్ ఫ్రంట్ పరిపాలనలో మనం చూడలేదు. చాలామంది నాయకులు చాలా సింపుల్ గా జీవించారు. అలా నేర్పారు. వీరు ఎక్కడికి వెళ్ళినా పదేసి ఇరవయ్యేసి పోలీసు వాహనాల హంగామా లేదు. చాలా సింపుల్ గా ఒక కారు. వెనక మరో పోలీసు జీపు..అంతే. మినిస్టర్ అని చెబితే తప్ప ఎవరికీ తెలియదు. అంత సింపుల్ జీవితాలు మనం చూశాం. ఆర్థిక మంత్రి ఒక సమావేశానికి వస్తే ఒక సాధారణమైన పోలీసు జీప్ ఉండేది . అంతే.
ఉద్యోగాలు పోయి రోడ్లమీద నిస్సహాయంగా కనిపించడం చూడలేదు. మరలా ఈ ఉద్యోగుల్లో మెజారిటీ భాగం పాలకవర్గం యూనియన్ సభ్యులే. కొత్త వారు ABTA లోకి రావడానికి ఇష్ట పడడం లేదు. అలావస్తే పాలకవర్గం ఏమైనా ఇబ్బంది పెడుతుందా అనే భయం వారిలో ఉండొచ్చు. Safe side చూసుకుంటున్నారు.
కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థ నాడు బలంగా ఉండేది. ఒక బస్ కండక్టర్ రూపాయి ఎక్కువ తీసుకుంటే ఎందుకు తీసుకున్నావు? అని నిలదీసే బెంగాల్ మనం చూశాం. ఒక ఆటో డ్రైవర్ రెండు రూపాయలు ఎక్కువ తీసుకుంటే చార్ట్ చూపించే వరకు విడిచి పెట్టని బెంగాల్ చూశాం. ఇక్కడ రూపాయి, రెండు రూపాయలు విషయం కాదు. అన్యాయానికి ఎదురు తిరిగే స్వభావం మనలో ఉంటే అవినీతి, నేరాలు నియంత్రణలో ఉంటాయి. సమాజమే ఒక వాచ్ డాగ్ గా, మెటల్ డిటెక్టర్ గా ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. నేడు అది కనిపించడం లేదు. ఎవరెలా పోతే నాకెందుకు?.. నేను సేఫ్ గా ఉంటే చాలు..అందరి దగ్గరా మంచి అయితే చాలు.. అనే స్వభావం ప్రపంచీకరణ నేర్పింది. నిలదీసే ప్రశ్నలు వేసే వారు లెఫ్ట్ పార్టీలో తప్ప పాలకవర్గం పార్టీలో లేరు.
మామూలు సమయాల్లో అత్యంత పవర్ ఫుల్ కవితలు రాసే కవులు కూడా నేడు ఎంతోమంది యుధ్ధం భయంకరమైన విషాదంలో, సంక్లిష్టమైన పరిస్థితిలో మౌనంగా ఉన్నారు. తమ సామాజిక బాధ్యతను, చారిత్రక బాధ్యతను నిర్వర్తించడంలో విఫలం అవుతున్నారు. రాయలేరని కాదు.కానీ, అదే సిధ్ధాంతం.
Safe side. నాకెందుకూ! అనే భావజాలం. సంక్లిష్టమైన సామాజిక పరిస్థితుల్లో రచయితలూ,కవులూ, ప్రజా గాయకులూ, సాహితీవేత్తలూ దిశానిర్దేశం చేశారు చరిత్రలో.. మరి నేడు నేహా సింగ్ రాథోడ్ లాంటి చిన్న అమ్మాయి దేశం కోసం మాట్లాడినట్లు నేడు ఎంతోమంది సాహితీకారులు మాట్లాడడం లేదు.రాయడం లేదు. ప్రఖ్యాత జర్నలిస్టు రవీష్ కుమార్ అన్నట్టు పౌరుల నరాల్లోకి భయం ఇంజెక్ట్ అయిపోయింది.పెట్టుబడిదారీ వ్యవస్థకు కూడా ఇలాంటి మౌనమే అవసరం. బెంగాల్ కూడా అదే దారిలో మౌనం తో పయనిస్తోంది.
నియామకాలు ప్రతి సంవత్సరం జరిగేవి. అవినీతి లేదనలేం. కానీ నియంత్రణ లో ఉండేది. ఏవో వందో వెయ్యో చిన్న చిన్న ఆఫీసర్లు భయం భయంగా తీసుకోవడం వినేవాళ్ళం. ఇంత బాహాటంగా లక్షలు కాదు. యూనియన్ నాయకులకు ఇన్ స్పెక్టర్ ఆఫీసులో చాలా హోల్డ్ ఉండేది. లంచాలు తెలిస్తే యూనియన్ ఆ ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ చేయించేసేది. నాయకులు కొందరు తమ పవర్ ను ఉపయోగించి క్లాసులు చేసేవారు కాదని వినేవాళ్ళం. చూశాం కూడా. సహ ఉద్యోగులతో జమిందారుల్లా ప్రవర్తించే వారని విన్నాం. ఎదిరించి నిల్చుంటే మానసికంగా ఇబ్బంది పెట్టడం చూశాం కూడా స్వయంగా. ఇది ఒక మైనస్ పాయింట్.
స్కూల్ కి ఇన్ స్పెక్టర్ లు వస్తే వారి ఆఫీస్ పనులు చేసి వెళ్ళేవారు. అంతేగానీ తెలుగు రాష్ట్రాల్లో విన్నట్టు జులుం చేసేవారు కాదు. ఒకవేళ ఎవరైనా అలా జమిందారులా విసిగిస్తే యూనియన్ నాయకులు డీ ఐ దగ్గర కూర్చొని నిరసన వ్యక్తం చేసేవారు. ఇలా ఒక పరిపాలనా వ్యవస్థ డిక్టేటర్ గా రూపాంతరం చెందకుండా నియంత్రణ ఉండేది. ఇందులో ఒకటి రెండు మైనస్ పాయింట్స్ ఉన్నా స్టాఫ్ సాధించిన ప్లస్ పాయింట్స్ ముందు అది negligible.
కానీ, తర్వాత వచ్చిన ప్రభుత్వం వామపక్ష యూనియన్ ను బలహీనం చెయ్యడం ఆరంభించింది. కొత్తవారు , ABTA లోకి రాలేదు. లేదా తక్కువ. 90 శాతం శిఖ్ఖా షెల్ లో చేరారు. ఇది పాలకవర్గం పార్టీ. ప్రభుత్వం భక్తులుగా మారారు. పోరాటం మరిచి పోయారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మౌనంగా ఉండిపోయారు.నా కాలు కింద భూమి కదలడం లేదు కదా . మరి నేనెందుకు చెడు అవ్వాలి అనే మధ్య తరగతి మౌన మనస్తత్వం నరాల్లోకి చేరి నిష్క్రియాత్మక పౌరునిగా మార్చేశాయి.
Strikes సమయాల్లో కూడా ప్రభుత్వం బ్రేక్ ఇన్ సర్వీస్ అని భయపెడుతూ జీవో ఇస్తే వీరు మంచి బాలుడులాగా ఆ రోజు కూడా ఉద్యోగాలు చేశారు. సమ్మె మా హక్కు. జీతం ఇవ్వకపోతే ఇవ్వకండి.అంతే గానీ ఉద్యోగాలు డిస్కంటిన్యూ చేసే హక్కు మీకు లేదు. పైగా, ఇది ఎమెర్జెన్సీ సెక్టార్ కాదు అని అడిగే బాధ్యత ఎవరూ నిర్వర్తించ లేదు. ABTA ఆ పని చేసింది..హై కోర్టు వరకు వెళ్ళింది. ఈ జీవో చెల్లదు అంది. పాలకవర్గం యూనియన్ మనం ప్రభుత్వానికి సహకారం చెయ్యాలి కదా అని చూసింది. మనం సమ్మెలు చేస్తే ఎలా అన్నట్లుగా చూశారు. ఫలితంగా, ఈ భజన వల్ల ఈ రోజు రావాల్సిన డిఏ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచీకరణ నేపథ్యంలో చేరిన ఈ కొత్త తరం ఉద్యోగులు పోరాటం మరిచిపోయారు. అందరూ కాదు . చాలామంది భక్తులుగా మారారు.ఇది అన్ని రంగాల్లో చూస్తున్నాం. మా నాయకుడు మా వాడు.ఆయన్ని ఏం అనకండి మేం ఒప్పుకోం అనే తప్పుడు చైతన్యం నేడు పౌరుల మెదళ్ళలో వేసేశారు. ఇది కేంద్రం లో కూడా పెరిగింది. అసహనం పెరిగింది. ప్రజారాజ్యంలో ప్రశ్న,నిరసన వ్యవస్థను బ్యాలెన్స్ చేస్తుంది. కానీ, ప్రశ్న వేస్తే అది సరయిన ప్రవర్తన కాదని తప్పుడు చైతన్యం అందుతోంది. ప్రశ్న వేస్తే దేశద్రోహి. ప్రశ్నలు వెయ్యకుండా భజన చేస్తూ ఉంటే దేశభక్తి. సమ్మెలు కూడా అలాగే వెనుకంజ వేశాయి. ఇలా పౌరులు ఎంత నిష్క్రియాత్మక మనసుతో ఉంటే అంత సదుపాయం ఏ ప్రభుత్వాలకైనా..
సింగూరు నుంచి టాటా మోటార్స్ వెళ్ళిన తరువాత అలాంటి వంద టాటా మోటార్స ని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వస్తుందని ప్రజలు భ్రమల్లో గడిపారు. వామపక్ష పార్టీలకు బలమైన సమాధానం చెప్పాలి అని చూశారు. కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో కనిపించే పారిశ్రామిక ప్రగతిలో పదిశాతం కూడా కనిపించలేదు. గోల్డెన్ ఏజ్ ను అందించిన జనపనార పరిశ్రమ కూడా నేడు నత్త నడక నడుస్తోంది.ఒకవైపు, ప్యానల్ రద్దు కారణంగా మరలా పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలనే సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రభుత్వం పాటించాలి. మరోవైపు, మేం పరీక్షలు రాసే ప్రసక్తే లేదని ఉద్యోగుల పోరాటం. గుక్క తిప్పుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం. ముందు నుయ్యి వెనుక గొయ్యి.
ప్రభుత్వాలు అవినీతి సామ్రాజ్యాలను కొనసాగించుకొనే పరిస్థితిలో, రవీష్ కుమార్ అన్నట్టు ప్రశ్నలు వెయ్యని పౌరులు పెరిగిపోయే పరిస్థితి ఇలాగే విషాదంలోకి తీసుకొని పోతుంది. కానీ, రవీంద్రుని నేలలో, శరత్ నేలలో, అమర్త్యసేన్ నేలలో ఎన్నో ఉద్యమాలకు మార్గం చూపించిన బెంగాల్ ప్రజలు తప్పకుండా చైతన్యం పొందుతారు.
కేశవ్
ఆర్థిక సామాజిక విశ్లేషకులు.
( కేశవ్ ఉపాధ్యాయులు. బెంగాల్ నుంచి వెలువడే జాగృతి సమీక్ష త్రైమాసిక పత్రిక సంపాదకులు. ఆర్థిక సామాజిక ప్రగతిశీల వ్యాసాలతో పగిలిన పాదాల నెత్తురులో, మార్కెట్లో అనే రెండు పుస్తకాలు రాశారు. ఆకలి అనే కథా సంపుటి వెలువరించారు. దిన పత్రికల్లో సమీక్షలు రాస్తుంటారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.