
ఆపరేషన్ కగార్ చివరి ఫలితం ఎలా ఉంటుందో మన ఊహకు అందని విషయం కాదు . ఈ యుద్ధంలో కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం అమాయకులైన ఆదివాసీలను కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా చంపుతున్నది అని మావోయిస్టుల ఆరోపణ. అయితే ఇందుకు జవాబుగా కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడమే గాక ఈ ఆర్థిక సంవత్సరంలో మావోయిస్టులను అంతమొందించడమే తమ సంకల్పం అని కేంద్ర హోం మంత్రి మరింత ధృడంగా ప్రకటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెండు వైపులా ప్రాణ నష్టం జరగకూడదంటూ చర్చల కోసం పీస్ డైలాగ్ కమిటీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి చర్చించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే నక్సలైట్లను నిషేధించింది . ఆ తర్వాత కొంత కాలానికి చర్చల పేరుతో మావోయిస్టులను పిలిచి బూటకపు ఎన్కౌంటర్ లలో ఉద్యమాన్ని దొంగ దెబ్బ తీసింది కూడా వై యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే. అయినప్పటికీ మారిన పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ విధానం మారుతుందేమో అనే ఆశ పీస్ డైలాగు పెద్దలకు ఎక్కడో ఒక చోట మిణుకు మిణుకు మంటూ ఉండి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి లేకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వ నిర్ణయమే తమకు శిరోధార్యం అని స్పష్టంగా తన విధానాన్ని ప్రకటించింది. తెలంగాణ పోలీస్ పెద్దలు స్పందిస్తూ కర్రె గుట్టల విషయంలో ఏం జరుగుతుందో తమకు కూడా తెలియడం లేదంటున్నారు.
నిజానికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియడం లేదు. అక్కడి పోలీసు, మిలట్రీ యంత్రాంగం ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాను ఆ దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. గత్యంతరం లేక విలేకరులు ఎవరి ఊహ శక్తిని బట్టి వారు వార్తలను అందిస్తున్నారు. గతంలో మానవ హక్కుల హననం జరుగుతుంది అని ఆరోపణలు వచ్చిన వెంటనే నిజనిర్ధారణ కమిటీలు అక్కడికి చేరుకునేవి. సమస్య తీవ్రతను బట్టి ఎడిటర్స్ గిల్డ్ సైతం జోక్యం చేసుకునేది. మరి ఇప్పుడు మావోయిస్టుల స్థావరాలే కేంద్రంగా చేసుకొని కొనసాగిస్తున్న ఈ హింసను కొందరు బుద్ధి జీవులు తప్ప సమాజం ఎందుకు తన సమస్యగా స్వీకరించడం లేదు ? మనదేశంలో వందకు పైగా కమ్యూనిస్టు పార్టీలు, అనేక ప్రజాసంఘాలు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాయి. దీనికి సమాధానం ఒక్కటే. వీరి వెనక ప్రజలు లేరు.
సమసమాజ నిర్మాణం, దోపిడీ నిర్మూలనే ధ్యేయంగా మన దేశంలో ఏర్పడిన మొదటి కమ్యూనిస్టు పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ. CPI. ఈ పార్టీ నుండి సీపీఐ (ఎం), సీపీఐ (ఎం) నుండి వివిధ నక్సలైట్ పార్టీలు, కాలక్రమంలో ఆ పార్టీల నుండి వివిధ గ్రూపులు ప్రజల కోసమని కొన్నిసార్లు, నాయకుల కోసం మరికొన్నిసార్లు చీలిపోయి బలహీనపడినవి. అలా చీలిపోయిన పార్టీలు కొన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య పోరాటాలను ఎన్నుకుంటే మరికొన్ని పార్టీలు సాయుధ పోరాటం మినహా మరోదారి లేవన్నవి. రెండు విభిన్న పంథాలో కొనసాగిన కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీలు బూర్జువా పెట్టుబడి పార్టీలు అర్థం చేసుకున్నంతగా మన దేశ నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైనాయి. ఇదే సమయంలో కమ్యూనిస్టు పార్టీకి (మావోయిస్టు, మార్క్సిస్టులు అని కూడా) పూర్తి సిద్ధాంత వైరుధ్యం ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్ని సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ చీలిపోలేదు. మన భారతదేశంలో ఇప్పటివరకు చీలిపోని ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. రోజురోజుకు బలపడి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఈ పార్టీని అన్ని కమ్యూనిస్టు పార్టీలు విమర్శిస్తున్నప్పటికీ దాని అప్రతిహత విజయాన్ని అడ్డుకోలేకపోతున్నవి. ‘ ప్రపంచ కార్మికులారా ఏకంకండి ‘ అని నినదించే కామ్రేడ్స్ మాత్రం ఉమ్మడి కార్యాచరణకు అడుగు ముందుకు వేయకపోవడమే నేటి విషాదం.
గత 40 సంవత్సరాలుగా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో మార్పులు సంభవించాయి. ప్రపంచీకరణ, రాజకీయ పునరేకీకరణ, మారిన పెట్టుబడి స్వరూపం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి మూలంగా పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రజల్లో కూడా ప్రజల జీవన ప్రమాణాల్లో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ప్రజల దైనందిన అవసరాలు అయిన తిండి, విద్య, వైద్య, ఉపాధి ఏదో స్థాయిలో ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. గతంలో సామాజికంగా వెలివేయబడిన కులాలు, జాతులు ఇప్పుడు పరిపాలనలో భాగమయ్యాయి. ప్రజల ప్రాధాన్యాలు కూడా మారిపోయాయి. వివిధ కమ్యూనిస్టు పార్టీలు ముఖ్యంగా మావోయిస్టుల ఉద్యమాలు లేకుండా ఈ మార్పును ఊహించలేం. నిరంతరం వివక్ష, దోపిడికి గురవుతున్న కులాలు, వర్గాలు వారి అస్తిత్వం కమ్యూనిజంలో ఎక్కడుందని ప్రశ్నించిన చైతన్యం కూడా ఈ ఉద్యమాల నుండి వచ్చిందే. ఈ స్థితిలో ప్రజలకు ప్రభుత్వాల మీద సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఈ అంశాన్ని ఉద్యమ పార్టీలు గ్రహించాలి.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరాలు పెరుగుతున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సరుకు రవాణా, మనుషుల రవాణా లేకుండా మన మనుగడ అసాధ్యం . వీటి కోసం ప్రాజెక్టులు, యంత్రాలు, రవాణా సౌకర్యాలు, సాధనాలు కావాలి. ఇందుకు కావలసిన ముడి ఖనిజం మైనింగ్ లేకుండా ఎలా వస్తుంది ? ప్రాజెక్టులు , మైనింగ్ కింద అడవులు, గుట్టలే కాకుండా ఊర్లు కూడా మునిగిపోతున్నవి. అయితే ఇక్కడ మన విధానాలు మారాలి. విడిపోయిన కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, ఎంఎల్ పార్టీలు అందరూ కలిసి ఒక బలమైన పార్టీగా అవతరిస్తే స్థానిక ప్రజలకు, ముఖ్యంగా ఆదివాసీలకు నష్టనివారణ చర్యలు తీసుకుంటూనే వారి జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వాలు మానవీయ కోణంలో విధాన నిర్ణయాలను అమలుపరిచేలా ఒత్తిడి తీసుకురావడం పెద్ద సమస్య కాదు. వర్తమానం చేస్తున్న ఒత్తిడిలో కమ్యూనిస్టు పార్టీలు కనీసం ఐక్య కార్యాచరణ అయినా తీసుకోవాలి. ప్రజలకు ఏది అవసరమో పార్టీలు గ్రహించాలి. ఆ దిశగా ప్రజా సమూహాలను చైతన్య పరచాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారి సిద్ధాంతాలను మార్చుకోవాలి. కొత్తగా ఏర్పడిన పార్టీ చట్టబద్ధంగా పనిచేస్తూ ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయడం పెద్ద సమస్య కాదు. అప్పుడు బూర్జువా పార్టీల నుండి హింస మొదలైతే దాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రజలే సాయుధులౌతారు.
– ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
9849082693
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.