
1974 శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్య కొలకలూరి ఇనాక్ అధ్యాపకులుగా పనిచేశారు. అందులోనే పరిశోధక విద్యార్థిగా రచయిత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధ్యయనం చేశారు. అంటే అర్థశతాబ్ధకాలంగా ఇనాక్ని, వారి వ్యక్తిత్వాన్ని, సాహిత్య సారస్వత మూర్తిత్వాన్ని చంద్రశేఖరరెడ్డి దగ్గరగా చూశారు. అంతేకాకుండా ‘సరైన సాహితీ మూల్యాంకనం చేసి’ ఎంతో పరిశోధించి, ప్రామాణికమైన 15 వ్యాసాల సమాహారంగా ‘ఆచార్య కొలకలూరి సాహిత్యంలోకి..’ పుస్తకాన్ని పాఠకుల ముందు ఉంచారు. రచయిత రాచపాళెం రచన విధానం చివరి పేజి వరకు పాఠకులని తీసుకెళ్తుంది.
కొలకలూరి ఇనాక్‌తో వ్యాస రచయిత ‘ముఖాముఖి’ చాలా విలువైనది. ఇనాక్ నుండి ఎన్నో విషయాలను రాచపాళెం అద్భుతంగా రాబట్టారు. ఆ సమాచారాన్ని రేపటితరం కవులకు, రచయితలకు గొప్ప సిలబస్‌గా అందించారు. మన ప్రాచీన కవులు అన్నట్లు ‘‘ముఖేముఖే సరస్వతి’’ కదా!! ఇంటర్వ్యూ బాగుంది. ఇనాక్‌పై రాచపాళెం చంద్రశేఖరరెడ్డి రాసిన 14 వ్యాసాల సంకలనమే ఈ పుస్తక రూపంగా చెప్పవచ్చు.
‘‘అగ్రగామి ఉపాధ్యాయుడు’’ కొలకలూరి అంటూ రాసిన తొలి వ్యాసంలో అధ్యాపకుడిగా(లెక్చరర్) ఇనాక్లోని గొప్ప లక్షణాలను చెప్పారు. అధ్యాపకత్వానికి అవసరమైన అంశాల గురించి బాగా వివరించారు. 1.ప్రజాస్వామిక ఆలోచన, ప్రవర్తన, 2.నిర్దిష్టమైన భావజాలం, 3.వర్తమాన సమాజ పరిణామాలతో సజీవ సంబంధం, 4.స్పష్టమైన విశ్లేషణా శక్తి. 5.సులభమైన భాషలో విషయాన్ని అభివ్యక్తం చేసే సామర్థ్యం లాంటివి ఆచార్య కొలకలూరి ఇనాక్లో ఉన్నాయని రచయిత రాచపాళెం చెప్పారు.
సాహిత్యానికి సమాజ శ్రేయస్సే ప్రయోజనం అంటారు, కవి ఇనాక్ ఈ దృక్పథాన్ని చక్కగా ఒడిసి పట్టుకున్నారు. పుస్తక రచయిత ఒకచోట ‘‘ఒకప్పుడు ఆయన మార్క్సీయ భావజాలం ఆధారంగా బోధించే వారు. తర్వాత అంబేద్కరైట్‌గా పరిణమించారు. ఇటీవలి కాలంలో ఆయన రచనల్లోనే గాక, పాఠ్య బోధనలో కూడా దళిత దృక్పథం బలపడింది. పిజి తెలుగు పాఠ్య ప్రణాళికలో భారీ మార్పులు తీసుకురావాలని తంటాలు పడుతున్న నాలాంటి వారికి అయన స్ఫూర్తి అధికంగా ఉంది.’’ అని అన్నారు. అంతేకాకుండా ‘అభ్యుదయం’ కవితలో కొలకలూరి సామాజిక స్వప్నం ప్రశంసనీయమని మెచ్చుకున్నారు. ఆ కవితా పంక్తులను ప్రస్తావించారు..
‘‘పైసాలేని వాడు- పైగా హరిజనుడు
ప్రధాన మంత్రి కాగలిగి- అయిదేళ్లు పదవిలో ఉండి
ఆపైన పదవి పదవి- పైసా లేకుండా
పాత మనిషిగా- బ్రతగ్గలిన్నాడు
భారతదేశం బాగుపడ్డట్టు’’.
బైబిలును వ్యవహారిక భాషలోకి అనువదించిన కొలకలూరి ఇనాక్ 90 పైగా రచనలు చేశారు. ధనికులు, పేదలు ఉన్న సమాజంలో కొలకలూరి పేదల పక్షం. పై కులాలు, క్రింది కులాలు ఉన్న సమాజంలో క్రింది కులాల పక్షం. మెజారిటీలు, మైనారిటీలుగా ఉన్న సమాజంలో ఆయన మైనారిటీ పక్షం. పురుషులు, స్త్రీలు ఉన్న సమాజంలో ఆయన స్త్రీల పక్షం. ప్రేమ, ద్వేషం ఉన్న సమాజంలో కొలకలూరి ప్రేమపక్షం. దీనిని పరిశీలిస్తే మనకు పెరియార్ గుర్తుకొస్తారు.
1964లో కాళీపట్నం రామారావు ‘యఙ్ఞం’ కథను రాయగా, 1969లో కొలకలూరి ‘ఊరబావి’ రాశారు. దళితులు ఆర్థిక దోపిడికి గురికావడాన్ని యఙ్ఞంలో రాస్తే, దళితులు సాంఘిక అణిచివేతకు, అవమానాలకు గురికావడాన్ని ఎత్తి చూపారు. ఇందులో సాంఘిక నిరంకుశత్వాన్ని ప్రశ్నించే కథగా ఊరబావి మనకు అర్థమవుతుంది.
కథా రచయితకు కొన్ని సైద్ధాంతిక ప్రాతిపదికలను ఇనాక్ ఏర్పాటుచేశారు. 1. రచయితలకు నిబద్ధత ఉండాలి. 2. నిబద్ధుడైతే చాలదు. నిమగ్నుడు కూడా కావాలి. సాహిత్యంలో నిబద్ధత, నిమగ్నత. నిబిడత అనివార్యమని అంటారు.
కొలకలూరి వారి దృక్పథం శాస్త్రీయమైనది. కొండజాతి ప్రజల మీద సానుభూతితో విరసం ధృక్పథంతో రాస్తే ‘‘నిబద్ధతా’’ సాహిత్యమని, ఊరికే రాయడమేగాక వాళ్ల బాధలలో భాగం పంచుకుంటూ, వాళ్ల విముక్తి కోసం పోరాటం చేస్తూ రాస్తే ‘‘నిమగ్నతా’’ సాహిత్యమని, వాళ్లే(బాధితుల) తమను తాము బాధల నుంచి విముక్తి చేసుకోవడానికి ఉద్యమించి, కలంపట్టి రాస్తే ‘‘నిబిడతా సాహిత్యం’’అని నిర్వచించారు. విప్లవ దృక్పథంతో రాసే రచయితలందరూ విప్లవ రచయితలైనా వాళ్లూ అందరూ నిబిడ రచయితలు కారు అంటారు.
దళిత సాహిత్యం మీద దళితుడే విమర్శిస్తే అది ‘‘నిబిడ విమర్శ’’. దళిత సమస్య నిర్మూలనంలో పాల్గొంటూ దళితేతరుడు దళిత సాహిత్యం మీద విమర్శ రాస్తే అది ‘‘నిమగ్న విమర్శ’’ అని అంటారు. అంతేకాకుండా, దళిత జీవితం పట్ల నిబద్ధత గల వారు దళిత సాహిత్యం మీద విమర్శ రాస్తే అది ‘‘నిబద్ధ’’ విమర్శ అని త్రిగుణ దృక్పథాన్ని తెలిపారు.
కొలకలూరి 2018 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ‘‘విమర్శిని’’ చాలా విలువైన గ్రంథం. ఈ గ్రంథంలో 1. తెలుగు వెలుగులు 2. తెలుగు నవల 3. తెలుగు కథానిక ఉన్నాయి. అలాగే భద్రిరాజు కృష్ణమూర్తి నాలుగు మాండలికాలున్నాయంటే కొలకలూరి వారు ఆరు మాండలికాలున్నాయన్నారు.
1909 వచ్చిన మాలవాండ్ర పాట రచయిత దళితుడే రాశారని భావించారు. దాని రచయిత మంగిపూడి వెంకటశర్మ రాశారు. భారతీయ అలంకారశాస్త్రాన్ని తిరగ రాయాలని ఇనాక్ అంటారు. బోయి భీమన్న మీద రాసిన వ్యాసంలో భారతదేశంలో జాతీయ భావన రాజకీయ అవసరాల కోసం ఏర్పడిందే తప్ప ప్రేమతో కాదని అన్నారు. కొలకలూరి దృష్టి ద్రావిడ దృష్టి. దళిత బహుజన దృష్టి. చారిత్రక వాస్తవిక దృష్టి. కందుకూరి నవల తొలి తెలుగు నవలగా ఆయన ఆమోదించలేదు. శ్రీరంగరాజ చరిత్ర తొలి నవల అంటారాయన. దాంట్లో లంబాడీ జీవిత చిత్రణ, కులాంత ప్రేమ, ప్రగతిశీల అంశాలున్నాయని గుర్తించారు. విశ్వనాథను హైందవ ప్రతినిధి రచయితగానే కొలకలూరి గుర్తించారు. ‘‘మాలపల్లి’’లో బ్రాహ్మణ వ్యవస్థను తిరస్కరించే జస్టిస్ పార్టీని తిరస్కరించే లక్షణముందన్నారు. త్రిపురనేని గోపీచంద్‌తోనే తెలుగు నవలల్లోకి అబ్రాహ్మణ జీవితాలు ప్రవేశించాయని చలం అన్నారు.
కొడవటిగంటి స్త్రీ విముక్తి కోరినా అది బ్రాహ్మణ స్త్రీ విముక్తే అన్నారు కొలకలూరి. కానీ వాళ్లు అబ్రాహ్మణ స్త్రీ స్వేచ్ఛను తిరస్కరించలేదన్నారు. ఇవన్నీ చర్చనీయాంశాలే కదా! 1910 గురజాడ దిద్దుబాటు తొలికాదు అని తిరస్కరించారు, అచ్చమాంబ ‘‘ధన త్రయోదశి’’ తొలి కథ అని నిర్ణయించారు. ఓ హెన్రీ ఆంగ్ల కథానువాదనకు ‘‘దిద్దుబాటు’’ అని దాని గుట్టు విప్పి ఇనాక్ చెప్పారు. విమర్శలకు ఒక ప్రాపంచిక దృక్పథం, ఒక నిబద్ధత, ఒక తాత్విక నేపథ్యం ఉండాలని ‘‘విమర్శిని’’లో తెలియజేస్తారు.
కృష్ణ దేవరాయల కొలువులోని ‘‘భట్టుమూర్తి’’(రామరాజభూషణుడు) అసలు పేరు శుభమూర్తి అని రామరాజభూషణడు అనేది బిరుదనామమని ఆయన శూద్రుడని కొలకలూరి ప్రతిపాదించారు. ‘‘వసుచరిత్ర’’ బ్రాహ్మణీయ సాహిత్య చట్రానికిలోబడి ఉన్నట్లు కనిపిస్తూనే స్వతంత్రంగా ఉంటూ శూద్ర లక్షణాలను పొదువుకుందని ఆయన సిద్ధాంతాన్ని తెలిపారు. ఒక రచయితను ఎలా చూడాలో, చదవాలో చెప్పారు.
1980లలో ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా విధానంలో ‘‘వసు చరిత్ర’’పై ఒక పాఠాన్ని కొలకలూరి రాశారు. 1996 నాటికి ఒక గ్రంథంగా వెలువరించారు.
శుభమూర్తి తన వసుచరిత్రలో శూద్రులు ఆకాశమంత పొత్తు పోసేంత ఎక్కువగా పంటలు పండించినట్లు వర్ణించాడని కొలకలూరి గుర్తించడం విశేషం. ఉత్పత్తి కులాల ప్రాధాన్యత విశిష్ట తెలపడం బాగుంది. వందల సంవత్సరాల క్రిందటి వసుచరిత్రలో ‘‘శూద్రులని వర్ణించినప్పుడు సగౌరవంగా చిత్రించాడు. ఎవరూ ఎక్కువగా ప్రస్తుతించని చర్మనిర్మిత వాక్యాలను తప్పెట వంటి వాటిని తాదాత్మ్యకంగా శుభమూర్తి నిలిపాడు’’ అని కొలకలూరి అంటారు.
నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన, నాచనసోమనాథుడు, శ్రీనాథుడు, పెద్దన కందుకూరిల వచనాలను విశ్లేషించడంతో పాటు తెలుగు వ్యాసం ఆంగ్ల భాషా ప్రభావంతో పుట్టిందని కొలకలూరి నిర్ధారించారు. ఆంగ్లంలో బేకన్ కాలం నుంచి ఫ్రెంచి రచయిత మాంటిన్ వరకు వివరించి, మాంటెన్ ప్రపంచసాహిత్యంలో తొలివ్యాసకర్త అని అంటారు.
సిపి బ్రౌన్ వ్రాసిన వ్యాసం ఆంగ్ల భాషలో ఆంధ్ర భాషా సారస్వతాలకు సంబంధించిన ప్రథమ వ్యాసం అంటారు. 1862- 76 మధ్య స్మామినీన ముద్దు నరసింహ నాముని ‘‘హిత సూచని(1862), ప్రమేయం- పరవస్తు వేంకటరంగాచార్యులు సంగ్రహము(1874), జియ్యర్ సూరి స్త్రీకళాకల్లోవిని(1876) అనే మూడింటిని కొలకలూరి సరిచేసి ప్రస్తావించారు.
కొలకలూరికి సంబంధించిన లోతైన పరిశోధన, పరిశీలన గురించి చెప్పే మూడు పత్ర సమర్పణలే ‘పత్ర త్రయి’ని చూపించవచ్చు. 1974- 83 మధ్య ఈ మూడు విశిష్ట పరిశోధన పత్రాలను రాశారు. వీటిలో రచయిత విమర్శ, పరిశోధనల మధ్యగల తేడాలను స్పష్టం చేశారు. ‘‘ఆలోచన పిండుకున్నది పరిశోధనం- అనుభూతి పంచుకున్నది విమర్శనం’’ అని బంగారు భారత స్వాప్నికుడు కొలకలూరి అంటారు.
వందలాది పుస్తకాలు రాసిన కొలకలూరి రచనలో ఆది ఆంధ్రుడు, అమరావతి, గాథ, షరా మామూలే, ముని వాహనడు(నాటకం) లాంటి రచనలన్నీ ఎంతో ప్రాముఖ్యత, ప్రామాణికతగలవిగా చెప్పుకోవచ్చు. ఆరు లక్షల ప్రతులు అమ్ముడైన గొప్ప నాటకం ‘‘ముని వాహనుడు’’ కీర్తికి ఎక్కింది.
ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రతీకైన ఎన్నికల వ్యవస్థ కులం, ధనం, మతం చుట్టూ తిరగడాన్ని నిరసిస్తారు. ‘‘కులాన్ని కూల్చందే, ధన్నాన్ని పంచందే, ఈ దేశం బాగుపడదు, ఈ జాతి ముందుకు పోదు’’ అంటారు ఓ కవితలో ‘‘కులం రాజు- వాడి ఉంపుడు గత్తెలు/ మతాలు- ఆచారాలు, దేవుడయినా, దేశమైనా కులం ముందు బలాదూరు’’ అంటారు. ఇది చెప్పాలంటే ప్రాపంచిక ధృక్పథం, మానవతా కావాలి. మతం మత్తు మందు అని మార్క్స్ అంటే, కులం మత్తు మందు అంటారు కొలకలూరి.
భాషా పరిశోధన అనగానే చిలుకూరి నారాయణ, భద్రిరాజు కృష్ణమూర్తి, జిఎస్ రెడ్డి, చేకూరి రామారావు, బూదరాజు రాధాకృష్ణల వరుసలో కొలకలూరి ఇనాక్ ఉంటారు. భాషా పరిశోధన సాహిత్య పరిశోధనను ఇనాక్ చేశారు. జానపదుల సాహిత్య విమర్శ వినూత్నమైంది. కొలకలూరి జానపద కథలను తెలుగు కథా సాహిత్యంలో ప్రత్యేశాఖగా గుర్తించాలని ప్రతిపాదించారు. జానపద కథలను ఎక్కువగా పరామర్శించారు.
గుర్రం జాషువా, కుసుమ ధర్మన్న, బీర్నాడి మోషే, బోయి భీమన్న, జ్ఞానాంద, కొలకలూరి ఇబ్బందులు తెల్సుకోవాలి. ముఖ్యమంత్రి సంజీవయ్య చెప్పినా యూనివర్సిటిలో ఇనాక్ ప్రవేశం దొరకలేదు. రాతి పగుళ్లలోంచి విత్తనం మొలకెత్తి మహావృక్షం అయినట్టుగా ఇనాక్ ఎంతో ఉన్నతస్థితికి ఎదిగారు. 1954 ఉత్తరం కథతో సాహిత్యసీమలోకి ఇనాక్ అరంగేట్రం చేశారు. ఆయన రాసిన ‘పులుల బోను- నేను’ ఆత్మకథాత్మ నవల పాఠకుల మనసులను కదిలిస్తుంది. మాదిగోడివి చదువెందుకు అన్న జోగారావుకు తన ఎదుగుదలతో ఇనాక్ సవాల్ విసిరారు. కొండను అద్దంలో చూపినట్టుగా 75 సంవత్సరాల సాహితీయాత్రికుని ‘గాథ’ను ఆచార్య కొలకలూరి సాహిత్యంలోకి పుస్తక రచయిత రాచపాళెం వందపేజిల్లో విశిష్టంగా విశ్లేషించారు.
తంగిరాల చక్రవర్తి (సమీక్షకులు)
ఫోన్ నెం: 93938 04472
పుస్తకం : ఆచార్య కొలకలూరి సాహిత్యంలోకి..
రచయిత: ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
పేజీలు : 104, వెల: రూ.100/-
ప్రతుల కోసం: జ్యోతి గ్రంథమాల, 4- 282 ఎన్ఎస్ నగర్, మీర్‌పేట,
హైదరాబాద్- 97, తెలంగాణ, ఫోన్ నెం: 94402 43433
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.