
వాళ్ల తుపాకులకు తలకాయలు లేవు
ఆ ఆయుధాలకు ఏ ఆలోచనా ఉండదు
మర తుపాకీ పట్టుకున్న వాడూ మరమనిషే
మీట ఎవరిపై నొక్కాలన్నదే మైండ్ ప్రోగ్రాం
మతంతో పాటే ఉన్మాదం రంగరించి
అందులోనే చారెడు విద్వేషమూ విదిల్చి
మరి కొంచెం క్రూరత్వం కూడా కలిపి
లేత మనసుల్లోనే ఎక్కిస్తున్న వికృతం
విశ్వాసం, విశ్వ మానవత్వం విరిగిపోయి
విష ఉద్రేకాలతో అమానుషత్వం పారుతుంది
ఆధ్యాత్మికత ముసుగులోని హననమే అది
సరిహద్దు రేఖలు దాటి వస్తున్న ఉగ్ర బీభత్సం
అమాయక యాత్రికులపై గుండ్ల వర్షం
చెల్లా చెదురై పడిపోయిన దేహాలు
పచ్చని బైసరన్ మైదానంలో రక్తపు చిత్తడి
హాహాకార రోదనలతో లోయంతా కన్నీళ్లు
పహెల్గాం పూల వనంలో అమానుష కాల్పులు
క్రూరమైన దౌర్బల్యానికి విశ్వమంతా దుఃఖం
సింధూ నదిలో నెత్తురు గడ్డ కట్టి నిలిచింది
పెద్ద పెద్ద రాజ్యాలకు యుద్ధమే దాహం
భూగోళమంతా వాళ్లకు వ్యాపార గణకం
ప్రేరేపిత మతోన్మాద అసహన ప్రేలాపనలు
ఇద్దరి మధ్యా రగిల్చి ఎగదోయడమే సూత్రం
ఉన్మాదం తలకెక్కి ఆయుధం పట్టిన వాడు
ప్రతి యుద్ధంలోనే అంతర్దానమవుతాడు
సౌందర్య కాశ్మీర లోయల్లో శాంతి కావాలి
తుపాకుల నుంచి తులిప్ పూలు పూయాలి
బ్యారెల్ మీద శాంతి పావురాలు ఆడుకోవాలి
అన్నవరం దేవేందర్
9440763479
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.