
‘పెద్దయ్యాక ఏమవుతావని ఇప్పుడు ఏ విద్యార్ధిని ఎవరడిగినా డాక్టరనో, సాఫ్ట్వేర్ ఇంజనీరనో’ సమాధానమివ్వడం చూస్తుంటాం. పెద్దాయ్యక ఏమవుతావని ఉపాధ్యాయుడు అడిగితే తటపటాయించకుండా ‘నేనేమవుతానో తెలీదు కానీ, ఏది చేసినా నా దేశానికి, నా ప్రజలకు మంచి జరిగేదే చేస్తాను’ అని చెప్పాడా విద్యార్ధి. 23 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణాలిచ్చిన ఆ విద్యార్ధే షహీద్ భగత్ సింగ్. ఉరితీయడానికి ముందు కూడా ఏ మాత్రం చలించకుండా ‘ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలి’ అని నినాదాలిచ్చిన దేశ ఉత్తమోత్తమ పుత్రుడాయన. ఉరి వేసినప్పుడు తలపై నల్ల ముసుగు వేసుకోవడానికి నిరాకరించిన ధీశాలి, నిర్భయుడు భగత్ సింగ్.
ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు 1907, సెప్టెంబరు 27న భగత్‌సింగ్ జన్మించాడు. 13 ఏళ్ల ప్రాయంలో తన మనసులో దేశభక్తి బీజం పడింది. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం భగత్‌పై ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా తొలిసారి ఆ పోరాటంలో పాల్గొన్నాడు. బ్రిటిష్ ప్రభుత్వ పుస్తకాలు, దుస్తులను తగలబెట్టాడు. 1919లో జలియన్ వాలాబాగ్ దురంతంతో భగత్‌సింగ్‌లో స్వాతంత్య్ర కాంక్ష రగిలించింది. గాంధీ అహింసా మార్గంతో బ్రిటిషోడు దేశం విడిచిపోయేలా లేడని అనుకున్నాడు. ఈ నేలపై బ్రిటిష్ ఆధిపత్యం పోవాలంటే పోరాట మార్గం ఇదికాదని బలంగా నమ్మాడు. దేశం విముక్తయ్యే కొత్త మార్గం అనుసరించాడు. భారతదేశ విముక్తికి సాయుధపోరాటమే మార్గమన్న అభిప్రాయం బలపడింది. హిందూస్తాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యునిగా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాడు. సంతలు, తిరునాళ్లు ఎక్కడ నలుగురు మనుషులంటే అక్కడకు తన సహచరులతో వెళ్లి కరపత్రాలు పంచాడు. నీడలా పోలీసులు వెంటాడుతున్నా తప్పించుకొని తిరిగాడు. దేశం కోసం ప్రాణమిచ్చే సాహసవంతులను తయారుచేశాడు. విప్లవతత్వం నూరిపోశాడు. దేశ భక్తిని వంటపట్టించాడు.
పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలను కాదన్నాడు. నా జీవితం దేశానికి అంకితం చేస్తున్నట్టుగా తండ్రికి లేఖ రాశాడు. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని నినదించాడు. దోపిడీ, వివక్ష, మతమౌఢ్యం, పేదరికంలేని సమసమాజం కావాలని కోరుకున్నాడు. తుద్వి శ్వాస విడిచేవరకు దానికే కట్టుబడి ఉన్నాడు.
తనను ఉరి తీయడానికి ముందు ‘‘బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు బతికున్న భగత్ సింగ్ కంటే చనిపోయిన భగత్‌సింగ్ మరింత ప్రమాదకారి’’అని భగత్ సింగ్ అన్నాడు. భగత్‌సింగ్ చనిపోయినా ఆయన ఆశయాలు, ఆయన కలలుకన్న సమాజం కోసం పరితపించి పనిచేస్తున్నవారు దేశమంతా విస్తరించివున్నారు. మనిషి కంటే ఆశయానికి ఉన్న బలం అది. తెల్లదొరలు పోయి నల్లదొరలొచ్చినా పేదరికం పోలేదు. దోపిడీ అంతంకాలేదు, అసమానతలు రూపుమాపలేదు. దోపిడీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకవర్గాలు కులం, మతాన్ని ఒక ఆయుధంగా, సాధనంగా వాడుకుంటున్నాయి. తమ వర్గ ప్రయోజనాల కోసం రాజ్యం హింసను ప్రేరేపిస్తోంది. ప్రజలను చీల్చుతోంది. ద్వేషం పెంచుతోంది. దేశ భక్తి భావాలు పెరగాల్సిన చోట, పెంపొందించాల్సిన చోట యువతను దారితప్పించే దురలవాట్ల వైపు మరల్చేకుట్రలకు పాల్పడుతోంది.
వర్తమాన సమాజానికి చారిత్రక వాస్తవాలు తెలియకుండా వక్రీకరణకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చరిత్రను తనకు నచ్చిన పద్ధతిలో మార్చుతోంది. రాసేవాళ్లను తయారుచేసి, ప్రధాన సీట్లలో కూర్చొబెడుతోంది. ఉచిత విద్య, వైద్యం, ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు ఆ బాధ్యతను విస్మరించి తమను తాము కాపాడుకొనేందుకు సమాజాన్ని రకారకాలుగా చీల్చి పబ్బం గడుపుకుంటున్నాయి. తమ తప్పులు తెలియకుండా, తెలిసినా ప్రశ్నించకుండా తిరోగమన పద్దతులను అమలుచేస్తోంది. నిన్నటి తరం కంటే నేటితరం అభివృద్ధికరమైనదనే నిజాన్ని విస్మరించరాదు. మానవత్వం, ధైర్యం, త్యాగం, అంకితభావం, ప్రేమతో మెలిగేలా యువత భగత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి.
అధికారంలో ఉన్న బిజెపి ప్రభ్వుత్వం భగత్ సింగ్ ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తుంది. యువత ఆలోచనలను మరింత మొద్దుబార్చేందుకు చూస్తున్నాయి. దానిలో భాగంగానే పుస్తకాల్లోని పాఠ్యాంశాలను మార్చి మతమౌఢ్యాన్ని పెంచిపోషించే రచనలను చేరుస్తున్నారు.
దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో నిర్వహిస్తున్న స్టడీ సెంటర్లకు నిధులు కోత విధిస్తున్నారు. యువత వారి మేధస్సును మెరుగుపర్చుకోవటం ప్రమాదకరం. అలా జరిగితే వారు పాలక వర్గాలను ప్రశ్నిస్తారు. ఇది దోపిడీ వర్గాల పీఠాలకు ప్రమాదకరం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం 2019లో చేసిన పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని ప్రజలను మతాలవారీగా విడగొడుతుంది. కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా దేశ పౌరులందరూ చట్టం ముందు సమానమేనని చెబుతున్న భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ చట్టం దేశంలోని ముస్లిం ప్రజానీకం పట్ల తీవ్రమైన వివక్షను ప్రదర్శిస్తుంది. దీనితోబాటు అస్సాంలో జారీ చేసిన జాతీయ పౌరసత్వ రిజిస్టరు(ఎన్ఆర్సి)ని దేశమంతటికీ విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలు భారతదేశ లౌకిక స్వభావాన్ని నాశనం చేసి, దాన్ని నిరంకుశ హిందూమత రాజ్యంగా మార్చడానికి ఆర్ఎస్ఎస్ ఎప్పటినుండో చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇది. దీని వల్ల దేశంలోని ముస్లిం ప్రజలకే కాకుండా హిందువులు, ఇతర ప్రజానీకానికి కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే దేశంలోని 140 కోట్ల జనాభా అంతా తాము భారత పౌరులమేనని నిరూపించుకోవాలి. సరైన పత్రాలు లేనివారంతా విదేశీయులుగా ముద్రపడి శరణార్ధి శిబిరాల్లో బ్రతకాల్సి ఉంటుంది.
కానీ, భగత్ సింగ్ ఆశించినట్లు మన దేశం తయారుకావాలి. దీనికి భిన్నంగా అవినీతి అక్రమాలు, స్వార్థం పెచ్చుమీరిపోయాయి. భారత రాజ్యాంగాన్ని అస్థిరపరుస్తున్నారు. యుతకు ఉపాధి భరోసా కల్పించడంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలో ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేయడంలేదు. దేశ రక్షణలో కీలకమైన రక్షణ రంగంలో కూడా అగ్నిపథ్ పేరుతో నాలుగేళ్ళకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అనంతరం ఆ యువత ఎటువైపు పయనిస్తారో చెప్పనవసరంలేదు. ఈ దేశంలో ప్రజలందరూ సంపూర్ణ స్వాతంత్య్రంతో జీవించాలని దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన ఆ అమరుల చితాభస్మం ఆనవాళ్ళు కూడా మిగలకుండా చేసిన ఆ దుస్సంఘటనను ఎంత మంది గుర్తుచేసుకుంటున్నారు? వారి స్ఫూర్తి నేటి తరంలోని ఎంతమందిలో ఉంది? ఈ దేశ ఘనమైన సంస్కృతికి వారసులైన యువత ఆలోచించాలి. నవభారత నిర్మాణం కోసం మాట్లాడాలి. నినదించాలి. తిరోగమన శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి. ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దే పనికి కంకణం కట్టుకోవాలి. 1931 మార్చి 23న దేశం కోసం ప్రాణాలిచ్చిన భగత్ సింగ్ 94వ వర్ధంతి స్ఫూర్తితో నిత్య చైతన్య విప్లవ జ్యోతిని గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా విప్లవ జోహార్లు అర్పించాలి. అప్పుడే భగత్ సింగ్ కలలు కన్న సమసమాజం సాకారమవుతుంది.
అల్లు రాజు
(ఈరోజు భగత్ సింగ్ 94వ వర్ధంతి)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.