
”ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారు, వరుసగా ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. మళ్లీ పాత పద్దతిలో పేపర్ బ్యాలెట్ తేవాల్సిందే, లేకుంటే వివిప్యాట్లు లెక్కించాల్సిందే” అని గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌తో సహా మరికొన్ని పార్టీలు ఆరోపిస్తూ డిమాండ్ చేస్తున్నాయి. ఆ మాట కొస్తే ఎన్నికల్లో ఓడిన ప్రతిసారి కొన్ని పార్టీలు చేస్తున్న విమర్శలు ఇవే. ఈ ఆరోపణలకు చెక్ పెట్టేది ఎలా? కేంద్ర ఎన్నికల సంఘం తన నిబద్దతను, ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను నిరూపించాల్సిన అవసరం లేదా..! ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట ఇది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల ద్వారానే ఓటింగ్ జరుగుతున్నా, అందరి అనుమానాలనూ నివృత్తి చేయడానికి వివిప్యాట్ సిస్టంను సమాంతరంగా కొనసాగిస్తోంది. మరి ఆ వివిప్యాట్లను లెక్కిస్తే సరిపోతుందిగదా..! ఇంకాఎవరికీ అనుమానం వుండదుకదా, అయినా సీఈసీ అందుకు ఒప్పుకోవడం లేదు. అసలు ఈవీఎంలు హ్యాకింగ్‌కు గురికావడం లేదని, అది అసాధ్యమని సీఈసీ వాదిస్తోంది.
ఎన్నికలలో భారతదేశానికి అసాధారణ రికార్డు ఉంది. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, యూఎస్ఏ వంటి ప్రజాస్వామ్య దేశాలు ఒకేసారి సార్వత్రిక ఓటు హక్కును ప్రవేశపెట్టలేకపోయినా, భారతదేశం ఎటువంటి సంకోచం లేకుండా దానిని అమలు చేసింది. భారతదేశ రాజ్యాంగ నిర్మాతలు ప్రతి పౌరుడి ఓటు హక్కుపై, ప్రజల శక్తిసామర్థ్యాలపై ఎంతో నమ్మకంతో ముందుకు సాగారు. భారతదేశంతో పాటు స్వాతంత్ర్యం పొందిన పలు దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థలు కుప్పకూలాయి. భారతదేశంలో మాత్రం ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది.
ఓటు విలువ ఆధారంగానే పార్టీలు అధికారం చేపడుతున్నాయి. అధికార పార్టీలు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నాయా లేదా అన్నది మరో చర్చ. అయినా దేశంలో ఎన్నికల ప్రక్రియ మాత్రం సంస్కరణలను స్వాగతిస్తూ ముందుకు సాగుతోంది. దాని పర్యవసానమే ఈవీఎంలు. 1982లో తొలిసారి కేరళలో జరిగిన ఒక ఉప ఎన్నికతో ప్రారంభమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ప్రక్రియ ఆ తరువాత పూర్తిస్థాయిలో వినియోగానికి వచ్చింది. అయితే పలు దేశాలలో ఈవీఎంలతో పాటు పేపర్ బ్యాలెట్లను వినియోగిస్తున్నారు. నెదర్లాండ్స్, కజకిస్తాన్, ఐర్లాండ్ దేశాలు EVMలను ఉపయోగించడం మానివేశాయి.
మన దేశంలో ప్రజాస్వామ్యానికి మచ్చ రాకుండా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం ముందుంది. అయినా ఇటీవల వస్తున్న ఆరోపణలకు జవాబీయాల్సిన అవసరం ఉంది.
ప్రముఖ ఎన్నికల సంస్కరణల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అనేక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని ఆరోపించింది. ఎన్నికల లెక్కింపు వేళ 543, 538 నియోజకవర్గాలలో పోలైన ఓట్ల కంటే తక్కువ లేదా ఎక్కువ ఓట్లు లెక్కించబడ్డాయని తన నివేదికలో స్పష్టంచేసింది. ఇదే నిజమైతే, మన ప్రజాస్వామ్యానికి మచ్చ పడ్డట్లే.
ఏడీఆర్ రిపోర్ట్ ఆధారంగా ఈవీఎంలపై ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్ష నేత రాహుల్ ఎన్నికల్లో అవకతవకలను పార్లమెంట్ వేదికగా చర్చను లేవనెత్తారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై కూడా అనుమానాలు లేవనెత్తారు. రాహుల్ ఆరోపణలను అధికార ఎన్డీయే ప్రభుత్వం ఖండించింది. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.
తుది ఓటర్ల ఓటింగ్ శాతం డేటాను విడుదల చేయడంలో ఎందుకు విపరీతమైన జాప్యం జరుగుతోందని, తుది ఓటర్ల ఓటింగ్ శాతం డేటాను ప్రకటించే ముందే తుది ఫలితాలను ఎలా ప్రకటిస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ఏడీఆర్ ప్రశ్నించింది. ఎన్నికల ఫలితాల తరువాత రెండున్నర నెలలకు కూడా ఫలితాల షీట్లు, ఫారం-20 ఆన్లైన్లో ఎందుకు పెట్టడం లేదంటోంది. ఏడీఆర్ వ్యవస్థాపకుడు జగదీప్ చోకర్ ఈ అంశంలో మాట్లాడుతూ 2019 , 2024 లోక్ సభ ఎన్నికలలో కనిపించిన ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంలో, ఆరోపణలపై వివరణ ఇవ్వడంలో ఈసీఐ విఫలమవడం వల్లే ప్రజలలోనూ అనుమానాలు వస్తున్నాయన్నారు.
అయితే ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు సరికాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈవీఎంలు అత్యంత భద్రతతో కూడినవని, ఈవీఎంలపై సందేహాలు అక్కర్లేదని పేర్కొంది. ర్యాండమ్‌గా వీవీ ప్యాట్లలోని స్లిప్పులను లెక్కిస్తున్నామని, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపులో ఇప్పటివరకు ఎక్కడా తేడా రాలేదని ఈసీ వాదిస్తోంది. అయితే, పోలింగ్ శాతం పెరుగుదలపైనా తప్పుడు ప్రచారం జరుగుతోందని, పోలింగ్ సమయం ముగిసే సమయానికి ఎంత పోలింగ్ శాతం నమోదైందో ఒకసారి ప్రకటిస్తున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ తాజాగా వివరణ ఇచ్చారు. పోలింగ్ సమయం ముగిశాక, అప్పటికే క్యూలైన్లలో ఉన్నవారు ఓటేస్తున్నారని, కొన్ని చోట్ల రాత్రి 8 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతోందని వెల్లడించారు. అందువల్ల పోలింగ్ శాతంపై చివరి లెక్కలు ఆలస్యంగా వస్తున్నాయని వివరించారు.
ఈసీఐ ఇలాంటి గందరగోళాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. అయితే, దాని నిర్ణయాలు , చర్యలు ప్రజలలో దాని గౌరవాన్ని పెంచుతూనే ఉంది. టిఎన్ శేషన్ లాంటి వ్యక్తులు ఎన్నికల సంఘం ప్రాధాన్యతను ఎంతో పెంచారు. శేషన్ కాలంలో, ఆయన ఫోటోలతో కూడిన ఓటరు ఐడి కార్డులను ప్రవేశపెట్టి, మోడల్ ప్రవర్తనా నియమావళిని అమలు చేశారు. ప్రస్తుతం దొంగ ఓట్లకు అవకాశం లేకుండా ఆధార్ నెంబర్‌తో ఓటర్ కార్డును అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఈవీఎంలు హ్యాకింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు పోవడం లేదు.
ఈవీఎం విషయానికొస్తే ఈసీఐ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో జరిగిన అనేక ఎన్నికలలో 22 సంవత్సరాలు జాగ్రత్తగా అధ్యయనం చేసి, వాటిని పూర్తిగా ఉపయోగించింది. బ్యాలెట్ పేపర్ల స్థానంలో ఈవీఎంలను ప్రవేశపెట్టడం వెనుక ఏకైక ఉద్దేశ్యం బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, ఎన్నికల ప్రక్రియను, ఫలితాన్ని దెబ్బతీసే ఇతర చర్యలను అడ్డుకోవడమే. ఈవీఎంలు వచ్చాక గంటల వ్యవధిలో ఫలితాలు కూడా అందించగలుగుతున్నారు.
అయితే, ఈవీఎంలను ప్రవేశపెట్టిన ఇన్ని సంవత్సరాల తర్వాత, మారిన సాంకేతిక పరిజ్ఞానంతో హ్యాకింగ్ ఆరోపణలు పెరుగుతున్నాయి. 2013లో మరింత పారదర్శకత పెంచేందుకు వివిప్యాట్ సిస్టం తెచ్చినా, ఇప్పుడు వాటిని లెక్కించాలన్న డిమాండ్ పెరుగుతోంది.
ప్రస్తుతం, ఈసీఐ చేయాల్సిందల్లా ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి తన పనిని కొనసాగించడమే. విమర్శలు, ఆరోపణలకు ప్రతిస్పందించకుండా, ఈసీఐ వచ్చి వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించడం ప్రారంభించవచ్చు. నిజానికి, ఓట్లను లెక్కించే ప్రస్తుత పద్ధతి, ఖచ్చితంగా చెప్పాలంటే ఈవీఎంలలో నమోదైన ఓట్లను మాత్రమే లెక్కించడం, కానీ భౌతిక లెక్కింపు కాదు.
వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించడం ద్వారా వాటిని ఈవీఎం గణాంకాలతో సరిచూడడం ద్వారా ఈసీఐ, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయలేమని నిరూపించవచ్చు. దీన్ని చేయడానికి ఈసీఐకి పట్టేది వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపుకు మరో రోజు సమయంతో పాటు మరికొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు. ఈ కొద్దిపాటి నిధులు సమయాన్ని ఖర్చు చేయడం ద్వారా ఆరోపణలకు చెక్ పెట్టి పారదర్శకతను పెంచే వీలుంది.
2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బిజేపీ పార్టీ ఘనవిజయం సాధించడానికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమంటూ ఓ వార్త వెల్లువెత్తింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు లండన్‌లో జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి విడుదలైన ఈ వార్త భారతదేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అంతేకాకుండా రాజకీయ రంగాన్ని ఒక్క కుదుపు కుదిపింది. తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్స్ ద్వారా హ్యాక్ చేశారని ఆయన ఆరోపించారు. సైబర్ నిపుణుడుగా చెప్పుకున్న సయ్యద్ సుజా ఈవీఎంలను హ్యకింగ్ చేసి చూపిస్తానని చెప్పినా, నిరూపించ లేకపోవటం, ఈసీ సవాల్ స్వీకరించక పోవడంతో అప్పట్లో ఆ వివాదం సద్దుమణింది. బ్లూటూత్ ఆప్షన్ కూడా లేకుండా పనిచేసే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఎన్నికల సంఘం అంటోంది. అందుకే వీవీప్యాట్ల లెక్కింపుకు ససేమిరా అంటోంది.
బాలకృష్ణ ఎం సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.