
హైదరాబాద్‌లోని సత్వా నాలెడ్జ్ సిటీలో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి చాలా మంది వచ్చారు. పుస్తకాలు, సాహిత్యం, కళల మీద ఉన్న ఇష్టంతో మూడు రోజుల పాటు (జనవరి 24, 25, 26) నేను కూడా ఈ ఫెస్టివల్‌కు వెళ్ళాను. ఫెస్టివల్ ప్రాంగణంలో ఒకేసారి మూడు, నాలుగు కార్యక్రమాలు ఉండడం వల్ల ఏ కార్యక్రమానికి వెళ్ళాలో కొన్నిసార్లు తేల్చుకోలేకపోయాను. ఏదిఏమైనా కొన్ని కార్యక్రమాలకు అయితే హాజరైయ్యాను. ఫెస్టివల్లో చూసిన వాటిని, విన్నవాటిని మొత్తం నా అనుభవ సారాన్ని మూడో రోజు రాయాలనిపించింది. ఆ రాసిన దానిని మీతో పంచుకుంటున్నాను.
సాధికారతకు ఉపయోగపడిన ఆర్ట్..
కరీంనగర్‌కు చెందిన సాహిత్య అనే కళాకారిణి తన ఆర్ట్‌ను ఫెస్టివల్లో ప్రదర్శనకు పెట్టారు. ఎంతో ఆకర్షిణియంగా ఆ ఆర్ట్ ఉండడంతో దానిని చూస్తూ ఉండిపోయాను. అయితే ఆర్ట్ కొంత అర్థమై, అర్ధంకానట్లు అనిపించింది. అంతేకాకుండా అసాధారణంగా కూడా అనిపించింది. వెంటనే తననే తన ఆర్ట్ గురించి వివరించమని అడిగాను. ముందుగా, సాహిత్య తనకు తాను పరిచయం చేసుకున్నారు. తను జెఎన్ఏఎఫ్ఏయూలో ప్రస్తుతం మాస్టర్స్ చేస్తున్నట్టుగా చెప్పారు.
‘‘నేను నా కళా ప్రస్థానాన్ని సానిటరీ ప్యాడ్‌పై ఎంబ్రాయిడరీ చేయడంతో ప్రారంభించాను. ఈ ప్రక్రియలో లజ్జా గౌరీ అనే హిందూ దేవత గురించి తెలుసుకున్నాను. స్త్రీ శక్తిని లోతుగా అర్థం చేసుకోవడానికి, నా ఆత్మాన్వేషణకు, సాధికారతకు ఇది ఎంతో ఉపయోగపడిరది’’ అని భావిస్తున్నానని సాహిత్య తెలిపారు.
సాహిత్య ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఫలప్రదాత, సమృద్ధి, సౌభాగ్యానికి సంకేతమైన లజ్జా గౌరీ దేవత నా స్త్రీ అనుభవాలకు, ముఖ్యంగా నా మాసిక సమయంలో, నాలోని భావాలకు మధ్య సమాంతరాలను అన్వేషించడానికి స్ఫూర్తినిచ్చింది. నా కళాకృతులు లజ్జా గౌరి పోషకాత్మక భావాన్ని, నా మాసిక ప్రయాణంలో అనుభూతి చెందిన భావాలను ప్రతిబింబిస్తాయి. సానిటరీ ప్యాడ్‌పై చేసిన ఎంబ్రాయిడరీ నా స్త్రీత్వాన్ని అంగీకరించడాన్ని సూచిస్తుంది.’’ అన్నారు.
‘‘ఒక కళాఖండంలో గర్భిణీ మహిళ గవ్వతో ఆడుకుంటూ ఉంటే, అది ఫలప్రదాత అందాన్ని, జీవన పోషణలోని ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. నా కళా ప్రయాణం ద్వారా ఇతరులు తమ జీవన చక్రాలను అంగీకరించాలని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ నాలోని దివ్యతను ప్రదర్శిస్తూ ఒక అంతరంగ, సాధికార అనుభవాన్ని పంచుకుంటుంది.’’ అని చెప్పుకొచ్చారు.
కళాకారిణి పావనితో మాటాముచ్చట..
ఇలానే ప్రదర్శనలను చూస్తూ ముందుకు వెళ్తే మరో కళాఖండం కనబడింది. హైదరాబాద్ నగరానికి చెందిన యస్వీఎన్ఎల్ పావని ఆ కళాఖండాన్ని రూపొందించారు. సంగీతానికి, ప్రకృతికి మధ్య సారూప్యతను కళాకారిణి పావని అన్వేషిస్తున్నారు. ఆమె జెఎన్‌ఎఎఫ్‌ఎయులో ఎంఎఫ్ఎ చేస్తున్నారు. ‘‘ సంగీతానికి ప్రకృతికి మధ్య ఉన్న సారూప్యతకు ఆకర్షితురాలినయ్యాను. నా ఆర్ట్‌లో ప్రపంచంలో సహజంగా ఉన్న అంతర్గత లయల శ్రావ్యమైన ధ్వని, వాటి అనుసరణలను చిత్రీకరించడానికి ప్రయత్నించాను. నేను ఈ సంగీతానికి సంబంధించిన అంశాలను, స్వరాలకు రంగులతో జతచేసి దానిని ఓ దృశ్య రూపంలోకి అనువదించాను. ఈ ఆర్ట్ కోసం కాగితం, కలర్ పెన్సిల్స్, అల్లికలు ఉపయోగించి ఈ కళాఖండాన్ని రూపొందించాను. సాంకేతికతను ఉపయోగించి వాటిని మరింత మెరుగుపరిచాను. చూడగానే వీక్షకులు తాము కళలోకి లీనమయ్యే అనుభూతిని సృష్టించాను. నా కుటుంబీకుల సహాయంతో సంగీతాన్ని ఈ యానిమేషన్‌కు బ్యాక్ డ్రాప్‌గా జోడించాను’’ అని పావని తెలిపారు.
క్రాఫ్ట్‌కు రూపమిచ్చిన వ్యక్తిగత పరిశీలన..
పెద్దపల్లి జిల్లా చిన్న ఓదలా వాసి ఆర్టిస్ట్ కటుక అనుక్య పటేల్‌ను ఫెస్టివల్లో కలిశాను. తను ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైనార్ట్స్ యూనివర్సిటీలో ఎంఎఫ్ఏ రెండవ సంవత్సరం చదువుతున్నారు. వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండడమే తనను కళల వైపు వచ్చేలా ప్రేరేపించిందని అనుక్య పటేల్ అన్నారు. తన వ్యక్తిగత ప్రయాణ అనుభవాలు, పరిశీలనలు తన క్రాఫ్ట్‌కి రూపమిస్తాయని ఆమె చెప్పారు. ‘‘వ్యవసాయం చుట్టూ ఉన్న కష్టమైన సమస్యలపై నా కళాత్మక దృష్టి కేంద్రీకరిస్తుంది. ముఖ్యంగా ఆహారంలో పోషకాల క్షీణతపై అధిక ఎరువులు, రసాయనాల వాడకం వల్ల కలిగే వినాశకరమైన పరిణామాలు, రోజువారీ అరుదైన అంశాలను ఏకీకృతం చేయడం. దీంతో ఆధునిక పర్యావరణ అభ్యాసాల గురించి ఆలోచించేలా చూసేవారిని ప్రేరేపించడమే నా కళ ముఖ్య ఉద్దేశ్యం’’ అని అన్నారు.
చిత్రకారుడు సాయికుమార్..
‘‘చిన్నప్పటినుంచి నాకు డ్రాయింగ్, పెయింటింగ్ మీద ఆసక్తి ఉండేది. మా నాన్న చేస్తోన్న పనిని చూస్తూ పెరిగాను. నేను కూడా స్కూల్ డేస్ నుంచి ఆయన పనిలో సహాయం చేసేవాడిని. కార్పెంట్రీని ఆర్ట్ఫామ్లో ఏదైనా చేయాలనే కోరిక ఎప్పుడూ ఉండేది. స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత నేను ఫైన్ఆర్ట్స్ కాలేజీలో చేరాను. నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత కూడా, ఇంకా ఏదో నేర్చుకోవాలన్న తృష్ణ నాలో ఉండేది. ప్రస్తుతం నేను పీఎస్టీ యూనివర్శిటీలో రెండో సంవత్సరం మాస్టర్స్ ఇన్ పెయింటింగ్ చేస్తున్నాను.’’ అని రంగారెడ్డి జిల్లా లోయపల్లి గ్రామ వాసి అందోజు సాయికుమార్ అన్నారు.
‘‘ప్రస్తుత నా ఆర్ట్ సిరీస్ ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను ప్రతిబింబిస్తుంది. నా చిన్ననాటి అనుభవాలు, మా నాన్న చేత నాకు అబ్బిన నైపుణ్యాలపై కూడా ఇది ఆధారపడి ఉంది. ఇవి నా పనుల్లో అడుగడుగునా ప్రతిబింబిస్తాయి.’’ అని సాయికుమార్ తెలిపారు.
సాయికుమార్ ఆర్ట్ సిరీస్‌లో ‘‘ప్రిస్క్రైబ్డ్ బెడ్ రెస్ట్’’, ‘‘ది రెనోవేషన్’’ చెప్పుకోదగ్గవి. ప్రిస్క్రైబ్డ్ బెడ్ రెస్ట్ అనే కళాకృతి కుటుంబ పెద్ద అనారోగ్యం పాలై, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లెటర్ పైన పడుకుని ఉండడం చూపిస్తుంది. అతని స్థితి, వైద్యుడి సలహా తప్ప వేరే మార్గం లేకపోవడం అనే దానిని ప్రతిబింబిస్తుందని సాయి చెప్పారు. ‘‘ది రెనోవేషన్’’ తన తాజా సిరీస్‌లో మరో కళాకృతి. అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుడి వైద్య ఖర్చులు మొత్తం కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇందులో సాయి చూపించారు. ఒక వృద్ధ మహిళ తన పాత ఇంటిని చూస్తూ దయనీయంగా ఉండడాన్ని, ఆ ఇల్లు కూడా అమ్మబడిన పరిస్థితి చూపరులకు అర్ధం అవుతుంది.
‘‘ఇలాంటి కుటుంబ అనుభవాలను, ఇంటింటి జీవితపు కథల్ని అనేకంగా అన్వేషించి నా కళాకృతుల్లో ప్రతిబింబించవచ్చని నేను భావిస్తున్నాను’’ సాయి ధీమావ్యక్తం చేశారు.
ఆశ్చర్యపోయేలా చేసిన ఆర్ట్ వర్క్..
హైదరబాద్ లిటరరీ ఫెస్ట్‌లో ఓ కళాకృతి నన్ను ఆశ్చర్యపోయేలా చేసింది. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇంకేందుకు చదవండి మరీ.. మెదక్ జిల్లా వాసి నవీన్ బాణి అనే విద్యార్థి బట్టల మీద రంగురంగుల పూసలు, కుట్లతో చిత్రాలు వేశారు. ఈ ఆర్ట్ వర్క్ ఎంతో ఆకర్షణీయంగా అనిపించింది. కాన్సెప్ట్ ఏంటని అతడినే అడిగాను.
అప్పుడు.. ‘‘ నేను మధ్యతరగతి బంజారా కుటుంబంలో పెరిగాను. నా తల్లిదండ్రులకు తమ పనిపట్ల ఉన్న అంకిత భావాన్ని నేను గమనించాను. అదే నా పనికి స్ఫూర్తినిచ్చింది. నా కళ ద్వారా నా కుటుంబ జీవన శైలి, అనుబంధం, నా చిన్ననాటి అనుభవాలను, జ్ఞాపకాలను ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను’’ అని నవీన్ చెప్పారు.
ప్రస్తుతం నవీన్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఎఫ్ఏ చేస్తున్నారు.
తీయని అనుభూతి లిటరరీ ఫెస్టివల్..
అనువాదకారిణి అఖిల అనుభవాలు, ఆర్ట్ గురించిన విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. అయితే, హైదరాబాద్ ఒక లిటరరీ ఫెస్టివల్‌గా మాత్రమే కాకుండా రకరకాల కళలు, ఆలోచనలు, అనుభవాల కలయికగా నాకు అనిపించింది. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో లిథుయేనియా దేశానికి సంబంధించిన పుస్తకాలు కూడా ప్రదర్శనలో పెట్టారు. దీంతో ఒక కొత్త దేశం పుస్తకాలు చదివే అవకాశం నాకు లభించింది. అలాగే లిథుయేనియా దేశ సినిమాలు కూడా ప్రదర్శించారు. ఆ పుస్తకాలు- సినిమాలు ఒక కొత్తకోణంలో జీవితాన్ని చూపించాయి. సింధీ భాషకు సంబంధించిన పుస్తకాలు కూడా ప్రదర్శనకు పెట్టారు. అలాగే ఈ లిటరరీ ఫెస్టివల్లో వేదిక పంచుకున్న మామిడి హరికృష్ణ, గోగు శ్యామల, మొహమ్మద్ ఖదీర్ బాబు, తేజా బాలాంత్రపులాంటి తెలుగు కవులు, రచయితలను చూడడం భలే అనిపించింది.
ఓ సందేశాత్మక కార్యక్రమం..
ప్రస్తుత సమాజంలో ట్రాన్స్, నాన్ బైనరీ వ్యక్తులపై వివక్ష పెరుగుతూ పోతుంది. ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌కు చెందిన డ్రాగ్ ఆర్టిస్ట్ పాత్రుని చిదానంద శాస్త్రి ‘‘కం సిట్ విత్ మీ’’ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం జెండర్ బైనరీ పరిధిని దాటి జెండర్ గురించి సంభాషణలను ప్రేరేపించేందుకు రూపొందించబడింది. ఈ ప్రదర్శనలో ఆయన సందర్శకులను తను కూర్చున్న ఒక సోఫాలో కూర్చోడానికి ఆహ్వానించారు. ఆ సోఫా ఒక సేఫ్ స్పేస్‌కి ప్రతీక. ఒక ప్రశ్న ద్వారా సంభాషణని మొదలుపెట్టారు. ‘‘మీరు నన్ను రెండు (స్త్రీ, పురుష) జెండర్ల కంటే ఎక్కువగా చూస్తున్నారా?’’ అని అడిగారు. ఈ ప్రదర్శనకు మంచి స్పందన వచ్చింది. వయసుతో సంబంధంలేకుండా ప్రేక్షకులు తమ ఆలోచనలను పంచుకున్నారు. ప్రశ్నలు అడిగారు, మానవత్వంతో తమ మద్దతును కూడా ప్రకటించారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్, పాసిబుల్ ఫ్యూచర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘‘కం సిట్ విత్ మీ’’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సంభాషణల ద్వారా వివక్షను నిర్మూలించి, అవగాహనను కల్పించవచ్చు అనే ఒక సందేశాన్ని ఇచ్చింది.
విభిన్న కార్యక్రమాలు, వివిధ కళాకృతులు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆయా ఆర్టిస్ట్‌ల అనుభవాలు నాలో నూతన ఉత్తేజాన్ని ఇచ్చాయి. హైదరాబాద్ లిటరేరి ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలకు వెళ్తే మనకు ఎంతో జ్ఞానం వస్తుంది. ఒక కొత్త ప్రపంచాన్ని చూసిన అనుభూతిని పొందినట్టుగా అనిపిస్తుంది. అనిపించడం ఏంటి హైదరాబాద్ నగరం ఓ ప్రేమైక ప్రపంచం అందులో సంవత్సరానికి ఓ సారి జరిగే హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ మరో ప్రపంచం. కాదుకాదు రంగురంగుల కళల ప్రపంచం, కళా ప్రపంచం..
– రమేశ్ కార్తీక్ నాయక్
(రచయిత, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహిత)
ఫొటో కర్టసి: అరవింద్ ఏవీ
(కవి, రచయిత, అసిస్టెంట్ డైరెక్టర్)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.