
1980ల మధ్య నుంచి లేదా దాదాపు నలభై ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న బాబ్రీ మసీదు – రామజన్మభూమి వివాదం భారతదేశాన్ని మతపరంగా చీల్చి, బీజేపీని ఆధిపత్య స్థాయిలోకి ఎగబాకించడానికి దోహదపడింది. చివరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రధాన పూజారి అవతారం ఎత్తి అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠ చేసిన ఏడాది తర్వాత అయినా ఈ ‘‘రాజకీయ కథనా’’నికి ముగింపు ఉంటుందని భావిస్తే అదీ జరగలేదు. అయోధ్యలో మతపరమైన తంతులు నిర్వహించిన తర్వాత నరేంద్రమోడీ’’ రామమందిరాన్ని (ఇంకా కట్టడం పూర్తికాని వేళ) ప్రారంభించడం ఒక విజయావకాశం మాత్రమే కాదు, వినమ్రంగా ఉండడానికి కూడా’’ అన్నారు. ఆ మాటలకు ఆ తర్వాతి పోకడలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రామమందిర వివాదానికి ఫుల్స్టాప్ పెట్టనేలేదు.
ప్రధాని ప్రత్యేకంగా వాగ్ధానం చేసిన ఆ నమ్రతకు ఆ తర్వాత ఆయన చేసిన ఎన్నికల ప్రసంగాలలో ఎక్కడా చోటే లేదు. అంతేకాదు ఆయన పార్టీ సహచరులు, మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అనేక సందర్భాలలో మాట్లాడిన తీరు, చేసిన ప్రకటనలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
మొదటి నుంచి ఒకే తీరు…
రామమందిర ప్రవేశ ద్వారాలను భక్తుల కోసం తెరవడం ‘‘భారత సమాజపు పరిణతిని తెలియపరిచే సందర్భం’’ (మోదీ ప్రసంగ భాగం)గా అయితే అస్సలు లేదు. ఇంకా చెప్పాలంటే ఆ ‘ఉద్యమం’ ఏ మాత్రం సంమయమనం, అణుకువ లేకుండా క్రూరంగానే సాగుతోంది. 1980లలో వివాదాన్ని మొదలుపెట్టినప్పటి రీతిలోనే. సంఘ్ పరివార్ అండదండలతోనే కొనసాగుతోంది.
అంతర్గత సందేశానికి ఆధారం…
నవంబర్ 2019 తీర్పును చూసి కలవరపడిన వారు కూడా దానిలో అంతర్గతంగా దాగున్న సందేశాన్ని చూసి కాసింత ఊరట చెందారు. ఆ తీర్పు వివాదంలో ఉన్న భూమిని హిందూపక్షానికి రామమందిరం నిర్మించడం కోసం అప్పగించినా, ఇతర ప్రార్థన స్థలాలను వాటి స్వభావాలను మార్చాలన్న డిమాండ్ల నుంచి కాపాడిందని ఊరట చెందారు. ప్రార్థన స్ఠలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం 1991 శాశ్వతంగా ఉండబోతోందన్న భరోసా ఇచ్చింది ఆ తీర్పు. అదే ఈ అంతర్గత సందేశానికి ఆధారం. పీవీ నరసింహారావు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమోదం పొందిన చట్టమిది. (బహుశా ఈ శకంలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన) నవంబర్ 2019 తీర్పులో సంతకం పెట్టిన ఐదుగురు న్యాయమూర్తులు ‘‘ ఈ చట్టం రాజ్యంగపు ప్రాథమిక విలువలను కాపాడుతుంది, భద్రంగా ఉండేలా చూస్తుంది’’ అని పునరుద్ఘాటించారు.
‘‘ఈ చట్టం బహిరంగ ప్రార్థన స్థలాల స్వభావాలను లేదా లక్షణాలను మార్చకూడదని చెప్పడం ద్వారా భవిష్యత్ గురించి చర్చించింది. వలసపాలన నుంచి స్వాతంత్య్రాన్ని సాధించుకున్న (ఆగస్టు15, 1947) నాటికి ప్రతి ప్రార్థనా స్థలం ఏ మత స్వభావంతో ఉందో అలానే ఉంచాలన్న ఒక సానుకూల కర్తవ్యాన్ని ఈ చట్టం నిర్దేశించింది’’ అని ఈ తీర్పు విస్పష్టంగా పేర్కొన్నది.
రామమందిరం ప్రారంభం తర్వాత పరిస్థితి…
ఏ ఇతర ప్రార్థనా స్థలపు మత స్వభావాన్ని మార్చకూడదని, తద్వారా సామరస్యపూరితమైన భవితను వాగ్ధానం చేసిందని ఏ చట్టం గురించి సుప్రీం కోర్టు ఈ తీర్పు ద్వారా వ్యాఖ్యానించిందో అదే చట్టపు రాజ్యాంగ బద్దతనే సవాలు చేస్తున్న వ్యాజ్యాలు విచారణ కోసం అత్యున్నత ధర్మాసనం ముందు ఎదురుచూస్తున్నాయిప్పుడు. ఇదీ రామమందిరం ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాతి స్థితి.
రామమందిరాన్ని ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. అయితే అయోధ్యలో కాదు. సంబాల్లో.. హిందువులు ‘‘తిరిగి సొంతం చేసుకోవాలనుకుంటున్న’’ ప్రతి ప్రార్థానా స్థలానికి అదే వర్తిస్తుందని (బాబరీ మసీదును ధ్వంసం చేసినవిధానమే) ఆదిత్యనాథ్ తేల్చిచెప్పారు. ‘‘వారసత్వసంపదను తిరిగిపొందాలనుకోవడం చెడ్డపనేమీ కాదు. వివాదస్పద కట్టడాలను మసీదులు అని అనకూడదు. భారతదేశం ముస్లింలీగ్ మనస్తత్వంతో నడవదు’’ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ అన్నారు.
ఆదిత్యానాథ్ ప్రకటనల పట్ల మోడీ మౌనం..
విగ్రహప్రతిష్ఠానంతర ఉపన్యాసంలో ‘‘రాముడంటే నిప్పు కాదు, శక్తి. రాముడంటే వివాదం కాదు పరిష్కారం’’ అని ఎంతో ఉద్రేకంగా మాట్లాడిన మోడీ, ఆ తర్వాత ఆదిత్యనాథ్ చేస్తున్న ఈ ప్రకటనల పట్ల మౌనంగా ఉన్నారు. ప్రార్థన స్థలాలను వివాదాస్పదం చేసే పనిని తీవ్రతరం చేయడంలో పార్టీలో అందరి కంటే తానే ముందుండాలన్న ఆదిత్యనాథ్ వ్యూహం మోడీని ఆందోళనకు గురిచేస్తోంది.
ముగింపు లేని ప్రక్రియ..
అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట జరిగిన ఒక సంవత్సరం తర్వాత చాలా బాధాకరంగా అనిపించే విషయమొకటి స్పష్టమైంది. ఆ రామమందిర ప్రారంభం అనేది కేవలం ఏదో ఆ సమయాన మాత్రమే విజయానికో, ప్రతీకారానికో సంకేతాత్మాకంగా నిలిచింది కాదని తేటతెల్లమైంది. ఆ దాడి నిరంతరం కొనసాగుతోంది. వారణాసిలోని గ్యాన్వాపి మసీదు మీద కానివ్వండి, మథురలోని షాహి ఈద్గాలో కానివ్వండి. ఇంకా సంబాల్లోని జామా మసీదు, అజ్మీర్‌లోని స్మారక ప్రదేశాలు, భోజ్ శాలతో పాటు అనేక ఇస్లామిక్ ప్రార్థనా స్థలాల మీద ఈ దాడి కొనసాగుతోంది. దీనితో ఈ విజయం, ప్రతీకారం తీర్చుకోవడమనే ప్రక్రియకు ముగింపు లేదని కొనసాగుతూనే ఉంటుందని స్పష్టమైంది.
అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో పాటు భారీ అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. దీనితో అయోధ్య అనే ఒక చిన్నపట్టణాన్ని ఒక బృహత్ మత కేంద్రప్రాంతంగా లేదా అచ్చమైన హిందూ వాటికన్లానో మార్చారు. అంటే రామజన్మభూమి ఉద్యమంగా చెప్పబడుతున్నది కేవలం ఒక మందిరం కోసం ఉద్దేశించిందిగా కాదనీ, రూపుమార్చుకుందని అర్థమవుతుంది. అదిప్పుడు ఒక కొత్త ప్రధాన ‘పవిత్ర స్థలం’ను నిర్మించే దిశగా సాగుతోంది. ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు మరెన్నో అయోధ్య తరహా ‘ఉద్యమాల’ కొనసాగింపుతో దేశంలో ప్రతిమూల అనేక కొత్త ‘‘పవిత్ర స్థలాలు’’ ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.
మసీదు నిర్మాణం మరో ప్రపంచ వింతే…
అత్యున్నత న్యాయస్థానం 2019 నవంబర్ 9న ఇచ్చిన తీర్పులో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌కు ‘‘ఐదు ఎకరాల అనువైన స్థలం’’ ఇవ్వాలని, ఆ తర్వాత ఆ స్థలంలో మసీదు నిర్మాణానికి, ఇతరత్రా దానికి కావలసిన అన్ని సౌకర్యాల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టే స్వేచ్ఛ వక్ఫ్ బోర్డ్‌కు ఉందని చెప్పింది. సుప్రీం కోర్టు నిర్దేశించినట్లు స్థలం కేటాయించవచ్చేమో కానీ అక్కడ మసీదు నిర్మాణమన్నది మాత్రం ఒక కలగానే మిగిలిపోతుంది. నిజానికి అయోధ్య శివార్లలో ఉండే ఆ భూమిలో ఎప్పటికైనా మసీదు నిర్మాణమన్నది జరిగితే కనుక అది మరో ప్రపంచ వింతే అవుతుంది.
ఆ బృహత్ ఆలయ ప్రారంభం అనేది వివాదాన్ని పరిష్కరించకపోగా ప్రతి ‘వివాదపూరితమైన’ ముస్లిం ప్రార్థనా స్థలపు భవిష్యత్ ఘోరంగా ఉండబోతోందని స్పష్టం చేస్తోంది. గత సంవత్సరం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం కోసమే మోడీ ఇంకా నిర్మాణం పూర్తి కాకపోయినా మందిరాన్ని ప్రారంభించాలన్న పథకం వేసుకున్నారు. కానీ ఇప్పుడు నిరంతరం కొనసాగించే మరిన్ని ప్రచారోద్యమాలను ప్రారంభించే ఉద్దేశంతోనే, ఆ కొత్త దశలోకి వెళ్ళడం కోసమే ఇంకా ఇతర ‘‘ప్రారంభ’’ వివాదాలను పురికొల్పుతున్నారు.
మరెన్నో ‘వివాదాల’లకు పురికొల్పు…
మతపరమైన అస్థిత్వం ఆధారంగా మనుషులను కూడగట్టడం ద్వారా, మతపరంగా అల్పసంఖ్యాకుల పట్ల ముఖ్యంగా ముస్లింల పట్ల, క్రిస్టియన్ల పట్ల దురభిప్రాయాలను కలిగించి వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం ద్వారా లబ్ది పొందిన వాళ్ళు బహుశా ఇంకా తమ లక్ష్యంలో ఉచ్చస్థాయికి చేరుకున్నట్లు భావించడం లేదనుకుంటా. బాబ్రీ మసీదు- రామమందిర వివాదం తీవ్రంగా ఉన్న 1980-90లలో మధ్యయుగాల నాటి సంబాల్ మసీదు మీద ‘తీవ్రమైన వివాదం’ గురించి ఎవరూ పెద్దగా విని ఉండరు కదా. కానీ ఇప్పుడు హిందుత్వ రాజకీయాలకు ప్రేరణ, ఉధృతి అవసరమైనప్పుడల్లా అలాంటి మరెన్నో ‘వివాదాల’ను పురికొల్పుతారు. అందుకే అయోధ్యలో రామమందిర ప్రారంభం నాడు మోడీ ప్రకటన ఒక ముసుగు మాత్రమేనని తేలిపోయింది. ‘‘ఈ రామ్‌లల్లా ఆలయ నిర్మాణం శాంతికి, సహనానికి, సామరస్యానికి, భారత సమాజపు సమన్వయానికి సంకేతం. ఈ నిర్మాణం నుంచి ఎలాంటి నిప్పు రాజుకోవడానికి అవకాశం ఉండదని మనకు కనిపిస్తోంది’’ అన్న ఆయన మాటలు ఒక ముసుగు మాత్రమేనని తర్వాత చర్యల వల్ల స్పష్టంగా అర్థం అయిపోయింది.
అనువాదం : వి.వి జ్యోతి
(నీలంజన్ ముఖోపాధ్యాయ పాత్రికేయుడు, రచయిత. ఆయన రాసిన చివరి పుస్తకం పేరు ది డిమాలిషన్, ది వెర్డిక్ట్ అండ్ ది టెంపుల్: ది డెఫినెట్ బుక్ ఆన్ ది రామ మందిర్ ప్రాజెక్ట్. నరేంద్రమోడీ: ది మాన్ అండ్ ది టైమ్స్ అనే పుస్తకం కూడా రాశారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.