
కొన్ని పుస్తకాలు చదవడం అంటే జీవితాన్ని తాకడం. మనిషిగా ఎదగడం. మానవత్వపు పరిమళాలను ఆఘ్రానించడం. చాలా తక్కువ పుస్తకాలు ఆ అనుభవాన్ని ఇస్తాయి. అలాంటి అనుభవం దొరికిన తరువాత జీవితం పట్ల మన దృక్పధంలో ఎంతో మార్పు వస్తుంది. మన నమ్మకాలు, మన ఆలొచనలను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మనిషి ఎదగాలంటే ఇలాంటి అనుభవం అవసరం.
జి.ఎన్. సాయిబాబా గారి ఈ అండాసెల్ కవిత్వాన్ని మనసుతో చదివితే, అది మనలో కలిగించే ప్రకంపనలు, మనం నిర్మించుకున్న కంఫర్ట్ జోన్ నుంచి మనకే తెలియక మనం వేసే కొన్ని అడుగులు మనల్ని మనిషితనానికి కాస్త దగ్గర చేసి తీరతాయి.
ఉద్యమకారులు సాధారణంగా సాహితీవేత్తలు కాలేరు. పదాలలో అందాన్ని కూర్చడం వారికి సాధ్యపడదు అన్నది ఓ అపోహ అని నిరూపిస్తుంది “నేను చావును నిరాకరిస్తున్నాను” అనే ఈ పుస్తకం. ప్రపంచంలో ఎటువంటి ఉద్యమ నేపద్యంలో కూడా, పని చేసేవాళ్లు కొందరుంటే, వారి పని పట్ల ప్రజలలో అవగాహన కలిగించే కళాకారులు మరికొందరు ఉంటారు. ఈ రెండు దృవాలు ఒక్కరిలో ఉండడం అరుదైన విషయం. ప్రొఫెసర్ సాయిబాబా గారిని ఓ పోరాట యోధుడిగానే గుర్తుపెట్టుకుంటాం. ఆయనలో ఓ గొప్ప సాహితీవేత్త ఉన్నాడని ఈ పుస్తకం చదివేదాకా నమ్మలేం. ఆయన అంతకు ముందు కవిత్వం రాసారో లేదా తెలీదు. కాని ఈ పుస్తకం చదువుతున్నప్పుడు “The true revolutionary is guided by a great feeling of love. It is impossible to think of a genuine revolutionary lacking this quality” అన్న చే మాటలు గుర్తుకు వస్తాయి. సాయిబాబా గారి వ్యక్తిత్వాన్ని ఈ పుస్తకంలో దర్శిస్తూ ఈ మాటలలోని నిజాన్ని అనుభవించిన పాఠకులకు ఆయన కవిత్వంలోని లోతు, అందం, సున్నితత్వం ఆశ్చర్యపరుస్తాయి.
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన పాణి గారు ఇలా అంటారు “మానవ సంబంధాలకు మనిషిని దూరం చేయడానికి రాజ్యం నేరాన్ని సాకుగా ఎంచుకుంటుంది. నేరం ఉద్దేశం మనిషిలోని సృజనాత్మకతకు మూలమైన సమాజం నుంచి వ్యక్తులను వేరు చేయడం. మనుషుల్లోని సృజనాత్మక జీవిని నిర్మూలించడం”….
కాని సాయిబాబా గారి విషయంలో ఈ సందర్భంలో ప్రభుత్వం ఓడిపోయింది. ఓ చీకటి సెల్ లో వీల్ చేర్ కి కట్టుబడిపోయిన ఓ ఉద్యమకారుడిని బలహీనపరచడానికి ప్రభుత్వం శిక్ష వేస్తే తన అపారమైన మానసిక స్థైర్యాన్ని ఆ మహామనిషి ప్రకటించుకున్న తీరు, ఆఖరి క్షణం దాకా ఆయన చూపిన పోరాట పటిమ, నిరంతరం తనను తాను చెక్కుకుంటూ జీవించిన ఆ ఉద్యమకారుని జీవితం ఎటువంటివారికైనా స్పూర్తిదాయకం.
పాణి గారే మరో చోట ఇలా అంటారు “చైతన్యవంతమైన ఖైదీలు ఒంతరితనాన్ని ఏకాంతంగా మార్చుకుంటారు. ఆ ఏకాంతంలోంచి విశాల మానవ ప్రపంచంలోకి విస్తరిస్తారు.” “ఒంటరి గదిలోంచి మనిషి బైటి ప్రపంచానికి వినిమయమయ్యే మాధ్యమమే కవిత్వం”…..
అందుకే కాబోలు ఆ జైలులో తన ఏకాంతంలో సాయిబాబా గారు కవిత్వాన్ని ఆశ్రయించారు. తనను తాను శోధించుకుంటూ తనకు తాను స్పూర్తి అందించుకుంటూ అపరిమితమైన మానవీయనతను, మానవ శక్తిని ప్రదర్శించారు. ఎన్ని అంక్షలో ఆయనపై, “తెలుగు మాతృభాష అయిన ఖైదీకి నాగపూర్ జైల్లో తెలుగు నిషిద్దం. అందువల్ల సాయిబాబా ఈ కవిత్వాన్ని ఇంగ్లీషులో రాశారు” ఎన్ని నిషిద్ధాల నడుమ ఆయన వ్యక్తిగా, ఉద్యమ స్పూర్తితో ఎదిగారో తెలుసుకోవడానికి ఈ కవిత్వం చదవాలి. మనుషులుగా జీవించడానికి మానవ పరిమితులను వ్యాపింపజేసుకుంటూ ఎదగాలనుకునే వ్యక్తులు తప్పకుండా చదవవలసిన కవిత్వం ఇది. జైలు గోడలుకు పరిమితమై ఎన్నో అంక్షలు, నిషేధాల నడుమ రోజులు గడిపిన ఓ మేధస్సు “ఏకాంతంలోంచి సమూహంలోకి చేసిన ప్రయాణం” ఈ పుస్తకం. పాణి గారి మాటల్లోనే “బైట ఉంటే తను ఎంత పెద్ద ప్రపంచంతో సంపర్కంలో ఉంటారో అందులో దేన్నీ ఆయన జైలు వల్ల కోల్పోలేదు. ఇందులో “నేను” ను సాయి కవిత్వం చాలా జాగ్రత్తగా ఎత్తిపట్టింది. దానికి కారణం సాయి జైలును అర్ధం చేసుకున్న తీరు. “
సాధారణంగా ఉద్యమ కవిత్వం ఒకే మూడ్ లో ఉండి పుస్తకంగా మారినప్పుడు అందులో పాఠకులకు మోనోటని ద్వనిస్తుంది. కాని ఈ పుస్తకం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. “ఏ కవిత సొంత దుఖమని, దాని నుంచి పుట్టిన ఆగ్రహమని మనకు అనిపించదు. సామాజిక విషాదంగా, వ్యాఖ్యానంగా, అనుభవంగా, ఆశావాదంగా ఇప్పటి దాకా వచ్చిన జైలు కవిత్వంలో ఇది ప్రత్యేకంగా అనిపిస్తుంది.”
ఆ జైలు గోడల నడుమ సాయిబాబాగారు ప్రపంచాన్ని విన్నారు, దర్శించారు, అనుభవించారు. ఆయన్ని బంధించిన రాజ్యం ఆయనలోని ఈ శక్తిని హరించలేకపోయింది. అందుకే ఓ కవితలో “అప్పుడే జీవం దాల్చుతొన్న కీటకాలను ఉక్కుపాదం కింద నలిపివేస్తున్న చప్పుడు” గురించి ప్రస్తావిస్తారు. ఆయనను మృత్యువు పేరుతో రాజ్యం భయపెట్టలేకపోయింది. “ఇప్పుడు నేను మృత్యువు గురించి యోచిస్తున్నాను అంటే జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాను. మృత్యువుకి ధనిక బీద, గౌరవ అగౌరవ భేదం లేదు. జీవించి ఉన్నప్పుడు నువ్వెవరన్నదే ముఖ్యం” అని ఆ స్థితిలో కూడా రాసుకోగల ధీరుడు సాయిబాబా. “జీవిత ఖైదు కంటే మరణ శిక్ష మేలు. మన అందమైన నేల మీద జీవనాన్ని సాగించడం మరణాన్ని కోరుకోవడం కంటె కష్టం. దేశమంటె మరేమీ కాదు మృత్యు వ్యాపారమే” అని రాసుకోగల సాయిబాబా మృత్యువుకు భయపడలేదు సమాజం నుండి వేరు పడడం మాత్రమే ఆయనను అందోళనకు గురి చేసిన విషయం. అందుకే ఆ అండాసెల్ లోనూ సమాజంతో జీవించడం నేర్చుకున్నారు. సమాజ ప్రతినిధిగా ఉండగల శక్తిని ప్రదర్శిస్తూ తన శిక్షను సవాలుగా చేసుకుని జీవించి చూపించారు.
“నేను చనిపోయేలా ఏం చేయాలో వాళ్లకు తెలియడం లేదు. నాకు మొలకెత్తే గడ్డి సవ్వడులు చాలా ఇష్టం” అని ఆయన మాత్రమే రాయగలడు. జైలులో తన సహచరి, కన్నతల్లులను ఆయన తలచుకున్న తీరు అత్యంత ప్రేమాస్పదం. “అమ్మా నా కోసం దుఖించకు” అంటూ “జైలు నాకు మరణం కాదు పునర్ జననమని నేను అర్ధం చేసుకున్నాను” అంటారు. “అభాగ్యజీవులకు అండగా నాతో పాటు నిలబడడానికి వస్తున్న ప్రతి ఒక్కరిలో నేను నా స్వేచ్చను పొందుతున్నాను” అని రాసుకున్నారు. అదే కవితలో ఒక పక్క తన తల్లికి “నువ్వు అర్ధం చేసుకోలేని విదేశీ భాషలో రాస్తున్నందుకు క్షమించు” అంటూ తన నిస్సహాయతను ప్రకటించుకుంటూనే మరో పక్క తన సహచరికి రాసిన కవితలో “ప్రియతమా ఈ బందీఖానాలోని శిక్షను నీ ప్రేమలేఖల్లో నన్ను నేను ముంచుకోవడం ద్వారా జయిస్తాను” అంటూ రాసుకున్నారు. తల్లి దగ్గర బిడ్డగా బేలతనం ప్రదర్శిస్తూ, సహచరి దగ్గర ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఆయన జరిపిన సంభాషణ ఆయనలోని రెండు కోణాలను చూపిస్తుంది. .
“ఓ జోయే నా సహచర బానిస పౌరుడా” అన్న కవితలో “నువ్వొక అద్వితీయమైన 18 అంకెలుగా సాంఖ్యీకరించబడి నిత్యమూ జాతీయీకరించబడుతూనే ఉంటావు” అంటూనే “ఈ దేశపు రహదారుల మీదా ఒక కొత్త జాతిని అన్వేషిద్దాం” అంటూ ఆ జైలు జీవితంలోనూ తన భవిష్యత్ ప్రణాళికను ధైర్యంగా ప్రకటించుకున్నారు. తానెంతో ప్రేమించిన తన విద్యార్ధులతో సంభాషిస్తూ “ అసత్యాల చెరసాల, విద్రోహకర నియమాలు, కుట్రపూరిత సంభాషణలు జ్ఞానంతో మీ విమర్శనాత్మక సాంగత్యం నుండి చెరబడ్డ ఈ నేల విముక్తిపై మీకున్న ప్రేమ నుండి నన్నుబంధిస్తున్నాయి” అంటూ వారి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
తన విద్యార్ధులకు మిత్రులకు రాసుకున్న ఉత్తరంలో “ఇది అలసట కలిగించే బాధాకరమైన సుదీర్ఘ ప్రయాణం. చివరకి నా గొంతు పెకలింది. నా తోటి వాళ్ళతో మాట్లాడేందుకు వాళ్లకు కూడా నాలాగే గొంతు రావాలని గట్టిగా కోరుకున్నాను. ఆ క్రమంలో నా స్వరం పెరగడం మొదలయింది. పెరుగుతున్న నా స్వరాన్ని చూసి నేను భయపడ్డాను. ఆ తరువాత నా కంఠ స్వరం మరికొంత పెద్దయింది. అప్పుడు హటాత్తుగా నా గొంతుపై గొడ్డలి వేటు పడింది.” అంటు తన ఉద్యమ ప్రయాణాన్ని చెప్పుకొస్తారు. తన అనారోగ్యాన్ని ప్రస్తావిస్తూనే “ మీరెవరూ నా పరిస్థితి పట్ల సానుభూతి చూపరని ఆశిస్తాను. నాకు సానుభూతి మీద నమ్మకం లేదు. నేను సంఘీభావాన్ని మాత్రమే నమ్ముతాను. నేను నా కథను ఎందుకు చెప్పానంటే అది మీ కథ కూడా కనుక. నా స్వేచ్చ మీ స్వేచ్చ కూడా కనుక” అంటారు. ఇది కదా సంపూర్ణమైన సామాజికత…. నిశ్చయంగా ఆయన స్వేచ్చ మన స్వేచ్చే, ఆయన ఖైదు మన ఖైదు కూడా…
కొత్త సంవత్సర ఉత్సవాలకు బైట ప్రపంచం సిద్దంగా ఉన్న సమయంలో రాసుకున్న కవితలో “ప్రజాస్వామ్యాలు మెజారిటేరియనిజాన్ని నాజీయిజాన్ని ఫాసిజాన్ని పోషిస్తున్నాయి. తమకు తాము వినాశనం చేసుకునే స్వయంచాలక మానవ యంత్రాలను వాళ్లు నియంత్రిస్తున్నారు” అంటూ ప్రభుత్వ తీరును ఆయన గుర్తు చేస్తారు. అలాగే మరో చోట “దినపత్రికలు కన్నాలను మోసుకొస్తున్నాయి, వార్తల స్థానంలో దుష్ట పుకార్లే ఇప్పుడిక్కడ తీర్పులు ప్రకటిస్తున్నాయ్” అంటారు. జైలును వర్ణిస్తూ మిత్రమా ఇది ఎత్తైన న్యాయపీఠాల పైన పరుచుకున్న అబద్దాల సమూహం, అసంఖ్యాకుల ఎడల జరిగే అన్యాయం పట్ల కంఠస్వరాల మౌనం, అది ప్రభుత్వాలను చూసి కలిగే భయం కాదు, గొంతులేని వాళ్ల తరుపున మాట్లాడే గొంతుల్లో కలిగే భయం, అది నైతిక దౌర్భల్యం, ఒక నాగరికత దురహంకారం, స్వేచ్చాయుత సమాజం కోసం మనం చేసిన ఉమ్మడి పోరాటాల చరిత్రల విస్మరణ, అదే ప్రియ నేస్తమా అదే మన ప్రపంచాన్ని నిజమైన నిరాశామయమైన జైలుగా మరుస్తుంది. “ అంటారు. ఈ వాక్యాలను అర్ధం చేసుకుంటే సాయిబాబా గారి పోరు అర్ధం అవుతుంది. ఆయన ఖైదు వెనుక రాజ్యం కుట్ర తేటతెల్లమవుతుంది.
మరో చోట ప్రకృతి దుమారాల గురించి విని దేశంలో రాజకీయ స్థితిగతుల దుమారాలతో ఆ వార్తలను పోలుస్తూ “అపరిచితమైన మనుషులు బాగా తెలిసిన మనుషులను ప్రేమికులనూ ఆలోచకులనూ కాల్చి చంపుతున్నారు” అంటారు. అన్ని హత్యలు అపరిచితుల చేతులే చేస్తున్నాయి. ఆ తుపాకి వెనుక కళ్ళు ఎవరివో, వాటి సంకల్పం ఏంటో తెలుసుకుని గళమెత్తే వ్యక్తుల గొంతుకలు వినిపించకపోతే ప్రపంచం భవిష్యత్తే అయోమయంలో పడుతుంది.
కోరేగావ్ సంఘటనను ఉదహరిస్తూ “చక్రవర్తుల తూటాలు కూల్చలేని రెండొందల ఏళ్ళ మట్టి విగ్రహం అంటరాని స్పర్శకి కుప్పకూలింది. నువ్వుకోరోగావ్ దళిత హృదయాన్ని అర్ధం చేసుకోలే” అంటూ దేశంలోని అధికార వర్గాన్ని, నేటి తరాన్ని కూడా నిలదీస్తారు.
“నా గదిలో ఓ పిచ్చుక” అనే కవిత భయంకరమైన ఒంటరి జైలు జీవితంలో సెల్ లోకి వచ్చిపోయే పిచ్చుకతో ఆయన చేసిన సంభాషణ . ఈ ఒక్క కవిత చాలు ఆయనలోని మనిషితనాన్ని, మానవ పరిమళాన్ని మనకు పరిచయం చేయడానికి. “ఎగిరి పోదామని ప్రయత్నం చేస్తూ జైలు ఊచకు తాకి మొద్దుబారిన నా గుండే మూలుగులాగా రెపరెపమని శబ్దం చేస్తూ కింద పడిపోయింది పాపం పిచ్చుక” అంటారు కవి. అతను స్వేచ్చ కోల్పోయిన ఓ ఖైదీ. ఇక్కడ ఆ పక్షి తాత్కాలికంగా బందీ అయినందుకు బాధపడుతున్నాడు.
“నా గొంతు ఎండుకు పోయింది దాహం వేస్తున్నట్టనిపించింది. కానీ నా జైలు గదిలో పక్షి ఉండగా నీళ్ళూ నేనెలా తీసుకోగలను”అని అనడం అందరికీ సాధ్యం కాదేమో. ప్రపంచంలో అందరికీ అన్ని హక్కులు సమానంగా అందాలని కోరుకునే ఓ మనవతావాది పక్షి ఉండగా తాను నీళ్ళూ తీసుకోలేనని చెప్పుకోవడాన్ని వింటుంటే ఆయన పట్ల మనలో రేగేది ఎలాంటి భావనో చెప్పలేని స్థితిలో మనం కొట్టుకుపోతాం. . “ప్రియ స్నేహితుడా ప్రతి రాత్రీ వచ్చి పోవూ నా ఒంటరితనం భయంకరంగా ఉంది” అంటూ అంతటి ధైర్యవంతుడు ఓ క్షణం ఆ పక్షితో మనసు కలపడం చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి.
మరో చోట పక్షులతో సంభాషిస్తూనే “ఏకంతవాసంలో జీవితానికి మనుగడ లేదు. జీవితం జీవితాన్ని పెనవెసుకునే వర్ధిల్లుతుంది.” “భవిష్యత్తు మసకబారుతూ నేను సుదూర పాలపుంత నుండి నిష్క్రమిస్తున్న తారలా ఉన్నాను” అంటూ తన అసక్తతనూ వ్యక్తీకరించుకున్నారు.
“నేను ఈ అలసటతో కూడిన అంతులేని ఎదురుచూపును విలువైన పని అనుకుంటాను. నా భ్రమలను భ్రాంతులను అపహాస్యం చేస్తూ ఈ అద్భుతమైన పనిమంతులు ఏ సమయంలోనైనా వాటి పనిని ఆనందంగా చేస్తుంటాయి. వేధించే కారాగారంలో గాయపడిన నా ఆత్మలా కాక అవి జైలు అనే ఉనికినే పట్టించుకోవడం లేదు.” అంటూ ఆ పక్షులతో తనను తాను పోల్చుకుంటూ ఆ చిన్న జీవులనుండి ప్రేరణ పొందుతూ ఆయన గడిపిన జైలు జీవితం మనకు ఎన్నో జీవన సత్యాలను అవగతం చేస్తుంది. నిజం చెప్పాలంటె మనం అందరం ఏదో ఒక జైలులో జీవిస్తున్నవాళ్లమే. ఇలాంటి కవిత్వం మన భ్రమలను భ్రాంతులను అపహాస్యం చెసేదే…
జైలు జవానుని తనను బంధించిన రాజ్యానికి ప్రతినిధిగా కాక ఓ మనిషిగా చూస్తూ “స్వీయ విషాద గాధకు సెలవిచ్చి ఖైదీల కన్నీటి గాధల్ని తడికళ్ళతో వింటుంటాడు వాళ్ల నేరాలకూ నిర్దోషిత్వాలకు అతీతమైన మానవత్వమతనిది” అంటూ అతనికి సలాం కొడతాడు సాయిబాబా లోని మానవతావాది. “బందీలు వొస్తుంటారు పోతుంటారు. ఇక్కడ మాత్రం అతడే ఒక శాశ్వత ఖైదీ. అతడు ఎప్పుడూ నా పంజరానికి అతుక్కుపోయే ప్రేమ ఖైది” అని ప్రేమగా ఆ జైలు జవానును మనసుతో ఆలింగనం చేసుకునే ఈ ఖైదీ ఎందరి మనసుల్లో బందీగా మారారో కదా…
సోషల్ మీడియా మాయాజాలానికి బలయిపోతున్న వారిని “నా సోదర ఖైదీల్లారా ఏడవకండి ఏడవకండి మీరు త్వరలోనే బంధ విముక్తులవుతారు” అని చమత్కరిస్తూ “మీరు కూర్చున్న కుర్చీల నుండి లేస్తారు. కుషన్ పరుపుల ఉండి మెత్తటి దిండ్ల నుండి అణీచివేత తెరలను వదిలించుకుని వెళ్ళిపోతారు, జైలు గోడల కావల బయటి ప్రపంచాన్ని తనివితీరా దర్శిస్తారు. చేతిలో సెల్ చంచలత్వం లేకుండా స్వేచ్చగా కదులుతారు. మీకు పోయేదేమీ లేదు సమాచార సంకెళ్లు తప్ప, గెలవడానికి మాత్రం గొప్ప ప్రపంచమే మీ ముందుంటుంది..” అని ఆయన రాసుకొస్తే చెప్పొద్దూ దీన్ని ప్రతి స్కూలులో, కాలీజీలోనూ వినిపించాలనిపిస్తుంది.
నాగపూర్ నగర చరిత్రలో మొట్టమొదటిసారిగా రావణున్ని ఆరాధించే మహాగామ్గో ఆదివాసి తెగ రావణుని దిష్టిబొమ్మను తగలబెట్టరాదని ప్రకటించారని విని అది ప్రేరణగా తీసుకుని రాసిన కవితలో “మా రాజు చెల్లి పరాభవం, మీ దేవుడి పెళ్ళాన్ని ఎత్తుకెళ్లడం, ఇంకెంత మాత్రం యుద్ద నికష కాబోదు. మా భూముల్ని అడవులి పర్వతాల్ని గుట్టల్ని నదీ నదాల్ని చెట్టూ చేమల్ని జంతుజాలాన్ని పురుగు పుట్రాలను సైతం పురా నగరాల్ని దేన్నీ వదలకుండా వేటినైతే మీరు వేల యేండ్లుగా దురాక్రమించారో వాటన్నింటినీ మేం వెనక్కి తీసుకుంటాం” అంటూ ఆయన రాసుకొచ్చిన విధానాం ఎంత గొప్పగా ఉందో. దీన్ని అనువాదంలో శ్రీశ్రీ గొంతుక కలిసి అందులోని దళిత ఆత్మగౌరవానికి వన్నె తెచ్చింది. ఇది అనువాదకుని చరిష్మా కూడా కావచ్చు. కాని ఈ కవితకు వింత సాహితీ అందాన్ని ఇచ్చింది.
“నీ ములాఖత్ కోసం ఎదురు చూడడం ఎంత బాగుంది” తనను కలవడానికి వచ్చె సహచరి కోసం ఈయన రాసుకున్న కవిత. ఇందులో టర్కిష్ కవి నాజిమ్ హిక్మత్ ను ఉదహరిస్తూ “ఆశకు సంకేతం జీవితం ప్రియతమా జీవించడం కూడా నిన్ను ప్రేమించేంత ముఖ్యమయినది.” అంటూ ఆయన కవితను ముగించిన తీరు అత్యద్బుతం.
“అలసిపోయావా ప్రియతమా” లో ఈ పంక్తులు చూడండి “సహనంతో నిలబడ్డం కూడా పోరాటమే, తప్పులు చేసినా, చేయకపోయినా ఆరోపణ వచ్చినప్పుడు ఒప్పుకోవడమే హుందాగా చేసుకొనే స్వయం విమర్శ. తప్పులు చేయకూడదనడం అన్యాయం, ఏ తప్పూ చేయకూడదనడం ఏపనీ చేయొద్దనడమే.”…. ఎంత గొప్ప పాఠం ఇది.
“ఒంటరి ఆశ” అనే కవిత లో “నాపై ఆకాశం లేదు, లేదు నా కాళ్ల కింద నేల, కాళ్ళూ చేతులకు బంధనాలు, ఉన్నదల్లా సంకెళ్ళు లేని హ్రుదయం, సంవత్సరాలుగా చెవిలో చెప్పేందుకు చిన్నమాట”……అంటారు. అన్నీటిని బంధించగల రాజ్యం అతని హృదయాన్ని బంధించలేకపోవడం కన్నా పెద్ద పరాజయం ఏం ఉంటుంది? సాయిబాబాను బంధించిన రాజ్యం ఓడిపోయంది. అతన్ని మాత్రం ఓడించలేకపోయింది.
“నల్లనిమేఘాల వెనుక దాక్కొని ఉన్న తళుక్కుమనే నక్షత్రపు బాధ, నువ్వు దానిని అనుభూతి చెందావనేది నాకు నిశ్చయమే” అంటున్న కవి మనసులో సహచరి జీవన గమనం పట్ల ఎంత నమ్మకమో. మరో కవితలో “తేనె చినుకుల వానలో తాజాగా నానిన వరిగడ్డి చేలలో మన రోజుల్ని గుర్తుచేసుకొని నా మనసు తుళ్ళిపడుతుంటే ఇనుప ఊచల మీద నా వేళ్ళు బిగుసుకుంటాయ్.” అని ఆయన రాస్తారు. ఇది కదా ప్రేమ కవిత్వమంటే. వ్యక్తిగత ప్రేమను సామాజికం చేయడం అంటే. అది అందరికీ సాధ్యపడదు. ఈ జంట మాత్రమే దాని సాధించారు. ఆ స్థాయికి అందుకోగల స్థితప్రజ్ఞత అందరికీ అబ్బదు. అది ఒక్క సాయిబాబా వసంత గార్లకే సాధ్యం.
‘కబీరు చెప్పింది విను’ కవితలో “రాముడి గుడికి పరిగెత్తడమే నీకు ఓట్లను తోసుకొస్తే నీ శతృవులు కూడా గుళ్ళ చుట్టూ మూగిపోరూ మరి. రాత్రింబగళ్ళు గుళ్ళోనే ఉండే పూజారికీ పదవి వర్తిస్తుంది కదా… మాయో మంత్రమో ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తాయని నువ్వు భ్రమపడితే గారడీ వాళ్ళే పాలకులు అయిపోతారు కదా.”…. ఇది అర్ధం చేసుకోగల ప్రజలు మన మధ్య ఎక్కువగా ఉండి ఉంటే ఈ దేశ భవిష్యత్తు మరోలా ఉంటుందన్నది నిజం.
నన్ను ఎంతో కదిలించిన వాక్యాలు “ఈ మహర్ ఏ తప్పూ చేయలేదు. ఆత్మగౌరవం ఆవహించి భవిష్యత్ స్మార్ట్ సిటీ ప్రదర్శనా ఫలకాన్ని బద్దలుకొట్టి అసంతృప్తిని ఆహ్వానించాడు. రాజ్యం పట్ల నేరం చేశాడు. రాజ ద్రోహం కింద ఖైదు చేయబడ్డాడు. ఈ చమర్ ఏ నేరం చేయలేదు. అస్థిత్వ స్పృహ ఆవహించి భవిష్యత్ స్మార్ట్ సిటీ నుండి చచ్చిన ఆవును ఎత్తివేయనని నిరాకరించి అసంతృప్తిని ఆహ్వానించాడు….” ఈ కవితతో తనను తాను రాబోయే తరాలకు అందించుకున్న సాయిబాబా గారి గురించి చెప్పడానికి భాష సరిపోదు.
ఈ కవితలను తెలుగులోని అనువదించిన వి.వి గారు, రివెరా, కరుణాకర్, గితాంజలి, రాజేంద్రబాబు అర్వాణి, బాసిత్, పి. వరలక్ష్మి, ఎన్. వేణుగోపాల్, ఉదయమిత్ర, శశికళ, అరుణాంక్, లకు కృతజ్ఞతలు. ఒక ఉద్యమకారుడ్ని, ఓ కవిని, ఓ మానవతామూర్తి మనోగతాన్ని నిర్భందపు ఆంగ్లం నుండి మాతృభాష తెలుగులోకి అందించడం, సాయిబాబా లాంటి ఓ గొప్ప మనీషి మాటలను శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాలకు దగ్గర చేర్చడం ఎంత భాద్యతతో కూడిన పనో అర్ధం చేసుకుంటే ఈ అనువాదకుల శ్రమకు, వీరు తీసుకున్న భాద్యతకు గౌరవపూర్వక నమస్కారాలు అందించకుండా ఉండలేం. ఇది పుస్తకం కాదు స్వేచ్చకు అర్ధం. ఇది సాహిత్యం కాదు మానవత్వపు జీవిన మార్గం.
“We cannot be sure of having something to live for unless we are willing to die for it” ఇదీ చే చెప్పిన మాటే. మా తరంలో సాయిబాబా గారిని ఆ పంధాలో జీవించగా మరణించగా చూడడం మనుషుల పట్ల కాస్త ప్రేమను పెంచింది. మానవత్వంపై కాస్త ఆశ చిగురింపజేసింది. కొన్ని జీవితాలకు మరణం ఉండదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.